Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mulakkada Pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

గోదాదేవి పరమాత్ముడిని వలచి ఆయననుపొందే మార్గం కోసం పరితపిస్తున్నది. పొందలేకపోవడంచేత విరహముతో అలమటిస్తున్నది. ఆయనను నిష్ఠురోక్తులతో నిందా రూపకంగా ప్రస్తుతి చేస్తున్నది. ఏదోరకంగా తనకు నచ్చినవాడిని పదేపదే గుర్తుచేసుకోవడం సహజమే కదా!

ప్రళయార్కోగ్రకుఠారకోణము నృప త్రైవిధ్యవత్పీఠికా
ఖ్యలఁ ద్రిస్థానము లేడుమార్లు వరుసన్ఘట్టించు దోశ్శక్తిఁ గీ
ర్తిలసద్వల్లకి మ్రోయ రక్తయయి యెం తే వశ్యయౌ భూసతీ
తిలకంబుం దుదఁ ద్రోవఁ గశ్యపున కా ర్తిం బిడ్డయై పోవదే?

శ్రీకృష్ణదేవరాయలవారి బహుముఖప్రజ్ఞకు, ఆయన మాత్రమే చేయగలిగిన ఊహలకు ఈ పద్యము మంచి ఉదాహరణము. ఈ పద్యములో పరశురాముడి శత్రు సంహారమును వీణ వాయించడంతో పోలుస్తున్నాడు. ఇరవైఒక్కసార్లు దండయాత్ర చేసి భూమి మీద ఉన్న రాజులందరినీ సంహరించి భూమిని క్షత్రియ శూన్యము చేశాడు ఆయన. పరశురాముని ప్రళయకాల సూర్యునివంటి ఉగ్రమైన గండ్రగొడ్డలియొక్క పిడిని/కర్రను (ప్రళయార్కోగ్రకుఠారకోణము) వీణతో పోలుస్తున్నాడు. 'కోణా వీణాదివాదనం' అని కోణము అంటే వీణ అనిఅర్థము, సంస్కృతంలో. శత్రు, మిత్ర, ఉదాసీనులు అనే మూడు రకముల రాజ సింహాసనములు, రాజులూ అని చెప్పబడింది. అంటే ఒక రాజుకు శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు అనే విధాలుగా స్థాయీ భేదములతో వేరే రాజులు ఉంటారు. ఆ మూడు విధముల స్థాయీ భేదములు వీణ అనే వాయిద్యానికి సంబంధించి సంగీతశాస్త్ర పరంగా మంద్ర, మధ్యమ, తారస్థాయిలు, స్థాయీ భేదములు అయినాయి. వీణకు ఉన్న మూడు తంత్రులు అయినాయి. 'స' 'రి' 'గ' 'మ' 'ప' 'ధ' 'ని' అనే సప్తస్వరాలు వరుసగా మంద్ర, మధ్యమ, తారస్థాయిలలోవాయించడంతో మూడు ఏడులు ఇరవై ఒక్కటి అయినాయి సంగీత ధ్వనులు. పరశురాముని యిరవైఒక్క దాడులు ఈ యిరవైఒక్క సంగీతధ్వనులు అయినాయి. అలా ఇరవై ఒక్క స్వరాలూ వాయించినట్లు ఇరవైఒక్కసార్లు దాడి చేసి రాజులను వాయించాడన్నమాట!  అలా తన భుజ శక్తి చేత తన కీర్తి అనే వీణను వాయించాడు పరశురాముడు( దోశ్శక్తిఁ గీర్తిలసద్వల్లకి మ్రోయ)భూదేవి'రక్తయై' వశ్య ఐంది ఆయనకు. రాజుల రక్తంతో భూమింతా తడిసిపోయింది అని ఒక అర్థం. భూదేవి ఆయనపట్లఅనురక్త ఐంది, అనురాగమును పొందింది అని మరొక అర్థం. కానీ యింతా చేసి రాజులందరినీ చంపి, భూదేవిని తను 'ఏలుకున్నాడా' అంటే లేదు. ఆమెను కశ్యపునికి ధార పోసి, తను ప్రశాంతంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు. పరశురామునికి అనురక్తితో భార్యకావలసిన భూదేవి కశ్యపునికి ఆర్తితో కుమార్తె ఐంది. అందుకే భూమిని కశ్యపి అని కూడా పిలుస్తారు, కశ్యపుని కుమార్తె కనుక. అటు రాజులందరినీ సంహరించి వారి భార్యలను భర్తలకుకాని వాళ్ళను చేసి వారిని ఏడిపించాడు, యిటు భూదేవిని నిరాకరించి ఈమెనూ ఏడిపించాడు,అదమ్మా, ఆ పరశురాముని నిర్వాకం.

చెలువముఁ దాల్చి త న్గవయఁ జేరిన రాగిణి రావణస్వసన్
నలువురు నవ్వ నత్తెఱఁ గొనర్పక ఏలిన వియ్య మై యతం
డలుగఁడు సీత కిట్టి తలఁపాత్మఁ దలంపక యాయమ న్వృథా
కలహమునం దనుం దొఱఁగు కాఁకకు నాఁకకు లోను సేయఁడే?

యిక ఆ శ్రీరాముడి కథ చెప్తాను వినండేం! మంచి సౌందర్యాన్ని పుచ్చుకుని, అంటే సుందరిగా మారి, తనను పొందడానికి వచ్చిన ఆ రావణుడి చెల్లెలిని నలుగురు నవ్విపోయేట్లు అలా చేయకుంటే, ముక్కూ చెవులు కోసి పంపకుంటే, రావణుడు వియ్యమయ్యేవాడు. బావమరిది అయ్యేవాడు. తనమీద అలిగేవాడు కాడు. సీత పట్ల అలా ఆలోచించేవాడు కాడు. ఆమెను అపహరించేవాడు కాడు. తనకు దూరమై తాపానికి, చెరకు ఆమె  లోనయ్యేది కాదు. కానీ మీ రామచంద్రుడు ఏం చేశాడు?

ఫీట్కారస్రవదస్రమై పెదవి కంపింప న్మొర ల్గిట్టి ప్రా
వృట్కాలాంబుదగర్జ గెల్వఁగ వలచ్ఛ్రీఖండ శాఖాసిత
త్విట్కుంభీనసరేఖఁ గే లసిలతా ధృత్బాహు వేష్టింప మున్
రాట్కంఠీరవ మై యొనర్చె వడి సోణాలంట ఘోణాచ్ఛిదన్

'ఫీ ఫీ' అని భయంకరంగా ఫీట్కారాలు చేస్తూ, పెదవులు వణికిపోతుండగా మొరలు పెడుతూ, వర్షాకాలపు మేఘంలాగా గర్జనలు చేస్తుండగా, చందనపు చెట్టు కొమ్మ మీది నల్ల త్రాచుపాములాగా, చుట్టుకున్న చేతిలో ఉన్న లతలాంటి ఖడ్గముతో అడుగంటా ముక్కును కోసిపారెయ్యలేదూ(యొనర్చె వడి సోణాలంట ఘోణాచ్ఛిదన్) తను రాజసింహమై, స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ కల్పించవలసినవాడై ఉండి కూడా అలాంటి పాడుపని చేశాడు. శూర్పణఖ ముక్కూ చెవులు కోసింది లక్ష్మణుడు అయినా, రాముడి ఆజ్ఞమేరకే అలా చేశాడు కనుక అది రాముడి దోషమే.

ఆముక్తమాల్యద ప్రబంధాన్ని పూర్వము సమీక్ష చేసిన మహానుభావులు, చివరి పాదము తప్ప, ఈ పద్యము మొత్తమూ శూర్పణఖ పరంగా చెప్పిందే అని భావించారు. సరస్వతీ మూర్తులైన వారి పాద రేణువు మాత్రం కూడా నేను చేయను, కానీ, నాకు మాత్రం అలా అనిపించలేదు. చందనపు చెట్టుకొమ్మవంటి బాహువు లక్ష్మణుడి బాహువు. అది లతలాగా చుట్టి శూర్పణఖను కదలకుండా పట్టుకుంది. ఆ చేతిలోని నల్లత్రాచువంటి నల్లని ఖడ్గం/బాకు శూర్పణఖ ముక్కు, చెవులు కోసేసింది. శ్రీ చందనం అంటే ఎర్ర చందనం, లక్ష్మణుడు ఎఱ్ఱని శరీర కాంతి కలిగినవాడు, కనుక ఆ పోలిక లక్ష్మణుడికే సరిపోతుంది అని ఈ 'బాలకుని' ఉద్దేశం. యింతేగాక వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో పదిహేడు, పద్దెనిమిది సర్గలలో శూర్పణఖ రామలక్ష్మణులను సమీపించి సంభాషించడం ఉన్నది. నిజానికి ఆమె తన రూపాన్ని మార్చుకుని ఏమీ శ్రీరాముడిని సమీపించలేదు. పరిహాసపూర్వకంగా 'ఓ సుందరీ! నీకు నేను తగినవాడను కను, నా తమ్ముడు అందగాడు. నాకు భార్య ఉన్నది,

నీకు సవతిపోరు ఉంటుంది, నన్ను చేసుకుంటే. కనుక నా తమ్ముడిని చేపట్టు' అన్నాడు శ్రీరాముడు. ఎవరైతేనేమి,మగాడు అయితే చాలు అనుకున్నది కనుక శూర్పణఖ లక్ష్మణుడిని అడిగింది. నేను నా అన్నకు దాసుడిని. నన్నుచేసుకుంటే నువ్వు కూడా దాసివి అవుతావు, 'యింత అందమైన దానివి, నీకు దాసిగా ఉండే కర్మ ఏమిటి?'అని లక్ష్మణుడు కూడా పరిహాసంగా అనేప్పటికి రాముడివైపు తిరిగి, 'దీన్ని చూసుకుని నన్ను నిరాకరిస్తున్నావు దూ, యిప్పుడే నీ కళ్ళెదుటే దీన్ని తినేస్తాను, నీతో హాయిగా సుఖిస్తాను' అంటూ శూర్పణఖ ఉల్క లాగా సీత మీదికి వచ్చింది.అప్పుడు శ్రీరాముని మాట మేరకు, రాముని ఖడ్గమును తీసుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడులక్ష్మణుడు. ఉత్తి చేతులతోనే సీతమీడికి వెళ్ళింది శూర్పణఖ, ఆమె చేతిలో ఏ ఖడ్గమూ లేదు, కనుక కూడా నల్లత్రాచు వంటి ఖడ్గమును ధరించిన ఎర్రచందనపు కొమ్మవంటి బాహువు లక్ష్మణమూర్తి బాహువే అని నా ఉద్దేశం.      

ఒల్లఁ బొమ్మన్నఁ బోదె తా నుల్లసముల
నేఁప నది రక్కసియ యౌట నెగ్గె వలచి
స్త్రీలు తలవంపఁ దాన వచ్చె నది చాల
కాఁడుదాని బజీతు సేయంగ నగునె

నిన్ను ఒల్లను, పొమ్మంటే దాని దారిన అది పొయ్యేది కదా, పరిహాసాలతో దాన్ని ఉడికించడం ఎందుకు? అది రాక్షసి కావడం దాని నేరమా, దేవుడు అలా పుట్టించాడు, అలా పుట్టింది! ప్రేమించి, ప్రపంచంలోని స్త్రీ జాతి సిగ్గుతో తలదించుకునేట్లు తనంత తానె వచ్చి కోరింది, అది చాలక ఆడదాని బతుకు బజారుపాలు చేయడం ఏమన్నా బాగుందా? అదమ్మా మీ రాముడి నిర్వాకం అని సాధిస్తున్నది గోదాదేవి.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు      

మరిన్ని శీర్షికలు
alaa modalindi