Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

రంగస్థల మహానటుడు - శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు - టీవీయస్.శాస్త్రి

peesapati narasimha murthy

శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు(1920 -2007) ప్రముఖ రంగస్థల నటుడు. తెలుగు నాటకరంగంపై శ్రీ కృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు.పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు. శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, విజయనగరం జిల్లా, బలిజపేట మండలం, వంతరం అనే గ్రామంలో 1920 జూలై 10 న జన్మించారు.

1938 లో 'రంగూన్ రౌడి' నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా శ్రీ పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టారు. 1946 లో 'పాండవోద్యోగ విజయాలు' నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్రను వేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. 'అజోవిభో' వారు వీరికి 'ప్రతిభామూర్తి' అవార్డును యిచ్చి గౌరవించారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన శ్రీ పీసపాటి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును పొందారు.

పాండవోద్యోగ విజయాలుతో పాటు, గౌతమబుద్ధ, లవకుశ, చింతామణి,  తారాశశాంకం... లాంటి నాటకాలు అనేకం ఆడిన శ్రీ పీసపాటికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది ఆయన ధరించిన శ్రీ కృష్ణ పాత్రే! అత్యుత్తమ కృష్ణునిగా 'ఉద్యోగ విజయాలు' నాటక రచయితల్లో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి నుండి అవార్డును అందుకోవటం, టంగుటూరి ప్రకాశంగారి నుండి నటరాజు విగ్రహాన్ని బహుమతిగా పొందటం, బిలాస్ పూర్ లో తెలుగురాని ఒక బెంగాలీ జంట నాటకం చూసి, గ్రీన్ రూంలో ఆయనను తనివితీరా ముద్దాడటం ... మొదలైన సంఘటనలు తన జీవితంలో మరువలేనివిగా వారు పేర్కొన్నారు.

పద్యగానంలో శ్రీ పీసపాటి గణనీయమైన మార్పులు తీసుకొని వచ్చారు. తెలుగు పౌరాణిక నాటకాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడటం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తీసి పాడటం ఆనవాయితీగా ఉండేది. శ్రీ పీసపాటివారు, ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తూ పద్యాలు పాడి ప్రజలను అలరించారు. పీసపాటి వేషధారణలో కూడా మార్పులు తీసుకొనివచ్చారు. దేహానికి అంటిపెట్టుకొని ఉండే నీలపురంగు చొక్కాను ధరించి నిజంగా నీలపు కృష్ణుడనే అనే భావనను కలిగించారు.

పీసపాటి 1987 లో బొబ్బిలి మండలంలోని రాముడువలస అనే గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్య నాటకాలలో నటనాచాతుర్యంతో పాటుగా, పద్యాన్ని అర్ధవంతంగా చదివి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, వారిని నాటకంలో పూర్తిగా లీనం చేయగలిగిన సమర్ధుడు శ్రీ పీసపాటి. వేషభాషలు కూడా చక్కగా ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, వీరు 'పండితుల నటుడు'. ఈయన నాటకంలో ఒన్స్ మోర్ పద్యాలు ఉండవు. కేవలం ఆంగిక, వాచికాభినయంతో నాటకాన్ని మొత్తాన్నితన ఆధీనంలోకి  తీసుకోగల మహానటుడు శ్రీ పీసపాటి.

వారితో నా ప్రత్యక్ష పరిచయం
అవి నేను గుంటూరు జిల్లాలోని గురజాలలో పనిచేస్తున్నరోజులు. శనివారం రాత్రి 'గయోపాఖ్యానం' నాటక ప్రదర్శన. ఆ నాటకం వేయించే కాంట్రాక్టర్ నాకు బాగా పరిచయస్తుడు. శ్రీ పీసపాటి వారు నిష్టాగారిష్టుడు. శ్రీ పీసపాటి వారికి మా ఇంటిలో బస ఏర్పాటు  చేసారు. పీసపాటివారు శనివారం ఉదయాని కల్లా గురజాలకు వచ్చారు. స్నానపానాదులు ముగించుకొని, సంధ్యావందనం చేసుకొని తీరికగా కూర్చున్నారు. వారు తన గొంతును గురించి అనేక జాగ్రత్తలను తీసుకునేవారు. నా భార్యకు ఆయన ముందుగానే ఆయన తినేవి, తినకూడనవి వివరంగా చెప్పారు. శనివారం రాత్రి 10 గంటలకు నాటకం. ఎనిమిది గంటలకల్లా-- ఇడ్లీ, అల్లపు చట్నీ, కారప్పొడి, నెయ్యి వేసుకొని స్వల్పాహారం తీసుకున్నారు. కొబ్బరి చట్నీ నిషిద్ధం.

ఆయన నాటక వేషానికి సంబంధించిన పెట్టెను తీసి వేషానికి సంబంధించిన డ్రస్సును నాకు చూపించారు. మాటల సందర్భంలో నేను వారిని ఒక ప్రశ్న అడిగాను. అది ఏమిటంటే-- నటుడికి కావలసిన ముఖ్య లక్షణం ఏమిటని? అందుకు వారు సవివరంగా ఇలా చెప్పారు, "నటుడికి ముందుగా తను వేయబోయే పాత్రకు సంబంధించిన పూర్తి అవగాహన చాలా అవసరం. భావయుక్తంగా, అక్షరదోషాలు లేకుండా మాటలను చెప్పాలి. పాత్రకు తగ్గ ఆంగికాభినయం చాలా ముఖ్యం." వారితో పాటుగా నేనూ నాటకానికి బయలు దేరి వెళ్లాను. గ్రీన్ రూంలో ఆయన మేకప్ చేసుకునే విధానం చూసి అబ్బురపడిపోయాను. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు లాగానే ఉన్నారు. నాటకాన్ని మొదటినుండి చివరివరకు అతి శ్రద్ధగా చూసి ఆనందించాను. కొన్ని సాంఘీక నాటకాల్లో కూడా నటించారు.

శ్రీ రావి కొండలరావు గారి పర్యవేక్షణలో, 'మా టీవీ' వారు 'కన్యాశుల్కం' నాటకాన్ని సీరియల్ గా తీసారు. అందులో శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు గిరీశంగా, చల్లా జయలలితగారు మధురవాణిగా, శ్రీ పీసపాటివారు లుబ్దావధానులుగా నటించారు. కొన్ని ఎపిసోడ్సు మాత్రమే వచ్చినట్లు, అసంపూర్తిగా ఆగిపోయినట్లు గుర్తు. ఆ సీరియల్ లో అందరికన్నా విశేష నటనా ప్రతిభ కనబరచినవారు పీసపాటి వారే! బహుశా: ఆయన వయసుకు తగ్గ పాత్ర కూడా కావటం వల్లనేమో, వారు మాటలు పలికే తీరు కూడా బాగుంది. అలా కేవలం పండితుల ప్రశంసలు అందుకున్న ఈ నటశేఖరుడు మంచి నటుడే కాదు పండితుడు కూడా!

శ్రీ పీసపాటివారిని గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు
నా 68 వ సంవత్సరములో నేను గిరీశంగా, నా అన్నగారి పాత్ర అయిన లుబ్దావధానులుగా ప్రఖ్యాత నటుడు శ్రీ పీసపాటివారితో కలసి నటించటం నా పూర్వజన్మ సుకృతం. ఆప్పుడు వారి వయసు 86 సంవత్సరాలు. శ్రీ రావి కొండలరావుగారి దర్శకత్వంలో నటించటం మరో అదృష్టంగా భావిస్తాను.

శ్రీ పీసపాటి నరసింహమూర్తిగారు,28-09-2007 న అమరలోకానికేగారు.ఆ మహానటుడికి నా ఘనమైన నివాళి!

మరిన్ని శీర్షికలు
Paryatakam - Mysore