Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue155/441/telugu-serials/atulitabandham/atulita-bandham/

ఐశ్వర్య నిద్ర లేచేసరికి ఏడు దాటిపోయింది. లేచిన వెంటనే మెయిల్ చెక్ చేసుకోవటం అలవాటు. ఎదురుగా మెయిల్ కనిపించగానే ఆమె గుండె ఝల్లుమంది... ఆనందంతో ఒడలు పులకరించింది. అనుకున్నట్టుగానే తాననుకున్న ఉద్యోగం వచ్చేసింది. మెయిల్ పంపించారు కంపెనీ వాళ్ళు.  

ఉత్సాహంగా ఈ కబురు చెప్పటానికని కార్తీక్ సెల్ కి ఫోన్ చేసింది ఐశ్వర్య. రింగ్ అవుతోంది కానీ ఎత్తటం లేదు... సైలెంట్ మోడ్ లో పెట్టి నిద్రపోతున్నాడేమోనని అనుకుంటూ అసంతృప్తిగానే లేచి బ్రష్ చేసుకొని హాల్లోకి వచ్చి, టీవీ ఆన్ చేసింది.

కాఫీ తాగాలనిపించి, చూస్తే ఫ్రిజ్ లో పాలు లేవు.  కారిడార్ లోకి వచ్చి వాచ్ మాన్ కోసం బెల్ నొక్కింది.

“ఏమ్మా, ఈ ఫ్లాట్ లోకి కొత్తగా వచ్చినట్టున్నారు కదూ?  నారాయణ  ఇంట్లో లేడమ్మా. ఏం కావాలి?” అడిగింది అన్నపూర్ణ. దంపతులిద్దరూ అప్పుడే గుడికి వెళ్లి వస్తున్నారు. 

“ఆ... అదీ... సారీ ఆంటీ... ఏమీ వద్దు...” లోపలికి  వెళ్లి తలుపు మూసుకోబోయింది ఐశ్వర్య.

“పిన్నీ, ఓ బిందెడు మంచి నీళ్ళు ఇవ్వరూ? నిన్న నారాయణ లేక నీళ్ళు పట్టలేకపోయాం...” మూడో ఫ్లాట్ మేనక వచ్చింది.

“దాందేముంది మేనకా, బిందె తెచ్చుకోమ్మా, ఇస్తాను. అమ్మాయ్, కాఫీ తాగావా?” ఐశ్వర్యను ఉద్దేశించి అన్నది అన్నపూర్ణ.

“ఇం...ఇంకా లేదండీ... అదే... పాల పేకెట్ కోసం... నారాయణ ఉన్నాడేమోనని...” నసిగింది.

“అవునా, ఉండమ్మా పాల పేకెట్ నేనిస్తాను... అవునూ అబ్బాయ్ కనిపించటం లేదు...”

“అవునండీ, సాయంత్రం వస్తాడు...”

అన్నపూర్ణ తెచ్చిచ్చిన పాలు కాచుకుని కాఫీ కలుపుకుని తాగి హాయిగా నిట్టూర్చింది ఐశ్వర్య. పక్కింట్లో ఇద్దరూ వృద్ధ దంపతులే ఉంటున్నారు కాబోలు... ఎంత మంచావిడ ఆంటీ! 

స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేసరికి తలుపు తట్టిన శబ్దం అయింది. తెరిచి చూస్తే ఉప్మా ప్లేట్ తో అన్నపూర్ణ నిలబడి ఉంది. 

“రండి ఆంటీ... లోపలికి  రండి... అయ్యో ఎందుకు తెచ్చారు ఆంటీ? వద్దు...” ఇబ్బందిగా మొహం పెట్టింది.

“ఏమ్మా, తల్లిలాంటి దాన్ని నా దగ్గర మొహమాటం ఏమిటి చెప్పు?”

“అది కాదు... నాకు... నాకు... ఉప్మా సయించదు...” 

ఫక్కున నవ్వింది అన్నపూర్ణ. 

“ఓ అదా? ఉప్మా సయించదు అని మీ బాబాయ్ దగ్గర అనేవు... ఒప్పుకోరసలు... నా చేతి ఉప్మా అంటే ఆయనకి  అంత ప్రీతి మరి! ఆ, అన్నట్టు నువ్వు ఆ ఆంటీ పిలుపు అటక మీద పడేసి పిన్నీ అని పిలవాలి. ఈ బిల్డింగ్ హోలు మొత్తం మీద అందరికీ నేను పిన్నినీ, ఆయన బాబాయీ...”

“ఊ... అదికాదు ఆంటీ... సారీ పిన్నీ... మా హాస్టల్ లో భీముడు ఉప్మా చేసిన రోజు బయటే టిఫిన్ తినే వాళ్ళం...పెసరట్ ఎంత రుచిగా చేసేవాడో, ఉప్మాని తగలెట్టేసేవాడు. అబ్బా, ఏం ఉప్మా పిన్నీ,  ఉండలు ఉండలుగా ఉండి, భయంకరమైన రుచితో...”

“అలాగా? పాపం మీ భీముడు మిమ్మల్ని బెదరగొట్టేసి ఉంటాడు. ఉప్మా రవ్వను దోరగా వేయించుకుని, పోపులో అన్ని దినుసులతో పాటుగా జీడిపప్పు ఎక్కువగా వేసి, ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించి, నీళ్ళు పోసి మరిగాక రవ్వ ఒక చేత్తో పోస్తూ, మరో చేత్తో కలియబెడితే ఉండలు కట్టదు. ఉడుకు పట్టగానే, ఆ పైన ఇంత నెయ్యి వేసి కలియబెడితే ఆ రుచే వేరు...ఒక్క స్పూన్ తిని చూడు... ఇక వదలవంటే నమ్ము...” 

అన్నపూర్ణ బలవంతం మీద స్పూనుతో నోట్లో పెట్టుకున్న ఐశ్వర్య, ఐదు నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేసింది, ‘యమ్మీ పిన్నీ, చాలా బాగుంది....’ అంటూ. 

“మంచమ్మాయివి తల్లీ! ఇంతకీ నీపేరు?”

“నా పేరు ఐశ్వర్య పిన్నీ!”

“కొత్తకాపురం కాబోలు...  అవునమ్మాయ్, కాపురం పెట్టించడానికి మీ పెద్దవాళ్ళు ఎవ్వరూ రాలేదా?” ఐశ్వర్య గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు అయింది.

“అదీ... అదీ... వస్తారు పిన్నీ...”

“ఊ... అబ్బాయి వచ్చాక మా ఇంటికి తీసుకురామ్మా... సరే, నేను వస్తాను మరి...” ఖాళీ ప్లేట్ చేతిలోకి తీసుకుంది అన్నపూర్ణ, ఐశ్వర్య వారిస్తున్నా వినకుండా.

“చాలా థాంక్స్ పిన్నీ... నాకు పనమ్మాయినీ, పాలబ్బాయినీ మాట్లాడి పెట్టాలి మీరు...” రిక్వెస్ట్ చేసింది.

“అంతగా చెప్పాలా? అలాగే... ఈరోజే కుదురుస్తాను ఐశ్వర్యా...” 

అన్నపూర్ణ వెళ్ళిపోగానే తలుపు మూసుకుని సోఫాలో కూలబడింది ఐశ్వర్య. 

అమ్మా, నాన్నా గుర్తు వచ్చారు. ఇలా కార్తీక్ తో కలిసి ఉంటున్నట్టు ఇంట్లో వాళ్లకి తెలియదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలియక మానదు... ఎవరి ద్వారానో తెలియటం కన్నా తానే తెలియజేయటం మంచిది.

రేపటినుంచీ, కొత్త ఉద్యోగానికి, కొత్తాఫీసుకు వెళ్ళాలి... ఉదయమే లేచి, ఇద్దరూ కలిసి పనులు, వంటా పూర్తి  చేసుకుని, బాక్సులు సర్దుకుని, ఎవరి ఆఫీసుకు వాళ్ళు...

అసలు కార్తీక్ తనాఫీసులో ఉద్యోగం వేయిస్తానని అన్నాడు, కానీ రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని తానే వారించింది. తన ప్రతిభతో ఉద్యోగం రాకపోతే అప్పుడు తప్పేది కాదేమో... ఏది ఏమైనా నేటి సమాజానికి ఈ ‘లివిన్ టుగెదర్’  కొత్తే.  ‘పెళ్ళి’ అనే వ్యవస్థకు అలవాటు పడిపోయిన వారు రియలైజ్ అవటానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఏమో...

కార్తీక్ ఫోన్ చేసాడు. సంబరంగా తన ఉద్యోగం విషయం చెప్పింది. 

“హార్టీ కంగ్రాట్స్ రా... నేను రాత్రికి వస్తాను. ఇంట్లో వాతావరణం ఏమీ బాగాలేదు. అమ్మ ఉదయం నుంచీ ఏడుపు మొదలుపెట్టింది... నాకూ మూడ్ సరిగ్గా లేదు, అర్థం చేసుకుంటావు కదూ?” అన్నాడు.

“ఓ, సారీ కార్తీ...”

“ఇట్ ఈజ్ ఓకే ఐశూ, మనం ఊహించిందే కదా... రాత్రి అన్నయ్య కూడా వచ్చాడు. ఇప్పటివరకూ వీళ్ళని వదిలి వెళ్ళలేదు కదా, ఇప్పుడు బట్టలు సర్దుకుని వచ్చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక గొడవ... ఏమిటో.. సరే... మళ్ళీ మాట్లాడతాను...” కట్ చేసేసాడు కార్తీక్.  ఐశ్వర్యకు మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది. ఏడుపు వచ్చింది... మళ్ళీ తన ఆశయాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు గుర్తు వచ్చి ధైర్యం తెచ్చుకుంది. కొత్తగా ఒక విషయం మొదలైనపుడు ఆ పనికి  ముందు అన్నీ అవరోధాలే ఉంటాయి. తర్వాత అందరికీ అర్థమౌతుంది, అలవాటూ అవుతుంది... పక్కింటి పిన్ని గుర్తు వచ్చి మనసు ఆహ్లాదంగా అయింది.

మరో అరగంట తర్వాత మళ్ళీ  మొబైల్ రింగ్ అవటంతో ఉలిక్కిపడి ఆన్సర్ చేసింది. 

“హాయ్ మధూ! ఆ... బాగున్నానే... కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈరోజు సాయంత్రానికి  వస్తాడు. ఏమిటీ, నిజమా? వావ్... వాటే వండర్? ఆ ఆఫీసు మా ఆఫీసుకు దగ్గరలోనే ఉంది... వచ్చేయవే... ఎప్పుడు జాయిన్ అవుతావు? వచ్చే వారమా? గుడ్... నా దగ్గర ఉండకూడదూ? ఓహ్, ఓకే... మన హాస్టల్ లోనేనా? సరే నీ ఇష్టం! వేరే ఇల్లు దొరికే దాకా అక్కడ ఉండు... నేను కూడా నీకు ఇల్లు వెదుకుతానులే... ఓ తమాషా చెప్పనా? ఈరోజు మొదటిసారి ఉప్మా ఇష్టంగా తిన్నాను... అదీ... మా పక్క ఫ్లాట్ లో ఓ ఆంటీ... ఉహు, పిన్ని ఉన్నారు...” మైమరచిపోయి మధూతో కబుర్లు చెప్పసాగింది ఐశ్వర్య.

***

“ఇప్పుడు ఒంటరిగా ఉద్యోగానికి ఎందుకమ్మా? పెళ్ళి చేసుకున్నాక చూడవచ్చు కదా?” వారింపుగా అన్నాడు అనంత రామయ్య. “మహిళకు ఆర్ధిక స్వాతంత్ర్యం చాలా అవసరం నాన్నా... మీ బాధ్యతను కాదనీ అనటం లేదు... ప్రస్తుతానికి జాయిన్ అవనీయండి...” మృదువుగా చెప్పింది మధుబాల.

“తెలిసినవాళ్ళకి, బంధువులకీ చాలా మందికి చెప్పాను నాన్నా, చెల్లాయి గురించి... తన పెళ్ళి గురించి మీరేమీ వర్రీ అవకండి.” అన్నాడు గిరి.“కాఫీ తీసుకోండి...” గిరి భార్య నిర్మల ట్రే లో అందరికీ కాఫీలు, మామగారికి పళ్ళ రసం తీసుకు వచ్చింది.“థాంక్స్ వదినా... నేను రాత్రి బస్ కి బయలుదేరతాను నాన్నా...” చెప్పింది మధుబాల.

“జాగ్రత్తమ్మా... నేను వచ్చి నీతో ఉండే వీలు లేదు... నాన్నగారిని చూసుకోవాలి కదా...” నిస్సహాయంగా అన్నది పూర్ణమ్మ. “ఇన్నాళ్ళూ ఒంటరిగానే ఉన్నాను కదమ్మా... అప్పుడు చదువూ, ఇప్పుడు ఉద్యోగం అంతే కదా? ఇల్లు దొరికే వరకూ హాస్టల్ లోనే ఉంటాను. ఏమీ భయం లేదు...” సముదాయించింది మధుబాల.

“మధూ, నీ చీరలు ఉతికి ఇస్త్రీ చేసి ఉంచాను, సర్దుకో...” చెప్పింది నిర్మల. “అయ్యో వదినా, నీకెందుకు శ్రమ? చాలా థాంక్స్...” కృతజ్ఞతగా అన్నది మధుబాల.చిన్నగా నవ్వింది నిర్మల, ఫర్వాలేదన్నట్టు.“ఇదిగో మధూ, ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో...” ఐదు వేలు తీసిచ్చాడు, గిరి.మౌనంగా అందుకొని బాగ్ లో పెట్టుకుంది మధుబాల.

***

“బుజ్జీ, నీ నిర్వాకమంతా తెలిసిందమ్మా... నీ అక్క చనిపోయి బాధని కలిగించింది, నువ్వేమో బ్రతికుండి వేదన కలిగిస్తున్నావు...పెళ్ళి కాకుండా ఓ మగవాడితో నువ్వు చేస్తున్నది కాపురం కాదు, అదేమిటో నా నోటితో కన్నతండ్రిగా నేను చెప్పలేను. కూటికి పేదను కానీ గుణానికి కాదు ఇంతవరకూ... అసలు  నిన్ను కన్న పాపానికి పరిహారంగా నాకు చచ్చిపోవాలని ఉంది. అయితే మంచం పట్టిన నా భార్యను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత  భర్తగా నాకుంది కనుక  ఆ పని చేయటం లేదు.ఇక నువ్వు ఇంటికి రాకు... నిన్ను చూసి నిజంగానే చచ్చిపోయే పరిస్థితిని తీసుకురాకు.ఇట్లు తిరుపతయ్య వ్రాలు.”

ఆరోజు పోస్ట్ లో ఆఫీసుకు వచ్చిన ఉత్తరాన్ని చూడగానే ఐశ్వర్య ముఖం పాలిపోయింది. అమ్మా, నాన్నా అంటూ మనసు ఆక్రోశించింది. కన్నీటి పర్యంతమై, ఇక పని చేయలేక వంట్లో బాగుండలేదని ఇంటికి వచ్చేసింది.ఇక తనకు కార్తీక్, మధూ తప్ప ఎవ్వరూ లేనట్టే... ఎంత నిర్దయగా రాసాడు నాన్న? ఆయన తప్పేమీ లేదులే, ఈ కర్కోటకపు సమాజానికి ప్రతినిధి అతడు. నిజానికి కార్తీక్ తో తానెంత సంతోషంగా ఉన్నదో చూస్తే తల్లిదండ్రులుగా ఎంతో సంతోషిస్తారు వాళ్ళు కూడా...ఈ ఆలోచనలతో మెల్లగా తేరుకుని, స్టవ్ మీద టీ కోసం నీళ్ళు పెట్టింది ఐశ్వర్య. “ఓయ్ ఐశూ... త్వరగా తలుపు తీయి...” పిలుపుతో పాటే కాలింగ్ బెల్ మ్రోగించాడు కార్తీక్.తలుపు తీసిన ఐశ్వర్యకు ఓ హగ్ ఇచ్చి, “కమ్మని యాలకుల టీ రమ్మని పిలిచింది, వచ్చేసాను...” అంటూనే మ్లానమైన ఆమె ముఖం చూసి, “ఏమైంది?” అన్నాడు అనుమానంగా.మౌనంగా తన చేతిలోని ఉత్తరాన్ని అందించింది.

చదివి, “ఓ, దీన్ని గురించేనా ఐశూ? ఇదింకా ప్రారంభమే... ముందు ముందు మరిన్ని ఎదుర్కోవాలి. మనం నమ్మిన సిద్ధాంతం కోసం ఎదుర్కోవాల్సిందే... కాకపోతే ఆయన నీ కన్నతండ్రి కాబట్టి నీకు అంత వేదన కలగటం సహజం... ఏదీ మరి? టీ తాగుదామా? వెళ్లి ముఖం కడుక్కు రా ఐశూ, టీ నేను చేస్తాను...” అన్నాడు అనునయంగా.అతని మాటలకు కరిగి నీరైంది ఐశ్వర్య. ఇలాంటి మంచివాడి గురించి ఎందుకో నాన్నకి భయాలూ, అనుమానాలు? అనుకుంటూ వాష్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. ఆమె వచ్చేసరికి ప్లేట్ లో బిస్కట్స్, టీ కప్పులు సిద్ధం చేసాడు కార్తీక్.“త్వరగా టీ తాగేస్తే బయటికి వెళదాం...” ఆమె బుగ్గ మీద చిటికె వేసి, టీ కప్పు అందించాడు.

***

‘పడతి జానకమ్మ పాణినే గ్రహియింప 
విరచినాడు శివుని విల్లునతడు 
భంగమొందె ధనువు యంగవించెనుసీత 
వరుడు రాము చేరి వధువు మురిసె!’ 

తాను వ్రాసిన ఆటవెలదిని రాగయుక్తంగా చదివి, ఆ పద్యమున్న కాగితాన్ని పూజామందిరంలో రాముడి పాదాల మీద ఉంచాడు విశ్వనాథం. ఆయనకి పద్యరచన చాలా ఇష్టం. అప్పుడప్పుడూ ఇలా రామాయణంలోని ఘట్టాలను రాసి రాముడికి అంకితం ఇస్తూ ఉంటాడు.

‘గౌతము భార్యా పాలిటి కామ ధేనువితడు 
ఘాతల కౌశికు పాలి  కల్ప వృక్షమూ...
సీతాదేవి పాలిటి చింతామణి యితడు...
ఈతడు దాసుల పాలి ఇహపర దైవము...
రామ చంద్రుడితడు రఘువీరుడు...
కామిత ఫలములీయ గలిగేనిందరికీ...’

ఆయన పద్యం వినగానే అప్రయత్నంగా పాడింది అన్నపూర్ణ. “పద్యం వింటూ ఉంటే అన్నమయ్య కీర్తన గుర్తు వచ్చింది... ఎంత బాగా రాసారు?” ఆయన ముఖంలోకే ఆరాధనగా చూసింది, అన్నపూర్ణ.

“చక్కగా పాడావు అనూ... సామాన్య మానవుడిగా భూమి మీద వసించిన నారాయణుడే రాముడు. ఆయన పడినన్ని కష్టాలు, సాధ్వి సీతమ్మ అనుభవించినంత వేదన ఎవరూ పడి ఉండరు. ప్రతీ దంపతులకూ ఆ ఆదిదంపతులే ఆదర్శం అనూ... ఎంత వేదనలో ఉన్నా ఆయన్ని తలచుకుంటే చాలు ఎంతో సాంత్వన!” భక్తి  పారవశ్యంతో చేతులు జోడించాడు విశ్వనాథం.

“పిన్నీ...” పిలుపుతో పాటుగా లోపలి జొరబడింది ఐశ్వర్య, మధుబాల చేయి పట్టుకుని.

“ఐశ్వర్యా, రామ్మా... ఏమిటీ ఉదయమే లేచేసావా? ఆదివారం కదా, ఇంకాసేపు పడుకుంటావు కదా అనుకున్నాను!” నవ్వుతూ ఎదురు వెళ్లి ఆమె చేయి పట్టుకుంది అన్నపూర్ణ.

“ఈ అమ్మాయి...?”

“పిన్నీ, ఇదిగో, ఇదే నా ఏకైక బెస్ట్ ఫ్రెండ్... మధుబాల... ఆదివారం కదాని ఇంటికి పిలిచేసాను... మధూ, చెప్పాగా పిన్నిగారు...” మురిపెంగా పరిచయాలు చేసేసింది ఐశ్వర్య.

“మధూ...నీ స్నేహితురాలు నిన్ను తలచుకోని క్షణం ఉండదు అంటే నమ్ము... చాలా సంతోషంగా ఉందమ్మా... రా.. ఇలా కూర్చో... ఉండండి, మీ బాబాయ్ పూజ అయిపోవచ్చింది... ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను...” అంటూనే లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ.

“ఈరోజు కార్తీక్ టూర్ వెళుతున్నాడు కలిసి గడుపుదాం అన్నావు., రాగానే, వీళ్ళ ఇంటికి తీసుకు వచ్చావు... ఏమిటే ఇదీ? నాకు కొత్తగా ఉంది... మళ్ళీ కాసేపాగి వద్దాం...” చిన్న గొంతుతో మొహమాటంగా అన్నది మధుబాల.

“ఏం కాదు... నాకు దొరికిన కొత్త ఆత్మీయులని పరిచయం చేయవద్దూ? అసలు నువ్వు  రాత్రే వచ్చేయాల్సిందే... చక్కగా కబుర్లు చెప్పుకొనే వాళ్ళం కదా!”

“నిన్న ఆఫీసులోనే బాగా ఆలస్యం అయిపోయింది ఐశూ, చెప్పాను కదా... ఇంతకూ నువ్వెలా ఉన్నావు?”

“ఎలా ఉన్నాను? నువ్వే చెప్పాలి మరి!”

“అప్పటికన్నా బాగున్నావు, సంతోషంగా ఉన్నావు కదా! అందుకే కాస్త నిండుదనం వచ్చింది...” పరీక్షగా చూస్తూ చెప్పింది మధుబాల.

“జీవితం ఎంతో సంతృప్తిగా ఉంది మధూ... ఒక్కటే బాధ నాకు...అదే, అమ్మానాన్నలకి దూరమయ్యానని. వాళ్లకి నేను చేసిన పని నచ్చలేదు... కానీ ఏమీ చేయలేను. ఈ ఆనందాన్ని దూరం చేసుకోలేను...” నిస్సహాయంగా చెప్పింది ఐశ్వర్య.

“అమ్మా నాన్నలే కదా, తప్పకుండా వాళ్ళు  నిన్ను పెద్ద మనసుతో క్షమించే రోజు వస్తుందిలే, బాధపడకు...” ఐశ్వర్య భుజాల మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కింది మధుబాల.

“తీర్థం, ప్రసాదం తీసుకోండి తల్లులూ!” విశ్వనాథం వచ్చాడు.

పచ్చని దబ్బపండు మేని ఛాయ, గోధుమ రంగు పట్టు ధోవతి కట్టుకొని ఉత్తరీయం భుజాల చుట్టూ కప్పుకున్నాడు. నుదుట విభూది రేఖల మధ్యలో ఉదయ భాను బింబమల్లే ప్రకాశిస్తున్న ఎఱ్ఱని కుంకుమ బొట్టు. 

భక్తిగా లేచి తీర్థమూ, ప్రసాదమూ తీసుకున్నారు ఇద్దరూ. తనను ఆయనకు ఐశ్వర్య పరిచయం చేయగానే అప్రయత్నంగా వంగి ఆయన పాదాలకు నమస్కారం చేసింది మధుబాల. 

“ఇష్ట కామ్యార్థ సిద్ధి రస్తు!” అని దీవించి, కూర్చోమని చెప్పి లోపలికి  వెళ్ళారు.

“అమ్మాయ్, పులిహోర, చక్రపొంగలి చేసాను. ఇక్కడే తింటారా? లేక బాక్స్ లో పెట్టి ఇవ్వనా?” ఆప్యాయంగా అడిగింది అన్నపూర్ణ.

“అబ్బే, వద్దు పిన్నీ, నేను టిఫిన్ కి దోసెల పిండి రెడీ చేసాను...” చెప్పింది ఐశ్వర్య.

“ఇది దేవుడి ప్రసాదం కదా, వద్దని అనకూడదు. సరే, బాక్స్ లో పెట్టి ఇస్తా తినండి ఇద్దరూ.. ప్రస్తుతానికి మంచి కాఫీ ఇస్తాను... సరేనా?”

ఐదే ఐదు నిమిషాల్లో ఘుమఘుమలాడే కాఫీ కప్పులతో వచ్చింది అన్నపూర్ణ. లొట్టలేస్తూ తాగేసి, ప్రసాదాల కారియర్ తీసుకుని మళ్ళీ వస్తామంటూ మధుబాలతో సహా తన ఫ్లాట్ లోకి దూరిపోయింది ఐశ్వర్య.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam