Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

10. పలుకుదేనెల తల్లి పవళించెను

పలుకుదేనెల తల్లి పవళించెను
కలికితనముల విభుని గలసినది గాన

1. నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
    పగలైనదాక జెలి పవళించెను
   తెగని పరిణతులతో దెల్లవారిన దాక
   జగదేకపతిమనసు జట్టిగొనెగాన

2. కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
    బంగారు మేడపై బవళించెను
    చెంగలువ కనుగొనల సింగారములు దొలక
    నంగజ గురునితోడ నలసినదిగాన

3. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
    పరవశంబున దరుణి పవళించెను
   తిరువేంకటాచలాధిపుని కౌగిట గలసి
   అరవిరై నును జెమట నంటినది గాన (06-74)

ముఖ్యమైన అర్థాలు
పలుకు దేనెల తల్లి  =  మాటలలో మాధుర్యం కలిగిన   తల్లి (సరస్వతి);
పవళించెను  =  పడుకొన్నది;
కలికితనము  =  నేర్పు, గడుసుతనం ;
విభుడు  =  ప్రభువు, సర్వవ్యాపకుడు;
నిగనిగని  =  నిగనిగయను కాంతిగలది;
నెఱులు  =  వెంట్రుకలు;
కెలకులు  =  పక్కలు;
పరిణతులు  =  నమస్కారాలు;
జట్టిగొనె  =  వశపరుచుకొను;
ఒలయు  =  చుట్టుకొనగా (కాంతి గుబ్బలను చుట్టుకొన్నది);
చెంగలువ  =  ఎఱ్ఱకలువ ;
అంగజగురుడు  =  మన్మథునికి గురువు;
మురిపెము  =  ఉల్లాసము, లాలన, శృంగారము,  సరసత;
పరవశము  =  1.పరాధీనము2. ఒడలెరుగకుండుట;
తిరు  =  శ్రీ ప్రదము, పూజ్యమైన;
అరవిరై  =  సగము విచ్చిన మొగ్గయై
నును  =  మృదువైన;

నాణానికి ఒక వైపు
తేనె నాలుక మీద కదిలితే తీపి. కాని మా అమ్మ అలమేలు మంగమ్మ మాట్లాడితే ఎదుటివారికి తేనె నాలిక మీద కదిలిన అనుభూతి. అంత తీయగా మాట్లాడే  మరో సరస్వతి దేవియైన మా పలుకు తేనెల తల్లి అలమేలు మంగమ్మ రాత్రంతా మా అయ్య వేంకటేశుని దగ్గర  ఎన్నెన్ని గడుసుతనాలు , నేర్పులు చూపించిందో తెలియదు కాని - మొత్తానికి  రాత్రి  నిద్రలేని కారణంగా ఇంకా  పగలైనా లేవకుండా పడుకొన్నది.

1.ముఖం మీద ముంగురులు అటు పక్క ఇటు పక్క అందంగా కదులుతుండగా  మా అమ్మ పగలైనా ఇంకా నిద్ర లేవకుండా పడుకొంది. . దీనికి కారణమేమిటో తెలుసా ! మా అయ్యని వశపరుచుకోవటానికి మా అమ్మ రాత్రంతా ఎడతెగని నమస్కారాలు చేసింది. ఎదుటివారిని యుద్ధంలో గెలవలేనప్పుడు, ఎదుటి వారికి దాసోహమన్నప్పుడు నమస్కారాలు చేస్తారు. విజయం సాధించినప్పుడు కూడా ఎదుటివారినుంచి నమస్కారాలందుకొంటారు. మొత్తానికి ఈ నమస్కార ప్రక్రియలు దంపతుల మధ్య రాత్రంతా ఎడతెగకుండా జరిగాయి. అందుకని అలసిపోయి మా అమ్మ పడుకొంది.

2.మా అమ్మ నిద్రలో పైట జారిన విషయం కూడా పట్టించుకోకుండా ఒళ్లు తెలియకుండా బంగారు  మేడలో పడుకొంది.కాంతి స్తనాల చుట్టూ అలముకొంది.  నిద్ర లేని కారణంగా కళ్లు ఎర్రబడ్డాయి. ఎర్ర కలువలవంటి తన కన్నుల చివర సింగారాలు ప్రవహిస్తుండగా   మన్మథునికే పాఠాలు నేర్పే మా అయ్య వేంకటేశునితో కలిసి  అమ్మ అలసి పోయింది. ఈ పాటికి మేడ దిగి స్నేహితురాళ్లతో మా అమ్మ కబుర్లు చెప్పాలి. కాని అలసట కారణంగా  పగలైనా   మేడ  దిగకుండా అమ్మ నిద్ర పోతోంది.

3. మీరు ఒకటి గమనించారా ! ముత్యాలతో అలంకరించిన మెత్తని దిండుపై ఒక పక్కకు ఒరిగినిద్రపోతున్న మా అమ్మ ముఖం మీద రాత్రి తాలూకు పరవశము కనబడు తోంది.  ఒళ్లంతా నలిగిపోయి సగము విరిసిన మొగ్గై, ఎన్నెన్నో  ఉల్లాసపు నటనలు, మృదువైన చెమటలతో , పరవశాలతో మా అమ్మ శుభదాయకుడైన వేంకటేశునితో కలిసి నిన్న రాత్రి అలసిపోయింది.–అందుకే- పగలైనా ఇంకా నిద్ర పోతోంది.

నాణానికి రెండో వైపు
‘’మధు వక్ష్యామి మధు వదిష్యామి’’(దైవ స్తోత్రం చేస్తూ  తేనెలాంటి తియ్యనైన  మధురమైన మాటలు మాట్లాడతాను.  ఎదుటివారికి తీపి పుట్టించే నడతను కలిగిఉంటాను.)  అన్నది వేదం. ఆ పలుకు తేనెల జీవాత్మ  అన్నమయ్య పల్లవిలో పలుకుతేనెల తల్లిగా పాదం మోపింది.

రాత్రి -పగలు అనేదానిని భగవద్గీత ప్రత్యేకంగా నిర్వచించింది.’యా నిశా సర్వభూతానాం/తస్యాం జాగర్తి సంయమీ/యస్యాం జాగ్రతి భూతాని/సా నిశా పశ్యతో మునేః’(02-69)  సామాన్య జనులకు ఏది రాత్రియో , ఆ రాత్రిలో యోగి మేల్కొని ఉంటాడు. సామాన్యులకు ఏది పగలో దానియందు యోగి నిద్ర పోతాడు.దీని సాంకేతి కార్థమిది. సామాన్యజనులకు ఏ దైవ తత్వము రాత్రిగా కంటికి కనబడదో,  ఆ సమయములో యోగి మేలుకొని ఆత్మ దర్శనము చేస్తుంటాడు. అందుకే ఇతరులకు రాత్రి అయినది యోగికి పగలు. ఏ భోగ  విషయాలలో   జీవులు మేలుకొనియుంటారో(పగలు)  ఆసక్తి చూపిస్తారో , దైవ తత్వాన్ని దర్శించే   యోగికి అది రాత్రి (అతని చూపుకు లౌకిక భోగ  విషయాలు కనబడవని భావం) భగవద్గీత చెప్పిన ‘పగలు’ అన్నమయ్య గీతంలోని ‘పగలు’ కు   అన్వయిస్తుంది.

ఈ గీతంలో జీవాత్మ పరమాత్మతో సంయోగ స్థితిని పొందింది. అది నిర్వికల్ప సమాధి స్థితి.  అంటే ఏ సందేహాలూ, లేని  పరిపూర్ణమైన పరవశ స్థితి.  .అందుకే చరణంలో ‘పరవశ’ శబ్ద ప్రయోగం.

అన్నమయ్య శృంగార వర్ణన ’ మధుర భక్తి సంప్రదాయము’ అనే పాదులోనుంచి లేచిన ఆకర్షించే పారిజాతపు చెట్టు. “మధురభక్తి” సంప్రదాయంలో జీవాత్మ స్త్రీ. పరమాత్మ పురుషుడు. “అసంప్రదాయవిత్‌ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయ:” .(అన్నీ తెలిసినప్పటికీ సంప్రదాయము తెలియనివానిని మూర్ఖునిలా వదిలేయాలి )అన్నారు శంకర భగవత్పాదులు గీతా భాష్యంలో. కనుక మధుర భక్తి సంప్రదాయము తెలుసుకొని, ప్రతి అన్నమయ్య శృంగార వర్ణనలో జీవాత్మ , పరమాత్మ -నాయికా నాయకులుగా చిత్రింపబడుతుంటారని గ్రహించాలి. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
bhagavaan shree ramana maharshi biography