Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మూడవ భాగం

Third Part

ఎలక్ట్రానిక్ మీడియాలో గాయత్రీపాటిల్ గురించి ప్రసారమైన కథనాల్ని మక్కీకి మక్కీ కాఫీకొట్టి మరో ఆర్టికల్ సిద్ధం చేసాడతడు. 'గొప్పలు పోయి తిప్పలు పడ్డ గాయత్రి' టైటిల్ తో... తనకు తెలీని మననటి సావిత్రి ఆరాధ్యనటి అని బిల్డప్ ఇవ్వబోయి బొక్కబోర్లాపడిన కొత్త హీరోయిన్. ప్రెస్ ముందు అవమానపడిన గాయత్రీపాటిల్... అని కూడా రాసాడు. ఆ ఆర్టికల్ రాస్తున్నంత సేపూ సుదర్శన్ మాధనపడుతూనే ఉన్నాడు. సినిమా అనేది అభిరుచిగల ఓ గుంపు ప్రయివేటు వ్యవహారం... అదో వ్యాపారం.

కొత్త సినిమా పోస్టర్ పడితే నచ్చితే చూడొచ్చు. నచ్చకపోతే మానేయవచ్చు. అంతే తప్ప... తప్పులు ఎంచేందుకు నిజానికి తనెవడు?

"ఫిల్మ్ జర్నలిస్ట్"

"అయినంతమాత్రాన... ఓ సినిమా రివ్యూ చేసేంత పూర్తి పరిజ్ఞానం తనకుందా?"

"కానీ... చేతులో కలం ఉంది"

"ఉంటే..."

"నువ్వు రాస్తే వేసుకునే పత్రిక ఉంది"

"ఉంటే..."

"చదివే పాఠకులు ఉన్నారు"

"అంతమాత్రాన చీల్చిచెండాడడమేనా? తెలిసో తెలియకో ఎదుటివారి పొరపాట్లని క్షమించలేమా? సావిత్రి గురించి ఆమెకి నిజంగా తెలీదు.  ప్రెస్ ముందు ఆమెపేరు గొప్పగా చెప్పాలనుకుంది. కానీ, అది మిస్ ఫైర్ అయింది. అదే ఆమె చేసిన నేరం... ఘోరం. ఒకప్పటి నటి ఆమెకి తెలీనంతమాత్రాన... ఇక, ఆమెకీ ఏమీ తెలీని అమాయకురాలిగా ముద్రవేసి 'రాసి' రంపాన పడేయడమేనా?"

"ఏ సెన్సేషన్ క్రియేట్ చేయకపోతే... రీడర్ నీ పత్రికే ఎందుకు కొనాలి?" సుదర్శన్ మనసు అడిగిందాప్రశ్న.

"అంటే... జర్నలిస్ట్ లమా... శాడిస్ట్ లమా? అడిగాడు సుదర్శన్ ఆ సాయంత్రం తనని కలిసిన మనోహర్ తో.

పొద్దున్న ఆర్టికల్ రాస్తున్నంత సేపూ తను ఆలోచించినదంతా అతనిముందు పెట్టాడు.

దానికి అతడు సమాధానంగా - "జర్నలిస్ట్ ల ముసుగులో శాడిస్టులమే. మన రాతలవల్ల పొరపాటున మంచి జరగాలేతప్ప మంచి కోసం రాసే రాతలు మనమేం చేస్తున్నాం. ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో... అభూత కల్పనలు తప్ప నిజమెక్కడుంది? నచ్చిన హీరోయిన్ ని ఆకాశానికెత్తేస్తాం. నచ్చనివాల్లని చూసీచూడనట్లు వదిలేస్తాం. 'కవర్' ఇచ్చిన ప్రొడ్యూసర్ సినిమా కవరేజ్ ప్రముఖంగా చేస్తాం. ఇవ్వనివాడి గురించి ఇసుమంతైనా రాయం. గొంగట్లో తింటూ వెంట్రుకలొస్తున్నాయని బాధపడడం మనం చేస్తున్న మొదటి తప్పు. ఎడిటర్ ఏం కావాలనుకుంటున్నాడో... ఇవ్వడమే మన డ్యూటీ" అన్నాడు మనోహర్.

"ఏమో... గాయత్రీ గురించి రాసిన ఆర్టికల్ నాకెంతో బాధనిపించింది. కొత్తగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తప్పటడుగులు వేస్తోంది. వాటిని భూతద్దంలో చూసి వేలెత్తి చూపించాలా?"

"తప్పటడుగులు సరిదిద్దే క్రమంలో అలా చూపించాల్సిందే. సావిత్రి తెలీకపోవడం తప్పు కాదు. తెలిసినట్లు బిల్డప్ ఇవ్వడం తప్పు" అన్నాడు మనోహర్.

"అద్సరే... ఆ వార్తని ప్రెస్ మీట్ అవగానే ఎలక్ట్రానిక్ మీడియా హోరెత్తించింది కదా! ఇక, మనం కూడా నెత్తిన మోసుకెల్లాలా?"

"నీ బాధ అది కాదు. ఎందుకో... ఆ అమ్మాయిని చూడగానే నువ్వు 'ఐస్' అయిపోయావ్. ఆ మైకంలో ఉండి ఇలా మాట్లాడుతున్నావ్. ఒక్క సంగతి గుర్తించుకో. ఓ హీరోయిన్ ని జర్నలిస్ట్ ఆడియన్స్ చూడలేనంత దగ్గరగా చూడొచ్చు. అంత మాత్రాన ఆమెకి 'దగ్గరై'పోయాననుకోవడం భ్రమ. మొన్నటికి మొన్న ఇలియానా... మొన్న కాజల్... నిన్న తమన్నా, తాప్సీ... ఇవాళ గాయత్రీపాటిల్. నటీమణులందరూ నదుల్లాంటివాళ్ళే"

అర్ధంకానట్టు చూసాడు సుదర్శన్ మనోహర్ వేపు.

"ఔను... ఈ హీరోయిన్లంతా నదుల్లాంటి వాళ్ళు. ఎక్కడో నాసికాత్రయంబకంలో చిన్నబిందువుగా పుట్టిన గోదావరి కొండలు కోనలు... సరిహద్దులు దాటి మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ లోకి ప్రవేశించి రాజమండ్రి దగ్గర అఖండ జలరాశిగా మారి అంతర్వేదిలో మహాసముద్రంలో కలిసిపోయింది. వీళ్ళూ అంతే. ఎక్కడెక్కడి నుంచో రెక్కలు విప్పుకుని ఇక్కడికి వచ్చి కొన్ని సినిమాలు చేస్తారు. వర్కవుట్ అయ్యేంతవరకూ ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత ఎంచక్కా ఇంకో పచ్చనిమొక్కని వెతుక్కుంటూ పరారైపోతారు. ఆ పరాయితనాన్ని ఎంతవరకు భరించాలో అంతవరకే భరించాలి. ఆపై నెత్తికెత్తికోకూడదు. గుండెల్లోకి ఆహ్వానించకూడదు. అంతే!" గీతోపదేశం చేసాడు మనోహర్.

"ఇంకో విషయం చెప్పనా?''

"ఇన్ని చెప్పావ్... అదీ చెప్పు" అన్నాడు సుదర్శన్.

"ఈ ఫిల్మ్ నగర్ లో జర్నలిస్ట్ వి నువ్వొక్కడివే కావు. నీ చుట్టూ వందలమంది ఉన్నారు. వాళ్ళలో నువ్వొక్కడివి మాత్రమే. ఓ హీరోయిన్ కి వాళ్ళెంతో... నువ్వూ అంతే. నువ్వు రాసిన ఆర్టికల్ చదివి నీమీదే ప్రత్యేక ప్రేమ పెంచుకుంటుందని, నువ్వనుకోవడం వెర్రితనం. అసలు... మన భాషే రాని ఆమె... నువ్వు రాసిందెలా చదువుతుంది? మూవీ పీఆర్వో మన్మధరావో, మార్తాండరావో చదివి ఆమెకి వినిపించాలి. అలా వినిపించే వ్యక్తి నీ ఆర్టికల్ నే ఎంచుకుని మరీ ఆమెకి చూపిస్తాడనుకోవడం ఇంకో భ్రమ. ఒకవేళ... అదే జరిగినా ఆ మన్మధరావుకి రెండు భాషల్లోనూ పూర్తి కమాండ్ ఉండాలి. ప్రతి భావాన్నీ ప్రతిఫలించే సామర్ధ్యం ఉండాలి. అయినా... నీవు రాసిన భావుకతని మరో భాషలోకి ట్రాన్స్ లేట్ చేయరెవరూ. మూడుముక్కల్లో నువ్వేం రాసావో చెప్తారంతే. ఇదిగో... మీ ప్రెస్ మీట్ కవరేజ్ ఈ తెలుగు పత్రికల్లో ఉంది... అంటూ చూపిస్తారు. అన్ని పత్రికల మధ్య నీ ఆర్టికల్... అంతమంది జర్నలిస్ట్ ల మధ్య నువ్వూ ఆమె దృష్టిలో పడరు. లేటెస్ట్ ప్రెస్ మీట్ లోనూ హీరోయిన్ గాయత్రికి ఎవ్వరినీ ఎవ్వరూ పేరుపేరునా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా! ఆ ప్రెస్ మీట్ కి అటెండైన గుంపులో నువ్వూ ఉన్నావు... నేనూ ఉన్నాను. మనలాగే మరెంతోమంది ఉన్నారు. ఒక సమావేశంలో అంతమందిని ఒకేసారి చూసిన ఆమె ఎంతమందిని ఎంతకాలం గుర్తించుకుంటుంది. పర్సనల్ ఐడెండిటీ రావాలంటే... ఆమెతో మరిన్ని సమావేశాలు జరగాలి. అవి జరిగేలోపు ఆమె ఫస్ట్ మూవీ రిలీజై సూపర్ హిట్ అయితే... ఇక, ఆమె మనకెవ్వరికీ అందనంత ఎత్తులో ఆకాశమార్గంలో అట్నుంచి ఇటు... ఇట్నుంచి అటు చక్కర్లు కొడ్తూ షూటింగ్ లు చేసుకుంటూ పోతుంది. అంతేనా... ఆ తర్వాత ఆమె మొదటి సినిమా గాయత్రీపాటిల్ కాదు. ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ గా తళుక్కుమంటుంది. ఆ తళుక్కులోంచి ఆమె లుక్కు నీవేపు ఎపుడు పడ్తుంది చెప్పు.

"అంతేనా?"

"అంతేనా... అని అమాయకంగా అడుగుతున్నావేంటీ? అదంతే. ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న తారల్ని చూసి నేలపై ఉన్న మనం సంతోషించాలే తప్ప కోసుకోవాలని కోరుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే... ఆ నక్షత్రాలు మనకు అందవు. ఈ హీరోయిన్లు అంతే... నేలపై నడిచే నక్షత్రాలు" అన్నాడు మనోహర్.

మనోహర్ తర్కం అంగీకరించడానికి సుదర్శన్ మనసు మొండికేస్తోంది. అతడి కల్లవాకిళ్ళలో గాయత్రీపాటిల్ మొహం కదలాడుతూ మెస్మరైజ్ చేస్తోంది.

"నా పత్రికలో నిన్నెంతో గొప్పగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా... కానీ, చేయలేకపోయా" బాధపడుతూనే ఉన్నాడు సుదర్శన్.

మనోహర్ చెప్తున్నట్లు -'తను జర్నలిస్ట్ గుంపులో ఒకడిగా కాకుండా... గాయత్రీపాటిల్ తనను గుర్తించే స్థాయికి చేరుకోవాలి. ఎలా...ఎలా?" ఆలోచిస్తున్నాడు సుదర్శన్.

"అసలు నువ్వేం మాట్లాడావో నీకు తెలుసా?" ఫోన్ లో కసురుతున్నాడు మాతంగరావు.

"ఏం మాట్లాడాను... సావిత్రి రోల్ మోడల్ అనేగా చెప్పాను. ఆ ఆర్టిస్ట్ నిజంగా ఇండస్ట్రీలో లేదా?" అడిగింది అమాయకంగా గాయత్రీపాటిల్.

"ఉంది... ఉండేది. ఇపుడు కాదు. ఒకపుడు"

"ఒకపుడా... ఎంత పొరపాటు జరిగింది. ఇంకా... ఇపుడూ ఆమె యాక్ట్ చేస్తోందని అలా చెప్పేసా"

"అదే... ఇపుడు మన ప్రాజెక్ట్ పరువు తీసింది. సిన్మా స్టార్ట్ అయిందగ్గర్నుంచీ నిన్ను జర్నలిస్ట్ లకు, ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా ప్రాజెక్ట్ ఇమేజ్ పెంచాను. మాతంగరావు సిన్మా హీరోయిన్ చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసాను. నీ ఇంట్రడక్షన్ సూపర్బ్ గా ఉండాలని... అది మూవీకి హెల్ఫ్ అవ్వాలని ఎంతగానో తపించాను. తీరా... ఇవాళేమైంది?"

ఆమె నవ్వింది. తర్వాత కూల్ గా అంది -"ఏమైంది... మాంచి పబ్లిసిటీ వచ్చింది. ఇవాళ ఏ చానల్ చూసినా నా గురించే కదా మాట్లాడుతున్నారు"
"ఆ... మాట్లాడుతున్నారు. మంచిగా కాదు... మాతంగరావు హీరోయిన్ కి మన మహానటి సావిత్రే తెలీదని నవ్వుకుంటున్నారు"

"అంతేగా..." తేలిగ్గా తీసుకుంది గాయత్రి.

"చూడండి. ఇపుడు జరుగుతోంది నాపై నెగిటివ్ పబ్లిసిటీ. అది కూడా ప్రాజెక్ట్ కి ప్లస్సే. సావిత్రి ఎవరో తెలీని గాయత్రి ఎలా ఉంటుందోననే ఇంట్రస్ట్ ఇపుడు చాలామందిలో కలుగుతుంది. ఆ చాలామంది సావిత్రితో నన్ను కంపేర్ చేస్తూ మన సిన్మా చూసేందుకు వస్తారు. జనాలు సిన్మా చూస్తే అది హిట్టే కదా!" చెప్తోంది.

"ఇక్కడ నీకో విషయం చెప్పాలి. మా ప్రొడక్షన్ ఎపుడూ నెగిటివ్ పబ్లిసిటీమీద ఆధారపడలేదు. ఇంతకుముందు తీసిన సిన్మాలన్నీ పాజిటివ్ గానే జనంలోకి వెళ్ళాయి" అన్నాడు మాతంగరావు.

"అందుకే మీరంత భయపడ్తున్నారు. అయినా... సావిత్రి గురించి తెలీనంత మాత్రాన తెలుగు ఇండస్ట్రీలోకి రాకూడదా...? ఇక్కడి మూవీస్ చేయకూడదా? అసలు సావిత్రి గురించి నేనెందుకు తెలుసుకోవాలి?" అడిగింది గాయత్రీపాటిల్.

"మహానటి కాబట్టి. ఆమె పోయి ఇన్నాళ్ళయినా... ఇంకా అభిమానులు నెత్తినపెట్టుకుని పూజిస్తున్న అభినేత్రి కాబట్టి. తెలుగు ఇండస్ట్రీలోకొచ్చి... ఇక్కడి సినిమాలు చేస్తున్న నువ్వు... ఇక్కడి మూలాలు తెలుసుకోవాలి కాబట్టి" కోపంగా అన్నాడు మాతంగరావు.

"నిజమే... ఎక్కడ్నించో వచ్చిన నీకు సావిత్రి గురించి తెలియకపోవచ్చు. అది తప్పు లేదు. కానీ, తెలిసినట్లు బిల్డప్ ఇవ్వడమే పెద్ద తప్పు. అది మన పర్సనాల్టీనే అవమానపరుస్తుంది. గొప్పగా ఉండాలనుకోవడం తప్పుకాదు... గొప్పలు పోవడం తప్పు"

"ఓకే... రేపు నేనే మీడియాని కలిసి సావిత్రి ఎవరో తెలీదని స్టేట్ మెంట్ ఇస్తా. సరిపోతుందా?" అడిగింది గాయత్రీపాటిల్.

"సరిపోదు..."

"మరేం చేయాలి?"

"ఇవాళ్టి స్టేట్ మెంట్ ని నిజం చేయాలి. నిజంగా సావిత్రి నీ రోల్ మోడల్ వని నిరూపించుకోవాలి. మనసావాచా... ఆ మహానటిని ఆదర్శంగా తీసుకుని జైత్రయాత్ర సాగించాలి. మళ్ళీ సావిత్రి మనకు దొరికిందని తెలుగు ప్రేక్షకులు మురిసిపోయేలా చేయాలి. ఇవాలో స్టేట్ మెంట్... రేపో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు మనమేం రాజకీయనాయకులం కాం. సినిమాని ఆరాధించేవాళ్ళం" చెప్పాడు.

"అంటే..."

"అంటే... ఇపుడు సావిత్రి సినిమాలు నువ్వు చూడాలి" చెప్పాడు మాతంగరావు కాల్ కట్ చేస్తూ.

"సావిత్రీ... సావిత్రీ... సావిత్రీ. ఇక్కడివాళ్ళందరికీ సావిత్రి మానియా పట్టుకుంది. నిజానికి తనస్సలు సావిత్రినే చూడలేదు. ఇదంతా ఆ బ్లడీ పీఆర్వో చేసిన పని. స్లిమ్ గా ఉన్నా తను సావిత్రిలా ఉంటుందట. ప్రెస్ మీట్ కెల్లబోయే ముందు సావిత్రి పేరు చెప్పమని సతాయించాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు సావిత్రి అంటే గాయత్రీ మంత్రమన్నాడు. అదే మంత్రం ఈ గాయత్రీకి ఆసరా కావాలన్నాడు. జర్నలిస్ట్ లతో మాట్లాడుతుంటే... దూరంనుంచి 'సావిత్రి...' అంటూ పదేపదే సైగలు చేసాడు. ఇపుడు నన్ను ఇరికించాడు" కోపంతో పళ్ళు నూరుకుంది గాయత్రీపాటిల్.

అయినా, కోపం ఆపుకోలేక సెల్ ఫోన్ తీసి పీఆర్వో కి కాల్ చేసింది.

"మేడమ్..." అన్నాడు పీఆర్వో మన్మధరావు.

"మీరోసారి ఇక్కడికి వస్తారా?" ఆదేశించింది గాయత్రీపాటిల్.

"ఓ... ష్యూర్" అన్నాడతడు.

గాయత్రీపాటిల్ అతడి రాక కోసం ఎదురుచూస్తుండగా... సెల్ ఫోన్ కువకువలాడింది. 'ఇన్ బాక్స్'లోకి తొంగిచూస్తే... అన్ నోన్ నంబర్ నుంచి ఓ ఎస్ఎంఎస్.

"వర్రీ కాకండి. మీకు తెలీని కొత్త ప్రపంచంలో మీరు నడుస్తున్నారు. తొలిఅడుగుల్లో ఈ తప్పటడుగులు తప్పవు. ధైర్యంతో ముందుకు సాగండి. ఖచ్చితంగా రేపటి రోజు మీదే. ఇదే లోకం రేపు రెడ్ కార్పెట్ వెల్కం చెప్పి తీరుతుంది... మీ అభిమాని"

"ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా... అపుడే నాకో అభిమానా?" ఆశ్చర్యపోయిందామె.

ఇంతకీ ఆ అభిమాని... ఆడా, మగా? అసలైన అభిమానానికి జెండర్ వివక్ష ఎందుకు? ఎవరైనా ఒకరే... సింపుల్ గా తన అభిమాని... అనుకుందామె. అంతలోనే మరో ఆలోచన - "సాధారణంగా 'హీరోయిన్ల అభిమానుల్లో ఎక్కువగా మగాళ్ళే ఉంటారు. భిన్నధృవాలు ఆకర్షించుకోవడమంటే ఇదేనేమో?" అనుకుంటుండగా... డోర్ నాక్ అయింది.

"ఎస్... కమిన్ అంది గాయత్రీపాటిల్.

లోనికి వచ్చాడు మన్మధరావు.

"ఏం జరుగుతోంది?"

"చానెల్స్ లో మీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవుతోంది"

"అది తెలుసు. గంటసేపట్నుంచీ చూస్తూనే ఉన్నా. భాష అర్ధం కాకపోయినా... భావం తెలుస్తోంది. నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఆడిపోసుకుంటున్నారు కదా"

"మీరు చెప్పిన ప్రతి విషయాన్ని హైలెట్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్నారు. మధ్యమధ్య మన మూవీ ప్రోమోస్ ప్లే చేస్తున్నారు..."

"అంతేనా?"

"టాలీవుడ్ కి మరో సావిత్రి దొరికిందని చెప్తున్నారు" చెప్పాడు మన్మధరావు.

సావిత్రి పేరు చెప్పగానే గాయత్రి ఫైర్ అయింది.

"ఆవిడ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఇమేజ్ వస్తుందని నువ్వేగా చెప్పావ్" అడిగిందామె.

"ఔను... ఇక్కడివాళ్ళకి సావిత్రి వెండితెర వేలుపు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే హీరోయిన్లకి ఓ డిక్షనరీ. ప్రేమ, కరుణ, జాలి, కోపం, భయం...ఇలాటి  భావోద్వేగాలు ఎపుడెలా పలికించాలో... ఎక్కడెలా నటించాలో తెలియజేసే అభినయ వ్యాకరణం. తెరపై ఓ పాత్రలో ఎలా జీవించాలో ఆమె సినిమాలు చెప్తే. త... నిజజీవితంలో ఆర్టిస్ట్ ఎలా ఉండకూడదో ఆమె జీవితం చెప్తుంది. అంటే... ఆమె నట జీవితం... నిజజీవితం ఎదగాలనుకునేవాళ్లకి స్ఫూర్తి దాయకాలు. కొత్త హీరోయిన్లకు పాట్యాంశాలు. అందుకే... ప్రెస్ మీట్ లో ఆమె పేరు చెప్తే నటిగా మీ ఇమేజ్ పెరుగుతుందని చెప్పమన్నా"

"అస్సలు నాకు సావిత్రి ఎలా ఉంటుందో తెలీదే. నీ సజెషన్ కేరీర్ కి హెల్పవుతుందని పాటిస్తే... ఇదిగో, ఇలా నా ఇమేజ్ డామేజ్ అయింది. ఇపుడేం చేయాలి. ఈ క్రయినెస్ ఎలా అధిగమించాలి?"

"ఒక్కటే పరిష్కారం" అన్నాడు మన్మధరావు.

"ఏంటీ..."

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
ninth part