Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam - vignanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Ugadi

జ్యోతి పథం - పులివర్తి కృష్ణ మూర్తి

 

భారతదేశంలోని వివిధ ప్రాంతాలవారూ, వివిధ జాతులవారూ హిందూ మతస్థులైన వారూ, వివిధ రోజుల్లో తమ సంవత్సరాదిని జరుపుకుంటారు. తెలుగువారు భ్రహ్మ పురాణంలో పేర్కొన్నట్లుగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు జరుపుకుంటున్నారు. తెలుగు వారితోబాటుగా మహారాష్ట్రులూ, కర్నాటకులూ జరుపుకుంటున్నరు. తమ సంవత్సరాదిని ఈ రోజునే.

తెలుగు నూతన సంవత్సరాదిని ఉగాది పండుగ అంటారు. కలియుగం  ప్రారంభమై ఇప్పటికి 5113 సంవత్సరాలు గడిచి, 5114 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. యుగాదిని కొందరు సంవత్సరం తర్వాత పెద్ద కాల స్వరూపం అంటారు. యుగాలు నాలుగు కదా ! కృత యుగాది, త్రేతా, ద్వాపర, కలియుగాలు. వీటిలో కృత యుగాది అంటే సృష్టి ఆరంభమైన రోజు. బ్రహ్మదేవుడు ఆ రోజునే సృష్టిని ప్రారంభించాడు. అంతేకాక ఆపైన సంవత్సరం ఆయనం, ౠతువు, మాసం, గ్రహం, నక్షత్రం, వాటికి అధిపతులనూ సృష్టించాడు. అందుకే ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమినాడు యుగాదిగా భావించి పండుగ చేసుకుంటున్నాము. యడాగమమును విడదీసి మనం ఉగాది అని పలుకుతున్నాము. ఈ సంవత్సరాది రోజున దేవతలూ, పెద్దలూ మనలను ఆశీర్వదించడానికి వేచి ఉంటారట.

ఉగాది రోజు అత్యంత షుభకరమైనది. అందుకే చాలామంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త లెక్కలు మొదలుపెట్టడం వంటివి చేస్తారు. వనవాసానంతరం శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరుగు ప్రయాణం ఈరోజునే చేశారట. అందువలన ఈ పండుగ అని అంటారు మరికొందరు.

 

ఉగాది నాడు తైలాభ్యంగనం, దైవారాధనం, షడ్రుచుల సమ్మిళితమైననింబ కుసుమ భాక్షణం గావించాలి. ఉగాది పచ్చడిలో కొత్త బెల్లమూ, మామిడికాయ ముక్కలూ, అరటిపండ్లూ, చెౠకు రసం, తేనె చేరుస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేర్చినా నింబ కుసుమం మాత్రం వుండాల్సిందే. ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మన హిందూ సంప్రదాయంలో కొన్ని కొన్ని వస్తువులను కొన్ని ఆంక్షలతో వాడమని వుంది. వినాయక చవితి తర్వాత మాత్రమే వెలగ కాయలనూ, నాగుల చవితి తర్వాతే తేగలనూ, ఉగాది తర్వాత కొత్త బెల్లమూ, కొత్త చింత పండునూ వాడాలంటారు. ఇక మధురాంల ద్రవ్యాలతో చేర్చి చేదురసం గల వేపపువ్వును కలిపి తినడంలో వేదాంతపరంగా ఒక అర్థం వుంది. కాలం తెచ్చే మార్పుల్లో వచ్చే కష్ట సుఖాలను అనుభవించేందుకు సిద్ధంగా వున్నట్లుగా మనం సూచిస్తున్నట్లుగా వుంది.

తైలాభ్యంగన స్నానం ఈరోజున అతి ముఖ్యంగా చెప్పబడింది. ఉగాదినాడు ఎవ్వరైతే నూనెలో తలంటిపోసుకోరో, వారు నరకలోకానికి పోతారని శాస్త్రం చెబుతూ వుంది. ఈరోజున నూతన వస్త్రాలు ధరించాలి. కొత్తనగలు పెట్టుకోవాలి. ఈ విధంగా మన దేహాన్ని శుచిగా వుంచుకుంటూ, బాగా అందంగా అలంకరించుకోవాలి. అలాచేస్తే మంగళకరం సంతోష ప్రదం, ఉత్సాహజనకం.

ఉగాది నాడు కొన్ని మంచిపనులు కూడా విధిగా చేయాలి. పితృదేవతలను స్మరించుకుంటూ దానధర్మాలు గావించాలి. వేసవికాలం ప్రారంభమవుతుంది కావున ఉగాది రోజున కొత్త గొడుగూ, చామరమూ కొని వుంచుకోవాలి. వాటిని మరొకరికి ఇస్తే కూడా పుణ్యమే .చలివేంద్రాలను ప్రారంభించాలి. దాహం గొన్న వారికి నీటిని అందించాలి. కొందరు కొత్త కుండల్లో మజ్జిగ, అందులో అల్లం ముక్కలూ, కొత్తిమీర, నిమ్మరసం కలిపి పంచుతారు.

ఉగాది రోజున భ్రహ్మదేవునికి పూజలు దవనముతో చేస్తారు. దవనము మంచి పరిమళపత్రమే గాక, ఆరోగ్యప్రదమైనది. హృదయానికి ఎంతో హితకరం కూడాను. చైత్ర శుక్ల పక్షంలో భ్రహ్మదేవునితోబాటుగా, దేవతలకూ , మునులకూ, మాతృదేవతకూ, ధర్మరాజుక్కూడా పూజలు చేస్తారు మరికొందరు. పూర్వకాలంలో ఉగాది నాడు మహాశాంతి కోసం సంవత్సరేష్టి  అనే యజ్ఞాన్ని చేసేవారట.మరో ముఖ్యమైనది ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం వలన మానవ జన్మ పరమార్థాన్ని గుర్తించేందుకని కొందరంటారు. పంచాంగాన్ని విన్నవారికి ఏ గ్రహం అనుకూలంగా వుందో, ఏదిలేదో తెల్సుకుని ముందు ముందు ఎలాంటి కష్టనష్టాలు సంభవించగలవో తెలిసి, జాగ్రత్తపడటం ఒక ముఖ్యమైన సదుపాయంగా భావించాలి.

ఈ ఉగాది రోజున గత సంవత్సర కాలంలో జరిగిన జీవిత విశేషాలను నెమరు వేసుకుంటూ రాబోయే మన్మధనామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుందాం. ఈ సంవత్సరంలో ధాన్యదానం ఎంతో గొప్పగా  చెప్పబడింది. కావున అందరూ అన్నదానం గావించి తరించాలి.జన్మజన్మల సుకృత్యాల ఫలంగా లభించిన ఈ మానవ జన్మను సార్ధకం గావించుకోవాలి. ఉగాది నాడు చైత్ర మాసపు తొలిరోజు. వసంత ౠతువు ఆరంభమయ్యే రోజు. ఈ వసంత కాలంలో నవరాత్రులూ పూజలు చేసిన వారికి అపమృత్యు భయం వుండదు అని ధర్మ సింధువులో వుంది. వాత్సాయన కామ సూత్రాల్లో మదనోత్సవంగా ఈ రోజుని పేర్కొన్నారు. ఋతురాజైన వసంతుని పూజించడం ద్వారా ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని చెప్పబడింది. ఉగాది నాడు కవులనూ, కళాకారులనూ సన్మానిస్తారు. కవి సమ్మేళనాలు జరుపుతారు. అంతటా ఆనందం నిండుకునే ఈ మన్మధనామ ఉగాది సర్వ శుభాలనూ కలుగజేస్తుంది.

మరిన్ని శీర్షికలు
Neck Pain | Cervical spondylosis | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.