Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ : అపర్ణ హత్య కేసులో నిరంతర అప్ డేట్స్ ప్రసారం చేస్తున్న చానల్ ఆఫీసుకొచ్చి గొడవ పడుతుంటాడు ఒక వ్యక్తి. అతడు అపర్ణ లిఫ్టులో ఆఖరుసారిగా కలిసిన వ్యక్తి. తన ప్రమేయం లేకుండా హైలైట్ చేస్తున్నారనేది అతడి బాధ. అతణ్ణి తన చాంబర్ కి పిలిచి మాట్లాడుతాడు తేజ...ఆ తర్వాత...

అర్ధాంతరంగా ఆమె చనిపోయింది. ఆమెది హత్యో...ఆత్మహత్యో తెలీని అనుమానాస్పద మృతి. ఆ ఒక్క అంశమే ఈ కేసులో మిస్టరీ. బాస్‌ దాన్నే ఛేదించమంటున్నాడు.

ఎక్కడ్నుంచీ ఈ కేసును నరుక్కు రావడం...అదే అంతు పట్టడం లేదతడికి. చానెల్‌ లైబ్రరీలో ప్రతిమతో తను చేసిన  ఇంటర్వ్యూతో పాటు... చనిపోయిన తర్వాత కవర్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ అన్నీ ఉన్నాయి. కొత్త ప్రోగ్రామ్‌కి అవన్నీ బేస్‌గానే పనికొస్తాయి. అయితే, ఫ్రెష్‌ ఇన్‌ఫర్మేషన్‌ కావాలంటే..ఆ మిస్టరీ వీడాల్సిందే. ఆమె చనిపోవడానికి అసలు కారణం తెలియాల్సిందే. హత్యే అయితే..నిందితుల్ని నిర్ధారించాలి.ఆత్మహత్యే అయితే...కారణాలు అతికినట్లు సరిపోవాలి. అవన్నీ తేలాలంటే... ఇన్విస్టిగేషన్‌ తాజాగా జరగాలి.

ఆ ఇన్విస్టిగేషన్‌ స్వయంగా చేయాలంటే తనకున్న ఏకైక బలం చానెల్‌.  క్రయిం రిపోర్టరనే హోదా. ఆ హోదాలోనే ప్రతిమ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. అంతకు ముందుగా ఇండస్ట్రీలో ఆమె మిత్రులు, శత్రువుల గురించి ఆరా తీయాలి.

సరిగ్గా...ఆ క్షణంలోనే ఆఫ్‌ ది రికార్డ్‌ గా తనతో కూడా ప్రతిమ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తేజాకి.

‘‘ఈ కార్పోరేట్‌ పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం కనిపించని యుద్ధం జరుగుతుంటుంది. అది మేధో యుద్ధం. పైకి ఆయుధాలు కనిపించవు. మనచుట్టూ ఉన్న గుంపులో శత్రువులెవరో...మిత్రులెవరో గుర్తించడం కష్టమే. అందుకే, ఈ యుద్ధాలు కురుక్షేత్ర సంగ్రామం కన్నా భీకరమైనవి...భయానకమైనవి. అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే ఈ యుద్ధంలో నెగ్గుకు రావడం కష్టం. విజేతలుగా నిలవడం కష్టం’’ అంది ప్రతిమ...ఓ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత.

ఆ మాటల్ని బట్టీ...కార్పొరేట్‌ కల్చర్‌ని అలవర్చుకుంటున్న కలర్‌ఫుల్‌ ఇండస్ట్రీతో ఆమె పెద్ద యుద్ధమే చేసుండాలి.

ఆ యుద్ధం గురించి తెలిస్తేనే...ఆమె శత్రువుల గురించి తెలుస్తుంది.  శత్రువులెవరో తేలిపోతే..మిస్టరీ వీడిపోతుంది.  ఆ శత్రువులు ఆమె పనిచేసే సంస్ధలోనే ఉన్నారో..లేక, ఇతర ప్రొడక్షన్‌ హౌస్‌ల్లో ఉన్నారో తేల్చుకోవాలి.  అంతేకాదు...ప్రతిమ పర్సనల్‌ లైఫ్‌ గురించి మరింత క్షుణ్ణంగా పరిశోధన జరపాలి.  ఆమెకో లవర్‌ ఉన్నట్లు తెలుసు. అయితే, ఆఫీసు ప్రిమిసెస్‌లో ఆమె మరణించింది కాబట్టి...అతగాడిపై ఈ ఘటన నీలి నీడలు అంతగా పరుచుకోలేదు. పోలీసులు అతడ్ని ఒకట్రెండు సార్లు ఇంటరాగేట్‌ చేసి వదిలేసారు.

ఆపై మళ్లీ ఇంకోసారి ప్రతిమ పేరెంట్స్‌ని కలిస్తే ఉపయోగం ఉంటుందేమో?

ఇలా ఆలోచిస్తుంటే...అతడికి సడన్‌గా సిద్దార్థ గుర్తొచ్చాడు. సిద్దార్థ తేజాకి మంచి ఫ్రెండే కాదు...ట్విన్‌ సిటీలో పేరు మోసిన డిటిక్టివ్‌. వ్యూహ  ప్రతి వ్యూహాలు, గూఢచర్య ప్రతి గూఢచర్యలు, ఎత్తులు, పై ఎత్తుల్లో ఆరితేరినవాడు.  ప్రత్యేకించి...ప్రతిమను బాగా ఎరిగినవాడు. పర్టిక్యులర్‌గా ప్రతిమ కేసులో సిద్దార్థ హెల్ప్‌ తీసుకోవడం సముచితమనిపించింది తేజాకి.

అంతే!

ఆఫీసు పనైపోయిన ఆ సాయంత్రం వేళ...సిద్దార్థకు కాల్‌ చేసాడు తేజ.

‘‘హలో...తేజా! చాన్నాళ్లకి’’ ఆప్యాయంగా పలకరించాడు సిద్దార్థ.

‘‘ఔను..చాల్రోజులకి. ఎలా ఉన్నావ్‌?’’ అడిగాడు తేజ.

‘‘ఫైన్‌..నువ్వెలా ఉన్నావ్‌?’’ అడిగాడతడు.

‘‘ఓకే. ఇవాళ్టి నీ ప్రోగ్రామ్‌ ఏంటీ?’’

‘‘క్లయింట్లూ, కేసులు..ఇన్విస్టిగేషన్‌. రోజూ ఉండే బిజీయే’’

‘‘నీకేం...’’ నవ్వాడు తేజ.

ఆ తర్వాత`‘‘ఓ హాఫెనవర్లో నీ ఆఫీసుకే వస్తున్నాను’’ చెప్పాడు.

‘‘ఊరక రారు క్రయిం రిపోర్టర్లు. విశేషమా?’’

‘‘సశేషమే...అక్కడకొచ్చాక మాట్లాడుకుందాం’’ అన్నాడు తేజ.

ఆ వెంటనే ఆఫీస్‌ ప్రిమిసెస్‌లో ఆపి ఉంచిన బైక్‌ పైకి ఓ దూకు దూకాడు. రయ్‌మంటూ లక్‌డికాపూల్‌ వైపు బాణంలా దూసుకెళ్లాడు.‘‘చూసిన మొదటి క్షణంలోనే తననెంతగానో ఆకట్టుకున్న అపురూప అందానికి మనస్ఫూర్తిగా సమర్పించే నివాళిగా ఆ ప్రోగ్రామ్‌ను మలచాలి...’’ అనుకుంటున్నాడే తప్ప...సిద్దార్థ ఆఫీసులో తనకో ఝలక్‌ ఎదురవబోతోందని అస్సలు ఊహించలేదతడు.

ట్రాఫిక్‌ పంజరాన్ని ఛేదించుకుంటూ...మహానగరాన్ని సముద్రంలా ఈదుకుంటూ మరో అరగంటలో సిద్దార్థ ముందున్నాడు తేజ. ఆరు దాటిందేమో...ఆఫీసులో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయతడికి. సిబ్బంది వెళ్లిపోయినట్లున్నారు...ఒంటరిగా క్యాబిన్‌లో కూచుని ఏదో కేసు  స్టడీ చేస్తున్నాడు సిద్దార్థ.  వెళ్లగానే చిర్నవ్వుల చిలకరింపు, ‘హలో...’ అనే పలకరింపు, ఓ ఆత్మీయ కరచాలనం, ఓ చిన్ని హగ్‌...ఆ తర్వాత కూల్‌ డ్రిరక్‌ ఆఫర్‌ చేసాడు సిద్దార్థ.

తర్వాత`‘‘విశేషమేంటీ?’’ అడిగాడు ఆసక్తిగా.

‘‘సశేషమే. మళ్లీ ప్రతిమ కేసు...’’ నవ్వుతూ అన్నాడు తేజ.

‘‘అయితే, ఇంకా నువ్వు ప్రతిమను మరిచి పోలేదన్న మాట’’

‘‘ప్రతిమ నా కళ్లకు కలై, కాళ్లకు సంకెలై మళ్లీ మళ్లీ చుట్టుకుంటోంది...’’అన్నాడు నవ్వుతూ.

‘‘ఆ కలా..ఆ సంకెల హాయిగానే ఉన్నట్లుంది’’ అన్నాడు సిద్దార్థ కాస్త వ్యంగ్యంగా.

‘‘ఆమె జ్ఞాపకం అందమైన ఓ వ్యాపకం. తలచుకున్నప్పుడల్లా గుండె ఎదవాకిట్లో పరిమళాల తుఫాన్‌. మళ్లీ అంత అందాన్ని చూడగలమా? నాకైతే డౌటే...’’

‘‘ప్రతిమ నీజీవితాన్ని బాగా ప్రభావితం చేసింది. అందుకే, పెళ్లి మాటెత్తడం లేదు. కనీసం...ఇంట్లోవాళ్లయినా పెళ్లిసంబంధాల మాటెత్తుతున్నారా? లేదా?’’ అడిగాడు సందేహం వచ్చి.

‘‘ఎందుకెత్తరూ. ఇంటికెళ్లగానే ప్రతిరోజూ అమ్మ దగ్గర్నుంచి ఎదురయ్యే ప్రశ్నే ఇది. నాన్నేలాగో ఉద్యోగం పేరుతో ఊరేగుతుంటారు కాబట్టి..కనిపించిన కాసేపూ లోకాభిరామాయణంతోనే సరి పెడ్తారు. ఇక, నా సిస్టర్‌ అర్చన ఉంది చూసావూ...నే వదిలేసిన అమ్మపాలు తాగి పెరిగానన్న  కృతజ్ఞత కూడా లేకుండా అస్తమానం సతాయిస్తూనే ఉంటుంది. అందమైన ఏ ఫొటో చూసినా ‘అన్నయ్యా! నా వదిన ఇదిగో!’ అంటూ ఆట పట్టిస్తుంది. ఒకటే అల్లరి చేస్తుంటుంది. ఒక్కోసారి ఆ అల్లరి శృతి మించినట్లనిపించినా...అర్చన మౌనంగా ఉంటే నే భరించలేను. ఇల్లు ఓ నరకంలా అనిపిస్తుంది..’’తన్మయంగా చెప్పాడు తేజ.

‘‘కరెక్టే...లోకంలో ఎన్ని బంధాలున్నా చెల్లి బంధం అపురూపమైంది. తల్లి రక్తం పంచుతుంది. భార్య పక్క పంచుకుంటుంది. అక్కయినా, చెల్లెలైనా ఏ స్వార్ధం లేకుండా తోడబుట్టినవాడి క్షేమం కోరుకుంటుంది. నీకో ముద్దుల చెల్లెలు అర్చన ఉంది. కానీ, నేనో...నా ఇంట్లో ఒంటరినే’’ నిట్టూర్చాడు సిద్దార్థ.

ఆ తర్వాత సీన్‌ మరీ బరువెక్కుతుందనుకున్నాడేమో మరి...వాతవరణాన్ని తేలిక చేస్తూ`‘‘అన్నట్టు..ఈ అన్నయ్య పెళ్లయితేకానీ అర్చన పెళ్లి కాదుకదా! అందుకే, ప్రతి ఫొటోలోనూ వదినని వెతుక్కుంటోంది కాబోలు..’’

‘‘డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. అప్పుడే దానికి పెళ్లేంటీ? ఏదో...నన్ను ఉడికించాలని ట్రై చేస్తుంటుందంతే’’ అన్నాడు తేజ.

‘‘అర్చనకు ప్రతిమ ఫొటో చూపించాల్సింది. వదిన తనే అంటూ ఫిక్సయిపోయేది...’’ నవ్వాడు సిద్దార్థ.

‘‘ఆమె బతికుండగా చూపించాలనే అనుకున్నాను. అప్పట్లో అది కుదరలేదు. ఇప్పుడు ప్రత్యేకించి చూపించాల్సిన అవసరమే లేదు...అయినా, మనమధ్య ఎప్పుడూ ఉండే డిస్కషనే ఇది. నేనేం చేసినా ప్రతిమ కోసమేనన్నట్లు అపార్ధం చేసుకుంటావ్‌. కానీ, ఈసారి ఈ విషయంలో నా తప్పేం లేదు...’’అంటూ బాస్‌ కొత్త కాన్సెప్ట్‌ గురించి వివరించాడు తేజ.

‘‘ఇప్పుడు చేయబోతున్న ప్రోగ్రాం కంప్లీట్‌ కొత్తగా ఉంటుంది. ఓ క్రయింలో ఇన్ని కోణాలా? ఇంత ఇన్విస్టిగేషనా? ఏ రైటరూ ఊహించలేని ఇన్ని మలుపులా? అని నీబోటి డిటెక్టివ్‌  కూడా ఆశ్చర్యపోయేలా సూపర్బ్‌గా ఉంటుంది’’ అన్నాడు తేజ.

‘‘ప్రోగ్రాం ప్రమోషన్‌ బాగానే చేస్తున్నావ్‌. పాత కంటెంట్‌ మార్చలేవు కదా? ప్రతిమ పేరు ప్రతిమగానే చెప్పాలి. ఆమె ప్రొఫెషన్‌ వాగ్దేవి ప్రొడక్షన్స్‌లో క్రియేటివ్‌ హెడ్‌గానే చెప్పాలి. ఆమె పుట్టుకను మార్చలేవు. ఏరోజైతే చనిపోయిందో...ఆ తేదీని మార్చలేవు. అవే వివరాలతో కొత్తగా నువ్వు చెప్పేదేముంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే ఓల్డ్‌ వైన్‌ ఇన్‌ న్యూ బాటిల్‌...’’ అన్నాడు సిద్దార్థ.

‘‘కానీ, ఈ కేసులో నువ్వొకటి మరిచిపోతున్నావు. ఆమె చనిపోవడం కరెక్టే. కానీ...ఆ చనిపోవడంపైనే అనుమానాలున్నాయి. ఆత్మహత్యో, హత్యో మా ప్రోగ్రాం నిర్ధారిస్తుంది. అసలు ప్రతిమ జీవితంలో లోకానికి తెలీని ఎన్నో నిజాల్ని వెలికి తీస్తాం. ఆమె విషాదాంతానికి కారణాల్ని సహేతుకంగా చెప్తూ కాంక్రీట్‌ కంక్లూజనిస్తాం. ఇక, వ్యూయర్సా? ఇంట్రస్టింగ్ గా తీస్తే ఎన్నిసార్లయినా చూస్తారు?  పకడ్బందీ స్క్రిప్ట్‌...హడలెత్తించే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌...ఇన్సిడెంట్‌ జరిగిన యాక్చువల్‌ లొకేషన్లలోనే షూటింగ్‌ చేస్తే...సింగిల్‌ ఎపిసోడ్‌ అయినా సూపర్బ్‌గా వస్తుంది. ఈ కథలో క్లయిమాక్స్‌ సస్పెన్స్‌. అదే...మిస్టరీ’’ చెప్తున్నాడు తేజ.

‘‘అయినా, ఇన్విస్టిగేషన్‌ చేయడానికి నువ్వెవరు?’’

‘‘ఖాకీ డ్రస్‌ వేయని పోలీస్‌ని. కలం పట్టుకున్న జర్నలిస్ట్‌ని’’ ఆ క్షణంలో బాస్‌ నరసింహం తేజాని ఆవహించినట్లున్నాడు. పూనకం వచ్చినవాడిలా ఒకటే ఊదరగొట్టేస్తున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్