Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ : ఒక కేసు పరిశోధించాలంటూ డిటెక్టివ్ తేజా దగ్గరికి వచ్చిన అపరిచిత వ్యక్తి ఇచ్చిన ఫోటో చూసి ఆశ్చరయపోతాడు తేజా...ఎందుకంటే అది చనిపోయిన ప్రతిమదే....కానీ ఈ అమ్మాయి అప్పుడప్పుడు తమకు ఇండికా కారులో కంపిస్తోందని అతడు చెప్పగా విని మరింత ఆశ్చర్యపోతాడు....ఆ తర్వాతా....

అపర్ణ క్షేమం. పోలీసులకి చిక్కిన అపర్ణ. అరకులోయలోని గెస్ట్‌హౌస్‌లో అపర్ణ పట్టుబడిన వైనం...’’ అంటూ హడలెత్తించే మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో అపర్ణ గురించిన లేటెస్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ని చానెల్స్‌ అందించాయి. అయినా, వ్యూయర్స్‌లో అంతులేని ఉత్కంఠ.

అపర్ణ దొరికింది సరే...ఎందుకు అదృశ్యమైంది? కిడ్నాప్‌ చేసారా? లవర్‌తో లేచిపోయిందా? ఇలా అనేక సందేహాలు.

ఆ మర్నాడు`

పోలీసులు అపర్ణను క్షేమంగా హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. అపర్ణను మీడియా ముందు ప్రవేశపెట్టమని మీడియా ప్రతినిధులు ఎంత అరిచి గీపెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. ‘‘ఆమెనెవరూ కిడ్నాప్‌ చేయలేదు. మానసిక ప్రశాంతత కోసం ఆమె తనంతట తానే వెళ్లిపోయింది. ఇంట్లోవాళ్లు కంగారుపడి ఫిర్యాదు చేయడంతో అపర్ణపై మీడియా దృష్టిపడిరది. వీధిలోకొచ్చిన ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితుల నేపధ్యంలో అపర్ణ అదృశ్యం ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియా పుణ్యమాని ఈ ఇన్సిడెంట్‌ ఇంటింటికీ పాకింది’’ పోలీస్‌ అధికారి ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చెప్పినమాటలవి.

‘‘ఇంతకీ అపర్ణ ఎక్కడ దొరికింది?’’ మీడియా ప్రతినిధి ప్రశ్న అది.

‘‘అరకు లోయలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో...’’

‘‘ఆమె ఒక్కరే దొరికారా? లేక, ఆమెతోపాటు మరెవరైనా దొరికారా?’’

‘‘అపర్ణే మా టార్గెట్‌. ఆమెని పట్టుకున్నాం’’

‘‘అపర్ణకి పెళ్లికాలేదని తెలిసింది. ఆమె అదృశ్యానికి ప్రేమ వ్యవహారమే కారణమా?’’

‘‘సారీ...మీ ప్రశ్నలన్నింటికీ ఆన్సరివ్వలేను. ఇన్నాళ్లూ మీడియాలో సెన్సేషనల్‌ న్యూస్‌గా నలుగుతున్న అపర్ణ స్టోరీ ఆమె దొరకడంతో క్లోజయినట్టే. ఆమె అభ్యర్ధన మేరకు వ్యక్తిగత వివరాలు ఇవ్వలేం’’ ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ముగిసిందన్నట్లుగా ఆ అధికారి లేచారు.

‘‘సార్‌..సార్‌! ఒక్క చిన్న ప్రశ్న. పబ్లిక్‌లోకి రానంతవరకూ పర్సనలే. అదృశ్యంతో ఆమె స్టోరీ పబ్లికైంది. ఆమె క్షేమంగా బయటపడాలని తెలుగువాళ్లంతా ఎంతగానో కోరుకున్నారు. ఆమె కనిపించనప్పుడు ఏం జరక్కూడదని కనిపించని దేవుళ్లనీ ప్రార్ధించారు. తీరా, ఆమె కనిపించాక...ఏం జరిగిందో చెప్పకపోవడం అన్యాయం’’ అన్నాడో మీడియా ప్రతినిధి.

