Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

అంజనా సౌమ్య

Interview with Anjana Sowmya by Raja

వర్తమాన , వర్ధమాన గాయనీ గాయకుల లిస్ట్ వేసుకుంటే  లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ వార్తల్లో ప్రముఖ స్థానంలో వున్న గాయని అంజనా సౌమ్య .  ఓ వైపు వాయు వేగంతో దూసుకు వస్తూ కూడా మరో వైపు అతి నెమ్మదిగా వుండడం చూస్తే -  అది ఆమె సెకెండ్ నేచరా లేక పర్మనెంట్ ఫీచరా - లేక ఆమెను 'ప్రభంజనా సౌమ్య ' అని పిలవాలా అని అనిపిస్తుంది. ఇటీవల ప్రశంసించదగ్గ విజయాలు సాధించిన అంజనాసౌమ్య ఓ వైపు తన రెగ్యులర్ షెడ్యూల్స్ తో  ఉరుకుల పరుగులు పెడుతూ ఇచ్చిన ఇంటర్ వ్యూ ఇది :

" నీ అసలు పేరు అంజనా సౌమ్య యేనా ?"
" కాదండీ ... నా పూర్తి పేరు వీర వెంకట నాగ దుర్గ సత్య పద్మాంజనా సౌమ్య"

" మరి అంత పెద్ద పేరుందంటే ఏదో బ్యాగ్రౌండ్ వుందన్నమాటే గా ? "
" నేను పుట్టడానికి ముందు మా అమ్మగారికి రెండు ఇష్యూలు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత లేక లేక నేను పుట్టాను. అంచేత అందరికీ మొక్కుకుని అన్ని పేర్లూ కలుపుకుంటే అంత పెద్ద పేరయిందన్నమాట."

"మరి అంజనా సౌమ్య అనే పేరు ఎలా వచ్చింది  ? "
" హైదరాబాద్ బ్లూస్ సినిమాకి వర్క్ చేసిన ఆశీర్వాద్ గారు పాడుతా తీయగా సెలక్షన్స్ లో నన్ను చూసి ఓ క్రిస్టియన్ ఆల్బమ్ కోసం కాకినాడ నుంచి పిలిపించారు.  అప్పుడు పేరెలా వుంటే బావుంటుందా అనుకుని షార్ట్ కట్ లో   సి.పి.  సౌమ్య  (చింతలపూడి పద్మాంజనా సౌమ్య) అని ముందు అనుకుని తర్వాత 'అంజనా సౌమ్య' అంటేనే బావుంటుందని అదే ఫైనల్ చేసేశారు. "

" ఆ తర్వాత డైరెక్ట్ గా సినిమాల్లో ట్రై చెయ్యడం జరిగిందా లేక ఏవైనా చదువుకున్నావా ?"
" బీ టెక్, ఎం.బి.ఏ. రెండూ చేశానండి. కాకినాడ లో వుంటుండగానే బీ.టెక్ (ఎలెక్త్రానిక్స్ & కమ్యూనికేషన్స్)  చేశాను. అప్పటికే సినిమాల్లో పాడాలన్న కోరిక వుండేది నాకు. బీ.టెక్. ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కోటి గారిని కలిసి ఆడిషన్ ఇచ్చాను. ఆయన నా వాయిస్ బావుందని చెప్పి 'క్లాస్ మేట్స్' సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు.  ఆ పాట 'మౌనమెందుకు మాటాడవెందుకు' . రికార్డింగ్ లో సింగర్ శ్రీకృష్ణ దగ్గరుండి పాడించాడు. తర్వాత కోటి గారు చెప్పారు 'నిర్మాత స్రవంతి రవికిషోర్ గారికి నచ్చేసింది. నీ పాటే వుంచేస్తున్నాం' అని.  "

" మరి ఇక్కడే వుండి ప్రయత్నాలు చెయ్యకుండా - బీ.టెక్. అయిపోయిన తర్వాత ఎం.బీ.ఏ. కూడా ఎందుకు ? "
" మా ఇంట్లో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండీ ... పీ.హెచ్.డీ.  లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ... నిజానికి బీ.టెక్. అవగానే హైదరాబాద్ లోనే జాబ్ వచ్చింది. ఒకసారి జాబ్ లోకెళితే ఇంక చదువు మీద కాన్సన్ ట్రేట్ చెయ్యలేవు అని నాన్నగారు అనడంతో కొంత అయిష్టంగానే వైజాగ్ వెళ్ళి ఎం.బీ.ఏ. లో జాయిన్ అయ్యాను. తర్వాత్తర్వాత ఎం.బీ.ఏ. యే నా ఫేవరెట్ అయిపోయింది. అది చదువుతూనే 'అన్నమయ్య సంకీర్తనామృతం' అనే ప్రైవేట్ ఆల్బమ్ స్వంతంగా చేశాను. "

" అంటే క్లాసికల్ మ్యూజిక్  తో  టచ్ వుందా ? "
" అయిదో క్లాస్ చదువుతున్నప్పట్నించి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతంలో డిప్లమో చేశాను. ఎం.బీ.ఏ. చేస్తున్నప్పుడే  వైజాగ్ ఆలిండియా రేడియో ద్వారా ఫోక్ విభాగంలో బీ.హై. వచ్చింది. "

' సూపర్ సింగర్ లోకి ఎంట్రీ కూడా ఎం.బీ.ఏ. చదువుతున్నప్పుడే కదూ ?"
" అవునండీ ... అప్పుడు అమ్మ కాలుకి సర్జరీ జరిగింది. హాస్పిటల్ లో వుండగా టీ.వీ.లో స్క్రోలింగ్ చూసి నన్ను అప్లయ్ చెయ్యమంది.  చేస్తే సెలక్ట్ అయ్యాను. ఫైనల్స్ లో రన్నర్ గా వచ్చాను.  ఆ తర్వాత సూపర్ సింగర్ 4th  సీరీస్ లో పాల్గొనమని పిలుపు వచ్చింది. అప్పటికి  నేను సినిమాల్లో 7 పాటల దాకా పాడాను. ఆలయం, న్యాయం కావాలి లాంటి సినిమాలతో పాటు,  తమిళం లో  కూడా 2 పాడేను. "

" సినిమాల్లో పాడాక రియాల్టీ షోల్లో ఒక పార్టిసిపెంట్ గా పాల్గొనాలని ఎందుకు అన్పించింది ? "
" అదే మాటన్నారు అందరూ ...  సినిమాల్లోనే కాకుండా రియాల్టీ షోల్లోనూ, స్టేజ్ షోల్లోను కూడా చాలా నేర్చుకోవచ్చు. నాక్కావలసింది నేర్చుకోవడం. ఇదే అందరికీ చెప్పాను. ఆ 4 th సీరీస్ ఫైనల్స్ లో విన్నర్ గా వచ్చాను. "

" ఆ తర్వాత ? "
" వెంటనే యూ.ఎస్. స్టేజ్ షోల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అమ్మ తో వెళ్ళాను. 16 ప్లేసెస్ లో షోలిచ్చాను.   వచ్చాక చక్రి గారు కన్నడ సినిమా 'గండెడె' లో 'గిర గిర తిరుగిదే'  అనే పాటను ఆయనతో పాటు పాడే అవకాశానిచ్చారు. అలాగే తమిళంలో 'పిళ్ళైయార్ తెరు కడైసి వీడు' అనే సినిమాలో 'ఎల్లొరే ఎల్లొరే' అనే పాటను పాడించారు. ఇప్పటికీ తమిళ నాట ఆ పాటతో  నన్ను గుర్తుపడతారు. ఇక తెలుగులో సింహా ( అచ్చాహై), సరదాగా కాస్సేపు (ఊహలో  సుందరా), దేవరాయ (నిక్కర్ వేసినప్పుడు) సినిమాల్లో పాడించారు "

" సరదాగా కాస్సేపు లో పాడబట్టే కదా డైరెక్టర్ వంశీ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ' పసలపూడి కథలు' టైటిల్ సాంగ్ పాడే చాన్స్ వచ్చింది ...?"
" అవునండీ ... ఆ పాటకి వచ్చిన  పేరు అంతా ఇంతా కాదు. స్టేట్స్ లో కూడా ఆ పాటని అడిగి మరీ పాడించుకున్నారు. ఆ పాటకి    'మా. టీ.' అవార్ద్ కూడా వచ్చింది."

