Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja music muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

మెగాభిమానం-మూడుముళ్ళ ముచ్చట

aaditya hrudayam - vn adithya

ఎల్ కేజీ నుంచి బిఎస్సీ వరకూ 17సంవత్సరాల నా  బాల్య, కౌమార, యవ్వన దశలు మూడిట్లోనూ - బాల్యంలో నేను ఎన్.టి.ఆర్ గారి అభిమానిని, కౌమారంలో కృష్ణ గారి అభిమానిని. యవ్వనంలో చిరంజీవిగారి అభిమానిని. సుమారుగా 'నాదేశం' వరకూ ఎన్.టి.ఆర్, 'కుమారరాజా', 'ఊరికిమొనగాడు' చిత్రాలనుంచి 'సింహాసనం'వరకూ కృష్ణ, 'ఖైదీ' నుంచి, 'గ్యాంగ్ లీడర్' వరకూ చిరంజీవికి అభిమానిని అన్నమాట. నేను పరిశ్రమకొచ్చాక నేను వర్క్ చేసిన బాలకృష్ణ, కమల్ హాసన్, వెంకటేశ్, నాగార్జున గార్లతో రిలేషన్ పెరిగాక ఏర్పడిన అభిమానాన్ని పర్సనల్ గా పక్కన పెడితే, నేను దర్శకుణ్ణయ్యాక  ఇచ్చిన ఇంటర్వ్యూలలో చిరంజీవి అభిమానిననే నిర్మొహమాటంగా చెప్పేసేవాడిని. అలా 'శ్రీరాం' సినిమా షూటింగ్ లో కలిసిన సినీజర్నలిస్ట్ శ్రీ జీవిగారికిచ్చిన ఇంటర్వ్యూలో మీ పెళ్ళెప్పుడు అనడిగితే, చిరంజీవిగారి సినిమా డైరక్ట్ చేసే వరకూ పెళ్ళిగురించి ఆలోచించను అని చెప్పేసాను.

తీరా చూస్తే చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశాలన్నీ దగ్గరకొచ్చి మిస్సయిపోతూ ఉండేవి.

అలాగే, చూస్తుండగా  ' ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్ దాదా' మొదలైపోయాయి. నాకేమో ఓ పక్క విపరీతంగా సంబంధాలు రావడం, ఇంట్లో ఒత్తిడి పెరగడం -  'ఇంద్ర' కి, ' ఠాగూర్' కి మధ్యలో అంజనా ప్రొడక్షన్ నాగబాబు గారినుంచి కబురొచ్చింది. చిరంజీవిగారితో మళయాళంలో మోహన్ లాల్ చేసిన సినిమా రీమేక్ చేద్దాం అని. నేను పరుచూరి వెంకటేశ్వరరావు గారు అందరం కలిసి మార్పులు, చేర్పులు అనుకొని వెళ్ళి చిరంజీవి గారికి చెప్పాం. ఆయన ఓకే అన్నారు. ఆనపూర్ణ స్టూడియోస్ లో నాగార్జునగారు అథితిగా ముహూర్తం చాలా ఘనంగా జరిగింది. ఇంకో రెండు నెలల్లో షూటింగ్ అనుకున్నాం. ఆ సిట్టింగ్స్ కన్నా ముందే నాకు నాగార్జునగారితో  'నేనున్నాను'  షూటింగ్ మొదలైంది, పెళ్ళయింది. సినిమా రిలీజయింది. హిట్ అయ్యింది. చిరంజీవి గారి ' అందరివాడు ' మొదలయింది. నాకు తెలీకుండా సినిమా ఆగిపోయింది. కేవలం జీవిగారితో నేను అన్నమాట ప్రకారమే నా పెళ్ళి కోసమే చిరంజీవిగారితో సినిమా ముహూర్తం జరుపుకుందని నాకనిపించింది. పై వాడి స్క్రీన్ ప్లే పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, జంధ్యాల గారు లాంటి స్టార్ రైటర్స్ కన్నా పవర్ ఫుల్ గా ఉంటుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మెగాస్టార్ తో సినిమా మూణ్ణాళ్ళముచ్చటయ్యుండచ్చుగానీ, ఆయనపై అభిమానం మాత్రం మూడు ముళ్ళ ముచ్చట లాగే పటిష్టంగా, పదిలంగా ఉంది.


వచ్చేవారం.... 'నమ్మవరు' తో నేను....



మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
music directors fastest fifty