‘‘సారీ...సారీ! అపర్ణ విషయంలో నేనేం చెప్పలేను’’ అంటూ అతడు మీడియా మైకు గొట్టాలకు దూరంగా జరిగిపోయాడు. ఆ తర్వాత అయిదునిముషాలకే ముఖానికి స్క్రార్ఫ్‌ వేసుకున్న ఓ యువతి పోలీస్‌ ఠాణాలోంచి బయటకి వస్తుంటే మీడియా జనాలు ఆమెని చుట్టుముట్టారు.

ఆమె పరుగు లంకించుకోబోగా అడ్డుకున్నారు. దాంతో, ఆమె ఓ క్షణం ఆగింది. అలా ఆమె ఆగిన ఆ క్షణంలోనే మీడియా గొట్టాలు ఆమెను చుట్టుముట్టాయి.

‘‘మేడమ్‌...మీ అదృశ్యం వెనుక కారణమేంటీ?’’

‘‘ఎవరైనా కిడ్నాప్‌ చేసారా?’’

‘‘లవ్‌ ఎఫైర్‌ ఏదైనా ఉందా?’’

‘‘ఇన్నిరోజులూ ఎక్కడికి వెళ్లారు? కనీసం మీ పేరెంట్స్‌కి కూడా ఏ ఇన్‌ఫర్మేషన్‌ చెప్పకుండా ఎలా ఉన్నారు?’’ వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు మీడియా ప్రతినిధులు. ఆమె ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం ఇవ్వకుండా`‘‘ప్లీజ్‌! ఇది నా వ్యక్తిగత విషయం. పబ్లిక్‌ చేయదలచుకోలేదు. మానసిక శాంతి కోసం నేను అలా బయటకి వెళ్లాల్సి వచ్చింది’’ అంటూ సెలవుపుచ్చేసుకుంది.  ఎప్పుడూ జనాలతో మీడియా ఆటాడుకుంటుంటే అపర్ణ మాత్రం అటు మీడియాను, ఇటు పోలీసుల్ని ఏకకాలంలోనే ‘జుగల్బందీ’ ఆడుకుంది. తను కనిపించకుండాపోవడం సెన్సేషన్‌ సృష్టించినా వివరాలు చెప్పడానికి ఏమాత్రం ముందుకు రాకుండా వ్యక్తిగతకారణాలంటూ సింపుల్‌గా తప్పించుకుంది. దాంతో ఒళ్లు మండిన మీడియా అపర్ణ క్షేమం విషయం ప్రపంచానికి తెలియబరుస్తూనే...‘అపర్ణ అదృశ్యం వెనుక మిస్టరీ’ అంటూ స్పెషల్‌ ప్రోగ్రాంలు టెలికాస్ట్‌ చేసింది. ఇదే విషయమై  చానెల్‌ సిక్స్‌టీన్‌ బాస్‌ నర్సింహం క్రయిం రిపోర్టర్‌ తేజాతో మాట్లాడుతూ`‘‘అపర్ణ అదృశ్యం మిస్టరీ కూడా త్వరలోనే ఛేదించాలి. కొత్త కాన్సెప్ట్‌తో డిజైన్‌ చేస్తున్న కొత్త ప్రోగ్రామ్స్‌ లిస్ట్‌లో దీన్ని కూడా చేర్చండి’’ అంటూనే`‘‘అన్నట్లు ప్రతిమ స్టోరీ ఎంతవరకూ వచ్చిందంటూ ప్రశ్నించాడు.

‘‘అదే పనిలో ఉన్నాం. తొందర్లోనే కొత్త కాన్సెప్ట్‌ ఎయిర్‌లోకి వెళ్తుంది’’ మాట ఇచ్చాడు తేజ.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ సెవన్‌లో ప్రత్యేకంగా కనిపించే భవంతి అది. చుట్టూ ఎత్తయిన ప్రహరీ, మధ్యలో ఎప్పుడూ మూసి ఉండే ఇనుపగేటు. లోనికి వెలుపలికి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆ గేటు మధ్యలో చిన్న తలుపు. వాహనాలేవైనా వచ్చినప్పుడు మాత్రమే ఇనుప గేటు రెండుగా చీలి...ఆ వెన్వెంటనే మూసుకుంటుంది. ఆ పక్కనే అనుక్షణం పహారా కాసే సెక్యూరిటీ గార్డు.  ఆ గేటు దాటి లోనికి వెళ్తే...విశాలమైన ఆవరణ. అటూ ఇటూ పూలమొక్కలు అందంగా తలలూపుతూ వచ్చే  అతిథులకు స్వాగతం చెప్తుంటాయి. ఆ పక్కనే వాహనాల్ని పార్క్‌ చేసి కాలినడకన ఓ ఫర్లాంగు దూరం నడిస్తేనేకానీ...ఆకాశాన్నంటే ఆ భవంతి పాదపీఠిక దగ్గరికి చేరుకోలేరెవరూ. ముందున్న హాల్లో సోఫాలున్నాయి. అక్కడే రిసెప్షనిస్ట్‌ కూడా ఉంటుంది. డిటెయిల్స్‌ తెలుసుకుని ఇంటర్‌కంలో సమాచారం అందిస్తుంది. వచ్చినవారి వివరాల్ని బట్టీ వేగంగానో, ఆలస్యంగానో ఆహ్వానాలు అందుతాయి. అది ఫణిభూషణరావుగారిల్లు. ఇండియాలోనే పేరుమోసిన ఇండస్ట్రీయలిస్ట్‌.

ఆరోజు`

ఆ ఇంటి గేటు ముందు ప్రత్యేకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుంపుగుంపులుగా జనం జాతర చేస్తున్నారక్కడ. అమ్మాయిగారి పుట్టినరోజు.  ఆరోజున బీదలకు చీరలు, ధోవతులు పంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంగతి ప్రముఖంగా ప్రకటించనక్కర్లేదు.  ప్రతి ఏడాదీ జరిగే తంతే. అందుకే, ఏడాది పొడవునా ఎక్కడెక్కడున్నా...ఆరోజు మాత్రం అక్కడికి చేరుకుంటారంతా. అమ్మాయిగారు కనిపించి దుస్తులు పంపిణీ చేసినా...కనిపించకుండా ఏ పనివారితో వితరణ చేయించినా నిండు నూరేళ్లూ ఆమె క్షేమంగా ఉండాలని ఆత్మీయంగా దీవిస్తారు. ఆరోజు అలాగే...ఎంతోమంది ఆ ఇంటిముందుకు చేరుకున్నారు.

ఆ ఇనుప గేటు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా? ఎప్పుడెప్పుడు లోనికి వెళ్లి దుస్తుల్ని అందుకుందామా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కదలికల్ని శ్రద్ధగా గమనిస్తున్నారు.

ఉదయం గడిచింది.

మధ్యాహ్నమైంది. అయినా, ఆ గేట్లు అలాగే మూసి ఉన్నాయి.

‘‘అమ్మాయిగారు అక్కడెక్కడో అమెరికాలో ఉన్నా పుట్టినరోజు ఆనవాయితీని ఎప్పుడూ తప్పలేదు. ఇవాళేమైంది?’’ గుమికూడిన జనం గుండెల్ని గుచ్చేస్తూ కొడవలిలాంటి ప్రశ్న.  ఆ ప్రశ్నకు సమాధానమెవరిస్తారు? జనంలో ఒకడు సెక్యూరిటీ గార్డు వైపు చూసాడు.  ఆ గార్డు కూడా భావరహితంగానే జనంవైపు చూస్తున్నాడు.

భవంతి లోపల`

ఒక్క వెలుగు కిరణం కూడా సోకని చిక్కటి చీకటి గదిలో ఏకాంతంలో కూరుకుపోయారు ఫణిభూషణరావు. గుండె పట్టనంత వేదనాతరంగాలు ఎగిసిపడుతుంటే...ఎవర్నీ కలవకుండా ఒంటరిద్వీపంలా కొన్ని గంటలు, రోజులు, వారాలు కూడా ఉండిపోవడం ఆయన నైజం. ఆ సమయంలో ఆయనకూ ప్రపంచానికీ మధ్య బంధాలు తెగిపోతాయంటే అతిశయోక్తి కాదు. అనుమతి లేనిదే ఆ గదిలోకి అడుగుపెట్టడానికి పనివారు సైతం జంకుతారు. కొన్నేళ్ల క్రితం భార్యపోయినప్పుడూ ఆయనలాగే ఆ చీకటిగదిలో ఉండిపోయారు. చావు కూడా తమని వేరు చేయలేదనే ధీమాతో జంటగా బతికేస్తుంటే కన్నుకుట్టిన విధి కాలనాగై కాటేసింది. అంతే! ఓ రాత్రి నిద్రపోయిన ఆయన సగభాగం మళ్లీ కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూడలేదు. నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారిపోయిన ఆమెని ‘అదృష్టవంతురాలు’ అంటూ అంతా వేనోళ్ల కీర్తించారు.

