Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - యాక్షన్ 3డి

Movie Review - Action 3D
చిత్రం: యాక్షన్ 3డి
తారాగణం: అల్లరి నరేష్, నీలం ఉపాధ్యాయ, వైభవ్, రితు బర్మేచ, కిక్ శ్యాం, షీన, స్నేహా ఉల్లాల్, రాజు సుందరం, కామ్నా జెట్మలాని, సునీల్, పోసాని, సుదీప్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, ఆలి, కృష్ణ భగవాన్
సంగీతం: బప్పా- బప్పి లహరి
చాయాగ్రహణం: సర్వేష్ మురారి
కూర్పు: ఎమ్మార్ వర్మ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: అనీల్ సుంకర
విడుదల తేదీ: 21 జూన్ 2013
 
దశాబ్దాల క్రితం "చిన్నారి చేతన" అని ఒకటి, "జై బేతాళ" అని ఒకటి 3డి సినిమాలుగా తెలుగు వాళ్ళ ముందుకు వచ్చాయి. ఈ మధ్య "అవతార్" ఒకటి 3డి సినిమాగా విశేషంగా అలరించింది. ఏడాది క్రితం రాంగోపాల్ వర్మ "భూత్ " అనే దెయ్యం సినిమాని 3డి గా చూపించాడు. మాయలు-మంత్రాలు, వింత లోకాలు మొదలైనవి చూపించడానికి మాత్రమే 3డి పనితనం పనికొస్తుందనుకుంటే తాజాగా నేడు భారత దేశంలోనే తొలి కామెడీ 3డి చిత్రంగా "యాక్షన్" టైటిల్ తో తెలుగులో మన ముందుకొచ్చింది. 3డిలో కామెడీనా? వివరాల్లోకి వెళ్దాం.  
 
క్లుప్తంగా చెప్పాలంటే:
నలుగురు యువకులు (అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం)సరదాగా గడపాలని గోవా వెళ్తారు. మద్యపానం చేసిన మత్తులో ఆ రాత్రి జరిగిందంతా మర్చిపోతారు. తమని ప్రమాదంలోకి, ఆశ్చర్యం లోకి, అయోమయంలోకి, భయంలోకి నెట్టగలిగే విచిత్ర సంఘటనలన్నీ ఒక్క రాత్రిలో తమకు తెలీకుండా ఎలా జరిగాయో ఛేదించడమే మిగిలిన సినిమా. 
 
మొత్తంగా చెప్పాలంటే: 
అల్లరి నరేష్ సినిమా అనగానే ప్రతీ రెండు నిమషాలకి ఒకసారి కడుపుబ్బ నవ్వించే హాస్యాన్ని ఆశించడం మామూలే. ఇది పూర్తిగా ఆంగ్ల చిత్రం "హ్యాంగ్ ఓవర్" నుంచి యధాతధంగా తీసుకున్నదే. "హ్యాంగోవర్" కంటే ముందే వచ్చినా గతంలో కమల్ హాసన్ తీసిన "పంచతంత్రం" కూడా ఇలాంటిదే. 
 
అయితే యధాతధంగా ఆంగ్ల చిత్రాన్ని అనుకరించడం వల్ల తెలుగు చిత్రంలో ఉండాల్సిన స్వభావం కొంత కోల్పోయింది. ఇక తెలుగు హాస్య చిత్రంగా రూపొందించాలనే క్రమంలో "దూకుడు" చిత్రంలోని పాత్రల్నే కాస్త అటు ఇటు చేసి చూపించినట్టయ్యింది. ఈ చిత్ర దర్శకుడు "దూకుడు" కి నిర్మాత కావడం గమనార్హం. 
 
నిజానికి ఇందులో 3డి అవసరం అసలు ఏ మాత్రం కనపడదు. ఒక మామూలు చిత్రంగా చూసినా పెద్దగా మిస్ అయ్యేది ఏమీ ఉండదు. అక్కడక్కడ కొన్ని చమక్కులు తప్ప ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా చూపించే ఆస్కారం లేని కథాంశం ఇది. 
 
అయినా ఈ సినిమా చూస్తుంటే దర్శక నిర్మాతలో ఉన్న తపన, తపస్సు కనిపిస్తాయి. ఏదో రకంగా ఒక 3డి సినిమా తీయాలనే తపన, తానూ దర్శకుడిగా అడుగులు వెయ్యాలనే తపస్సు.....!
 
2:30 గంటలకు దగ్గరగా ఉన్న ఈ చిత్రం నిడివి 30 నిమిషాల వరకు కుదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3డి కళ్ళజోడు వల్ల కలిగే ఇబ్బంది, దాని వల్ల కలిగే కించిత్ శిరోభారాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
ఇక కళాకారుల పనితీరుకొస్తే అల్లరి నరేష్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తన సినిమా అంటేనే కనీస స్థాయి వినోదం తప్పకుండా ఉంటుందనేది మరో సారి నిరూపణ అయ్యింది. రాజూ సుందరం వచ్చీ రాని తెలుగు తనదైన శైలిలో పలికి అక్కడక్కడా నవ్వించగలిగాడు. కిక్ శ్యాం, వైభవ్ లు పర్వాలేదనిపించారు. స్నేహా ఉల్లల్, నీలం అందాల విందు చేస్తే షీన, కామ్నాలు కాసేపు మెరిశారు. ఎమ్మెస్ నారాయణ బాగానే నవ్విస్తే, ఆలి నవ్వించాననుకున్నాడు. కృష్ణ భగవాన్ అతిధి పాత్రలో పర్వాలేదు. బ్రహ్మానందం కూడా అంతే. కథ మొదట్లోను, మధ్యలోను, చివరలోను పోసాని, సునీల్ కనిపిస్తారు. 
 
చిత్రం నిడివి, కథనం పైన మరింత జాగ్రత్త వహించి వుంటే ఫలితం మరింత బాగుండేది. 
 
ఒక్క ముక్కలో చెప్పాలంటే: కళ్ళ జోడు పెట్టుకుని సినిమా చూసే సరదా ఉంటే చూడండి
 
అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Psycho