Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pancharaamalu by Jayalakshmi Jampani

ఈ సంచికలో >> శీర్షికలు >>

సీనియర్ సిటిజెన్లూ - అంతర్జాలమూ - భమిడిపాటి ఫణిబాబు

Senior Citizens and Internet by Bhamidipati

మామూలుగా వయసు మళ్ళినవారిలో ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. అంతర్జాలం (Internet) అనేది ఇప్పటి తరంవారికే ఉపయోగిస్తుందీ, మనలాటివారు వీటిలోకి వెళ్ళి లేనిపోని "తలనొప్పి"  తెచ్చికోకూడదూ, అని. అందులో వీరి తప్పూ లేదనుకోండి, చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం అలాటిదాయె. పంచాయితీ బోర్డువారు పార్కుల్లో పెట్టే రేడియోల్లో వినీ, ఉచిత గ్రంధాలయాల్లో వార్తాపత్రికలు చదివీ పెరిగి పెద్దయారు. ఏదో ఆ తరువాత టీవీ ల ధర్మమా అని, ఇంట్లోనే ఓ పడక్కుర్చీలో కూర్చుని,వాళ్ళు చూపించే, ఏవో కొన్నితప్పించి, అర్ధంపర్ధం లేని కార్యక్రమాలకి అలవాటు పడిపోయారు. కాలక్రమేణా, ఆర్ధికసంస్కరణల వలన, ఇప్పుడు ఎక్కడచూసినా, ఎవరి చేతుల్లో చూసినా శంఖ చక్రాలలాగ ఓ సెల్ ఫోనూ, ఇంట్లో ఒక డెస్క్ టాప్పూ, భుజానికో ల్యాప్ టాప్పూనూ.

ఇదివరకటి రోజుల్లో ఏదైనా సంఘటన  మంచవనీయండి, చెడవనీయండి మనకి తెలియాలంటే రేడియోల్లో వచ్చే వార్తలో, మర్నాటికి వచ్చే వార్తాపత్రికలో దిక్కు. పైగా ఆరోజుల్లో ప్రసారమాధ్యమాలు ఉన్నది ఒక్క రేడియో అయినా, దాంట్లోవిన్నదే వేదవాక్కులా అనిపించేది. ఓహో.. కాబోసు.. అనేసికుని, మనం ప్రభావితం అవడమేకాక మన పిల్లలకికూడా కాచి వడపోసేవారం. అదే వాతావరణంలో మనమూ, మన పిల్లలూ పెరిగాము. దానితో చాలాకాలం 'నూతిలో కప్పల..'మాదిరిగానే మిగిలిపోయాము. మనం అంటే అలాగే ఉన్నా, కాలం ఆగదుగా! దానిదారిన అది పరిగెత్తెస్తోంది.ఎన్నెన్నో ఆవిష్కారాలు జరుగుతున్నాయి, ఆ క్రమంలోదే ప్రస్తుతపు Internet , దానినే ముద్దుగా తెలుగులో 'అంతర్జాలం' అని పిలుచుకుంటున్నాము.

కొత్తదేదైనా వచ్చిందంటే మనలో వచ్చేది ముందుగా  ఒకరకమైన "భయం" అనండి, లేదా " ఏదో వెళ్ళిపోతోందిగా.." అనే మనస్థత్వం. ముందుగా ఈ diffident attitude  లోంచి బయటపడాలి.ప్రతీవారికీ ఏదైనా చేయాలంటే ముందుగా ఓ అవగాహన ఏర్పడాలి. చిన్నప్పటినుంచీ, పళ్ళ డాక్టరుదగ్గరకి వెళ్ళాలంటే ఓ రకమైన భయం.ఎంత నొప్పివచ్చినా, ఏ లవంగ మొగ్గో పెట్టుకుని, నొప్పి భరించడానికి సిధ్ధపడతాము కానీ, దంతవైద్యుడి దగ్గరకు మాత్రం వెళ్ళం.ఎప్పుడో ఏ చిన్నపిల్లాడినో ఆ పళ్ళ డాక్టరుదగ్గరకు తీసికెళ్ళినప్పుడు చూసే అవకాశం వస్తుంది. అదేదో మత్తుమందు ఇచ్చేసి, ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ, ఆ పన్ను కాస్తా టుపుక్కున పీకేస్తాడు, పీకినట్టుగాకూడా తెలియదు.హాయిగా ఆ పిల్లాడు నవ్వుతూ బయటకొచ్చేసి ఓ ఐస్ క్రీమ్ముకూడా తినేస్తాడు.ఓస్ ఇంతేనా !! అనిపించేస్తుంది. అంత చిన్నపిల్లాడే ఓర్చుకోగాలేనిది మనం ఓర్చుకోలేమా అనుకుంటూ బయలుదేరతారు. ఈ ఇంటర్నెట్టూ అంతే ఓస్.. ఇంతేనా..కంటే సులభం..

నేర్చుకోవాలనే తపనే ఉండాలికానీ, దానికి వయస్సు  ఎటువంటి పరిస్థితుల్లోనూ అడ్డురాదు.పైగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎవ్వరూ, అంటే కట్టుకున్నవాళ్ళూ, కన్నవాళ్ళూ కూడా ,  ఈ పెద్దవారి మాటవినడంలేదో అని ఘోషిస్తున్న ఈ రోజుల్లో, మన వయస్సుతో నిమిత్తం లేకుండా,మన మాట వినేది ఈ కంప్యూటరు ఒక్కటే అనడంలో ఆశ్చర్యం లేదు. మీరు ఏమి అడగండి, నవ్వకుండా, పరిహాసం చేయకుండా, చిరాకుపడకుండా, ఓపిగ్గా సమాధానం చెప్పేది ఈ కంప్యూటరే.పైగా మనం అడిగినదాంట్లో ఏదైనా అపభ్రంశపుది ఉంటే, మనల్ని అడుగుతుందికూడానూ--"నాన్నా.. నీవు అడిగినది ఫలానాయా ,తప్పు వ్రాసేవేమో.." అంటూ బుజ్జగిస్తూ. ఈరోజుల్లో అంత అభిమానం చూపించేది ఎవరండీ?

రిటైరవుతున్నామంటేనే, ఓ అరునెల్ల ముందునుంచీ అంటే మన పెన్షన్ పేపర్లు రెడీ అయినప్పటినుంచీ  ఓ ఆందోళన మొదలవుతుంది. దానికి సాయం ప్రతీవారూ, " ఏమిటి మాస్టారూ, ఈ ఏడాది రిటైరయిపోతున్నట్టున్నారు, భవిష్యత్కార్యక్రమం ఏమిటీ.." అంటూ పరామర్శ చేసేవారే. చేయాలంటే లక్షపనులున్నాయి- ఎక్కడో ఏదో పేపర్లో అప్పుడెప్పుడో చదివిన ఓ పుస్తకం చదవాలనుకోవచ్చు. ప్రవచనాలు వినేవాళ్ళం, ఇప్పుడు నిరాటంకంగా వినొచ్చు.

జీవితంలో చేయాలనుకున్నవీ, చేయడానికి అవకాశం రానివీ( పరిస్థితుల ప్రభావం వల్ల) ఎన్నెన్నో ఉంటాయి. రోజులో టైమంతా మనదే కదా, ఎక్కడకి కావల్సొస్తే అక్కడకి వెళ్ళొచ్చు, ఆఫీసూ, శలవలూ లాటి గొడవలుండవుగా, అబ్బ విశ్రాంతే విశ్రాంతిరా బాబూ అనుకునేటంతగా. కానీ దీంట్లోకూడా ఒక అసౌఖ్యం ఉంది, ఎన్నెన్ని పుస్తకాలు కొంటారూ, ఎన్నెన్ని ప్రవచనాలకి వెళ్ళగలుగుతారూ, దానికీ ఓ లిమిట్ ఉంటుందిగా... ఇలాటివేవీ లేకుండా, హాయిగా ఇంట్లోనే కూర్చుని   కావలిసినదేదో వినడానికీ, చూడడానికీ,తెలిసికోడానికీ అందుబాటులో ఉండే ముఖ్యసాధనమే ఈ అంతర్జాలం.

ఇదేమీ బ్రహ్మవిద్య కాదు నేర్చుకోవాలంటే. ఈరోజుల్లో ప్రతీ ఇంట్లోనూ ఒక ఐటి పిల్లో, పిల్లాడో తప్పకుండా ఉండేఉంటాడు. అలాటివారికి తోడుగా ఓ డెస్క్ టాప్పో, ల్యాప్ టాప్పో తప్పకుండా ఉండేఉంటుంది. లేకపోయినా, ఆమాత్రం కొనుక్కునే స్థోమత ఉంటుంది. జీవితం అంతా ఇంకోరికోసమే బ్రతికాము, కనీసం ఇప్పుడైనా "మనకోసం" బ్రతికితే తప్పులేదు. ఓ డెస్క్ టాప్పు కొనేయండి. పిల్లనో, పిల్లాడినో ఈ కంప్యూటరు వివరాలు కనుక్కోండి, వాళ్ళకి టైములేదంటారా, హాయిగా "కంప్యూటరు విజ్ఞానం" లాటి పుస్తకం కొనుక్కోవడం.చదివితే ఆమాత్రం తెలియకపోదు. నలభైయ్యెసి సంవత్సరాల అనుభవం ఎప్పుడూ గుర్తుంచుకోవడమే.ఓ వారం పదిరోజులు  శ్రధ్ధగా, ఆ పుస్తకంలో చెప్పినట్టుగా నేర్చేసికుంటే చాలు, ఏదో ఈవెనింగు వాక్కుకీ, గుడికి వెళ్ళడానికీ తప్ప బయటకు ఇంకో పని దేనికీ వెళ్ళఖ్ఖర్లేదు. అన్నీ ఇంట్లోనే కూర్చుని చేసేసికోవడం.

దీనివలన మరో ముఖ్యమైన సదుపాయం ఏమిటంటే, అయ్యో మనకేమీ తెలియదేమో అనే న్యూనతాభావం ఉండదు. అవతలివాడికెంత తెలిసున్నట్టు ప్రవర్తిస్తాడో ఆమాత్రం మనకూ తెలుస్తుంది. అంతేకాకుండగా, ఏదో తూతూమంత్రంలా వదిలేయకుండా, తెలిసికున్నదాని మూలంలోకి వెళ్ళి ఇంకొన్ని వివరాలు తెలిసికుంటాం.ఆ తెలిసికున్నవేవో, ఓ బ్లాగు తెరిచికుని దానిలో వ్రాసి మిగిలినవారితో పంచుకుంటాము. ఇవే కాకుండా, మన అనుభవాలుకూడా ఈ తరంవారికి చెప్పొచ్చు. మనమూ మన ముందుతరం వారినుండి వారు వ్రాసినపుస్తకాలద్వారానే కదా తెలిసికున్నదీ. అప్పుడు పుస్తకాలూ, ఇప్పుడు అంతర్జాలమూ బ్లాగ్గులూ.

రిటైరవుతున్నారంటే ముందుగా వచ్చేది ఒక డిప్రెషన్, రేపణ్ణించీ ఎలాగ వెళ్తుందో, అసలు ఎవరైనా మాట్టాడతారో లేదో, కాలక్షేపం ఎలాగా అనుకునే ఓ రకమైన వైరాగ్యం. వీటన్నిటికీ ఒకేఒక సంజీవినీ మంత్రం-- అంతర్జాలం. ఏమి చేయగలమూ అని కాదు ఏమిచేయలేమో అని మీకు మీరు ప్రశ్నించుకోండి. అప్పుడెప్పుడో ఓ మొబైల్ కంపెనీ వాళ్ళు "ప్రపంచం మీ గుప్పెట్లో" అని ఒక ప్రకటన ఇచ్చేవారు. అలాగ ప్రపంచాన్నంతా మీగుప్పెట్లోకి తెచ్చేసికోండి. ఎవరూ మనని పలకరించడంలేదనే బాధ ఉండదు.ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనపై మనకే ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతలు ఎలాగూ పూర్తిచేశాము, కనీసం ఈ చరమాంకంలోనైనా మనకోసం మనం బ్రతికితే తప్పేమిటిటా?




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
jeevana nanem