‘‘నిజమే! ఆమె అదృష్టవంతురాలే! అందుకే, నన్ను ఒంటరిని చేసి కనిపించని దూరతీరాలకు తరలిపోయింది. మరితనో? ఆమె లేని దురదృష్టవంతుడు’’ ఆ బాధే ఫణిభూషణరావుని నలుగురిలోకి రానివ్వలేదు. కొన్ని రోజులపాటు అలాగే ఉండిపోయారు. తనని ప్రేమించి...అంచెలంచెలుగా అభివృద్ధి చెందేలా చూసి, ఇన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది తనే అని అతడి విశ్వాసం. ఆ దంపతుల గారాలపట్టి పుట్టినరోజు ఇవాళే. అయినా, అతడు ఆ గదినుంచి బయటకు రావడం లేదు.

ఎవరు పిలిస్తే వస్తారు?

సిబ్బంది అంతా ఆనందరావువైపే చూస్తున్నారు. ఆనందరావు వ్యక్తిగత కార్యదర్శే కాదు...ఆయనకు అత్యంత ఆత్మీయుడు కూడా. ఇలా ఏకాంతంలోకి వెళ్లిపోయినప్పుడు వెన్వెంటనే స్పందించడు. కార్యాలయ కార్యకలాపాలకు ఏమాత్రం అవాంతరం రానీయకుండా ఓ కాపు కాస్తూనే...ఫణిభూషణరావు కదలికలపై ఓ కన్ను వేస్తాడు. అదును చూసి చొరవగా లోనికి వెళ్తాడు. ఆ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి అతడిని తోడుపెట్టుకుని బయటకివస్తాడు. ఒక్కోసారి వెళ్లిన కార్యం సఫలం కాలేదన్న పుట్టెడు నైరాశ్యంతో ఒక్కడే వస్తాడు. అలాగనీ...ఆయన్ని ఒంటరిగా వదిలేయడు. వదిలేసినట్లు మాత్రమే కనిపిస్తాడు. రోజుకోసారైనా లోనికి వెళ్లి...ఆయన్ని పలకరిస్తాడు. పరామర్శిస్తాడు. బతిమిలాడుతాడు. బామాలుతాడు. ఏదో ఒకటి చేసి చివరాఖరికి విజయం సాధిస్తాడు.

ఇవాళ కూడా అంతే.

ఉదయం నుంచీ ఆ గదిలోంచి బయటకి రాని ఫణిభూషణరావుని బయటకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు కంకణం కట్టుకున్నాడు ఆనందరావు. లోనికి వెళ్లేందుకు నెమ్మదిగా తలుపు తెరిచాడు. అలా తలుపు తెరవడంతో ఎక్కడ్నుంచీ దూసుకొచ్చిందో ఒకే ఒక్క వెలుగు కిరణం..తిన్నగా వెళ్లి ఫణిభూషణరావు కన్రెప్పల్ని సూదిలా గుచ్చింది. చురుక్కుమనడంతో ఆయన కళ్లు తెరిచారు.  వెంటనే, పక్కనే గోడకున్న స్విచ్‌ ఆన్‌ చేసాడు ఆనందరావు.

ఒక్కసారిగా వెలుతురంతా గదిలో పరుచుకుంది.  పళ్లు పటపటలాడిస్తూ,  కళ్లు టపటపలాడిస్తూ  ఫణిభూషణరావు కోపంగా చూసాడు ఆనందరావు వంక. ఆ తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచారు`‘‘ఎందుకొచ్చావిక్కడికి?’’

ఒక్క క్షణం ఆనందరావు మాట్లాడలేదు.

‘‘ఏం..’’ మళ్లీ గాండ్రిరచారాయన.

‘‘ఇవాళ...అమ్మాయిగారి పుట్టినరోజు’’ అన్నాడతడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్