Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఈ తూరుపు - ఆ పశ్చిమం - దంతులూరి కిశోర్ వర్మ

 

ది లాస్ట్ వాల్డ్

`మగవాళ్ళు సాహసకృత్యాలు చెయ్యాలి, ఆడవాళ్ళు అందుకు బహుమానంగా వాళ్ళకు తమ మనసు ఇవ్వాలి,` అంది గ్లాడిస్ తనకు ప్రపోజ్ చేసిన మలోన్ అనే కుర్రాడితో. `నేను ప్రేమించేది ఘనకార్యాలు చేసి గొప్ప పేరు సంపాదించినవాడినే; అటువంటి వాడిని భర్తగా పొందినందుకు నన్ను చూసి అందరూ అసూయపడాలి,` అని కూడా అంది. `నేను చేస్తే-` అన్నాడు. `ఈ ప్రపంచంలో నీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొన్నప్పుడు మాట్లాడదాం,` అంది.  గ్లాడిస్ తన స్వార్ధంకోసం మలోన్ ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతుందా? ఎవరికైనా అలానే అనిపించవచ్చు కానీ ఇరవైమూడు సంవత్సరాల కుర్రాడు, మొదటిప్రేమ మైకంలో ఉన్నవాడు అలా ఎప్పటికీ అనుకోడు!

 

డైలీ గెజెట్ అనే న్యూస్‌పేపర్‌లో మలోన్ రిపోర్టర్. పై సంఘటన జరిగిన తరువాత నేరుగా న్యూస్ ఎడిటర్ మెక్ఆర్డెల్ దగ్గరకు వెళ్ళి తనకు ఏదయినా ప్రమాదాలు నిండిన, సాహసాలతో కూడిన న్యూస్‌రిపోర్టింగ్ పని అప్పగించమని, పేపర్‌కు మంచి పేరు తీసుకు వస్తానని అడుగుతాడు.  మెక్ఆర్డెల్ ప్రొఫెసర్ చాలెంజర్ గురించి మలోన్‌కి చెపుతాడు. ప్రొఫెసర్ చాలెంజర్ పూర్తిగా పరిణామం చెందని మనిషిలా - నరవానరంలా ఉంటాడు.  పెద్ద తల - అతని టోపీని సాధారణమైన వాళ్ళు పెట్టుకొంటే ముఖం అంతా పూర్తిగా కప్పబడిపోయి టోపీ అంచు భుజాలను తాకుతుంది. అతని విశాలమైన చాతీకీ, పెద్దబుర్రకీ మధ్య మెడ ఉండనే ఉండదు. పొడవైన గెడ్డం, డ్రమ్ములాంటి శరీరం, బరువైన చేతులు, పొట్టి కాళ్ళు...  ప్రపంచ సాహిత్యంలో షెర్లాక్ హోంస్ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన డిటెక్టివ్ పాత్రని సృష్టించిన  సర్ ఆర్థర్ కానన్ డాయల్ ఇటువంటి ఆకారం ఉన్న ప్రొఫెసర్ చాలెంజర్ హీరోగా ఒక పాపులర్ సైన్స్ ఫిక్షన్ నవల రాశాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నవలే ది లాస్ట్ వాల్డ్ (The Lost World)!

చాలెంజర్ ఒక జువాలజిస్ట్. దక్షిణ అమెరికా వెళ్ళివచ్చానని, వింత ప్రాణులని చూశానని చెపుతున్నాడు. ఆ ఖండంలో ఏ ప్రదేశమో ఖచ్చితంగా చెప్పడం లేదు. ఎవో ఫొటోగ్రాఫులు చూపిస్తున్నాడు. జనాలు.. ముఖ్యంగా విలేఖరులు అతని మాటల్ని కట్టుకథలుగా కొట్టి పారేస్తున్నారు. ఫోటోగ్రాఫులు ఫేక్ అని హేళన చేస్తున్నారు. తన మాటల్ని నమ్మని వాళ్ళమీద విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు చాలెంజర్. ఇంటర్యూ తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ముగ్గుర్ని ఇంటి గుమ్మం లోనుంచి, మెట్లమీదుగా రోడ్డు మీదకి విసిరేసి మరింత చెడ్డపేరు తెచ్చుకొన్నాడు. ప్రస్థుతం అలాంటి కోపిష్టి ప్రొఫెసర్ని మంచి చేసుకొని, నిజాలు నిగ్గుతేల్చే పని మలోన్‌కి అప్పగించారు. మొదటిలో మిగిలిన విలేఖరులకు పట్టిన గతే మలోన్‌కి పట్టింది. కానీ, క్రమంగా చాలెంజర్ నమ్మకాన్ని సంపాదించాడు. మలోన్‌కి చాలెంజర్ చెప్పిన కథ ఇది -

ఒక పరిశోధన విషయంగా దక్షిణ అమెరికా వెళ్ళిన చాలెంజర్‌కి మాపెల్ వైట్ అనే ఒక చిత్రకారుడి స్కెచ్‌బుక్‌ దొరుకుతుంది. అందులో మిలియన్ సంవత్సరాలకి పూర్వం ఈ భూమి మీద నివశించి తరువాత అంతరించిపోయాయని భావించబడుతున్న కొన్ని జురాసిక్ జంతువుల స్కెచ్‌లూ, అవి నివశించే లాస్ట్‌వాల్డ్ లాండ్‌స్కేప్ బొమ్మలు ఉన్నాయి. అవి కేవలం చిత్రకారుడి ఊహనుంచి ఆకారం పొందిన బొమ్మలు కాదు అని చెప్పడానికి కావలసినన్ని అధారాలు ఆ స్కెచ్‌బుక్‌లో కనిపిస్తున్నాయి.  

అమేజాన్ నది ప్రాంతంలో నివశించే అడవి మనుషులు కురుపురి అనే దుష్టశక్తి గురించి కథలుగా చెప్పుకొంటారు. ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కురుపురి చాలా చెడ్డదని, అది ఉండే దిక్కుకి ఎవరూ వెళ్ళకూడదని అంటారు. చాలెంజర్ చెప్పిన మాపెల్ వైట్ అనే చిత్రకారుడు చనిపోవడానికి ముందు కురుపురి ఉంటుందని భావించే దిక్కునుంచే వస్తాడు. అటువైపే లాస్ట్ వాల్డ్ ఉండవచ్చు! ఇద్దరు ఆదివాసీలని గైడ్‌లుగా ఉండడానికి బలవంతంగా ఒప్పించి ఆ దిక్కుకి చాలెంజర్ వెళ్ళాడు. లాస్ట్ వాల్డ్ వెడల్పయిన మట్టు ఉన్న గిన్నె లాంటి దుర్బేద్యమైన ప్రదేశం. చుట్టూ ఎత్తైన కొండలు మధ్యలో మైళ్ళకొద్దీ విస్తరించిన మైదాన ప్రాంతం. ఈ గిన్నె అంచుకి ఒకవైపు ఓ నలభై అడుగుల ఎడంగా ఒక కొండ ఉంది. దాని శిఖరం మీద ఒక పెద్ద చెట్టుని చాలెంజర్ చూశాడు. ఆ చెట్టు చిటారు కొమ్మమీద వాలి ఉన్న జురాసిక్ కాలానికి చెందిన రాక్షస పక్షి కనిపించింది. చాలెంజర్ దానికి ఫోటో తీశాడు. తరువాత గన్‌తో కాల్చాడు. దురదృష్టవశాత్తూ జురాసిక్ పక్షి ఎగిరిపోయింది. కానీ తుపాకీ గుండు తగిలి దాని రెక్కనుంచి జారిపడిన ఒక ఎముక ముక్కను చాలెంజర్ సంపాదించ గలిగాడు. చిత్రకారుడి బొమ్మలు, ప్రొఫెసర్ తీసిన ఫోటో, అతని దగ్గర ఉన్న పక్షి ఎముక - ఇవి మూడూ జురాసిక్ జంతువులు ఇంకా ఈ భూమి మీద నివశిస్తున్నాయి అనడానికి తిరుగు లేని ఋజువులు. కానీ, చాలెంజర్ని నమ్మెదెవరు!? 

