Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ రమణ మహర్షి (పదకొండవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
 

గురువు అనుగ్రహం లభించిన తర్వాత గురుస్తుతి చేయటం ఏ భక్తునికైనా సహజమే. రంగాచారి అనే భక్తుడు శ్రీ భగవాన్ ని "నిష్కామకర్మ" అంటే ఏమిటి, వివరించి చెప్పమని అడిగారు. భగవాన్ సమాధానం చెప్పకుండా, గిరిపైకి వెళ్ళటం ప్రారంభించారు. దారికి అడ్డంగా లావుపాటి కొమ్మముళ్ళతో సహా, పడి ఉంది. మహర్షి తీసుకొని, దానిపై ముళ్ళను కోసేశారు. కొమ్మను అంతా సాపు చేసేసి, బిరుసైన ఆకుతో, దానికి నగిషీ పెట్టారు. చక్కని కర్రలాగా తయారుచేశారు. తన కర్రను పోగొట్టుకుని ఆదారినే వస్తున్న ఒక గొల్లవానికి దాన్ని బహుకరించారు. రంగాచారి గారు అడిగిన ప్రశ్నకు పరిపూర్ణమైన, కార్యరూపమైన సమాధానాన్ని పై విధంగా వివరించారు శ్రీ భగవాన్.

కార్ల్ జంగ్ అనే స్విస్ సైక్రియాటిస్ట్, ఒక వ్యాసంలో శ్రీరామకృష్ణునీ, శ్రీ రమణ మహర్షినీ పోలుస్తూ, "భక్తి నుండి జ్ఞానానికి పురోగమనం అది" అన్నారు. ఇది వినగానే భగవాన్ ఆపోలికకు అభ్యంతరం చెప్పారు. "ఏదారిన శిఖరాన్ని చేరినా తరువాత మిగిలిన మార్గాలన్నీ అర్ధమవుతాయి. శ్రీ రామకృష్ణునికి తెలియనిదేమిటి అసలు?"

అదే విధంగా తమని జ్ఞాని అనిగానీ, మహాత్మాగాంధీని కర్మయోగి అనిగానీ పోలికలు తెస్తుంటే, శ్రీ భగవాన్ కి నచ్చేదికాదు. చూచే కళ్ళు, పనులు చేసే చేతులూ ఒకే ఒక "శాశ్వతమైన మంచితనానికి" అవయవాలు వంటివే అనేవారు. ప్రతిచోటా పనిచేసేది ఆధ్యాత్మిక శక్తి ఒక్కటే అనేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేస్తూ ఉంటారు. వాటిలో హెచ్చుతగ్గులు చూపటం "అహంకారానికి నిదర్శనం" అనేవారు.

శ్రీ భగవాన్ అందరికీ మిత్రులే. రాకుమారుడైనా, పామరుడైనా, పాపిఅయినా, యోగియైనా, విద్వాంసుడైనా, నిరక్షరాసుడైనా, గొవుఅయినా, కుక్క అయినా, కోతి అయినా, ఎవరికైనా సరే, వారి సన్నిధి ఆనందమయం. స్త్రీలూ, హరిజనులుకూడా సాదంగా ఆహ్వానింపబడేవారు అందరికీ వారి సామీప్యమూ, సౌలభ్యమూ అనుభవమయ్యేవి.

శ్రీ భగవాన్ కి దేవతలంటే ఎంతోగౌరవం. వారు ప్రధానంగా చెప్పేది శుద్ధజ్ఞానం గురించే, మానవజీవితానికే ఒక అర్ధాన్ని ఇచ్చి, ఆధ్యాత్మికమూ, లౌకికమూ అనే విభేదాలను తొలగిస్తుంది. భగవాన్ ఉపదేశించిన విచారమార్గం. ఈ మార్గం చైతన్య పరిశోధన.