"ఇంకెవవరి దగ్గర పాడేవు ? "
" అనూప్ రూబెన్స్ దగ్గర లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు సినిమాల్లో పాడేను. మిక్కీ జే. మేయర్ దగ్గర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'  సినిమాకి 'వాన చినుకులు' పాట ... "

"నీ కెరీర్ లో బిగ్గెస్ట్ కమ్మర్షియల్ హిట్ ఈ  పాటే కదూ ? "
"అవునండీ "

" ఎంతసేపు పట్టింది  నేర్చుకోవడానికి ?"
"ఇరవై నిముషాలు "

"మిక్కీ జె దగ్గర చాన్స్ ఎలా వచ్చింది ? "
" ఆయన కూడా సూపర్ సింగర్ చూసే నన్ను పిలిపించారు. సింగర్ కృష్ణ చైతన్య నా నంబర్ ఇచ్చాడు. "

" ఆయన దగ్గర పాడడం ఎలా అనిపించింది ? "
" పాట పాడే స్టయిల్ ఇలా వుండాలి అని ఆయనే చెబుతారు. ఆయనే దగ్గరుండి ట్రాక్ తీశారు.  ఇదే కాకుండా లేటెస్ట్ 'యముడికి మొగుడు' (అల్లరి నరేష్) లో కోటి గారు పాడించిన ' ఓరోరి మగధీరా' పాట కమర్షియల్ గా బాగా హిట్ అయింది."

" ఇప్పటి దాకా సినిమాల్లో ఎన్ని పాటలు పాడి వుంటావు ? "
" దాదాపు 50 వుండొచ్చు. "

" ఏ పాట పాడడానికి ఎక్కువ కష్టపడ్డావు ?"
" ఇప్పటిదాకా నన్ను కష్టపెట్టిన పాట రాలేదు. కానీ ప్రస్థుతం నేను చేస్తున్న డివోషనల్ ఆల్బమ్ కే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. "

" ఏంటా ఆల్బమ్ ? "
" అష్టకాలు, స్తుతులు తో కూడిన ఆల్బమ్ అది. పేరు - 'భక్తి తో అంజనాసౌమ్య' ... వడలి ఫణి నారాయణ గారు మ్యూజిక్ చేశారు. ఈ నెల 24న రిలీజ్ "

" మీరందరూ మన కల్చరల్ అంబాసిడర్స్ కాబట్టి ఒక గాయనిగా ఎన్ని దేశాలు తిరిగుంటావు ? "
" యూ.ఎస్., సింగపూర్, మలేషియా, జపాన్ "

" ఓకే ... చాలా మందికి తెలిసినా నీ లేటెస్ట్ సక్సెస్ గురించి నీ మాటల్లో వినాలని వుంటుంది కదా ... దాని గురించి చెప్పమ్మా  ... "
" సూపర్ సింగర్ -7 లో ఫైనల్ విన్నర్ గా రావడమే లేటెస్ట్ సక్సెస్ ...   కానీ ఈ సక్సెస్ కి ఓ ప్రత్యేకత వుంది.  శైలజ గారు, ఉష గారు, సుమంగళి గారు, సునీత గారు, కౌసల్య గారు వంటి సీనియర్ ప్రొఫెషనల్ సింగర్స్ ముందు - పాట మీద ఎంతో అవగాహన, డెప్త్ వున్న చంద్రబోస్ , అనంత్ శ్రీరామ్ వంటి రచయితల ముందు - ప్రస్తుతం వున్న ప్రొఫెషనల్ సింగర్స్ తో పోటీ  పడుతూ - ఫైనల్ విన్నర్ గా రావడం మామూలు గెలుపు కాదు. జీవితంలో చెప్పుకోదగ్గ మలుపు. ఎంతో తృప్తిగా అనిపించింది. ఈ సక్సెస్ వెనుక - నన్ను తీర్చిదిద్దిన నా తలిదండ్రుల కృషి, మా వారు రవి ప్రోత్సాహం, మా టీవి వారి సహకారం ఇన్ని వున్నాయి. "

 

శుభాభినందనలు - గోతెలుగు.కామ్






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
raja music muchchatlu