Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : బలుపు

Movie Review - Balupu

చిత్రం: బలుపు
తారాగణం: రవితేజ, శ్రుతి హాసన్, అంజలి, అడివి శేషు, బ్రహ్మానందం తదితరులు
ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
సంగీతం: తమన్
కూర్పు: గౌతం రాజు
నిర్మాణం: ప్రసాద్ వర పొట్లూరి
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేదీ: 28 జూన్ 2013

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవి తేజ, గబ్బర్ సింగ్ తో సూపర్ కథానాయిక అయిపోయిన శృతి హాసన్ కలిసి "బలుపు"తో ముందుకొచ్చారు ఈ రోజు. కథా కమామిషు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
రికవరీ ఏజెంట్ గా పని చేసే రవి తేజ అనుకోని పరిస్థితుల్లో సరదగా మేనమామ (బ్రహ్మానందం) తో కలిసి అల్లరి చేసే శ్రుతి (శ్రుతి హాసన్) ని కలుస్తాడు. ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు.

ఇదిలా ఉంటే కొందరు విలన్లు ఇద్దరు వ్యక్తుల కోసం దేశమంతా గాలిస్తుంటారు..వాళ్లు ఎవరు? ఎవరి కోసం వెతుకుతున్నారు? తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
కథ ఎలా ఉన్నా ప్రేక్షకుల దృష్టిని సినిమా నుంచి మరలకుండా చేయగల ప్రతిభ రవితేజది. తన మాస్ డైలాగులతో, డాన్సులతో చప్పట్లు కొట్టించుకోవడం కూడా తనకు కొత్తేమీ కాదు. అంత మాస్ అప్పీల్ ఉన్న రవితేజ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్  ప్రస్తావన, గబ్బర్ సింగ్ సన్నివేశాలు వాడుకున్నారు. వాటికీ ఈలలు మోగడం విశేషం.

ఒక సన్నివేశంలో నందమూరి బాలకృష్ణని స్ఫురింపజేసేలా రవి తేజ మాట్లాడడం కొందరికి వివాదంగా అనిపించినా పెక్కు మందికి వినోదాన్ని అందించింది. 


ఇక శ్రుతి హాసన్ చలాకీ అల్లరి పిల్లగా బాగానే చేసింది. బ్రహ్మానందం షరా మామూలుగా నవ్వులు పుట్టించాడు.

పధ్ధతైన తండ్రి పాత్రకు ప్రకాష్ రాజ్ మొదటి సగంలో పూర్తిగా న్యాయం చేసాడు.

దుష్ట పాత్రలో అడివి శేషు మెప్పిస్తాడు.

తమన్ సంగీతంలో చెప్పుకోదగ్గ విశేషం వినపడదు. కిక్, దూకుడు లాంటి సినిమాల్లో చూపించిన పనితనం ఇక్కడ చూపించలేదనిపిస్తుంది.

డాక్టర్ సావిత్రి గా ఆలి పర్వాలేదు అనిపిస్తాడు. డాక్టర్ గా అంజలి ద్వితీయార్థం లో కనువిందుగా ఉంది.

ఇతర సాంకేతిక విభాగాలన్నీ తమ తమ పని దర్శకుడి సూచనల మేరకు పనిచేసినట్టు ఉన్నాయి. కోన వెంకట్ సంభాషణలు అందులో ప్రాసలు బాగానే పండాయి. అక్కడక్కడా ద్వంద్వార్థాలు దొర్లినా సెన్సార్ కి అందకుండా రాసుకున్నాడు రచయిత.

మాస్ ఫార్ములా చిత్రాలను ఇష్టపడే వారికి కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయిందులో. అయితే కొన్ని సన్నివేశాలు బలంగా ఉంటే కొన్ని మూస పధ్ధతిలో సాగాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే: బలుపు కొంత, వాపు కొంత...చూసి ఆనందించొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Kalyan Malik