శ్రీ భగవాన్ కి "తత్త్వరాయుని" కథ అంటే చాలా ఇష్టం. తత్త్వరాయుడు తన గురువు గౌరవార్ధం "భరణి" అనే ప్రక్రియలో కవితని వ్రాశాడు. పండితులు కొందరిని ఆహ్వానించాడు ఆకవితను ఆలకించటానికి. ఆ పండితులలో ఒకరు అభ్యంతరం చెప్పారు.
వేయి ఏనుగులను సంహరించిన వీరుని గురించే "భరణి" వ్రాయాలి గాని, ఒక మామూలు సాధువు గురించి కాదన్నారు. "అయితే సరే, మనమంతా మా గురువుగారి వద్దకువెళ్ళి వారి సమక్షంలోనే ఈవిషయం తేల్చుకుందాం" అన్నాడు. గురువు వద్దకు వెళ్ళి తమ సమస్యను ఆయనకు నివేదించాడు. గురువు మౌనంగా కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళూకూర్చున్నారు. ఒక్కరికీ ఒక్క ఆలోచన కూడా రాకుండా కొన్నిరోజులు గడిచిపోయాయి. ఇలా కొంతకాలం గడిచాక, గురువు కొద్దిగా తన మనస్సుని చలింపచేశాడు. ఆపండితులంతా ముక్తకంటంతో, "మదపు టేనుగుల వంటి మా అహంకారాన్ని నిశ్చలం చేసిన ఈయన శక్తితో పోలిస్తే, వెయ్యి ఏనుగులను వధించటం ఏమంత ఘనకార్యంకాదు"అన్నారు.

తత్త్వరాయున్ని తన "భరణి" ని చదివి వినిపించమని కోరారు.

"నేను ఎవరిని" అనే ఆత్మవిచారం వల్లగానీ, శరణాగతి వల్లగానీ, ఎవరైనా ఇహపరాలతో భద్రంగా, సంతోషంగా, సౌకర్యంగా జీవించవచ్చని అందరినీ ఒప్పించవచ్చన్నదే శ్రీ భగవాన్ ధ్యేయం. "అహం లేకపోతే నేనే నీవు, నీవులేకుండా నీవూ నేనే. నీవు, నేనూ ఒకటే కదా!"

ఒక స్విట్జర్లాండ్ మహిళ తనకు కలిగిన భ్రాంతి దర్శనమును గురించి శ్రీ భగవాన్ కు వివరించింది. ఆమె కళ్ళు తెరుచుకొని కూర్చుని ఉన్నది. భగవాన్ ముఖము అందమైన పుష్పాలతో అలంకరింపబడి ఉంది. ఆ శిశువు పట్ల ఆమెకు ప్రేమ కలిగింది. ఆకర్షణకలిగింది.

దానికి భగవాన్ సమాధానంగా "ఆదృశ్యము నీ మనస్సులోనిది. దానికి కారణము నీప్రేమ. "పాల్ బ్రంటన్" అనే విదేశీయుడు నన్ను ఒక మహాకాయునిగా చూశాడు. నీవు నన్ను ఒక శిశువుగా చూశావు. ఈరెండూ మనః కల్పితదృశ్యములే. ఇలాంటి దృశ్యాలతో భ్రాంతికి లోనుకావద్దు.

ఆ మహిళ రెండవ ప్రశ్న ఇలా అడిగింది. "నేను స్విట్జర్లాండులో వున్నప్పుడు, మీ సహాయమును అర్ధిస్తే, భగవాన్ అక్కడికి రావాలని నేను కోరుకుంటే, మీరు నాకు ఏ విధంగా సహాయం చేయగలరు?"

భగవాన్ సమాధానంగా "స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంది? అది నీలోనే ఉంది. నీవు భౌతికంగా శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు పరిమితులు కనిపిస్తున్నాయి. స్థల, కాలములు ఈ స్థాయిలో పనిచేస్తాయి. నీవు స్థూల దేహములను గురించి భావిస్తున్నంతవరకు, భిన్న శరీరములగా కన్పిస్తాయి. అందుకు భిన్నముగా, నిజమయిన మహర్షిని గురించిన జ్ఞానము సకల సంశయములను నివారిస్తుంది. ఇప్పుడు నీవు భారతదేశములో ఉన్నావా? భారతదేశము నీలో ఉన్నదా? ఇప్పుడు కూడా నీవు భారతదేశములో ఉన్నావన్న మిధ్యా భావన తొలగిపోవాలి. దీనిని సరిచూచుకోవాలంటే, నీ నిద్రను గమనించు, నిద్రలో ఉండగా, నీవు స్విట్జర్లాండులోనో, భారతదేశంలోనో ఉన్నట్లు అనిపించిందా? అయినా కూడా, నీవు ఇప్పుడు ఎలా వున్నావో, అప్పుడు కూడా అలాగే ఉన్నావు. స్థలము అనేది నీలోనే ఉన్నది. భౌతికమైన శరీరము స్థలములో ఉన్నది. కానినీవులేవు. పాల్ బ్రంటన్ అదృశ్యమును చూచినప్పుడుకళ్ళు మూసుకుని ఉన్నాడు. నీవు కళ్ళు తెరుచుకొని ఉన్నట్లు చెబుతున్నావు. బహుశా నీవు ఒక పసిబిడ్డను గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటావు. అదే నీకు కలలో కనిపించింది.

కొన్ని నిమిషాల తర్వాత భగవాన్ ఇలా చెప్పసాగారు. నీవు కొద్దిసేపట్లో నిద్రపోతావు. ప్రొద్దున్న నిద్రలేవగానే, "నేను బాగా నిద్రపోయాను. హాయిగా నిద్రపోయాను" అని చెబుతావు. నిద్రలో ఉన్నది నీ యదార్ధ స్వరూపము. ఇది అప్పుడు, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అలా కాకపోతే, అది నీ నిజ స్వరూపము కాజాలదు. ఇప్పుడు కూడా ఆ నిద్రస్థితిని పొందు. అదే శివుడంటే. మనకు ఒక రూపము వున్నదా? శివుని రూపమును గురించి ఆలోచించే ముందు దీనిని గురించి ఆలోచించు. నిద్రలో నీవు లేవా? అప్పుడు నీకు ఏరూపమైనా తెలిసినదా? నీ నిద్రలో ఏ 'నేను' ఉన్నదో, అది ఇప్పుడూ ఉన్నది. నీ నిద్రానుభవమున బట్టి, నీకప్పుడు రూపము లేదు, ఇప్పుడు కూడా అదే. ఏదైతే, స్థిరంగా నిలిచి ఉంటుందో అదే యదార్ధ స్వరూపము అయిఉండాలి. నిద్రలో శరీరము లేదు. సుఖానుభవము మాత్రమే ఉన్నది. అది ఇప్పుడు కూడా స్థిరంగానే నిలిచి ఉన్నది. ఆత్మకు శరీరం లేదు. ఈవిధంగా నీకేశరీరము లేకపోతే, ఇక శివునికి శరీరము ఎలా ఉంటుంది? నీకు శరీరము ఉంటే శివునికి కూడా శరీరము ఉంటుంది. నీకు లేకపోతే, శివునికి కూడా లేదు. శివుడు అంటే ఆనందస్వరూపము. మంగళ రూపము అని వివరించి చెప్పారు.

శ్రీ భగవాన్ ఇలా చెప్పేవారు "తాను సహజంగానే దుర్బలుడననీ, దుష్టుడననీ అనుకోవటమే ప్రతి మనిషీ చేసే పెద్ద తప్పిదం. వాస్తవానికి ప్రతి మానవుడూ దైవిక సంపన్నుడే, బలాధ్యుడే. అతని అలవాట్లూ, వాంచలూ, భావాలూ - అవే దుర్బలమైనవి. అతని ప్రకృతి కానే కాదు."

శ్రీ భగవాన్ ఉపదేశసారమిది : "నేను ఎవడును" అనే అన్వేషణను విడవకుండా కొనసాగించు. నీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా విశ్లేషించుకో. "నేను" అనే భావం ఎక్కడ జనిస్తుందో కనుక్కో, ధ్యానాన్ని కొనసాగించు. అంతర్ముఖం అవుతూండు. ఏదో ఒకరోజు ఈ ఆలోచనా చక్రం ఆగిపోతుంది. సహజస్పూర్తి నీకు తెలియకుండా ఉదయిస్తుంది. ఆస్పూర్తి వెంటేవెళ్ళు, నీ ఆలోచనంతా ఆగిపోతుంది. అదే నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది."

సందర్శకులూ, భక్తులూ తమకి దీక్షనో, అనుగ్రహాన్నో, ఏదైనా ఆధ్యాత్మికానుభూతినో, ఇవ్వమని శ్రీ భగవాన్ ని కోరుతుంటారు. దీనికి సమాధానంగా "నేనెప్పుడూ ఇస్తూనే ఉన్నాను. మీరు గ్రహించలేకపోతే నేనేం చేయగలను?" అనేవారు.

జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం బోధించినట్టు, "నేను నా జనకునిలో ఉన్నాను. నా జనకుడు నాలోఉన్నాడు. నేనూ, నా జనకుడూ ఏకమే." తిరువన్నామలై లోని శ్రీ భగవాన్ కూడా అంతే.

శ్రద్ధా విశ్వాసాలతో వారి సన్నిధికి చేరిన వారందరికీ వారి సమక్షాన నెలకొనే ప్రశాంత వాతావరణం అనుభూతమవుతుంది. ఆయనని ఏవో ప్రశ్నలు అడుగుదామని వెళ్లినవారికి, వారు అడుగకముందే సమాధానాలు లభించేవి. ఆయన ఒక్కమాట మాట్లాడకపోయినా, వారి సన్నిధిలో కూర్చున్న వారి సంశయాలు నివృత్తి అయ్యేవి.

ఒక్కోసారి శ్రీ భగవాన్ తమ చుట్టూ జరిగే వాటిపట్ల పూర్తిగా అనాసక్తంగా ఉండేవారు. కానీ ఒక్కొక్కప్పుడు చిన్నచిన్న విషయాల్లో కూడా ఆసక్తి చూపేవారు. గూటిలో నుంచి క్రింద పడిపోయిన పిచ్చుక గుడ్డు గురించి ఎంతో శ్రద్ధ తీసుకొనేవారు. ఆగ్రుడ్డు నుంచి చిన్ని పిచ్చుక బయటికి వచ్చినప్పుడు దానిని అందరికీ చూపేవారు. కానీ ఆమరుక్షణమే ఎవరైనా వచ్చి ఫలానా భక్తుడు పోయాడని చెప్తే, "ఓహో అలాగా!" అనేసి ఊరుకునేవారు.

శ్రీ భగవాన్ మతాచారానికి విరుద్ధంగా ఏమీ అనేవారుకాదు. తమ భక్తులు ఎవరైనా ఆ ఆచారాలను విమర్శిస్తే ఖండించేవారు. తమ దర్శనార్ధం వచ్చిన భక్తులను ఎట్టి పరిస్థితులలోనూ ఆటంక పరచవద్దనేవారు. సామాజికంగా బడుగువర్గం వాళ్ళ పక్షమే ఉండేవారు. ఆశ్రమం బయట భోజనం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాతే, వారు భోజనం చేసేవారు. పేదవారికి ఏ పల్చటి సాంబారునో వడ్డిస్తే వారికి కోపం వచ్చేది. వారికి కూడా దానినే వడ్డించమనేవారు. భగవాన్ అనారోగ్యంగా ఉన్న రోజులలో వారి ఆరోగ్యం కోసం పాలూ, పళ్ళు వారికి ఇచ్చినప్పుడు కూడా, అక్కడ వున్న వారందరికీ సమానంగా పంచమనేవారు.

(వచ్చే సంచికలో భగవాన్ తల్లి అళగమ్మ గారికి ముక్తి నొసగుట గురించి)

మరిన్ని శీర్షికలు
peesapati narasimha murthy