చాలెంజర్ చెప్పిన దానిలో నిజా నిజాలు నిర్ధారించడానికి నలుగురు సభ్యుల బృందం బయలుదేరుతుంది. వాళ్ళు నలుగురూ - ప్రొఫెసర్ చాలెంజర్, ప్రొఫెసర్ సుమర్లీ, దక్షిణ అమెరికా ఖండంలో అంతకు ముందు కొన్ని సాహసాలు చేసిన లార్డ్ జాన్ రాక్స్‌టన్, మలోన్. ఈ నలుగురిలో నాకు వ్యక్తిగతంగా నచ్చిన పాత్ర లార్డ్ జాన్ రాక్స్‌టన్‌ది. లాస్ట్‌వాల్డ్ సాహాసానికి బయలుదేరడానికి ముందే దక్షిణ అమెరికాలో అతను చేసిన పోరాటాలు ఆ ప్రాంతపు తెగలలో అతనికి రెడ్‌చీఫ్ అనే పేరుని సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా పెడ్రో లోపెజ్ అనే ముఠా నాయకుడ్ని చంపి, స్థానికులని బానిసలుగా మార్చే ప్రక్రియకి చరమగీతం పాడాడు.

జంబో అనే విశ్వాతపాత్రుడైన ఒక నల్లజాతీయుడినీ, గోమెజ్ అనే మరొక వ్యక్తినీ, మరి కొంతమంది సేవకుల్ని నియమించుకొని అమేజాన్ నదిమీద, దానికి ఉండే వందలాది ఉపనదుల్లో ఒకదానిలో జురాసిక్ ల్యాండ్ వైపు ప్రయాణం కొనసాగించారు. ఇక్కడ గోమెజ్ గురించి కొంత చెప్పుకోవాలి. గతంలో లార్డ్ జాన్ రాక్స్‌టన్ చంపిన పెడ్రో లోపెజ్‌కి గోమెజ్ స్వయంగా తమ్ముడు. తన అన్నను చంపిన రాక్స్‌టన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడు.  

 

చాలా ప్రయాసల కోర్చి లాస్ట్‌వాల్డ్ ప్రాంతానికి చేరుకొన్నారు. అగ్మిపర్వతాల విస్పోటనాల ఫలితంగా లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడిప్రాంతం ఒక పొరలా పైకి ఉబికివచ్చి, చుట్టూ కొండలతో మిగిలిన ప్రదేశంనుంచి వేరుపడి పోయింది. లోపల ఉన్న జురాసిక్ ప్రాణి ప్రపంచం నిరంతరంగా కొనసాగుతూ వచ్చింది. అడవులతో, అమేజాన్ నదియొక్క వందలకొద్దీ ఉపనదులతో ఉండే దక్షిణ అమెరికా రెయిన్ ఫారెస్ట్‌లో ప్రపంచానికి తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. నిట్టనిలువుగా ఉన్న కొండను ఎక్కి లోపలికి దిగడానికి అనువైన ప్రదేశం ఎక్కడా లేదు. చాలెంజర్ ఇదివరలో మలోన్‌కి చెప్పిన జురాసిక్ పక్షి వాలిన చెట్టు - అరవై అడుగుల ఎత్తైనది - లాస్ట్ వాల్డ్ లోనికి వెళ్ళడానికి వంతెనలా ఉపయోగ పడింది. దానిని నరికి నలభై అడుగుల ఎడంగా ఉన్న రెండు కొండలకీ అడ్డుగా పడేలా చేసి, దానిని దాటారు. ఎప్పటి నుంచో రాక్‌స్టన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న గోమెజ్‌కి సరిగ్గా అప్పుడు అవకాశం దొరికింది. చాలెంజర్ బృందాన్ని లాస్ట్‌వాల్డ్ లోనికి వెళ్ళనిచ్చి వంతెనగా ఉపయోగ పడిన చెట్టుని రెండు కొండల మధ్యకీ తోసేశాడు. వాళ్ళు వెనుకకు తిరిగి రావడానికి మార్గాన్ని శాశ్వతంగా మూసేశాడు.  

ఆ ప్రాంతానికి మాపెల్‌వైట్ ల్యాండ్ అని పేరు పెట్టారు. ఇక్కడి నుంచి కథ అపాయాలతో, ఆశ్చర్యకరమైన దృశ్యాలతో, సాహసాలతో, పోరాటాలతో రోలర్ కోస్టర్ రైడ్‌లా పరుగులు పెడుతుంది. టెరడాక్టిలస్ అనే పక్షులని, ఆకులు అలమలూ తినే ఇగ్వాండన్ అనే జంతువుని, స్టెగోసారస్‌ని.. ఇంకా చాలా జురాసిక్ జంతువులని వాళ్ళు చూస్తారు. వెంటపడి తరిమే జంతువుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెడతారు. భయంకరమైన రక్తపిపాసులు లాంటి నర వానర జాతి చేతిలో పడి చావు వరకూ వెళ్ళి అదృష్టవశాత్తూ బ్రతికి బయట పడతారు. కొండ గుహల్లో నివశిస్తున్న ఆదిమానవుల్ని చూస్తారు. వాళ్ళకీ, నరవానరులకీ మధ్య జరిగిన పోరాటంలో పాలుపంచుకొని నరవానరులని నిర్మూలిస్తారు.  చివరికి ఆదిమానవులు నివశిస్తున్న కొండ గుహల్లో ఒక దానినుంచి బయటి ప్రపంచంలోనికి ఉన్న మార్గాన్ని అన్వేషించి, ప్రపంచం నమ్మే నమూనాలను సేకరించుకొని లండన్ చేరతారు. మాపెల్‌వైట్ ల్యాండ్‌లో జాన్ రాక్స్‌టన్ దృష్టిలో పడిన నీలం మట్టిలాంటిది కింబర్లీలో ఉన్న డీబీర్స్ వజ్రాల గనిలో మాత్రమే ఉండగలదని అతనికి అనిపించి. దానిని సేకరించుకొని వస్తాడు. ఆ మట్టిలో నిజంగానే విలువైన వజ్రాలు ఉన్నాయి. వాటినుంచి వచ్చే రెండు లక్షల పౌండ్స్‌నీ నలుగురూ సమానంగా పంచుకొందామని రాక్స్‌టన్ ప్రకటిస్తాడు.  

ఈ సాహస యాత్రతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన మలోన్ తనను పెళ్ళిచేసుకొమ్మని అడగడానికి నేరుగా గ్లాడిస్ దగ్గరకి వెళ్ళాడు. కానీ ఆమె అప్పటికే ఒక సాధారణమైన గుమస్తాని పెళ్ళిచేసుకొని స్థిరపడిపోయింది!  

మైఖేల్ క్రిచ్‌టన్ రాసిన జురాసిక్‌పార్క్ నవల చదివిన వాళ్ళకి, దాని ఆధారంగా స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన సినిమాలు చూసిన వాళ్ళకి ఈ రోజు పరిచయంలో రాసిన జంతువుల గురించి అవగాహన ఉంటుంది. ఈ సినిమా 1993లో వచ్చింది. కానీ సర్ఆర్థర్ కానన్ డాయల్ రాసిన ది లాస్ట్‌వాల్డ్ స్ట్రాండ్ పత్రికలో సీరియల్‌గా వచ్చిన సంవత్సరం అంతకు తొంభై సంవత్సరాలకు పూర్వం - అంటే 1902. లాస్ట్ వాల్డ్ నవల ఆధారంగా అదే పేరుతో తీసిన మూకీ సినిమా కూడా యూట్యూబ్‌లో చూడవచ్చు. సర్ ఆర్థర్ కానన్ డాయల్ పేరు చెపితే ముందుగా గుర్తుకు వచ్చేది షెర్లాక్ హోంస్ పాత్రే. మరి షెర్లాక్‌హోంస్ గురించి ఎందుకు రాయలేదు అని కోపగించుకోకండి.  మరెప్పుడైనా ఆ పాత్ర చేసిన నేరపరిశోధనల గురించి మాట్లాడు కొందాం. ప్రస్తుతం ది లాస్ట్‌వాల్డ్ నవల సంపాదించి మరో ప్రపంచంలో అలా విహరించి రండి.    

మరిన్ని శీర్షికలు
jayajayadevam