Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasinipattiuste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: జగదీష్ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాక,  అతన్ని చాలా మిస్ అవుతారు చంద్రకళ కుటుంబం.  టెలి-ఫిలింప్రాజెక్ట్ కి,  చంద్రకళ  సెలెక్ట్ అయ్యిందని భూషణ్ అంకుల్ ఫోన్ చేసి చెప్తారు. .జగదీష్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రెండు ఫోన్లు పంపిస్తాడు చంద్రకళకి.. ఆ తరువాత... 
 

“ఆ భగవంతుడు ఇచ్చిన టాలెంట్ తో,  నీవూ అంతటి స్థాయిని చేరుకోగలవని  ఆశిద్దాము రా,”  అన్నారు నాన్న.

నా కోసం కలలు కనే  అమ్మానాన్న  ఉండడం ఎంత అదృష్టం అనిపించి, నా కళ్ళల్లో నీరు తిరిగింది. ..... నాన్నకి, అమ్మకి కనబడకుండా గబుక్కున తుడిచేసాను.

“దేశదేశాల్లో ఉన్న సాంస్కృతిక  సభలు నీ నృత్యానికి  ‘వేదిక’ లవ్వాలి.  నీలోని కళకి కళాభిమానుల హృదయాలు ఉప్పొంగిపోవాలి,” అన్నారు నాన్న నా వంక చూసి. 

నాలో ఒక కొత్త ఉత్సాహం తోచింది.  నాన్న కోరిక తీరాలి.  అందుగ్గాను నేను కృషి చెయ్యాలి.  నాన్న అడుగుతున్నది అసాధ్యమేమీ కాదు.  
‘గాడ్ విల్ హెల్ప్ మీ! ఐ విల్ మేక్ మై ఫాదర్ ప్రౌడ్ ఆఫ్ మీ ’ అనుకున్నాను. 

గబుక్కున, నా క్లాస్మేట్ వాణి గుర్తొచ్చింది. --- తన పేరెంట్స్, తనని డాక్టర్ చెయ్యాలని కలలు కంటారంటూ, మండి పడుతుంది.......
అమ్మానాన్నల  కలలను, మన కలలుగా చేసుకుంటే తప్పేముంది... అంత కోపం ద్వేషం ఎందుకో వాణికి?...

**       

నాన్న హెల్త్ కోసం, స్పెషల్ డైట్ అంటూ, అమ్మ రకరకాల వంటకాలు చేయసాగింది. 

ఆదివారం లంచ్ కి కూర్చున్నప్పుడు,  దగ్గరుండి నాన్న చేత బోన్ సూప్ తాగించింది.  

“సూప్ సరే, కానీ ఆ మాంసం కూరలు మాత్రం తినలేను శారదా,” అన్నారు నాన్న...

“కాస్తన్నా తినేసి, కాసేపు రెస్ట్ తీసుకోండి.  సాయంత్రం నీరూ, భూషణ్ వాళ్ళు వస్తారు,” అంటూ నాన్నకి కర్రీ వడ్డించింది.

**

చీకటి  పడుతుండగా వచ్చారు అంకుల్, ఆంటీ.  నాన్నని చూసి, చాలా చిక్కారేమని ఆశ్చర్య పోయారు. నాన్న హెల్త్  గురించి  వాకబు  చేసారు.

“కొద్ది రోజులు ఇంటి పట్టునే ఉండి, మంచి డైట్ తీసుకొని, త్వరగా కోలుకో మేజర్,” అన్నారు భూషణ్ అంకుల్.

“అదే అనుకుంటున్నాను.  అక్కడ ఫుడ్ పడలేదు.  పైగా ‘యాసిడిటి’ డెవెలప్ అయినట్టుంది,”  అన్నారు నాన్న.

“అదలా ఉంచితే, ఇక్కడ చంద్రకళ విషయంలో, నీ సపోర్ట్ కి,  చాలా థాంక్స్,” అన్నారు నాన్న.

“ఇట్స్ మై డ్యూటీ ఎండ్ ప్లెజర్,” అన్నారు అంకుల్.

“మీ విషయాలు చెప్పు భూషణ్... మీరెలా ఉన్నారు? ఈ ఆరు నెలల్లో ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ టేక్-అప్  చేసావా?”  అడిగారు  నాన్న...

“మేము బాగున్నాము.  బిజీగా ఉన్నాము.  త్వరలో, మా తండ్రిగారి పేరిట మేము  స్థాపించిన ‘రాజ్ భూషణ్ మెడికల్ కాలేజీ’   పూర్తవుతుంది.   అలాగే, నగర శివార్లలో హండ్రెడ్ బెడ్ అధునాతన హాస్పిటల్  కూడా.  రెండిటి ప్రారంభోత్సవం త్వరలోనే పెట్టుకుంటాము.  అర్హత ఉండీ, స్తోమత లేని  విద్యార్ధులకి ఈ సంస్థల్లో ఉచిత విద్య, ట్రైనింగ్ లభింపచేయాలని  ప్రయత్నిస్తున్నాను,” అన్నారు అంకుల్. 

“బాగుంది.  లక్ష్మీ పుత్రులందరికీ నీ కున్న దూరదృష్టి, మంచి మనసు ఉంటే, సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుందోయ్  భూషణ్.  కంగ్రాచ్యులేషన్స్,” అంటున్న నాన్నకి,

తన చేతిలోని బుక్-లెట్ అందించారు అంకుల్ ....

“ఇది మన చంద్రకళ చేయబోతున్న టెలిఫిలిం ప్రాజెక్ట్ షెడ్యూల్.  షూటింగ్ అంతా వేసవి సెలవల్లోనే జరుగుతుంది.  ఒక నెల పని ఉంటుంది కళకి.  కథానాయకి కళ్యాణి  పాత్రలో  మన కళ చక్కగా ఇముడుతుంది.  రెండో మూడో సంప్రదాయ నృత్యాలు ఉంటాయి. 

ఇక్కడ జెమిని చానల్ ద్వారా సీరియల్ గా టెలికాస్ట్ అవుతుంది. విదేశాల్లో కూడా ఎడ్యుకేషనల్ ఫిలింగా,  పంపిణీకి ఏర్పాటు అయిందట,”  అని ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు చెప్పారు అంకుల్...

“ఇక రెండో విషయం.... హైదరాబాద్ నుండి వంశీ ఆర్ట్స్ వాళ్ళు మన చంద్రకళ ప్రోగ్రామ్స్ భారిగా ఆంధ్రప్రదేశ్ లో స్పాన్సర్ చేస్తారంట.  తీరిక చేసుకొని  మాట్లాడమన్నారు,” అన్నారు ...

“మన వీలు కూడా చూసుకుని, అన్నీ మాట్లాడుదాములే,” అన్నారు నాన్న.

“మరో కప్పు కాఫీ కావాలి శారద గారు,” అడిగారు అంకుల్ అమ్మని. 

“మీకు  మషాల దోసె ఇష్టం కదా.  తిని వెళ్ళండి. మన రాణికి కూడా ఇష్టం. వచ్చి తినమని ఫోన్ చెయ్యండి భూషణ్ గారు,” అంటూ, నీరూఆంటీ సహా అమ్మ కిచెన్ వైపు వెళ్ళింది.

“ఇవాళ వేలంటైన్స్ డాన్స్ పార్టీ అంటూ తన ఫ్రెండ్స్ తో వెళ్ళిందమ్మా, రాణి.  కాబట్టి, దాని షేర్ దోసెలు కూడా నాకే,” నవ్వుతూ అంకుల్.

**

నీరూ ఆంటీ, అంకుల్ వెళ్ళిపోయాక,  అంతా హాల్లో చేరాము.  తన రూములో నుండి సెల్ ఫోన్లో  మాట్లాడుతూ వచ్చి, నాన్న పక్కనే చేరాడు వినోద్.... జగదీష్ తో మాట్లాడుతున్నాడని అర్ధమయింది...

