Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: హోరాహోరీ 
తారాగణం: దిలీప్‌, దక్ష, ఛస్వా, అభిరామ్‌, డి.ఎస్‌.రావు, ఎంవిఎస్‌ హరనాథరావు, రాకెట్‌ రాఘవ, సీమ, భార్గవి తదితరులు. 
చాయాగ్రహణం: దీపక్‌ భగవంత్‌ 
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి 
దర్శకత్వం: తేజ 
నిర్మాణం: శ్రీ రంజిత్‌ మూవీస్‌ 
నిర్మాత: కెఎల్‌ దామోదర ప్రసాద్‌ 
సమర్పణ: డి.సురేష్‌బాబు 
విడుదల తేదీ: 11 ఆగస్ట్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే 
డబ్బు కోసం హత్యలు చేసే క్రూరుడు బసవేశ్వర్‌ (చస్వా)కి తొలి చూపులోనే మైథిలి (దక్ష) నచ్చుతుంది. అప్పటిదాకా పెళ్ళి అనేదాని గురించి ఆలోచించని బసవేశ్వర్‌, మైథిలిని దక్కించుకోవాలనుకుంటాడు. ఇంకో వైపు మైథిలికి పెళ్ళి ఫిక్సవుతుంది. తాను తప్ప ఇంకెవరు మైథిలిని పెళ్ళి చేసుకున్నా ఊరుకోనని మైథిలి అన్నని హెచ్చరిస్తాడు బసవేశ్వర్‌. అన్నమాట ప్రకారమే పెళ్ళి పీటలపై మైథిలిని చేసుకోవాలనుకున్న పెళ్ళికొడుకుని బసవేశ్వర్‌ చంపేస్తాడు. మైథిలిని చూసుకోడానికి ఇంకో కుర్రాడొస్తే, అతన్నీ చంపేస్తాడు. ఇవన్నీ చూసిన మైథిలి షాక్‌కి గురవుతుంది. మైథిలిని బసవేశ్వర్‌కి దూరంగా పంపించేస్తారు కుటుంబ సభ్యులు. అక్కడే మైథిలికి స్కంధ (దిలీప్‌) పరిచయమవుతాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అంతకుముందే ఓ సందర్భంలో స్కంధకీ బసవకీ స్నేహం కుదురుతుంది. తన ప్రేమ గురించి స్కంద, బసవకి చెప్తాడు. తాను మధ్యలో ఉండి పెళ్ళి పరిపిస్తానని స్కందకి హామీ ఇస్తాడు బసవ. అయితే స్కంద ప్రేమిస్తున్నది మైథిలినేనని బసవకి తెలుస్తుంది. అప్పుడు బసవ ఏం చేశాడు? మైథిలిని బసవ దక్కించుకున్నాడా? స్కంద మైథిలి ప్రేమ ఫలించిందా? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు దిలీప్‌. తొలి చిత్రంలోనే కాన్ఫిడెంట్‌గా నటించాడు. తొలి చిత్రం కావడంతో ఇంకా చిన్న చిన్న లోపాలున్నాయి. వాటిపై దృష్టి పెడితే తెలుగులో అతనికి అవకాశాలు, దాంతోపాటే నటనలో మెచ్యూరిటీ లభిస్తుంది. హీరోయిన్‌ దక్ష గ్లామరస్‌గా కనిపించింది. నటన పరంగా ఇంకా ఇంప్రూవ్‌ అవ్వాలి. కొన్ని సీన్స్‌లో బాగా చేసింది. తేజ సినిమాల్లో హీరోయిన్స్‌ టిపికల్‌గా ఉంటారు. ఆ విషయంలో దక్ష ఇంకా చాలా బాగా చేసి ఉండాలి. చేసినంతవరకు జస్ట్‌ ఓకే. విలన్‌గా నటించిన చస్వా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. విలన్‌ పాత్ర కూడా తేజ మార్క్‌ క్రూరత్వంతో నిండినది కావడంతో, దానికి సరిగ్గా సూటయిపోయాడు చస్వా. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

తేజ సినిమాల్లో చాలావరకు ప్రేమకథలే. ప్రేమకథలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ట్రీట్‌మెంట్‌ విషయంలో తేజ తనదైన ట్రెండ్‌ని సృష్టించుకుని, అదే రూట్‌లో పయనిస్తున్నాడు. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతోపాటు, కొంచెం నటీనటుల్ని కష్టపెట్టేస్తుంటాడు. అలా కష్టపెట్టేయడంలోనే ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయగలగడం తేజ టెక్నిక్‌. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కథ మామూలే అయినా, కథనం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మాటలు బాగున్నాయి. మ్యూజిక్‌ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా పనిచేశాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణపు విలువలు తేజ సినిమాలకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ప్రేమకథా చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చిన డైరెక్టర్‌ తేజ, ఈ చిత్రాన్ని కూడా తన పాత చిత్రాలకు దగ్గరగా ఉండేలానే చూసుకున్నట్టున్నాడు. తేజ గత చిత్రాలు చాలానే గుర్తుకొస్తాయి ఈ సినిమా చూస్తోంటే. హీరో, హీరోయిన్లను క్లయిమాక్స్‌కి ముందు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడు తేజ. విలన్‌తో హీరోయిన్లు హోరాహోరీగా తలపడ్తారు. విలన్‌ బలవంతుడు, హీరో హీరోయిన్లు బలహీనులు కావడంతో సినిమా టెన్షన్‌గా సాగిపోతుంటుంది. చివరికి శుభం కార్డు పడినా, దానికన్నా ముందు టెన్షన్‌ క్రియేట్‌ చేయడంలో తేజ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అదే ఈ సినిమా విషయంలోనూ జరిగింది. ఫస్టాఫ్‌ బాగానే సాగిపోతుంది. సెకెండాఫ్‌లో హీరో హీరోయిన్ల కష్టాలు, విలనిజం మరీ క్రూరంగా ఉండటం కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలే అయినా, ఓవరాల్‌గా సినిమా ఓకే. ప్రమోషన్‌ ఇంకాస్త బాగా చేస్తే, లిమిటెడ్‌ బడ్జెట్‌ సినిమా గనుక తేజకంటూ సెపరేట్‌గా ఉన్న ఆడియన్స్‌ సినిమాని ఆదరిస్తే మంచి విజయమే దక్కించుకోగలదు.

ఒక్క మాటలో చెప్పాలంటే 
తేజ మార్క్‌ హోరాహోరీ

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
naapaata