Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: స్పీడున్నోడు 
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనారికా బడోరియా, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, కబీర్‌సింగ్‌ దుహాన్‌, కృష్ణ చైతన్య, పోసాని కృష్ణమురళి, మధునందన్‌, పృధ్వీరాజ్‌, సత్య, పవిత్ర లోకేష్‌ తదితరులు. 
సంగీతం: డిజె వసంత్‌ 
ఛాయాగ్రహణం: విజయ్‌ 
నిర్మాణం: గుడ్‌విల్‌ సినిమా 
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్‌ 
నిర్మాతలు: భీమనేని సునీత 
విడుదల తేదీ: 5 ఫిబ్రవరి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
స్నేహం కోసం ప్రాణమిచ్చే యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కుర్రాడు శోభన్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌). శోభన్‌ తన ఫ్రెండ్‌ని, అతను ప్రేమించిన అమ్మాయి వాసంతి (సోనారికా)తో కలిపేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో వాసంతి, శోభన్‌తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ వారి పెళ్ళికి వాసంతి తండ్రి అడ్డుపడతాడు. అప్పటికే వాసంతికి ఆమె బావ (కబీర్‌ సింగ్‌)తో పెళ్ళి కుదురుతుంది. తనకు కాబోయే భార్యను ప్రేమించిన శోభన్‌పై వాసంతి భావ పగ పెంచుకుంటాడు. వాసంతిని శోభన్‌ గెలుచుకున్నాడా? ఈ క్రమంలో శోభన్‌ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అసలు స్నేహం కోసం ప్రాణమిచ్చే శోభన్‌, స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయి ప్రేమలో ఎలా పడతాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే 
తొలి సినిమాతో పోల్చితే నటనలో కాస్త మెరుగయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. డాన్సుల్లో, యాక్షన్‌లో మునుపటి వేగాన్ని కొనసాగించాడు. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలిగాడు. సోనారిక అందంగా కనిపించింది. పాటల్లో ఇంకా గ్లామరస్‌గా కనిపించింది. కబీర్‌ సింగ్‌ విలనిజం ఆకట్టుకుంటుంది. నెగెటివ్‌ షేడ్స్‌లో కృష్ణచైతన్య ఆకట్టుకున్నాడు. ప్రకాష్‌రాజ్‌ మామూలే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధుల మేర బాగానే చేశారు. శ్రీనివాస్‌రెడ్డి, పృధ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులంతా కామెడీతో అలరించారు. 
రీమేక్‌ సినిమాలు తీయడంలో భీమనేని దిట్ట. కథ అందరికీ తెల్సిందే. కథనం విషయంలో నేటివిటీకి దర్శకుడు పెద్దపీట వేయాలనుకున్నాడు. ఆ క్రమంలో కొంచెం విజయం సాధించగలిగాడు. మాటల బాగానే ఉన్నాయి. నిర్మాతగానూ బాధ్యతలు తీసుకున్న భీమనేని, సినిమాపై తన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. డి.జె. వసంత్‌ సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ కొన్ని సన్నివేశాల్లో చాలా బాగుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. రిచ్‌నెస్‌ కనిపించింది. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో.

ఆల్రెడీ హిట్టయిన సినిమాని తెలుగులో రీమేక్‌ చేయడం అన్నిసార్లూ ఈజీ కాదు. అయితే భీమనేని ఇలాంటి విషయాల్లో దిట్ట. ఇక్కడా తన మార్క్‌ చూపించాడు. మాస్‌ హీరోతో మాస్‌ సినిమా మాస్‌కి అవసరమైన రీతిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. హీరో నుంచి డాన్సుల్లో, యాక్షన్‌లో దర్శకుడికి ఫుల్‌ సపోర్ట్‌ లభించింది. కామెడీ వరకూ కూడా ఇబ్బందులేమీ లేవు. కొత్త దనం గురించి ఇలాంటి సినిమాల్లో ఆశించడానికేమీ ఉండదు. ఫస్టాఫ్‌ రొమాంటిక్‌గా, సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. అక్కడక్కడా ఫైట్స్‌, అక్కడక్కడా డాన్స్‌లు, కావాల్సినంత కామెడీతో ఫస్టాఫ్‌ ఉంటే, సెకెండాఫ్‌లో కొంచెం వేగం తగ్గిందనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా మాస్‌ అడియన్స్‌కి ఓకే అనిపిస్తుంది. టార్గెట్‌ ఆడియన్స్‌ వాళ్ళే గనుక, సినిమాకి మాస్‌ బలం బాగానే ఉండొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే : మరీ అంత స్పీడ్‌ కాదుగానీ ఓకే.

అంకెల్లో చెప్పాలంటే: 3 / 5

మరిన్ని సినిమా కబుర్లు
interview