Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue139/393/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

ఎవరో అజ్ఞాత చిత్రకారుడు రంగు కుంచెతో అద్భుతంగా చిత్రించిన సుందర వనంలా ఉందా ప్రాంతం. చిన్న చిన్న కొండ గుట్టల మధ్యన విశాలమైన నీటి మడుగు కనువిందు చేస్తోంది. మడుగును చుట్టి దట్టంగా అనేక వృక్షాలు, పొదలు, లతలు పచ్చగా మెరుస్తూ చల్లటి నీడనిస్తున్నాయి. ఓ కొండ గుట్ట పై నుంచి జాలు వారుతున్న స్వచ్ఛమైన నీరు నిశ్శబ్ధంగా కొండవాలు వెంట జారి కింద మడుగు లోకి చేరుతోంది. సమృద్ధిగా నీరు వున్న చోట తారు లతలు కళకళ లాడుతూంటాయి. కొంత దూరంలో ఏపుగా పెరిగిన అడవి అరటి చెట్లు అనేకం కన్పిస్తున్నాయి. మాగిన అరటి పండ్లతో గెలలు నోరూరిస్తున్నాయి. అరటి పండ్లు మెక్కిన కోతులు వృక్ష శాఖల మీద తీరిగ్గా విశ్రాంతి పొందుతున్నాయి. శుక పిక శాలి కాది వృక్ష సమూహాలు మడుగు మీదుగా ఎగురుతూ సందడి చేస్తున్నాయి. మడుగు మీదుగా వీస్తున్న శీతల గాలులు వడ దెబ్బ నుండి సేద తీరుస్తున్నాయి. నయన మనోహరమగు ఆ ప్రదేశాన్ని చూస్తూ అశ్వం దిగాడు ధనుంజయుడు. పులకించిపోయాడు. తన్మయంతో` ‘‘నమ్మలేకపోతున్నాను మిత్రమా! ఈ సమీపాల్లో ఇంతటి రమణీయ ప్రదేశమొండు కలదని ఇంతవరకు తెలియనైతిని సుమా’’ అన్నాడు ముందుకు నడుస్తూ.

అప్పటికే తన అశ్వం దిగిన అపర్ణుడు అతన్ని అనుసరిస్తూ చెప్పాడు` ‘‘మీకే కాదు యువరాజా! బాటసారులు చాలా మందికి ఈ చోటు తెలీదు. ఎందుకంటే, బాట నుండి దూరంగా గుట్టల మధ్య వున్నది కదా. ఈ మడుగు నీరు స్వచ్ఛమైనది, రుచిగా వుంటుంది. మీరు స్నానమాచరించి, భుజించి ఒకింత విశ్రాంతి నొందుటకు అనువైన చోటు. సాయం సమాయన తిరిగి ప్రయాణం సాగింపవచ్చు’’ అన్నాడు.
ధనుంజయుడు సాలోచనగా వెనుతిరిగి`

అపర్ణుని వంక చూసాడు.

‘‘నాకు తెలీక అడుగుతాను అపర్ణా. చూస్తుంటే మా అటవీ ప్రాంతాన్నీ నీకు కొట్టిన పిండిలా వున్నట్టుంది. ఈ రహస్య ప్రాంతం నీకు మాత్రం ఎలా తెలుసుసు?’’ సందేహం వ్యక్తం చేసాడు.

చిన్నగా దరహాసం చేసాడు అపర్ణుడు.

‘‘మీ మాటలు సత్యదూరము కాదులే యువరాజా. నేను తిరగని అటవీ ప్రాంతాలు లేవు. పిన్న వయసు నుంచీ అలవాటే. ఏలాగున అని అడగవద్దు. సమయమంటూ వస్తే తప్పక వివరించగలను. మీరు స్నానం చేయండి. నేనలా వెళ్ళి అరటి పండ్లు తెచ్చెదను’’ అంటూ మరో మాటకి అవకాశం యివ్వకుండా అపర్ణుడు ముందుకు సాగాడు.

కొద్ది క్షణాలు వెళ్తున్న అపర్ణుడినే చూస్తుండి పోయాడు ధనుంజయుడు.

‘‘పండ్లకు తొందరేమున్నది మిత్రమా. వెనక్కురా. ఇరువురము కలిసే స్నానమాచరించెదముగాక’’ అంటూ పిలిచాడు.

‘‘లేదు లేదు. నేనిపుడు స్నానమాచరింప. మీరు కానిండు’’ తిరిగి చూడకుండానే బదులిచ్చాడు అపర్ణుడు.

అతడు వెళ్తున్న దారిలో అడవి నెమళ్ళు రెండు పురి విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆడ నెమళ్ళు ఆడుతున్నాయి. అపర్ణుడి నడకలో నాట్యం కన్పిస్తోంది. నడక తీరు హోయులు మనోహరంగా వున్నాయి. ఎందుకో కాసేపలా సందిగ్ధంలోనే వుండిపోయాడు ధనుంజయుడు. వీడు నిజముగా అపర్ణుడా? లేక... అపర్ణా... వీడు నాకు అర్థం గావటం లేదే. అయినా వయసుకు మించిన అంత పెద్ద తలపాగా అవసరమా... మర్మమేదో ఆ తలపాగా లోనే వున్నట్టుంది. సూర్యాస్తమయం లోన వీడి గుట్టు తెలుసుకోలేనా?

ఆలోచిస్తూనే అశ్వాలు రెంటినీ పచ్చిక మీద మేతకు వదిలాడు. వంటి మీది ఉడుపు (దుస్తులు) తీసి, నడుంకి వస్త్ర భాగం చుట్టుకుని స్నానానికి మడుగు లోకి దిగాడు.

ఛాతీకి మించి లోతు లేదా మడుగు.

చల్లటి నీరు ఉష్ణతాపాన్ని పోగొట్టి శరీరానికి హాయినిస్తోంది. ముదముతో మునకలు వేసి ఈతలు కొడుతూ జల క్రీడకు ఉపక్రమించాడు ధనుంజయుడు. వెళ్తున్న అపర్ణుడికి నీళ్ళ శబ్ధం విన్పిస్తూనే వుంది. అయినా తిరిగి చూడలేదు. నేరుగా అంత దూరంలోని కదళీ వనాన్ని చేరుకున్నాడు. అనేక అరటి చెట్లు ఏపుగా పెరిగున్నాయక్కడ.

అచటికి చేరుకోగానే ఓరకంట ఓసారి వెనక్కి చూసాడు అపర్ణుడు. జలక్రీడలో తన్మయుడై వున్నాడు యువరాజు. ఏడడుగులపైగా ఆజాను బాహుడు, గోధుమ వన్నె మేని ఛాయవాడు, విశామైన వక్ష స్థలం, సన్నటి నడుం, కండలు తిరిగిన దృఢమైన బాహువులు, సన్నటి సింహం నడుంతో నీటి తడితో నవ మన్మధునిలా మెరిసి పోతున్న ధనుంజయుని చూడ్డానికి రెండు కళ్ళు చాలవనిపించింది. బలవంతంగా చూపులు తిప్పుకొని అరటి చెట్లలో జొరబడి ఖడ్గం అందుకున్నాడు.

సరిగ్గా అప్పుడే`

అంత వరకు అక్కడి నీడలో ప్రశాంతంగా పడుకునుంది అయిదు మూర్ల నల్లత్రాచు ఒకటి. అపర్ణుడి రాక గమనించి చేటలా సర్పం విప్పింది. ‘బుస్’ మని భీకరంగా బుసలు కొడుతూ కస్సున పైకి లేచింది.

తన దారికి అడ్డంగా వున్న ఆ కరి నాగును` అపర్ణుడు గమనించాడు.

అయినా కొంచెం కూడ తొట్రు పడలేదు, భయ పడలేదు. తీక్షణంగా దాని కళ్ళ లోకే చూస్తూ ముందుకెళ్ళాడు. ఏదో మంత్రం పఠిస్తూ తన కుడి చేతిని ముందుకు చాపాడు అంతే`

అంతగా బుసకొట్టిన సర్పం కూడ తన రోషాన్ని వదిలి పడగ మూసి పిల్లిలా అపర్ణుడి ముందు తల నేలకు వాల్చింది.
అది లోనే ఒకప్పుడు తన బిడ్డయిన సర్పాలు తన మాట విని అవినీతికి పాల్పడలేదన్న కోపంలో తల్లి కద్రువ గరుడలకు ఆహారం కమ్మని తన సంతానాన్ని శపించింది. ఆ శాప ఫలితం గరుడులకు నాగులకు వైరం. అందుకే సర్పజాతి కన్పిస్తే గరుడ పక్షులు వదలవు. అలాంటి గరుడ రేఖ అపర్ణుడి కుడిచేతిలో వుంది. ఆ పైన మంత్ర కట్టుతో కరి నాగు అపర్ణుడి వశమైపోయింది.

‘‘కరి నాగమా! ఏమా పొగరు నీకు? నీకును నాకును శత్రుత్వము లేదు గదా! నీ దారి నీది, నా దారి నాది. అడ్డు తొలగి స్వేచ్ఛగా వెళ్ళిపో త్వరితముగా.’’ అంటూ ఆజ్ఞాపించాడు.

ఆ మాటకు కట్టు బడుతూ వెనక్కు వెనక్కు జరిగిందా పాము. అక్కడి నుండి ఎడం పక్కకు తిరిగి వేగంగా పాకుతూ అంత దూరం లోని దట్టమైన పొదలోకి వెళ్ళిపోయింది. ఇక బయటకు కన్పించలేదు.

అపర్ణుడు ముందుకెళ్ళి చక్కగా పండిన రెండు అరటి గెలలను నరికి వాటితో వెనుతిరిగాడు.ఈ లోపల అక్కడ యువరాజు ధనుంజయుడు స్నానం ముగించి, తీరం ఎక్కి దుస్తులు మార్చుకున్నాడు. తడి బట్టను పొద మీద ఆరవేసాడు. వృక్ష ఛాయలో కంబళి పరిచి కూచున్నాడు. అశ్వాలు జంటగా పశ్చిక మేస్తున్నాయి. చన్నీటి స్నానంతో శరీరం తేలిక పడి ధనుంజయునికి నిద్ర ముంచుకొస్తోంది. ఇంతలో అపర్ణుడు అరటి గెలలతో తిరిగి వచ్చాడు. అపర్ణుడు మడుగు నీటిలో ముఖం, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. ఇద్దరూ జొన్నరొట్టెలతో బాటు అరటి పళ్ళు ఆరగించారు.

‘‘ఇక మీరు విశ్రమించండి యువరాజా!’’ అంటూ లేచాడు అపర్ణుడు.

‘‘మరి నీవు? ఒకింత విశ్రమించ వచ్చు గదా. ఇచట కౄరమృగాల జాడ కూడ లేదు’’ కంబళి మీద మేను వాలుస్తూ అడిగాడు ధనుంజయుడు.

‘‘ఇది భల్లూకాలు అధికంగా సంచరించే చోటు. నేను కాపలా వుంటాను, మీరు విశ్రమించండి’’ అన్నాడు అపర్ణుడు.
ధనుంజయుడు  గాఢ నిద్రా వశుడయ్యాడు.

తిరిగి మెలుకువ వచ్చేసరికి పగటి మూడో యామం పూర్తయి సూర్యుడు పశ్చిమకాశంలో పైన ప్రకాశిస్తున్నాడు. రాత్రి పడ్డానికి ఇంకో జాము పొద్దు మాత్రమే మిగిలి వుంది. అది కూడ కాదు, లేచి కూచునే సరికి ఒక విచిత్రమైన దృశ్యం అతడి కంట బడింది.
భయంకరమైన రెండు అడవి ఎలుగొండ్లు వాటి పిల్లలు రెండు, వాటి మెడలో లతలు పూలతో కూడిన మాలలు వేసి గంతులేస్తూ వాటితో ఆడుకుంటున్నాడు అపర్ణుడు. ఇది అసాధారణ విషయం.

అడవి భల్లూకాలు మనుషుల్ని చూస్తే రెచ్చిపోయి దారుణంగా దాడి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చంపేస్తాయి. ఓడిపోతే తిరిగి చూడకుండా పారిపోతాయి. అలాంటి  కౄర మృగాలను పెంపుడు జంతువుల్ని చేసి ఆడుకోవటం నమ్మ శక్యం గావటం లేదు. అసలు ఎవరీ అపర్ణుడు. ఇతడికి రాని విద్యంటూ వుందా? చూస్తుంటే ఇతడిలో అసాధారణ ప్రతిభలు చాలా వున్నాయనిపిస్తోంది. ప్రతిక్షణం కొత్తగా కన్పిస్తూ సరికొత్త సందేహాలకు తావిస్తున్నాడు. ఇతడు నిజంగా రత్నగిరి వాడేనా? ఎక్కడి నుండి వచ్చాడు? ఎంత వరకు వస్తాడు? ఏమీ అర్థం గావటం లేదే. ఎడ తెగని ఆలోచనలతో కొద్దిసేపు ముచ్చటగా భల్లూకాలతో అపర్ణుడి ఆటను చూస్తుండిపోయాడు ధనుంజయుడు.

అంతలో యువరాజు నిద్ర లేవటం గమనించిన అపర్ణుడు, ఆటలు ఆపి భల్లూకాన్ని భుజం తట్టి పంపించేసాడు. అవి కనుమరుగు కాగానే ధనుంజయుని వద్దకొచ్చాడు. 

‘‘లేచారా ప్రభూ! సాయం సమయమైనది. ఒక జాము పొద్దు మాత్రమే వున్నది. మనము బయలుదేరుట మంచిది.’’ అంటూ గుర్తు చేసాడు.

‘‘అలాగే మిత్రమా! కాని ఆ భల్లూకాలేమిటి? నీ పాత మిత్రులా లేక గత జన్మ అనుబంధమా! సాధు జంతువుల్లా నీతో ఆడుకొనుచున్నవి?’’ లేచి పరిహాసంగా నవ్వుతూ అడిగాడు ధనుంజయుడు.

‘‘అదేం కాదులే’’ అంటూ తనూ నవ్వాడు అపర్ణుడు.

‘‘ఏ జంతువైనా నాకు ఇట్టే వశమై పోతుంది. అదొక విద్య అంతే!’’ అన్నాడు అపర్ణుడు. ఇక జాగు చేయకుండా అశ్వారూఢులై అక్కడి నుంచి బయలు దేరారు ఇరువురూ.

అడవి నుంచి తిరిగి బాట మీదకు చేరుకోగానే అశ్వాలు గరుడ, ఢాకినీ రెండూ పోటీ పడి దౌడు ఆరంభించాయి. దారిలో కొందరు అశ్వికులు, రథాలు, ఎడ్లబండ్లు, గుంపులుగా బాటసారులు అక్కడక్కడా ఎదురవుతున్నారు. మధ్యలో ఎక్కడా ఆగలేదు అపర్ణుడు, ధనుంజయుడు.
క్రమంగా సూర్యుడు పడమట వాలుతున్న వేళయింది. ఎండ తీవ్రత చాలా వరకు తగ్గింది. ఆడవి మీదుగా శీతల గాలులు ఆరంభించాయి. ఆకాశంలో కొంగల బారులు దక్షిణంగా సాగి పోతున్నాయి. ఉత్తరాకాశంలో కొన్ని నల్ల మబ్బులు గోచరిస్తున్నాయి. ఇంకొంత వ్యవధిలో చీకటి పడనుందనగా అశ్వాలు అడవి మధ్య లోని ఒక కూడలి ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రధాన మార్గం నుండి అక్కడ ఎడం పక్కగా మరో మార్గం పశ్చిమంగా చీలి పోతోంది.

తన అశ్వాన్ని అక్కడి నిలువరించాడు అపర్ణుడు.

‘‘ఆగితివేనయ్యా మిత్రమా! చీకటి పడకముందే మనం ఏదో ఒక సురక్షిత ప్రదేశానికి చేరుకొనుట ఉత్తమం కదా?’’ తన అశ్వాన్ని అపర్ణుడి పక్కగా పోనిస్తూ అడిగాడు యువరాజు ధనుంజయుడు.

‘‘యువరాజావారికింతవరకు దేశాటన చేసిన అనుభవం వున్నట్టు లేదు’’ ఒకింత పరిహాసంగా అడిగాడు అపర్ణుడు.

‘‘ఆ మాట నిజము. మా రత్నగిరి రాజ్యంలో కూడ కొంత భాగం మాత్రమే తిరగాను. ఇది దేశాటనకు బయలుదేరు సమయమే... కాని కారణాంతరాల వలన వేరే పని బడింది. నీకెందుకొచ్చినదా సంశయం?’’

‘‘కాబోయే ప్రభువులు మీరు. దేశాటన చేయుట చాలా అవసరము. దేశాలు తిరిగి చూచుట వలన అనుభవం వస్తుంది. దేశ కాల పరిస్థితుల్లో ఆయా దేశాలు అచటి ప్రజలు వారి భాషలు, ఆచార వ్యవహారాలు, అచటి పరిపాలనా పద్ధతులు, ప్రజల కష్ట సుఖాలు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు మీ ప్రయాణం ఆ కొరత తీరుస్తుందని ఆశిస్తాను. మీరిలా కొంత దూరం వెళ్ళగానే అటవీ ప్రాంతం తరిగి పోయి సుక్షేత్రాలయిన పంట భూములు కన్పిస్తాయి. చీకటి పడిన కొద్ది సేపటికే ఎగువన రామగిరి అనే గ్రామం చేరుకుంటారు. రాత్రికి అచటి సత్రంలో మజిలీ చేసి, ఉదయం బయలు దేరవచ్చు.’’

అపర్ణుడివన్నీ ఎందుకు చెప్తున్నాడో ధనుంజయుడికి అర్థం కాలేదు. ‘‘అంటే... నీవిటు నాతో వచ్చుట లేదా?’’ అనడిగాడు
‘‘లేదు యువరాజా. నా మార్గము ఇటు. రాత్రికి బోయ పల్లెలో మజిలీ చేసి వేకువనే చంపక పురానికి బయలు దేరతాను’’
‘‘చంపక పురంలో పని ఏమి అని అడగను. కాని మాకు అంతరంగిక మిత్రుడివయ్యావు. పునర్దర్శనం ఎప్పుడు?’’
భుజాలు ఎగురవేసి సన్నగా నవ్వాడు అపర్ణుడు.

‘మీ స్నేహం లభించటం నా అదృష్టం యువరాజా. మన స్నేహం స్వచ్ఛమైతే త్వరలోనే మనం కలుసుకోగలమన్న నమ్మకం నాకున్నది. ఇక శెలవు ప్రభూ. మీరును ముందుకు సాగండి. పోయి వచ్చెద’’ అంటూ మరో మాటకు అవకాశం యివ్వకుండా తన అశ్వం ఢాకినిని అదలించాడు అపర్ణుడు.

దౌడు తీస్తున్న అశ్వాన్ని దాని మీద వెళ్ళిపోతున్న అపర్ణుడిని చూస్తూ భారంగా నిట్టూర్చాడు ధనుంజయుడు. ఇలా మధ్యాహ్నం పరిచయమై అలా సాయంత్రం వెళ్ళి పోతుంటే బాధగానే వుంది. కొద్ది రోజులు తన వెంట వస్తాడనుకున్నాడు. కాని ఇక్కడే విడిపోయాడు. లోకం ఎవరి కోసం ఆగదు. ఎవరి పనులు వారివి. లక్ష్యాన్ని వెదుక్కొంటూ ఒంటరి గానే తను ముందుకు సాగాలి.

అపర్ణుడి అశ్వం అడవి దారిన కను మరుగు కాగానే తన అశ్వం గరుడను అదిలించి ముందుకు దూకించాడు.

అపర్ణుడిది వయసు తక్కువ గాని అనుభవంలో దిట్ట. అతడు చెప్పినట్టే చీకటి పడిన కొద్ది సేపటికే పొలాల మధ్య వున్న రామగిరి గ్రామ పొలి మేరల్లోకి అడుగు పెట్టింది అశ్వం గరుడ

*******************************

రాజధాని నగరం రత్నగిరి.

పేరుకు తగ్గట్టు గానే సిరి సంపదలతో వర్థిల్లే ఒక అద్భుత నగరం. సముద్ర తీరంలోని ఈ నగరం దుర్భేద్యమైనది. ఎటు చూసినా ఎత్తైన భవంతులు, కోటలు, పేటలు, సుఖ సంతోషాలతో జీవించే ప్రజలు, కళకళలాడే వీధులతో నయన మనోహరంగా వుంటుంది.
ప్రస్తుతం రత్నగిరి పాలకుడైన ధర్మతేజ మహారాజు పాండు వంశంలో నాటి పాండవాగ్రజుడైన ధర్మరాజు తర్వాత అంతటి ధర్మ ప్రభువుగా ఆదర్శ మూర్తిగా ప్రజల మన్ననలు పొందిన వాడు. రత్నగిరి ప్రజలు ఆయన్ని దైవంగా భావిస్తారు.

అలాగని ధర్మ తేజుడు తన రాజ్య రక్షణ విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. అసంఖ్యాక సైనిక బలం వుంది. పటిష్టమైన పరిపాలనా విధానం వుంది. ఎప్పటికప్పుడు దేశ విదేశాల సమాచారాన్ని అందించే గూఢచార వ్యవస్థ వుంది. పావురాల మూలంగా ఎప్పటికప్పుడు రాజధానికి సమాధానం చేరవేయటంలో రత్నగిరి వాసులు బహు చతురులని  పేరు పొందారు. అందుకే పొరుగు రాజులు ఎవరూ రత్నగిరి వైపు కన్నెత్తి చూడరు. దాడికి తెగబడరు.

ఆశనేది మనకి లేక పోవచ్చు.

కాని ఎదుటి వారికుండొచ్చు.

రాజ్య కాంక్ష మనకు లేక పోవచ్చు. కాని పొరుగు వాడికుంటుంది.అలాంటి వాళ్ళు అవకాశం కోసం గుంట నక్కల్లా కాచుకుని వుంటారు. వాళ్ళని కని పెట్టడం అంత సులువు కాదు. ప్రస్తుతం రత్నగిరిలో పరిస్థితుల్నిబట్టి అవకాశాన్ని పరిశీలిస్తున్న మేక వన్నె పులులు కొన్ని వున్నాయి. వాటి గురించి రత్నగిరి ప్రభువుకు తెలీదు. వేగులు కూడ ఇంతవరకు పసి గట్ట లేక పోయారు.

ఆ రోజు వేకువనే కరూర దేశానికి చెందిన వర్తక నౌక ఒకటి రత్నగిరి ఓడరేవుకు చేరుకుంది. రేవు సుంకం చెల్లించి ఓడలోకి అవసరమైన మంచి నీరు పట్టుకున్నారు. ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసారు సరంగులు. తమ ఓడ వ్యాపార నిమిత్తంగా సింహళ ద్వీపం వెళ్ళి తిరిగొస్తోందనీ, కొన్ని మరమ్మతుల కారణంగా రెండు దినాలు రత్నగిరి సాగర జల్లాల్లో నిలిపేందుకు రేవు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. తర్వాత తీరానికి దూరంగా సముద్ర జల్లాల్లో తెర చాపు దించి తమ ఓడకు లంగరు వేసి అక్కడే వుండి పోయారు సరంగులు.

నిజానికి ఆ ఓడ సింహాళ ద్వీపం వెళ్ళనేలేదు. ఎగువన కరూర రేవు నుంచి నేరుగా రత్నగిరికే వచ్చింది. అది అనేక తెర చాపలతో కూడిన భారీ వర్తక నౌక. కాని అందులోని వర్తక వేష ధారులంతా గాంధార సైనికులు. అందులో వచ్చిన వాడు సాక్షాత్తు గాంధార దేశాధీశుడు శతానీకుడు. గాంధారం నుండి ఇక్కడి వరకు కూడ చాలా రహస్యంగా సాగింది అతడి ప్రయాణం.

ఎవరీ శతానీకుడు?

గాంధార దేశ రాజధాని గాంధార నగరం. ప్రస్తుతం దీన్ని కాంథహార్ అంటున్నాం. అప్పటి గాంధార దేశమే నేటి  ఆప్ఘనిస్థాన్. ఈ గాంధార యువరాణి ధృతరాష్ట్రుని భార్య గాంధారీ దేవి. ఆమెకు నూరుగురు సోదరులు. ఆఖరి వాడు శకుని. శకుని చరిత్ర తెలిసిన వారికి ఏం జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కురు సామ్రాజ్య  వైభవ కాలంలో పేరుకు శకుని రాజే గాని గాంధార మీద పెత్తనమంతా సుయోధనుడిదే. కురు క్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పరిపాలన వచ్చాక గాంధారను సామంత రాజ్యం చేసి శకుని వంశీకుడ్ని అక్కడ రాజును చేయటం జరిగింది.

పిమ్మట తరాలు మారాక వచ్చిన రాజకీయ పరిణామాల్లో హస్తిన ఏలుబడి నుండి స్వతంత్రించిన కొన్ని రాజ్యాల్లో ఈ గాంధార కూడ ఒకటి. ఆ విధంగా కథా కాలం నాటికి శకుని వంశీకుల్లో ఏడో తరం వాడీ శతానీకుడు. పొరుగు పచ్చగా వుంటే సహింప లేడు. కుట్రలు కుతంత్రాలు చేయటంలో అపర శకునిగా ప్రసిద్ధుడు.

గాంధార దేశం వాయువ్య భారత దేశంలో ఈశాన్యంగా పర్వతాలతో విస్తరించి వున్న దేశం. దీనికి ఎగువన కాశ్మీర రాజ్యం, దిగువన పాంచాల రాజ్యం (పంజాబ్) తూర్పు సరిహద్దు దేశాలు. వీటికి దిగువన సింధూ నది నానుకొని దిగువ సముద్రం వరకు ఉత్తర దక్షిణాలుగా ఒక పీలికలా వ్యాపించి కరూర దేశం వుంది. నేటి పాకిస్థాన్ లో కొంత భాగం, తూర్పున భృగుకచ్చా దీన్నే భరూచ్ అని పిలుస్తున్నాం. దీని మీద అధిపత్యం ద్వారక పాలకులయిన యాదవులదయినా కొంత భాగం కరూర దేశం ఆధిపత్యంలో వుండేది. శ్రీకృష్ణుని ద్వాపర నీటి మునిగిన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో ప్రభాస రాజధానిగా శ్రీకృష్ణుని వంశీకుల పాలన సాగింది. యాదవులు బలహీన పడ్డంతో భృగుకచ్ఛలో కొంత భాగం కరూరు పాలకుల ఆధీనం లోకి పోయింది.

ఇక కరూర రాజ్యం విషయానికొస్తే ఇది గతంలో మరాట్వాల ఆధీనంలో వుండేది. గాంధార దేశానికి మరాట్వాలకు శతృత్వం వుంది. కరూరులు మరాట్వాను జయించటంలో శతానీకుడు కాశ్మీరీలను, పాంచాల వారిని కలుపుకొని సాయం చేసి వున్నాడు. ఆ విధంగా కరూర రాజ్యం గాంధారకు మిత్ర రాజ్యమైంది.

కరూర దేశానికి దక్షిణాన సముద్ర తీరం తక్కువగా ఉన్నప్పటికీ ముఖ్యమైన రెండు రేవు పట్టణాలున్నాయి. సింధూ నది మీదుగా ఈ రేవు పట్టణాల వరకు నౌకల రాక పోకలున్నాయి. కరూర దేశం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడానికి అదో కారణమైంది. పోతే గాంధారం, కాశ్మీరం, పాంచాల, కరూర దేశాలు మిత్ర దేశాలు గావటంతో గాంధార ప్రభువు శతానీకుడు నిరాటంకంగా దక్షిణ సముద్రం వరకు వచ్చి పోడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. సింధూ నది మీదుగా అతడు సముద్ర రేవు పట్టణానికి చేరుకుంటే చాలు. అక్కడ సొగసైన భారీ విలాస నౌక ఒకటి సిద్ధంగా వుంటుంది. సముద్ర యానానికి తగు ఏర్పట్లన్నీ తృటిలో జరిగి పోతాయి.

కాని ప్రస్తుత పరిస్థితి వేరు.

అతడి ప్రయాణం రహస్యంగా ఉంచ బడింది.

ముఖ్యమైన పని మీద గాంధారం నుండి బయలు దేరిన శతానీకుడు కరూర రాజ్యం మీదుగా వర్తక నౌకలో రత్నగిరి సముద్ర జలాల్లోకి ప్రవేశింప గలిగాడు. రత్నగిరికి చెందిన ఒక ఉన్నత వ్యక్తి కోసం పగలంతా ఎదురు చూస్తూనే వున్నాడు. అతడితో బాటు అతడి పరివారమూ వర్తకులు వేషాల్లోనే వున్నారు. అయినప్పటికీ కూడ శతానీకుడు నౌక ఉపరితలానికి రాకుండా దిగువన తనకు కేటాయించిన ప్రత్యేక మందిరానికే పరిమితమయ్యాడు.

క్రమంగా సాయంకాలమైంది.

పశ్చిమాకాశం అరుణ వర్ణం దాల్చి ప్రభాకరుడు సముద్ర జల్లాల్లో అస్తమించడానికి సిద్ధ పడుతున్నాడు. వాతావరణం ఇప్పుడిప్పుడే చల్ల బడుతూ సాగర జలాల మీదుగా శీతల గాలులు  వీస్తున్నాయి. నౌక దిగువ భాగంలోని ప్రత్యేక మందిరంలో గవాక్షం చెంత ఉచితాసనం మీద సుఖాసీనుడై వున్నాడు గాంధారాధీశుడు.

మధ్యాహ్న భోజనానంతరం ఒకింత విశ్రాంతి నొందిన శతానీకుడు నిద్ర లేచినప్పటి నుండి అక్కడే కూచుని మధిర సేవిస్తూ ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు. వచ్చింది రహస్య ప్రయాణం కాబట్టి శిరస్సున మణిమయ కిరీటంగాని రాజోచితమైన దుస్తులు, ఆ భూషణాలు గాని లేవు. ఒక సాధారణ వర్తకుని వేషంలో వున్నాడు. అతడి వయసు అయిదు పదులు దాటి ఉండొచ్చు. నలుపు తెలుపు కలగలిపిన మేని ఛాయతో ఏడున్నరడుగుల ఎత్తున సన్నగా వున్నాడు. కోల ముఖం, చికిలి కళ్ళు, వంపు తిరిగిన నాసిక, గుబురు మీసాలతో మనిషి చాలా గంభీరంగా వున్నాడు. అతడి చూపు దూరంగా తీరంలోని రత్నగిరి నగరాన్ని వీక్షిస్తున్నాయి.

ఎదురుగా తీర సమీపంలోనే వుంది రత్నగిరి కొండ. దాని మీద దుర్భేధ్యమైన రత్నగిరి కోట. సముద్ర మార్గంగా శత్రువులెవరూ కోటమీద దాడి చేయకుండా తీరం వెంట అగడ్లతో కూడిన రెండంచెల ఎత్తున కోట గోడల నిర్మాణం వుంది. కొండను చుట్టి మిగిలిన మూడు పక్కలా రత్నగిరి నగరం విస్తరించి వుంది. నగరానికి పెడగా ఉత్తరాన సువిశాలమైన ఓడ రేవు వుంది.

రత్నగిరి మీది అద్భుతమైన కోట సంధ్య వెలుగులో స్పష్టంగా అందంగా కన్పిస్తోంది. కోట బురుజులు బంగారు తాపడాలతో మణిమయ రత్న స్వర్ణ కాంతులీనుతూ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతున్నాయి. బురుజుల మీద రత్నగిరి జయ కేతనాలు రెపరెప లాడుతున్నాయి.
అటు ఓడరేవులో దేశ విదేశీ నౌకలు అనేకం నిలిచి వున్నాయి. కొన్ని ఓడలు రంగు రంగుల తెర చాపలు గాలికి రెపరెపలాడుతూ సముద్రం మీదకు వెళ్ళి పోతున్నాయి. రేవులో ఓడ నుండి సరుకు దించుతున్న రేవు కార్మికుల పాటలు కర్ణా కర్ణిగా గాలి వాటున వినవస్తున్నాయి. గవాక్షం గుండా వీక్షిస్తున్న శతానీకుని చూపులు కోట మీది జయ కేతనం మీదే వున్నాయి. ఆ పతాక స్థానంలో తమ గాంధార జయ కేతనం ఎగిరే శుభ దినం వస్తుందా? అది ఎంత దూరంలో వుంది?

రత్నగిరిని జయించటం అంత సులువు కాదని తెలుసు. కాని జయించాలనే కాంక్ష పూర్తిగా వుంది. దక్షిణాన రత్నగిరి తన వశమైతే చాలా రాజ్యాలు జయించి చక్రవర్తి కాగలడు. యుద్ధ నీతిని పక్కన పెట్టి కుట్రలు కుతంత్రాలను ఆశ్రయిస్తే విజయాన్ని రుచి చూడటం కష్టం కాదు. కాదంటే రత్నగిరి పరిస్థితులు  తనకు అనుకూలంగా మారాలి. తనకు అందిన సమాచారాన్ని బట్టి ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. రావలసిన మనిషి వస్తే ఖచ్చితమైన సమాచారం  తెలుస్తుంది. కాని పగటి వేళ అతడు రాలేడు గాబట్టే ఓపిగ్గా రాత్రి వరకు ఎదురు చూస్తున్నాడు.
క్రమంగా సముద్రం మీదుగా చీకట్లు అలుముకున్నాయి. చలి గాలులు అధికరించటంతో గవాక్షం మూసి వేయ బడింది. ఆ ప్రత్యేక మందిరంలో ఆముదం దీపాలు వెలిగించ బడి వెలుగు నిండుకుంది. అలల తాకిడికి ఉయ్యాలాలా వూగుతోంది నౌక. నౌక పైభాగాన అనేక దివిటీలు వెలిగించ బడ్డాయి. చీకటితో బాటే ఆకాశాన నల్లని మబ్బులు కూడ చేరటంతో రాత్రికి వర్షం పడే సూచనలు తెలుస్తున్నాయి.
చీకటి పడిన కొద్ది సేపటికి`

తన మందిరం నుంచి బయటికొచ్చాడు శతానీకుడు. చెక్క మెట్ల వెంట నౌక ఉపరితల భాగానికి వచ్చాడు. తెరచాపలు దించ బడినప్పటికీ కొయ్యల నుంచి కిరకిర శబ్ధాలు విన్పిస్తున్నాయి. చుట్టూ గాడాంధకారం. చుట్టు పక్కల రాత్రి వేళ చేపలు పట్టే జాలరుల నావల కదలికలు వాటి మీద కాగడా కాంతులు కన్పిస్తున్నాయి. అటు వైభవోపేతమైన రత్నగిరి నగర దీప కాంతులు సముద్ర జలాల మీద ప్రతిఫలిస్తున్నాయి. శతానీకుడు కాసేపు అటు యిటు తిరిగి ఒక ఉన్నతాసనం మీద కూచున్నాడు. పగటి ఉష్ణ తాపం నుంచి శీతల గాలులకు చక్కటి ఉపశమనంగా వుంది.

మరికొంత తడవు నౌక పైనే ఉండే వాడేమో. కాని తడి పొడి చినుకుతో వర్షం ఆరంభమైంది. ఆకాశంలో ఉరుములు మెరుపులు లేకుండానే వర్షం. అది ఉధృతం గావటంతో శతానీకుడు కిందకు వెళ్ళిపోయాడు. వర్షం మూలంగా కాసేపు హడావుడి చోటు చేసుకుందక్కడ. కాని వచ్చినంత వేగం గానూ వర్షం నిలిచి పోయింది.

నౌక దిగువ భాగం చివరలో వుంది వంట శాల. చక్కని విందు భోజనాల సువాసనలు గాల్లో వ్యాపిస్తున్నాయి. తన భోజనం ఆలస్యమవుతుంది గాబట్టి ఈ లోపల సరంగులతో సహా సిబ్బందిని భోజనాలు కానిచ్చి సిద్ధంగా వుండమని ఆజ్ఞాపించాడు శతానీకుడు. అంతా విడతలుగా వంటశాలకు వెళ్ళి భోజనాలు ముగించి వచ్చారు.

క్రమంగా రాత్రి మొదటి జాము ముగిసింది. కోట పై నుండి రెండో యామాన్ని సూచిస్తూ నగరా మోగింది. తిరిగి తడి పొడి చినుకులు ఆరంభమయ్యాయి. సరిగ్గా అప్పుడే`

శర వేగంతో ప్రయాణించే చిన్న నౌక ఒకటి అటుగా వచ్చింది. నౌక చెరో పక్కన రెండు దివిటీలు మాత్రమే మండుతున్నాయి. నౌక ముందు భాగంలో నలుగురు వ్యక్తులు నిలబడున్నారు. వారిలో ఒకడు శతానీకుని మనిషి.    ఉదయం రేవులో దిగి అటునుంచి అటే నగరంలోకి వెళ్లిన వాడు. ఇప్పుడు కావలిసిన మనిషిని తీసుకుని తిరిగి వస్తున్నాడు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు అంగ రక్షకులు. మధ్యలోవున్న వ్యక్తి సామాన్యుడు కాదు. రత్నగిరి రాజ్యానికి ఉప సైన్యాధ్యక్షుడు. అరి వీర భయంకరుడని పేరు పడ్డ మహా వీరుడు బాహ్లీకుడు. వాళ్ళ ముగ్గురూ ముఖాలు తెలీకుండా నల్ల దుప్పట్లు ముసుగులుగా ధరించి వున్నారు. ముగ్గురూ కృపాణధారులై వున్నారు. 

.....................................................ఈ ఉత్కంఠ వచ్చేవారం దాకా.....................................

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్