Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

'నమ్మవర్ ' తో నేను...

Aditya Hrudayam

'నమ్మవర్' అనే తమిళ సినిమాకి నేను, నిర్మాత శ్రీ బి. వెంకట్రామిరెడ్డిగారి తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ని, 'చందమామ - విజయాకంబైన్స్' చెన్నైలో! దర్శకులు శ్రీ సేతుమాధవన్ గారు మంచి తెలుగు సాహిత్యాభిమాని. హీరో 'పద్మశ్రీ' కమల్ హాసన్, హీరోయిన్ గౌతమి.

జాతీయ ఉత్తమనటుడైన కమల్ హాసన్ తో 100రోజులు షూటింగ్ లో గడపడం అంటే 100 సినిమాలకి వర్క్ చేసిన అనుభవం ఒకేసారి తెచ్చుకోవడం.

అప్పటికే తెలుగులో పెద్దస్టార్ అయిన కమల్ హాసన్ షూటింగ్ టైంలో నాకో షాకిచ్చాడు. తెలుగు మాట్లాడే 23 జిల్లాల్లో, ఏజిల్లా ప్రజలు ఏ యాసలో మాట్లాడుతారో ఆయన మాట్లాడి చూపించారు.తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్. కృష్ణా, గుంటూరు జిల్లాలు, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు ఇలా వివిధ యాసలన్నీ ఆయన ఇమిటేట్ చేసి ఫర్ ఫెక్ట్ గా చెప్తుంటే ఆశ్చర్య పోయాన్నేను.

ఆయనకి శ్రీ శ్రీ గారి కవితలన్నా, గద్దర్ గారి పాటలన్నా మహా ఇష్టం. నాతో అడిగి చెప్పించుకునేవారు.

నేను గబగబా చెప్పగానే, నాభుజంమీద చెయ్యివేసి 'నమ్మవర్' ఇందాళు అన్నారు సేతుమాధవన్ గారితో. అంటే వీడు 'మనవాడు' అని.

ఆయన తెలుగు ప్రావీణ్యం చూసి సిగ్గేసి, నేను 35రోజుల్లో తమిళం పుస్తకాన్నికొని, పలక, బలపంతో రోజుకి అయిదు ఎక్సర్ సైజుల చొప్పున తమిళ్ రాయడం చదవడం నేర్చుకున్నాను. సగం సినిమా అయ్యేసరికి స్క్రిప్ట్ ఫెయిర్ చేసేవాడిని. ఆ స్క్రిప్ట్ కి ప్రూఫ్ రీడింగ్ ఆయనే స్వయంగా చేసేవారు. ఆసినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కమల్ హాసనే కాబట్టి, సింగీతంగారు డైరెక్టర్ కి కావల్సిన ఈస్థటిక్ సెన్స్ ని నేర్పిస్తే, సేతుమాధవన్ గారు షాట్ డివిజన్ కి కావలసిన సైన్స్ ని (లైన్ ఆఫ్ యాక్సిస్, రైట్, లెఫ్ట్ లు మెయిన్ టెయిన్ చేయడం వంటివి) నేర్పించారు.

కమల్ హాసన్ మాత్రం నటుడిగా ఎంత ఎవరెస్టో, నిర్మాత నచ్చకపోతే, ప్రవర్తనలో అంత వరెస్టు. 'నమ్మవర్' షూటింగ్ సమయంలో నిర్మాతతో విభేదాలొచ్చాక ఆయన కాల్చుకుతినడాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ క్రమంలో తెలుగు, తమిళ బేధాలు కూడా బైటపెట్టేసరికి నేను భరించలేకపోయాను. ఇప్పటికీ తమిళులకి తెలుగు సినిమా పరిశ్రమ వ్యక్తులంటే చాలా తక్కువ.

ఇక్కడికొచ్చి సురేష్ బాబు దగ్గర వెంకటేష్ బాబు దగ్గర అవకాశం పొంది, ఆయనమీదే జోకులేసుకునే తమిళ దర్శకుల్ని కూడా చూశాను. వాళ్ళ మార్కెట్ ఇక్కడ డెవలప్ అయినంతగా మన మార్కెట్ అక్కడ డెవలప్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే.

అందుకే నన్నెంత అభిమానించినా, కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' సినిమాకి అసోసియేట్ గా పనిచేయమని ఆఫరిస్తే వద్దని చెప్పి హైదరాబాద్ వచ్చేసి, డా:డి. రామానాయుడు గారి సురేష్ సంస్థలో చేరాను. ఏదో ఒకరోజు నేను నేర్చుకున్న తమిళం వల్ల అక్కడ సినిమాలు తీసి తెలుగు జెండా ఎగరేయాలని నా కోరిక.

ఈ మధ్య రాజమౌళి గారు, గుణశేఖర్ గారు, అల్లుఅర్జున్ వంటివారు కొంత క్రేజ్ తెచ్చారు. తెలుగు మార్కెట్ కి. కానీ అది సరిపోదు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో రోజుకి 101 మంది దర్శకులు హైదరాబాద్ నుంచి చెన్నైలో దిగాలి. కథలు చెప్పి, ఒకే చేయించుకుని సినిమాలు తీసి సూపర్ హిట్ లు ఇవ్వాలి (101 ఎందుకంటే వాళ్లు రోజుకి వందమంది దిగేవాళ్ళు కాబట్టి)
మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
music muchchatlu