“ఏరా కళా, మన జగదీష్ ఒక కేరింగ్, ఎఫెక్షనేట్  యంగ్-మాన్  అనిపిస్తున్నాడు కదూ!” అన్నారు ఉన్నట్టుండి నాన్న. 

“అవును నాన్న, నువ్వు  లేనప్పుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు కదా! బావ నా ఆడిషన్స్ కి తోడుగా ఉన్నాడు కూడా. హి ఇజ్ గుడ్ మాన్ ఎండ్ హెల్ప్ ఫుల్,” అన్నాను.

“అవునా? శారదా,” అమ్మవంక చూస్తూ నాన్న. 

అప్పటికి ఫోన్ పెట్టేసిన వినోద్, “ జస్ట్ గుడ్ మాన్ కాదు డాడీ,  బావ ఇజ్ మై హీరో ,  నాకెంతో మంచి ఫోన్ ఇచ్చాడు,”  హ్యాపీగా వినోద్.

“అలాగా? డాడీ ఇజ్ మై హీరో  అనేవాడివిగా! రాస్కెల్,”  అన్నారు  నాన్న వాడి చెవి పిండి.

“నువ్వు నా ఫస్ట్ హీరో. జగదీష్ బావ నా సెకండ్ హీరో,” అని వాడు అన్నాక గాని, వాడి చెవి వదల్లేదు నాన్న. 

**

ఇంటిపట్టునే ఉన్నా నీరసంగా అనిపిస్తుందని వారం రోజులు సెలవు పొడిగించారు నాన్న...

పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు...  ఇంట్లో యోగాసనాలు వేస్తున్నారు...నాన్న శీర్షాసనం వేసేప్పుడు, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.   నేను, వినోద్ చూస్తూ ఉండిపోతున్నాము... నాన్న ఆర్మీమాన్ కాబట్టి, అలా అంత సులువుగా చేస్తున్నారనుకున్నాము.

నాన్న యోగ అయ్యాకే, ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ కి వెళుతున్నాము...

నాన్న ఇలా ఇంట్లో ఉంటే, సరదాగా ఉందన్నాడు వినోద్.

**

స్కూల్ నుండి వచ్చేప్పటికి, సిటింగ్ రూం నుండి అమ్మ గొంతు పెద్దగా వినబడుతుంది.  ఏదో మొత్తుకుంటుంది.

“ఎలాగండీ?  మొన్ననే కదా ఒక ఎసైన్మెంట్  నుండి హెల్త్ పాడయి వచ్చి, లీవ్ మీదున్నారు.  అంతలో మళ్ళీ ఈ పిలుపేంటి?” అమ్మ కోపంగా.

“నేనో  ఆర్మీ ఆఫీసర్నని మరిచిపోవద్దు.  అస్సాం లోని మా యూనిట్ కి వెళ్ళే డ్యూటి రొటీన్గా నాకు పడింది.  అన్నీ తెలిసి కూడా గోల చేస్తే ఎలా? అయినా నెలన్నర టైం ఉంది.  వచ్చే వారం ఎలాగు, మెడికల్ చెకప్ కి, హాస్పిటల్లో ఎడ్మిట్ అవుతాను. అంతా బాగానే చెకౌట్  అవుతాను.  నువ్వింత గొడవ చేస్తుంటే, పిల్లలు ఏమనుకుంటారు?” అడిగారు నాన్న. 

వాకిట్లోనే నిలబడి ఇదంతా వింటున్న నేను, లోనికి వెళ్లి  సోఫాలో నాన్న పక్కన కూర్చున్నాను.  నాన్నకి  మరోపక్క  వినోద్  అంటిపెట్టుకుని  కూర్చునున్నాడు.

ఏమిటి నాన్నా, బయట వరకు మీ మాటలు పెద్దగా వినబడుతున్నాయి.  ఏమయింది?” అడిగాను ఆత్రుతగా.

“నువ్వు ముందు ఫ్రెష్ అయి రా,  స్నాక్ తింటూ నేను చెప్పే కొన్ని విషయాలు వినచ్చు ,” అన్నారు నాన్న.

**

పది నిముషాల్లో ఫ్రెష్ అయి వెళ్లి,  నాన్న ఎదురుగా కుర్చీలో కూర్చున్నా, ‘చెప్పండి’ అన్నట్టు...

“ఫస్ట్ విషయం - నీ టెలి-ఫిలిం షూటింగ్ అయ్యాక,  ఒక ఏడాది గడువులో  - అంటే ఈ సమ్మర్ నుండి మళ్ళీ సమ్మర్ వరకు - మీ మాస్టారు గారి ‘నృత్యహేళి’ ప్రోగ్రాములు  చాలు.  పైగా ఇవన్నీ బయట ఊళ్ళ ప్రోగ్రాములు..  చదువు అశ్రద్ధ చేయకూడదు,” అని నావంక చూసారు.
తల ఊపాను, ఔనన్నట్టు.

“తరువాతి విషయం - నా జాబ్ గురించి.  నేను అస్సాం వెళ్ళవలసి ఉంటుంది.  దానికే మీ అమ్మ గొడవ చేస్తుంది. మరి డ్యూటీ కదా! అయినా ఎక్కువ  కాలం  అక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు,” అన్నారు నాన్న.

వెళ్ళి నాన్న పక్కనే కూర్చుని, ఆయన భుజం మీద తల ఆన్చాను.  నాన్న మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళడం తలుచుకుని ఏడుపొచ్చేసింది.

**

శనివారం  పొద్దున్నే వరసబెట్టి చుట్టాలందరికీ ఫోన్లు చేసే కార్యక్రమం పెట్టుకుంది అమ్మ. ముందుగా  కోటమ్మత్తతో చాలా సేపు మాట్లాడింది.  నా డాన్స్ ప్రోగ్రాములు నుండి, నాన్న మళ్ళీ ఉద్యోగానికి దూరంగా వెళ్ళవలసి రావడం వరకు, అన్ని సంగతులు చెప్పిందామెకి.  ఆమెతో ఫోన్ పెట్టేసాక,  రెండు వారాల్లో కోటమ్మత్త  చెన్నైకి వచ్చేస్తుందని  అనౌన్స్ చేసింది కూడా. తరువాత  ఫోన్ కాల్  అమ్మమ్మకి.  ‘రాగం - తానం - పల్లవి’ గురించి  మాట్లాడి,  జగదీష్, గిఫ్ట్స్ గా పంపిన ఫోన్ల గురించి చెప్పింది.  జగదీష్ గురించి కూడా కాసేపు కబుర్లాడారు.  ప్రతివారం వారితో మాట్లాడి,  వారి యోగక్షేమాలు కనుక్కుంటాడని  చెప్పిందట  అమ్మమ్మ.

‘నాకూ, వినోద్ కి కూడా ఫోన్ చేస్తుంటాడు జగదీష్.

‘హలో ట్వింకిల్ టోస్’  అని పిలుస్తాడు నన్ను.   ఆ పిలుపు నాకు చాలా నచ్చుతుంది. వారమంతా జరిగిన సంగతులన్నీ చెప్పేవరకు ఊరుకోడు’ ...అని గుర్తు చేసుకున్నాను.

ఇంతలో అమ్మ, “హలో, వదినా,” అనడం వినిపించింది... ఢిల్లీ కాల్ అని అర్ధమయింది....

చాలా సేపు కబుర్లు  చెప్పింది మణిత్తయ్యకి.  రాణి, నీరూఆంటి పేర్లు కూడా వినబడ్డాయి అమ్మ మాటల్లో. 

“చదువు విషయంగా, ఇటుపైన సమ్మర్లో  కూడా బిజీ అయిపోతున్నాడట  జగదీష్,”  అంది అమ్మ,  ఫోన్ పెట్టేసాక.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery