Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ninth part

ఈ సంచికలో >> సీరియల్స్

దుప్పటి - కాశీ భొట్ల కామేశ్వర్రావు

duppati story by kaashibotla kameshwara rao

నేనెప్పుడు రాజమండ్రి వెళ్ళినా అమలాపురంలో బస్సెక్కి ఆలమూరు మీదుగా పోయేవాణ్ణి. ఒకసారి నా రాజమండ్రి ప్రయాణానికి కారు దాటిపోయింది. ఈసారి తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసివచ్చింది. ముక్తేశ్వరం కారెక్కి రేవులో దిగాను. రేవు టికెట్టు తీసుకొంటున్నాను. 

"ఒరేయ్ రావుడోయ్, ఒరేయ్ రావుడూ," అంటూ పరిచిత కంటం వినిపించింది.

వెనక్కి తిరిగి చూశాను. కుంటి సోమన్న కనిపించాడు. 

కుంటి సోమన్నది మా వూరే. చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూలు పక్కనే కుంటిసోమన్న పెసరట్ల దుకాణం ఉండేది. ఉదయంపూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరిలౌజు వెచ్చవెచ్చగా మాకు దొరికేవి. ఏదైనా ఒకకానీ ఖరీదు. మాకు తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు కుంటిసోమన్నకే అమ్మేవాళ్ళం. అప్పుడు కొబ్బరిపండు కూడా కానీ ఖరీదే. ఇలా కొబ్బరిపండిచ్చి అలా కొబ్బరినౌజు తీసుకోనేవాళ్ళం. 

కుంటిసోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కాని నేను నారింజకాయలు వల్చుకొని తింటున్నా, నిమ్మకాయల రసం నీళ్ళలో కలుపుకొని త్రాగుతున్నా మా మేనత్త వచ్చి 'ఒరేయ్ రామూ! సోమన్న ఇల్లాగే తిన్నాడు వాడి కాళ్ళు పడిపోయాయి,' అని బెదిరించేది. 'ఆటలమ్మ చూపినప్పుడు అపథ్యం చేశాడు అంచేత కాళ్ళు పడిపోయాయి' అని మా అమ్మ అనేది. 

కుంటిసోమన్నకు అందుచేత పెళ్ళి కాలేదు. ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఉన్నవాడిలాగ ఆ ఒక్క జందెంముడిని వినీతిగా వేసుకొని ఓ గోచియో, అంగవస్త్రమో కట్టుకొని పెనం దగ్గర కూర్చొనేవాడు. 

ఈ వర్తకంలో లాభం తియ్యాలనే ఆశ కుంటిసోమన్నకు లేదు. ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో యింట్లో భోజనం చేసేవాడు. కాని నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల దానికి రోజూ ఓ అణా కావలసివచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటిసోమన్న ఆశించేది రోజూ ఆ ఒక్క అణా మాత్రమే. అప్పుడప్పుడు అనగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు, మాకు తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళం. కాని మా ప్రయత్నం సఫలమైనా అది సోమన్న దృష్టిలో పడేది. 'వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ, నేనే ఇద్దును కదా!' అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకిచ్చేవాడు. ఈ విధంగా ఉచితంగా కూడా సోమన్న దగ్గర మేం తీసుకొంటూ వుండేవాళ్ళం. 

సోమన్న కొట్టు దగ్గరే కాలవు. మేం ఈతలీదేందుకు చాలా సాయం చేసేవాడు. కుంటివాడనే మాటేగాని కాలువ ఈ మూల నుంచి ఆ మూలకు నాలుగు బారల్లో ఈదేసేవాడు. మాకు చిన్నచిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు. 

సోమన్న కొట్టు ఎదురుగుండా వున్న చింతచెట్టు క్రింద పాకలేసి రాముణ్ణి ప్రతిష్టించి భజన చేసేవాళ్ళం. ప్రసాదాలు తయారుచేయడం, పంచడం సోమన్న పని. 

ఈ విధంగా సోమన్న మా బాల్యజీవితంలో ఓ భాగం అయిపోయాడు. ఆ సోమన్న నాకిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనబడ్డాడు. 

"ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?" అన్నాడు. 

"రాజమండ్రి, ఉద్యోగం చేస్తున్నానక్కడ," అన్నా. 

"అబ్బో పెద్దవాడవయ్యావురోయ్," అన్నాడు, హృదయపూర్వకమైన సంతోషంతో. 

"ఇక్కడున్నావేం," అన్నాను. 

ఈ ప్రశ్న తెలివితక్కువ ప్రశ్నే. ఎదురుగుండా పెనం, పెసరట్ల పోయ్యీ కనబడుతూనే వున్నాయి. 

రోజులు మారిపోయిన తర్వాత ఆ కుంటివాడు కూడా తన పొట్ట తాను పోషించుకోవలసి వచ్చింది. ఓ రోజున తన పెనం, అట్లకాడా పుచ్చుకొని మా వూరు నుంచి ఇక్కడకు వచ్చేశాడు సోమన్న. 

"ఇప్పుడిక్కడే వుంటున్నాను. పెసరట్లు కాల్చనా? ఇంకా నీకు లంచికి అరగంట టైముంది," అంటూ పెనం మీద రెండు పెసరట్లకు పిండి పోశాడు. 

ఒక్కసారి మంట ఎగదోసి, "ఒరేయ్ విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?" అన్నాడు. 

విశ్వనాథం మా చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు. మాకు నాయకుడుగా ఉంటూ వుండేవాడు. 

"హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు," అన్నాను. 

"ఎప్పుడూ ఎవరూ కనబడరురా," అన్నాడు పెసరట్టు మీద నెయ్యి పోస్తూ. 

"ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనబడుతుంది. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు. పలకరించి వెళుతూ ఉంటుంది," అన్నాడు. 

నా మనస్సు ఆ చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తూ వుంది. ఇంతలో లాంచి హారన్ నా చెవుల్లో పడింది. ఉలిక్కిపడ్డాను. 

"ఫరవాలేదులే, ఇంకా పావుగంట ఉంటుంది," అంటూ పెసరట్లు ఆకులో పెట్టి నాకిచ్చాడు. నాకోసం ప్రత్యేకంగా కాల్చాడు. నేతివాసన ఘుమఘుమలాడుతోంది. రెండు తిన్నాను. ఓ అర్ధరూపాయి తీసి ఆ సోమన్నకిచ్చాను. పుచ్చుకోలేదు. నాకిచ్చేశాడు. 

"ఉంచు," అన్నాను. 

"వద్దు డబ్బెందుకురా నాకు," అన్నాడు. 

"ఒరేయ్ రావూ! చలికి మహా బాధపడుతున్నాను ఈ గోదావరి వార. దుప్పటీ గుడ్డ ఏదైనా వుంటే పడేద్దూ," అన్నాడు. 

ఈ అడగడంలో యాచనా, దైన్యం ఏమీలేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు. నా సంచీలో ఓ దుప్పటి కూడా వుంది. కానీ అది కొని వారంరోజులు కూడా కాలేదు. ఖరీదు పది రూపాయలు. అది ఇద్దామని ఒక్కసారి అనిపించినా నాలుక యాంత్రికంగా, "సరే ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే," అంది. 

గబగబా సంచీ పుచ్చుకొని పోయి లాంచీలో కూర్చున్నాను. లాంచీ గోదావరి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. నా మనస్సు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కల్లే జ్ఞాపకానికి రాసాగారు. 

చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో కాపురం చేసుకొంటూ వుంది. మా తరగతిలో చంద్రమతి పెద్దపిల్ల. పదమూడేళ్ళు ఉండేవి. నల్లగా నిగనిగలాడుతూ వుండేది. నేనెప్పుడూ చంద్రమతి దగ్గరగా కూర్చునేవాణ్ణి. ఆదిలక్ష్మి అంటే నాకు విపరీతమైన భయం. శుద్ధ మొద్దుపిల్ల.  నా లెక్కలు చూసి వేసేది. మేష్టారితో చెప్పేందుకు కదిలానో మొట్టికాయలు మొట్టేసేది. బుగ్గ నులుములు నులిమేసేది. కస్సుబుస్సులాడే ఆ ముఖం ఇప్పటికీ నేను మరిచిపోలేను. ఆదిలక్ష్మి ముఖం ఎంత ధుమధుమలాడేదో శ్యామల ముఖం అంత సంతోషంతో వుండేది ఎప్పుడూ. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెల్లు. వాళ్ళింటి దగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఇష్టం. సుందరి కోసం ఆపువ్వులు కోసుకు వచ్చేవాణ్ణి. సుందరి ఇప్పుడెక్కడుందో. ఇప్పటికి నలుగురు పిల్లల తల్లై వుంటుంది. వేసంగి వెన్నెల రాత్రుల్లో మైసూరు గోవా మామిడి క్రింద కూర్చుని సుదూరాన వినిపించే గ్రామదేవత జాతరడప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్ళం. గుయ్యంగాడు, ఆంజనేయులి వేషం వేసే ఆ సత్యంగాడు - వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ ఈ జీవితంలో అల్లా ఆడుకోగలనా?

నా మనస్సు ఆ కరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తోంది. ఆ స్మృతులన్నీ నాలో కుంటిసోమన్న రెచ్చ గొట్టాడు. ఆ తియ్యని రోజులనన్నింటినీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చాడు. దీనికి కృతజ్ఞతగా సోమన్నకు నేనేమిచ్చాను.

నా దగ్గర డబ్బులు డాక్టర్ల కంటే ముందు రచయితలే పొందుతూ వుంటారు. రచయిత వలె మధురస్మృతుల్ని నాలో రేపిన సోమన్న ఏమి పొందాడు? ఒక్క దుప్పటీ గుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రున్నయ్యాను. ఒక్కసారి ఒడ్డువైపు చూశాను. సోమన్న ఉండే పాక చిన్నదిగా నాకు కనిపిస్తూనే వుంది. ఇక్కడ అందరూ సోమన్నను ఎరుగుదురు. లాంచి దిగి ఏ పడవవాడి చేతికైనా దుప్పటి ఇచ్చి పంపించాలని అనుకొన్నాను - కానీ ఆ కొత్త దుప్పటి వాడివ్వక అపహరిస్తే? నాకెందుచేతో సోమన్న సొమ్ము ఎవడూ అపహరించాడు అని అనిపించలేదు. 

కారులో కూర్చున్నాను. రోడ్డు కిరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నుల పండుగగా ఉన్నాయి. మా బడికి ఆవలిప్రక్క ఇలాంటి చేలే ఉండేవి. పెసర పైరు వేసినప్పుడు మేము ఆ చేలలోకి వెళ్ళేవాళ్ళం. ఇంత పెసరరొట్ట పీకి కాల్చుకొని ఆ కాయలు వల్చుకొని తినేవాళ్ళం. ఆ రుచి ఈనాటికీ నాకు మరపునకు రాదు. ఇప్పుడు ఆ బడిలో - ఆ వీధిలో పుట్టి పెరిగిన అనేకమంది పిల్లల్ని నేనెరుగుదును. ఆడపిల్లలు చాలామంది అత్తవారింటికి వెళ్ళిపోయి వుంటారు. వారి స్థానే క్రొత్త కోడళ్ళతో ఆ కొంపలు కలకలలాడుతూ వుంటాయి. మా బడికి మళ్ళీ వీళ్ళు పిల్లల్ని సరఫరా చేస్తూ వుంటారు కాబోలు. ఇల్లాటి స్మృతులతో నాకారు ప్రయాణం సాగింది. 

రాజమండ్రిలో దిగి నా పనిలో నేను ప్రవేశించినా ఈ భావోన్మత్తత, దీనికి కారణమైన సోమన్నా నా మనస్సు విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికి గాని ఆ స్మృతులను మరచిపోలేకపోయాను. 

ఓ నెల గడిచింది. ఒకసారి అమలాపురం రావలసి వచ్చింది. ఈసారి కోటిపల్లి మీదుగానే వెళ్ళాలని నిశ్చయించుకొన్నాను. నా చిన్ననాటి స్నేహితుడక్కడ ఉంటాడు. వాడి కోరిక  నెరవేర్చడానికి దుప్పటీ కొనాలనుకున్నాను. నా దగ్గర పుష్కలంగానే డబ్బు వుంది. కాని ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటి కొన్నాను. బస్సెక్కి బయలుదేరాను. 

ఏదో ఇంటికిపోతున్న మనస్సేమో సోమన్నను గురించి చిన్ననాటి ముచ్చట్లను గురించి అంతగా ఆలోచించలేదు. కారు కోటిపల్లి వచ్చేటప్పటికి తొమ్మిధైంది. లాంచి గోదావరిలో సగం దూరం వచ్చేటప్పటికి సోమన్న పాక కనబడుతూ వుంది. నేను వెడుతూ వుంటే సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు  కాల్పించుకుని తిని దుప్పటి ఇవ్వాలనిపించింది. లాంచి ఒడ్డుకు చేరింది. సంచీ పుచ్చుకొని బయలుదేరాను. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో వెంకటప్పయ్య ఒకడు. వెంకటప్పయ్య సోమన్నకు అన్నగారే. 

"ఏమోయ్ ఇల్లా వచ్చావ్?" అన్నాను వెంకటప్పయ్యను ఉద్దేశిస్తూ. 

కానీ, వెంకటప్పయ్య నా మాటలకు బదులు చెప్పకుండానే పాకలోకి వెళ్ళాడు. నేను కూడా వెనకాలే పాకలోకి వెళ్లబోయాను. కాని ఎవడో నా జబ్బ పట్టుకొని ఆపాడు. నేను ప్రక్కకు తిరిగి, "సోం?" అన్నాను. 

"సోమన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి," అన్నాడు. 

నాకు అంతా అర్ధమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాను. 

వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి పీక్కుపోయి వుంది ఆకృతి. గంపలో కూర్చోబెట్టి, "ఏదైనా గుడ్డ కప్పాలి," అన్నాడు వెంకటప్పయ్య. 

నేను తల వంచుకుని నా సంచీలోని కొత్త దుప్పటి తీసి సోమన్నకు కప్పేను.


(వంశీకి నచ్చిన మరో కథ వచ్చే వారం )

మరిన్ని సీరియల్స్