Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: సూర్య వర్సెస్‌ సూర్య
తారాగణం: నిఖిల్‌ సిద్దార్ధ, త్రిధా చౌదరి, తనికెళ్ళ భరణి, మధుబాల, మస్త్‌ అలీ, సయాజీ షిండే, సత్య, వివా హర్ష, తాగుబోతు రమేష్‌, ప్రవీణ్‌ తదితరులు
చాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
సంగీతం: సత్య మహావీర్‌
నిర్మాణం: సురక్ష ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
విడుదల తేదీ: 5 మార్చి 2015

క్లుప్తంగా చెప్పాలంటే
సూర్య (నిఖిల్‌) సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి పోర్ఫ్రియా అనే ఓ అరుదైన వ్యాధి వుంటుంది. అతను సూర్యకిరణాల్ని చూడలేడు, భరించలేడు. అందుకే రోజూ చీకటి పడ్డాకే అతని దినచర్య మొదలవుతుంది. అనుకోకుండా సంజన (త్రిదా)ని చూస్తాడు సూర్య. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. సూర్య స్నేహితులు ఎర్‌సామ్‌ (తనికెళ్ళ భరణి), అరుణ్‌ సాయి (సత్య) అతనికి ప్రేమ విషయంలో సహాయ సహకారాలు అందిస్తారు. క్రమంగా సంజన కూడా సూర్యతో ప్రేమలో పడుతుంది. అయితే అతనికి వున్న అరుదైన వ్యాధి గురించి మాత్రం సంజనకి తెలియదు. ఓ సందర్భంలో ఆ విషయం తెలిసి షాక్‌కి గురవుతుంది త్రిద. ఆ తర్వాత ఏమయ్యింది? సూర్య తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నిఖిల్‌ నటించలేదు జీవించాడనడం సబబేమో. సినిమా సినిమాకీ అతని నటనలో మెచ్యూరిటీ లెవల్స్‌ పెరిగిపోతున్నాయి. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాలతో నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న నిఖిల్‌కి నటుడిగా పరిపూర్ణతనిచ్చిన సినిమా ఇది. ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతం అనిపించుకున్నాడు నిఖిల్‌. హీరోయిన్‌ త్రిధా స్క్రీన్‌ మీద కాన్ఫిడెంట్‌గా కనిపించింది. క్యూట్‌గా వుంది. నటిగా మంచి మార్కులేయించుకుంది కూడా.తనికెళ్ళ భరణి పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా వుంది. సత్య నవ్వించాడు. మస్త్‌ అలీ బాగా చేశాడు. మధుబాల ఓకే. షయాజీ షిండే మామూలే. తాగుబోతు రమేష్‌, వివా హర్ష, ప్రవీణ్‌ తదితరులు తమ పాత్రల వరకూ ఓకే అనిపిస్తారు.ఇంట్రెస్టింగ్‌ స్టోరీలైన్‌ ఎంచుకున్న దర్శకుడు, స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకొంచెం కేర్‌ తీసుకుంటే బాగుండేది. డైలాగ్స్‌ ఓకే. స్క్రిప్ట్‌ పరంగా యావరేజ్‌ అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఇంకాస్త ఎడిటింగ్‌ అవసరం. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. మ్యూజిక్‌ ఓకే. రెండు పాటలు తెరపై చూడ్డానికి బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌ ట్రెండీగా, స్టైలిష్‌గా ఉన్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కలర్‌ఫుల్‌గా పనిచేసింది.
కొత్త తరహా కాన్సెప్ట్స్‌తో యంగ్‌ డైరెక్టర్స్‌ సినిమాలు తీయాలనుకోవడం అభినందనీయం. అదే సమయంలో చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతున్నప్పుడు, దాన్ని ఆడియన్స్‌కి చేరవేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌క్రి స్ట్రెంగ్త్‌ పెరుగుతుంది. ఈ సినిమా విషయానికొస్తే ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. కాస్త హ్యూమర్‌, అవసరమైనంత రొమాన్స్‌, కొంచెం డ్రామా ఉన్నాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ఎత్తుపల్లాలు సినిమా గమనానికి అవరోధాలుగా మారాయి. దాంతో డ్రాగింగ్‌గా అనిపిస్తుంది. క్లయిమాక్స్‌కి ముందు మళ్ళీ సినిమా వేగం పుంజుకుంటుంది. కంటెంట్‌ ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్‌ చేసే విధానంలో దర్శకుడి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న సినిమా మౌత్‌ టాక్‌తో చెప్పుకోదగ్గ విజయం సాధించడానికి అవకాశం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఫర్వాలేదన్పించే ‘సూర్య’ వెలుగు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
anushka same as naresh