Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Action 3D

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - సైకో

Movie Review - Psycho
చిత్రం: సైకో
తారాగణం: రాజ్ ష్రాఫ్, నిషా కొఠారి తదితరులు
కథ, కథనం: రాం గోపాల్ వర్మ
దర్శకత్వం: కిషోర్ భార్గవ్
విడుదల తేదీ: 21జూన్  2013

సమకాలీన వ్యవస్థ, అందులో సాగుతున్న హింస, అంతీర్లీనంగా మనుషుల మనసుల్లో ఉండే వివిధ మానసిక కోణాల విశ్లేషణ, భయానక, భీభత్స రసావిష్కరణ...ఇవే మనకు ఈ మధ్య రాంగోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నవి. వయసొచ్చిన అమ్మాయిల వెంట పడి, వేధించి, ఆ పనికి ప్రేమ అని ఒక పేరు పెట్టుకుని, ఆ పైశాచిక ప్రేమకు లొంగకపోతే యాసిడ్ పోసో, గొంతు కోసో చంపే మగాళ్ళ వార్తలు వార్తా పత్రికల్లో నిత్యం చదువుతూనే ఉన్నాం, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఒకవేళ వేధించబడే ఆడది తిరగబడితే? పూవుకి ప్రతిరూపంగా సమాజం చిత్రించిన ఆడది ప్రతీకారానికి ప్రతిబింబంగా మారితే? ఎమౌతుందో 'సైకో' లో చూడాలి. 
 
క్లుప్తంగా చెప్పాలంటే: 
ప్రశాంతంగా ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, ఇంటి బాధ్యత మోస్తూ, కదల్లేని తండ్రికి అండగా నిలబడుతూ, తమ్ముడికి బాధ్యత నేర్పే అక్కగా , తల్లికి మంచి స్నేహితురాలిగా కాలం గడుపుతున్న ఒక అమ్మాయి (నిషా) జీవితంలోకి ఒక అజ్ఞాత వ్యక్తి (రాజ్ ష్రాఫ్) ప్రవేశిస్తాడు. పరిచయిస్తుడుగా మారి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. తనలో ఉన్న క్షణికావేశాన్ని, పిచ్చి వ్యామోహాన్ని గమనించిన ఆ అమ్మాయి అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఎంత తప్పించుకోవాలనుకుంటుందో అతను అంత రాక్షసుడైపోతూ ఉంటాడు. చివరకు ఏమౌతుందో తెరపై చూడాలి. 
 
మొత్తంగా చెప్పాలంటే:
చెడు మీద మంచి నెగ్గడం కేవలం సినిమాల్లోను, పురాణాల్లోను మాత్రమే సాధ్యమేమో. నిజ జీవితంలో చెడు మంచిపై గెలిచినప్పుడల్లా ప్రారబ్ధం అని, కర్మ అని సరిపెట్టుకునే మనిషి కనీసం కథల్లో అయినా మంచే చెడుపై గెలవాలనుకుంటాడు..అందుకే పైశాచిక ప్రేమికుల మీద తిరగబడి హతం చేయగలిగే స్త్రీలు మనకు వార్తల్లో కనపడరు..కానీ ఇలాంటి సినిమాల్లో కనిపిస్తారు..ప్రేక్షకులను మురిపిస్తారు. 
 
రాంగోపాల్ వర్మ కథ, కథనం అందించగా కిషోర్ భార్గవ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఆద్యంతం వర్మని అనుకరించినట్టే ఉంటుంది దర్శకత్వమంతా. ప్రముఖంగా ఈ సినిమాలో కథనంతో పాటు శబ్దరచన గురించి చెప్పుకోవాలి. ఎక్కడా దృష్టి మరల్చకుండా ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది. 
 
కథ తారాస్థాయికి చేరే సరికి అమ్మాయిలో ప్రతీకార వాంచ పెంచడానికి అవసరమైన సన్నివేశాలు మరికొన్ని పెంచితే మరింత పండేది. 
 
ఏది ఏమైనా ఎక్కడా ఒక్క పాట లేకుండా, రెండు ప్రధాన పాత్రలతో కథంతా నడపడం అంత తేలిక కాదు. ఈ విషయంలో కిషోర్ భార్గవ్ శ్రమ ఫలించినట్టే. 
 
ఒక్క ముక్కలో చెప్పాలంటే: సమయం ఉంటే చూడొచ్చు
 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu