Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగిన కథ:  సహస్ర అభ్యర్థన మీద లోపలి వాళ్ళు బయటకి పోకుండా, బయటి వాళ్ళు లోనకురాకుండా జడ్జిగారు తలుపుల్ని మూసి లాక్‌చేయించేస్తారు. పిమ్మట సహస్ర నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఆ తరువాత..  

సమయం పదిగంటలు దాటి పోడంతో...బయట అశోక వృక్షం కింద కార్లో కూచున్న త్యాగరాజన్‌కి పరిస్థితి అర్థం గాకుండా పోయింది. ఎక్కడా సహస్ర కోర్టుకి వచ్చిన జాడ కన్పించలేదు. ఆ విరాట్‌ గాని వాడి మనుషులు గాని ఎవరూ వచ్చినట్టు లేదు. కోర్టు లోపల బయటా జనం మాత్రం అలాగే వున్నారు. కోర్టు లోపల ఏం జరుగుతోందో అర్థంగావటం లేదు. ఇక ఉత్కంఠ భరించ లేక పది అయిదు నిముషాలకు కొంత దూరంలో వేన్‌లో వున్న పాండ్యన్‌కి ఫోన్‌ చేసాడు.

‘‘ఏమిట్రా పాండ్యా నాకు మతిపోతోంది. అయోమయంగా వుంది. మనం వేసిన ప్లానేమిటి యిక్కడ జరుగుతోందేమిటి? అవతల కోర్టు ఆరవభమైంది. సహస్ర వచ్చిందా రాలేదా?’’ విసుగంతా గొంతులో నింపుకొంటూ అడిగాడు.

‘‘నాకూ అదే అర్థంగావటం లేదు సార్‌. లోపల్నుంచి ఎవరూ బయటికి రాకుండా తలుపులు  మూయించారు...’’

‘‘మన వాళ్ళెవరూ సెల్‌ఫోన్‌తో లోన లేరా?’’

‘‘హర్యానా షూటర్స్‌ యిద్దరే వున్నారు సార్‌. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోంది’’

‘‘అఘోరించలేకపోయావ్‌. పక్కాగా ప్లాన్‌ చేసిన వాడివి విడిగా యిద్దర్ని సెల్‌ఫోన్స్‌తో లోనకు పంపించలేకపోయావా....’’

త్యాగరాజన్‌ మాటలు పూర్తిగాకుండానే అవతలి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. పాండ్యన్‌ ఎందుకు స్విచ్ఛాఫ్‌ చేసాడో అర్థంగాక పిచ్చికోపంతో తలతిప్పి వేన్‌ వైపు చూడబోయాడు. ఇంతలో కారు పక్కకొచ్చి ఎవరో డోర్‌ మీద చప్పుడు చేసారు. వచ్చింది ఎవరో తెలీక కంగారు పడేలోన మరికొందరు కన్పించారు.

ఎందుకో త్యాగరాజన్‌ మనుసు సందేహించింది. కారును పొమ్మని డ్రయివర్‌కి సిగ్నలిచ్చాడు. డ్రయివర్‌ ఇంజన్‌ స్టార్ట్‌ చేస్తుండగా సడెన్‌గా అటు డోర్‌ తెరుచుకుంది. ఎవరో డ్రయివర్‌ని బయటికి లాగేసి స్టీరింగ్‌ తీసుకొంటూ లోనకొచ్చాడు. ఆ వెనకే కుడిపక్క డోర్‌ తెరుచుకొని హుందాగా కారెక్కి త్యాగరాజన్‌ పక్కన కూచున్నాడో వ్యక్తి. రెండో పక్క డోర్‌లోంచి మరో వ్యక్తి లోనకొచ్చాడు. కారు డోర్స్‌ని తెరిచే ఉంచారు. ‘‘ఎవరు? ఎవరు మీరంతా?’’ కోపంతో అరిచాడు త్యాగరాజన్‌.

కుడి పక్కన కూర్చున్న వ్యక్తి హుందాగా నవ్వి తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు.

‘‘మిష్టర్‌ త్యాగరాజన్‌ అయాం జికె పరాశరన్‌. జాయింట్‌ డైరెక్టర్‌ ఫ్రం సిబిఐ. వీళ్ళంతా నా సబార్డినేట్స్‌’’ అన్నాడు కూల్‌గా. సిబిఐ రంగప్రవేశం చేసిందని తెలీగానే త్యాగరాజన్‌ గుండెల్లో పెద్ద రాయి పడినట్టయింది. నోట మాట రాలేదు. ఏ బేస్‌ మీద సిబిఐ రంగంలోకి దిగిందో తెలీలేదు. ఎందుకంటే ఇంతవరకు ఈ కేసుమీద ఎలాంటి ఎంక్వయిరీ జరగలేదు. సహస్ర నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. సిబిఐ రంగంలోకి దిగితే తన తండ్రి సెంట్రల్‌ మినిష్టర్‌ దేవరాజుకి తెలీకుండా ఉంటుందా? తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేదే...

‘‘ఏమిటి పాండ్యన్‌తో మాట్లాడుతున్నావా? ఇక వాడితో మాట్లాడలేవు. పాండ్యన్ని మావాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఓ సారి బయటికి చూడు’’ అన్నాడు పరాశరన్‌.

మఫ్టీలో వున్న పోలీసులు పాండ్యన్‌ని అరెస్ట్‌ చేసి దూరంగా వున్న పోలీస్‌ వేన్‌ వైపు తీసుకు పోతున్నారు. అప్పటికే మెట్లదగ్గర ఉన్న హర్యానా షూటర్స్‌ ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి లాక్కుపోతున్నారు. అంతే కాదు కోర్టు ఆవరణ లోని త్యాగరాజన్‌ మనుషుల్ని వెదికి వెదికి మరీ పట్టుకుని వేన్‌ల వైపు తరలిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఒక్కసారిగా నవనాడులూ స్థంభించి పోయినట్టయింది.

‘‘ఏమిటీ అన్యాయం? ఏ బేస్‌ మీద నన్ను మీరు అరెస్ట్‌ చేస్తున్నారు?’’ చివరకు ఎలాగో నోరు పెకల్చి అడిగాడు త్యాగరాజన్‌.

‘‘బేస్‌ ఉంది మిష్టర్‌. స్కెలిటన్‌లు కూడా నీ అక్రమాలకు సాక్ష్యం చెప్తాయి. మధురైలో నీ టేకు ఎస్టేట్‌లో జరిపిన తవ్వకాల్లో మొత్తం ఇరవై ఆరు శవాల తాలూకు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వాటిలో రెండింకా పూర్తిగా శిథిలంకాలేదు. జర్నలిస్టు లహరి ఇచ్చిన రిపోర్టులో మిస్సింగ్‌ పర్సన్స్‌ పద్దెనిమిది మంది అస్థిపంజరాలు మీ ఎస్టేట్‌ లోనే దొరికాయి. స్టేట్‌ గవర్నమెంట్‌ తరపున సియం గారి అభ్యర్థనతో మేం రంగంలోకి దిగి అస్థిపంజరాల మీద జరిపిన పరిశోధనల్లో జర్నలిస్టు లహరి రిపోర్టు వాస్తవమని తేలింది. సో లహరి సేకరించి రిపోర్టులో పొందుపరిచిన అన్ని అంశాలమీద క్షుణ్ణంగా పరిశోధన జరపమని సుప్రీంకోర్టు ఆర్డర్‌. ప్రస్తుతానికి టేక్‌ ఎస్టేట్‌లో జరిగిన హత్యల ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్‌ చేయటం జరిగింది’’ అంటూ పరాశరన్‌ వివరిస్తుంటే అచేతనుడయ్యాడు త్యాగరాజన్‌.

‘‘జర్నలిస్టు లహరి, షియీజ్‌ బ్రిలియంట్‌ ఆమె కోర్టుకు వచ్చింది. జడ్జిగారు స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆమెను చంపబోయిన హర్యానా షూటర్స్‌ మావాళ్ళకి లొంగిపోయారు. ఈ ఇన్ఫర్మేషన్‌ చాలనుకుంటాను. ఇక బయలుదేరదాం. కమాన్‌’’ అంటూ కారు దిగాడు పరాశరన్‌. త్యాగరాజన్ని కూడా ప్రత్యేక వాహనంలో సిబిఐ కోర్టుకు తరలించగా డ్రయివరు త్యాగరాజన్‌ కారు తీసుకొని వెళ్ళిపోయాడు. కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు త్యాగరాజన్‌తో బాటు అతడి మనుషులందర్నీ రిమాండ్‌కు తరలించారు. రక్తరహిత యుద్ధం ఆ విధంగా ముగిసింది. సాయంకాలం మూడు గంటల వరకు కోర్టు సహస్రనుంచి స్టేట్‌మెంట్‌ తీసుకొంటూనే వుంది. కోర్టు ముగియగానే తమిళనాడు సియం సెల్విచెందామరై ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందం సహస్రను సురక్షితంగా గోస్వామి కాలనీకి చేర్చింది. అంతా తేలిగ్గా వూపిరి తీసుకున్నారు. సిబిఐ కష్టడీలో వున్న త్యాగరాజన్‌కి బెయిల్‌ నిరాకరించింది కోర్టు. ఎప్పటికి బయటికొస్తాడో కాలమే నిర్ణయించాలి.

***********************************

కోయంబత్తూరు...


వెంకటరత్నంనాయుడి గారిల్లు...

ఆ రోజు బంధువులందరి రాకతో కళకళలాడుతోంది. త్యాగరాజన్‌ అరెస్టయిన వారం రోజులవరకు విరాట్‌తో సహా అంతా అక్కడే వున్నారు. తనను కాపాడి సొంత తమ్ముళ్ళలా ‘‘అక్కా’’ అంటూ కంటికి రెప్పలా తన్ని కాపాడిన మురడన్‌ ముత్తు బేచ్‌ని సహస్ర మర్చిపోలేదు. వాళ్ళకి తనిచ్చిన మాటనిలబెట్టుకుంది. ఇక దీక్షతో కలిసి సహస్ర మధురైకి బయలుదేరింది. దీక్షతో చందూనికూడ తన వెంట తీసుకెళ్ళింది.

విరాట్‌ తనమేనత్త  కాంచనమాలను, విశాలను తీసుకొని కార్లో కోయంబత్తూరు చేరుకున్నాడు. అంతకు రెండ్రోజుల ముందే మునుసామి తన మనుషులతో కోయంబత్తూరు, కదిరేశన్‌ ధర్మలు తమ వాళ్ళతో మధురైకి వెళ్ళిపోయారు.

దీక్ష మధురై వచ్చిన విషయం తెలీగానే ఆమె అన్నలు వచ్చారు. చెల్లెలికి అన్యాయం చేసారు, పట్టించుకోడం లేదని నలుగురూ నాలుగు రకాలుగా చెప్పుకోడం తట్టుకోలేక, తప్పు తెలుసుకొని తామే దీక్ష చందూలకు వివాహం జరిపించటానికి ముందుకొచ్చారు. తర్వాత మహాదేవనాయకర్‌ దంపతులు సహస్రతో కోయంబత్తూరు బయలుదేరగానే వెంట దీక్ష చందూలు, అలాగే ధర్మ మిత్ర వర్గం అంతా కోయంబత్తూరు చేరుకున్నారు.

ఇక ఎంతో కాలం తర్వాత పుట్టింట్లోకి కూతురు విశాలను తీసుకొచ్చిన కాంచనమాలను చూడ్డానికి బంధువర్గమంతా వచ్చారు. భర్త రంగనాధ చౌదరి అన్నదమ్ములంతా వచ్చారు. రంగనాధ చౌదరి పోయిన విషయం తెలిసి అటువైపు బంధువర్గం బాధపడినా కాంచనమాల విశాల యిద్దర్నీ ఎంతో ఆదరంగా చూసారు. ఇక అంతా వచ్చిన విషయం తెలిసి వెంకటరత్నం నాయుడుగారి పెద్ద కూతురు కనకమహాలక్ష్మి, ఆమె భర్త కూతురు సాగరికతో వచ్చి ఇక్కడే వున్నారు. ఇక మునుసామి అయితే అందరితోబాటు నాయుడిగారింటనే వున్నాడు.

ఆ విధంగా అందరి రాకతో వెంకటరత్నంనాయడి గారిల్లు సకల శోభాయమానంగా కళకళలాడిరది. ఆ రోజు భోజనలానంతరం ముందుగా విరాట్‌ పెళ్ళి ప్రస్తావనని మునుసామి తీసుకొచ్చాడు. ‘‘దీక్ష చందూల వివాహానికి దీక్ష అన్నలు ముహుర్తం నిర్ణయించేసారు. మనమే లేటు. మన విరాట్‌ పెళ్ళికీ ముహుర్తం పెట్టేస్తే ఓ పనైపోతుంది గదా!’’ అన్నాడు.

‘‘ఇందులో మా లేటు ఏముంది? ఓ మాట వాళ్ళనడిగితే తర్వాత పురోహితుడ్ని పిలిపించి ముహుర్తం ఖరారు చేద్దాం. ఏమంటారు డాడీ?’’ అన్నాడు విక్రాంత్‌.

‘‘అవునవును అడగండి’’ అన్నాడు వెంకటరత్నం నాయుడు.

‘‘నాకయితే అడగటం అనవసరమనిపిస్తొంది. ఏకంగా పురోహితుడ్ని పిలిపించండి’’ అన్నాడు మహాదేవనాయకర్‌.

‘‘ఓ మాట అడుగుదాం నాయకర్‌ సాబ్‌ తప్పేముంది? ఏమ్మ సహస్రా, విశాల మీ ఇద్దరికీ బావను చేసుకోవటం సమ్మతమే గదా. ముహుర్తం పెట్టించేస్తాం.’’ అనడిగాడు మునుసామి.

‘‘అలాగే కాని బావ ముందుగా ప్రేమించింది అక్క సహస్రని కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించండి’’ అంది విశాల.

‘‘అదేమిటి? మరి నువ్వు?’’

‘‘నేను వాళ్ళతోనే ఉండిపోతాలే’’ అంది.

‘‘సహస్రా నువ్వేమంటావ్‌?’’

‘‘విశాల అలాగే చెప్తుంది కాని సొంత మరదల్ని పక్కనపెట్టి నన్ను చేసుకుంటే తప్పునాదంటారు. విశాలతోనే పెళ్ళి జరిపించండి’’ అంది సహస్ర.

‘‘మరి నువ్వు?’’

‘‘నేనూ వాళ్ళతోనే ఉంటాగా’’

అక్కడే వుండి అంతా వింటున్న విరాట్‌ ఇక భరించలేక ‘‘ఈ త్యాగాలేమిట్రా నాయనో... నా వల్ల కాదు. నాకు ఇద్దరూ కావాలి. పెళ్ళి చేసుకుంటారో లేదో అడగండి’’ అంటూ లేచిలోనకెళ్ళిపోయాడు విరాట్‌. ‘విన్నారుగా మా మావయ్య బంగారం. బంగారాన్ని వదులుకుంటామా ఏంటి మీరు చేసుకోనంటే చెప్పండి నేను చేసుకోడానికి రెడీగానే వున్నాను’ అంది సాగరిక. దాంతో ఒక్కసారిగా గొల్లున నవ్వారంతా.

అప్పటికప్పుడు పురోహితుడ్ని పిలిపించి ముహుర్తాలు చూపించారు సాధారణంగా ఇలాంటి సందర్భాల్తో పేరు బలం తిథి నక్షత్రాల్ని బట్టి వేరు వేరు ముహుర్తాలోస్తాయి. కాని లక్కీగా విరాట్‌కి ఒకే ముహుర్తంలో ఇద్దరికీ తాళికట్టే అద్భుతమైన ముహుర్తం కుదిరింది. ఆ ముహుర్తానికే రంగరంగ వైభవంగా వివాహమూ జరిగింది.

వివాహానికైతే లక్కీగా ఒకే ముహుర్తం కుదిరింది సరే. మరి శోభనానిక్కూడ పెళ్ళికూతుళ్ళిద్దరికీ ఒకే ముహుర్తాలు వస్తాయా.....? ఒకవేళ వస్తే.........???

: అయిపోయింది :

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery