Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
peesapati narasimha murthy

ఈ సంచికలో >> శీర్షికలు >>

మైసూర్ (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Paryatakam - Mysore

కర్ణాటక రాష్ట్రం లో ని రెండవ అతిపెద్ద నగరమైన మైసూర్ ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. ఇది రాష్ట్ర రాజధాని బెంగుళూరు నుండి 140 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ప్రాంతం 'గార్డెన్ సిటీ', 'సిటీ ఆఫ్ పాలసెస్' గా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ప్రాంతీయ భాష కన్నడం. ప్రసిద్ది చెందిన మైసూరు సిల్క్ చీరల యొక్క మూలం ఈ నగరం లోనే ప్రారంభం అయింది.

హిందువుల ఇతిహాసం దేవి భాగవతంలో మైసూర్ గురించి ప్రస్తావించబడింది. ఇందులోని ప్రస్తావించబడిన ప్రకారం, మహిషాసరుడనే రాక్షస రాజు మైసూర్ ని పరిపాలించేవాడు. దేవతల మరియు దేవుళ్ళ అభ్యర్ధనలతో పార్వతీ దేవి చాముండి లేదా చాముండేశ్వరి అవతారములో జన్మించి మహిషాసురుడిని వధించింది. అందుకే ఈ ప్రాంతం 'మహిశ్రు' గా పిలువబడేది. కాలక్రమంలో ఈ ప్రాంతం పేరు మైసూర్ గా మారింది.

చారిత్రకపరంగా మైసూర్ నగరం గురించి క్రీ.శ.245 లో అశోకుని కాలం లో కూడా ప్రస్తావించబడింది. అయినప్పటికీ, మైసూరు గురించిన చరిత్ర కి సంబంధించిన విషయాలు 10 వ శతాబ్దం నుండే అందుబాటులోకి వచ్చాయి.

ఒకప్పుడు ఈ రాచరిక నగరం నుండి కొన్ని శతాబ్దాల పాటు మైసూర్ రాష్ట్ర పాలన సాగించిన మైసూరు మహారాజులకు ఈ ప్రాంతం రాజధానిగా వ్యవహరించింది. ఈ ప్రాంతం కర్ణాటక సాంస్కృతిక కేంద్రం గా మారడానికి కళాకారులు, చేతిపని నిపుణులు, రచయితలతో పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల యొక్క కళాభిమానం తమ వంతు పాత్ర పోషించాయి.

ఈ ప్రాంతం లో పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి.

మైసూర్ పాలసు
మైసూర్ లో ని ప్రధాన ఆకర్షణలలో ఒకటి అంబ విలాస్ పాలసు గా కూడా పిలువబడే మైసూరు పాలస్. ఇది ఒకప్పటి రాజ వంశీకులకు అధికార నివాస ప్రాంతంగా ఉండేది. మైసూర్ నగరానికి నడిబోడ్డులో ఈ పాలసు ఉంది. ఈ పాలసు లోపలి భాగం అత్యంత ఆకర్షణీయంగా, రమణీయంగా ఘనంగా చెక్కబడినది. మైసూర్ నగరం లో ఉన్న పాలస్ ల తో పోలిస్తే ఈ పాలసు ప్రత్యేకమైనది. ఈ రాజభవనానికి దాదాపు 500 ఏళ్ళ చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం కనబడుతున్న పాలసు మాత్రం 1912 లో తిరిగి నిర్మించబడినది. అసలైన పాలసు ఒడయార్ రాజ వంశీకులచే 14 వ శతాబ్దం లో నిర్మించబడినది. ప్రస్తుత పాలసు, ఇండో సరాసీనిక్ శైలి లో హిందూ, ముస్లిం, రాజ్ పుట్, మరియు గోతిక్ నిర్మాణ శైలిలని ప్రతిబింబిస్తుంది. ఈ పాలసు లో దసరా వేడుకలని ఘనంగా జరుపుకుంటారు. ఈ పాలసు సముదాయం లో పన్నెండు హిందూ ఆలయాలు కలవు. కళ్యాణమంటపం, రాజదర్బారులతో పాటు సువర్ణ రాజ సింహాసనం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఈ పాలసు  ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడింది.

బృందావన్ గార్డెన్స్
బృందావన్ గార్డెన్స్, కావేరి నది పైన నిర్మించబడిన కృష్ణసాగర డ్యాం ని అనుకోని ఉంది. 1927 లో ప్రారంభమైన ఈ ఉద్యావనం  పనులు 1932 లో పూర్తయ్యాయి. 

ఈ గార్డెన్ లో ని ప్రధాన ఆకర్షణ పాటలకు అనుగుణంగా నాట్యం చేసే మ్యూజికల్ ఫౌంటైన్. నీళ్ళు, రంగులు ఇంకా సంగీతం యొక్క  అద్భుత కలయికగా ఈ ఫౌంటైన్ ను అభివర్ణించవచ్చు.

భారతదేశం లో నే అత్యంత ప్రసిద్ది చెందిన టెర్రస్ గార్డెన్ ఇది.

చాముండి హిల్స్
సముద్ర మట్టం నుండి 3,489 అడుగుల ఎత్తులో ఉన్న చాముండి హిల్స్ , మైసూరు నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.

ఈ కొండపై శ్రీ చాముండేశ్వరి ఆలయం ఉంది. మహిషాసుర మర్ధినిగా కొలువబడే "చాముండి" లేదా "దుర్గ" గా అవతరించిన శక్తి స్వరూపం కొలువై ఉన్న ఆలయం ఇది.

మైసూరు నగరం లో ని అన్ని వైపుల నుండి కూడా దాదాపు 8 నుండి పది కిలోమీటర్ల దూరం వరకు చాముండి హిల్స్ ని చూడవచ్చు.

జగన్మోహన్ పాలసు
ఈ పాలసు మూడవ కృష్ణరాజ ఓడయారు హయాంలో 1861 లో మైసూర్ పాలసు కి ప్రత్యామ్నాయం గా నిర్మించబడింది. 1897 లో ని అగ్నికి ఆహుతి అయిన మైసూర్ పాలసు 1912 లో పునర్నిర్మితమయింది. అప్పటి వరకు ఆ రాజవంశీకులు జగన్మోహన్ పాలసు లో నివసించారు.  ఈ పాలసు 1915 లో ఆర్ట్ గాలెరీగా మార్చబడినది. కేవలం 70 రోజులలోనే చెక్కబడిన అధ్బుతమైన చెక్కడాలతో అలంకరించబడిన ఈ పాలసు యొక్క ప్రధాన ద్వారం కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆర్ట్ గాలేరీ లో ని దాదాపు 2000 పైగా మైసూరు, మొఘల్ మరియు శాంతినికేతన్ శైలిని ప్రతిబింబించే వివిధ భారతీయ శైలి చిత్రలేఖనాలు ఉన్నాయి. తిరువనంతపురానికి చెందిన ప్రతిష్టాత్మకమైన కళాకారుడైన రాజా రవివర్మ చిత్రలేఖనాలు ఇక్కడ పొందుబరచబడి ఉన్నాయి. ఈ పాలసు యొక్క వైభవం ప్రతి పర్యాటకుడిని అమితంగా ఆకర్షిస్తుంది.

రైల్ మ్యూజియం
ఢిల్లీ లో ఏర్పాటయిన నేషనల్ రైల్వే మ్యూజియం తరహాలో 1979 లో  మైసూరు లోఇండియన్ రైల్వేస్ చేత ఏర్పాటయిన రెండవ మ్యూజియం ఇది.

లోకోమోటివ్ ల ప్రదర్శనలను ఇక్కడ గమనించవచ్చు. మైసూరు రైల్వే మ్యూజియం ప్రధాన ఆకర్షణ, భారత దేశంలో ని రైల్వేస్ అభివృద్దిని వివరించే  వివిధ బ్లాకు అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ మరియు చిత్రలేఖనాల ప్రదర్శన.

చిన్న పిల్లల కోసం ఈ మ్యూజియం లో బాటరీ చేత నడుపబడే మినీ ట్రైన్ రైడ్ అవకాశం ఉంది.


లలితా మహల్
చాముండి హిల్స్ కి సమీపం లో మైసూరు నగరానికి తూర్పువైపున కర్నాటకలోని ఉన్న పాలసు లలితా మహల్ .

మైసూరు నగరం లో ని రెండవ అతిపెద్ద పాలసు ఇది.

1921 లో ఈ పాలసు నిర్మితమయింది. 1974 లో హెరిటేజ్ హోటల్ గా మార్చబడినది.



శ్రీరంగ పట్నం

మైసూరు నుండి 13 కిలోమిటర్ల దూరం లో ఉన్నశ్రీరంగపట్నం కావేరి నది యొక్క రెండు ఉప విభాగాలతో అండాకారంలో ఏర్పడ్డ ద్వీపం. చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఇది. శ్రీ రంగనాథస్వామి ఆలయం ఇక్కడ ప్రముఖమైనది.

వీటితో పాటు నిమిషాంబ టెంపుల్, శ్రీ కంఠేశ్వర టెంపుల్, మేలుకోటే టెంపుల్, త్రినేశ్వరస్వామి టెంపుల్, దొడ్డ ఘోసాయి ఘాట్, జామా మసీదు ఇంకా సెయింట్ ఫిలోమేనాస్ చర్చ్ ల వంటి ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణలు , బాల్మురి ఫాల్స్, కబిని రివర్, సంగం వంటి ప్రకృతి అందాలు,  రీజినల్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ, ఫోక్ లోర్ మ్యూజియం, మైసూరు జూ, హ్యాపీ మాన్ పార్క్ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలు పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇంకొక ఆసక్తికరమైన అంశం, ఈ నగరం ఎన్నో ప్రసిద్ది చెందిన వైల్డ్ లైఫ్ సాంచురీలకు సమీపాన ఉంది. అంతే కాకుండా, ఈ నగరం లో నే ఒక జూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల ప్రియులకు ఈ జూ ప్రసిద్దమైన గమ్యస్థానం.

ఇప్పటికీ మైసూర్ నగరంలో గత వైభవం ప్రకాశిస్తూ ఉందనడం లో సందేహం లేదు. ఈ నగరం యొక్క నిర్మాణ వారసత్వ వైభవం అలాగే నిలిచి ఉంది.అందుకే, దేశ విదేశాల నుండి ఎంతో మంది పర్యాటకుల హృదయాలను మైసూరు నగరం దోచుకుంటోంది.

మరిన్ని శీర్షికలు
weekly horoscope(July 06 - July 12)