Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
travelogue eastren europe book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

త్రిశంకు స్వర్గం - భమిడిపాటి ఫణిబాబు

thrishanku swargam

చిన్నప్పుడు  రామాయణ, భాగవతాలనుండి ఎన్నెన్నో కథలు విన్నాము. ఇదివరకటి తరంవారు తాము విన్న కథలతోనే పెరిగి పెద్దయ్యారు. కానీ, ఈ తరంవారు అంత త్వరగా వీటిని నమ్మరు. కారణాలు అనేకంగా ఉన్నాయి. ఏదో కష్టాలు వచ్చినప్పుడు తప్ప దేవుడనేవాడు గుర్తుకు రాడు. యాధాలాపంగా ఎప్పుడైనా దేవుడి గురించీ  ఇళ్ళల్లో ఉండే పెద్దవారు ఎప్పుడైనా ప్రస్తావించినా, ఏదో మొహమ్మాటానికి తల ఊపుతారు కానీ, నిజంగా నమ్మరు. సాంకేతిక పరిజ్ఞానం ధర్మమా అని, అసలు ఈ ప్రపంచంలో సృష్టించిందంతా మానవుడు చేసిందే అంటారు. ఈమధ్యన ఉత్తరాఖండ్ లో జరిగిన జల ప్రళయానికి కారణాలు, ఎవరికి తోచినవిధంగా వారు చెప్తున్నారు. పాతతరం వారూ, ఇంకా దేముడిమీద నమ్మకం ఉన్నవారూ, ఇదంతా గంగమ్మతల్లి కోపం అన్నారు. ఆధునికులు అంటే అందులో కొందరు moderates అంటారూ, అదొక్కటే కారణమనలేమూ, ఎక్కడపడితే అక్కడ, హిమాలయాల్లో కడుతూన్న ప్రాజెక్టులూ, అలాగే అర్ధరహితంగా వ్యాపారధోరణితో కడుతూన్న హొటళ్ళూ, రిసార్టులూ కూడా ఓ కారణం అంటారు. పాపం ఈ "అటూ ఇటూ కాని moderates" కి, దేవుణ్ణి ఏమైనా అంటే ఆయనకి కోపం వస్తుందేమో అని భయం, అలాగని ఆధునీకులతో తేడా వస్తే ఏమైనా అవహేళన చేస్తారేమో అని భయం. అందుకే ఏ గొడవా లేకుండగా రెండు వర్గాలవారినీ సమర్ధించేస్తే అసలు గొడవే లేదు!

ఉదాహరణకి భాగవతం లోని ప్రహ్లాద చరిత్ర తీసికుందాం. లీలావతి గర్భంలో ఉండగానే, నారదుడు చెప్పగా తెలిసికుని, పుట్టేటప్పటికే విష్ణుభక్తుడయిపోయాడు. అలాగే అభిమన్యుడూనూ. భక్త ప్రహ్లాద  సినిమాలోకూడా చూశాము. అంజలీదేవి గర్భంతో ఉండగా, బాలమురళీకృష్ణగారు నారదుడిరూపంతో వచ్చి విష్ణు మూర్తి గురించి కథలు చెప్తూంటే, మధ్యలో ప్రశ్నలు కూడా వేస్తూంటాడు. ఆ తరువాత ఎస్.వి.రంగారావు గారు, బేబీ రోజారమణిని, "అసలు నీకు ఈ విష్ణుభక్తి ఎక్కణ్ణించి వచ్చిందిరా పుత్రా.." అని అడిగినప్పుడు విషయం తెలియచేస్తాడు. ఆతావేతా తేలిందేమిటంటే, పౌరాణిక కాలంలో తల్లి గర్భంలో ఉండగానే, సకలవిద్యలూ, విజ్ఞానసారాంశమూ కూడా నేర్చేసికుంటారని. ఏదో ఆతరం వారు, ఇంట్లోని పెద్దవారూ, స్కూళ్ళలోని ఉపాధ్యాయులూ, దేవాలయాల్లోని పురాణం చెప్పే వారిద్వారానూ విని పెరిగి పెద్దయ్యారు. కారణం అంతకంటే మెరుగైన సాధనాలు లేకపోవడం వల్ల.

కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. కంప్యూటరుమీద ఓ నొక్కు నొక్కితే కావలిసిన సమాచారం తెలిసిపోతోంది. మెదడుని కూడా ఏమీ శ్రమ పెట్టఖ్ఖర్లేకుండగా. చిన్నప్పుడు ప్రతీవారూ ఎక్కాలు బట్టీపట్టినవారే. చదువు వంటబట్టినా లేకపోయినా, ఈ ఎక్కాలు మాత్రం వచ్చేసేవి. అందుకే ఆ రోజుల్లో, బట్టలు ఉతకడానికి తీసికెళ్ళేవారూ, పాలు ఇంటింటికీ తెచ్చిపోసేవారూ, ఎంత విద్యావిహీనులైనా నోటితో లెఖ్ఖ కట్టి, డబ్బులు తీసికెళ్ళేవారు. అదే ఈరోజుల్లో చూడండి, ఎంత చిన్న కూడికైనా, అదేదో calculator లేకుండా చెప్పలేడు. అలాగే నెల తప్పినప్పటినుండీ ప్రతీదానికీ నెట్టే దిక్కు అయిపోయింది. అదే ఇదివరకటి రోజుల్లో మన ఫ్యామిలీ డాక్టరు గారు,  కొత్తగా పెళ్ళైన కూతురిదో, కోడలిదో నాడి చూసి చెప్పేసేవారు, విషయమేమిటో.

సాంకేతికపరిజ్ఞానం ఉండాలీ, అది క్రమంగా అభివృధ్ధికూడా చెందాలి కాదని ఎవరూ అనరు. కానీ అదేసమయంలో, ప్రాచీన గ్రంధాల్లో ఉన్నవాటిలో కూడా  నిజం ఉందని ఎందుకు ఒప్పుకోరో అర్ధం అవదు. పైన వివరించిన ప్రహ్లాద ఉదంతం, అంతా humbug అని తోసిపారేస్తారే, మరి ఈరోజుల్లో జరుగుతున్నదేమిటీ? ఓ పిల్లో, పిల్లాడో మాటలురావడం తరవాయి, సెల్ ఫోనో, టీవీరిమోట్టో, లాప్ టాప్పో లేకుండా కనిపిస్తున్నారా? ఏ ఇంట్లో చూడండి, ఈరోజుల్లో చిన్నపిల్లల చేతుల్లో కనిపించేవి ఇవే. పైగా తల్లితండ్రులూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూంటారు కూడానూ, తమ పిల్లల ఘనత గురించి. అందులో తప్పేమీ లేదు. ఇదివరకటి రోజుల్లో పసిపిల్లలకి తిండి పెట్టాలంటే, వారి తల్లో, అమ్మమ్మో, నానమ్మో చంకలో వేసికుని అటూఇటూ త్రిప్పుతూ, ఏవేవో కాకమ్మ కథలు చెప్తూ పెట్టవలసొచ్చేది. కానీ ఈ రోజుల్లో ఓ టీవీ ఎదురుగా కూర్చోపెట్టి, చేతిలో ఓ రిమోట్ పెట్టేస్తే చాలు, కిక్కురుమనకుండా తినేస్తాడు.

ఈ బుధ్ధులన్నీ ఎక్కణ్ణించి వచ్చాయంటారు? ఎవరూ నేర్పలేదు. విషయమేమిటంటే, ఆ రోజుల్లో ప్రహ్లాదుడూ, అభిమన్యుడూ లాగానే, ఈ కాలపు పిల్లలు అమ్మ కడుపులో ఉండగానే నేర్చేసికుంటున్నారు, కారణం ఈ modern అమ్మలు కూడా, తొమ్మిదో నెల వచ్చి, మర్నాడు డాక్టరుగారిచ్చిన తేదీ  వచ్చేదాకా ఈ లాప్ టాప్పులూ, రిమోట్లూ, సెల్ ఫోన్లతోనే కదా గడిపేదీ? అందుకే అప్పటిదాకా కడుపులో రాత్రనకా, పగలనకా విని విని, భూమి మీద కొచ్చేసరికి కనిపించే ఈ వస్తువులమీద అంతగా అభిమానం పెరిగిపోయిందేమోనని నా అభిప్రాయం.

పైన చెప్పిన కారణం ఒప్పుకుంటారా అంటే అదీలేదూ, పోనీ కారణమేమిటో చెప్పగలరా అంటే మళ్ళీ నెట్ లోకి వెళ్ళి, గూగులమ్మని అడిగి, అదేదో genes అంటారు కానీ, మన పురాణాలు మాత్రం నమ్మరు. పోనీ అలాగని పూర్తిగా నమ్మరంటారా, ఏ అమెరికాకో వెళ్ళాలంటే, చిలుకూరు బాలాజీ ని 108 ప్రదక్షిణాలూ చేసేసి మొక్కేసుకోడం.

ఇలా ఎటూకాకుండా, త్రిశంకు స్వర్గంలో కొట్టుకుంటున్నారు చాలామంది.




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
gaps due to shifts between couples