Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srinivas the soldier

ఈ సంచికలో >> కథలు >> పున: ప్రతిష్ఠ

punapratishta

ఆగకుండా మోగుతున్న సెల్ కోయిల కూతతో నిద్రాభంగం అయింది... సమయం ఎనిమిది గంటలని ఎదురుగా ఉన్న గడియారం చూపిస్తోంది...బారెడు  పొద్దెక్కిన విషయం కిటికీలోంచి బెడ్ మీదికి పడ్తున్న సూర్య కిరణాలను చూస్తే తెలుస్తోంది....ప్చ్... రాత్రి  సినిమా స్టోరీ సిటింగ్ వల్ల బాగా లేటుగా వచ్చాను...

హాల్లోకి వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలూ కనబడ్డారు... శుభ్రంగా తలంటు పోసుకొని, కొత్త బట్టలు కట్టుకుని... శ్రద్ధగా... వేప పూత వొలుస్తూ... అప్పుడు గుర్తుకొచ్చింది... ఇవాళ ఉగాది పండుగ అన్న విషయం...పిల్లల కన్నా ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం… అందునా పండుగ రోజున... ఎందుకో గిల్టీగా అనిపించింది.. దేవుడి గదిలోంచి వస్తున్న అగరొత్తుల వాసన, వినిపిస్తున్న ఘంటా నాదం ఆ గిల్టీనెస్ మరింత పెంచాయి..

కాఫీ కోసం నాలుక పీకుతున్నా...పండుగ రోజు కూడా బెడ్ కాఫీ అంటే శ్రీమతి చూసే చూపు గుర్తొచ్చింది... దాంతో బలవంతంగా బాత్రూం లోకి దూరి, షాంపూ స్నానంతో బయటకు వచ్చాను...శ్రీమతి గొంతులోంచి శ్రావ్యంగా లలితా సహస్ర నామ పారాయణం వినిపిస్తోంది... అందుకని ఎక్కువ శబ్దం కాకుండా వంటింట్లోకి దూరి, కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చాను... అలవాటు ప్రకారం టి.వి. ఆన్ చేసి న్యూస్ విందామంటూ కూర్చున్నాను... పూజ పూర్తయిన మా ఆవిడ తులసి కోట దగ్గరకు వెళుతూ "ఈరోజు పండగ... గుర్తుందిగా..." అంది... దాని అర్దం "ఇవాళైనా పాడు న్యూస్ వదిలేసి పూజ చేసుకోండి" అని.. ఏమాటకామాటే చెప్పుకోవాలి... నా శ్రీమతి టి.వి. చాలా తక్కువగా చూస్తుంది... చాగంటి వారిదో, గరికపాటి వారిదో పురాణ కాలక్షేపం వస్తే మాత్రం వదలదు.. సీరియల్స్ జోలికి మాత్రం చస్తే వెళ్ళదు... ఇది తెలిసిన మా స్నేహితులందరూ  'నీ అంత అదృష్టవంతుడు ఈ తెలుగు దేశంలొ లేడోయ్' అంటుంటారు. ఆఖరుకి నేను రచనా సహకారం అందించిన సీరియల్సు, సినిమాలను కూడా పట్టించుకోదు...'ఏముంది? ఒక పుణ్యమా... పురుషార్దమా...' అంటూ తీసి పారేస్తుంది.. కూడు పెడుతున్న వాటిని, అందునా నా సాహితీ పటిమని గుర్తించక పోవటం ఉక్రోషం కలిగించినా, వాస్తవానికి నాదీ అదే అభిప్రాయం కావటంతో.. మరేమీ అనను. 

కాఫీ తాగటం పూర్తి చేసి, దేవుడి గదిలోకి దూరాను. పట్టు పంచె కట్టుకొని అందంగా అలంకరించిన దేవుడి మందిరం ముందు కూర్చొని ఒక అరగంట పాటు పూజాదికాలు కానిచ్చాను ... మనసుకు నిజమైన ప్రశాంతత, తనువుకు పవిత్రత అప్పుడే చేకూరినట్టనిపించింది... ఈ నగర జీవితంలో పనికి మాలిన వ్యవహారాలన్నింటికీ సమయం ఉంటుంది గానీ, దేవుని ముందు కూచోవాలంటే పట్టుమని పది నిముషాలు కూడా దొరకదు... ఈ రోజు ఉగాది కనుక, ఇవాళ్టి నుంచైనా జీవన శైలి మార్చుకోవాలి అని గట్టిగా అనుకున్నాను... మరో పక్క మనసు 'ఈ నిర్ణయం గతేడాది అనుకున్నదే.... కుక్క తోక వంకర...’ అని వెటకారం చేస్తూనే ఉంది.

పూజ అయిన వెంటనే.. శ్రీమతి ఇచ్చిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాను. షడ్రుచుల సమ్మేళనంతో, జీవితానుభవాలన్నిటినీ సమ దృష్టితో తెలియ జేసే ఇటువంటి గొప్ప పండుగ బహుశా ఏ యితర ప్రాంతంలోనూ, ఏ యితర దేశంలోనూ లేదేమో... అనిపించింది….

ఎడ తెరిపి లేకుండా లేండ్ లైను, మొబైల్ ఫోన్లు మోగుతూనే ఉన్నాయి... ఉగాది శుభాకాంక్షలు చెప్పే బంధువులు, సన్నిహితుల కాల్స్ తో... హేపీ టెల్గూ న్యూ యియర్, హేపీ ఉగాడీ అంటూ వచ్చే మెసేజ్ లతో మొబైల్సు మాటి మాటికీ కుయ్ కుయ్ మంటున్నాయి.  ప్రొడ్యూసర్ గోపాల్ నుంచి ఫోన్... కొత్త సినిమా స్టోరీ సిట్టింగు కోసం నగరం బయట్ రిసార్ట్స్ బుక్ చేసామని, మధ్యాహ్నం నుంచే రావాలని... సరే.. అనే లోపు గుర్తొచ్చింది - ఈ రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో సాంస్కృతిక శాఖ వారి ఆద్వర్యంలో జరిగే ఉగాది ఉత్సవాలలో కవి సమ్మేళనంలో పాల్గొనాల్సి ఉందన్న విషయం. అదే విషయం ఆ నిర్మాతకి చెప్పాను... అన్యమనస్కంగా సరే అంటూ... రేపటి నుంచీ ఇక ఏ యితర కమిట్మెంట్సు పెట్టుకోమాకండి... స్టోరీ సిట్టింగ్ తొందరగా ముగించాలి మనం.... అన్నాడు.  సరే అన్నాను. 

సాధారణంగా 'కవి సమ్మేళనాల' వంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటాను... సమయం వృధా... పైగా.. ఆర్ధికంగా ఏ ప్రయోజనం ఉండదు.. మహా అయితే ఒక శాలువా కప్పడం తప్ప... కానీ, ఉగాది ఉత్సవాలు.. అందులోనూ ప్రభుత్వం తరపున కావటంతో మంత్రులు, ఉన్నతాధికారులు చాలామంది పాల్గొంటారు... ఆ పరిచయాలు తర్వాత తర్వాత ఉపయోగపడ్తాయి... అనే ఉద్దేశ్యంతో సాంస్కృతిక శాఖ వారు అడిగినదే తడవుగా సరే అన్నాను.

అంతలో ఫోన్ మళ్ళా మోగింది... పిల్లలు తీసారు... అమ్మా .. మామ్మ నుంచి ఫోను.. అంటూ వంటింట్లోకి పరుగుతీసారు... మా అమ్మ నుంచి ఫోను అయినా ... ముందు నా శ్రీమతే మాట్లాడి, తర్వాతే నాకు ఇస్తుంది... ముందు నేను మాట్లాడితే ఏదో ముక్తసరిగా మాట్లాడి, పెట్టేస్తానేమోనని ఈ ఏర్పాటు... పైగా అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒక పార్టీయే...శ్రీమతి మాట్లాడటం అయి పోయాక పావు గంటకి ఫోను నా చేతికి వచ్చింది... ఉగాది శుభాకాంక్షలు నాయనా.. నువ్వు ఎలా ఉన్నావు... ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మధ్యన లేటుగా వస్తున్నావట రాత్రుళ్ళు... అంటూ గుక్క తిప్పుకోకుండా అడిగింది... నేను బాగానే ఉన్న్నానమ్మా... నువ్వు ఎలా ఉన్నావు.. ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? అంటే.. నాకేం నాయనా నిక్షేపంగా ఉన్నాను... ఊర్లో అందరూ బాగున్నారు... ఉంటాను నాయనా… జాగ్రత్త… అని ఫోను పెట్టేసింది...

అమ్మకు నామీద ఉన్న కోపం చెప్పకనే చెప్పినట్లనిపించింది. ఊరికి నన్ను రమ్మంటుంది... ఊరు వదిలి తనని రమ్మంటాను... ఇద్దరి మధ్యా ఆ ఒక్క విషయం పైనే ఎప్పుడూ గొడవ.. అందుకని ఆమెను మాటల్తో నేనేం బాధ పెడతానో అని, మా ఆవిడే అమ్మతో ఎక్కువ ఫోను చేస్తుంటుంది... వీలున్నప్పుడల్లా ఊరు వెళ్ళి కలుస్తుంటుంది.

అమ్మతో ఫోను మాట్లాడిన తరువాత, ఉగాది పండుగ నాడు - పండు ముత్తయిదువ లాగా ముస్తాబయ్యే మా ఊరు గుర్తొచ్చింది.  మాది - కోనసీమలోని శ్రీరామ పురం అగ్రహారం... నాన్నగారు వేద పండితులు... ఘనాపాఠి. అంతే కాదు, గొప్ప పౌరాణికులు కూడా... దురదృష్టమో నాన్నగారు శ్రద్ధ పెట్టక పోవడమో.. కారణమేదైనా గాని, మా అన్నదమ్ములెవ్వరికీ ఆ వేద విద్య అబ్బలేదు. లౌకిక విద్యతో, ఉద్యోగాల వేటలో తలో మూలకీ చేరుకున్నాం.. శ్రీరామ నవమికైతే మా రామాలయంలో సీతారాముల కళ్యాణానికి గ్రామమంతా - చిన్నా పెద్దా తేడా లేకుండా హాజరయ్యేది.. ఆహితాగ్నులైన అగ్రహారీకులు మొదలు అందరూ సహ పంక్తి భోజనాలు చేసేవారు... ఎవరి ఆచార సంప్రదాయాలు వారు పాటిస్తూనే.. ఇతరులను గౌరవించే గొప్ప సంస్కృతి ఉండేది.

తెలుగు పండిట్ కోర్సు చేసిన వెంటనే ఊళ్ళో తెలుగు పండితునిగా ఉద్యోగం చేస్తున్న నాకు, అనుకోకుండా సినీ రచయితగా అవకాశం దక్కింది.. నేను రాసిన నాటకాలకు నంది అవార్డులు రావడంతో, సినీ రంగం నుంచి పిలుపు రావడం, ఉత్సాహంగా దాన్ని నేను అందిపుచ్చుకోవడంతో హైదరాబాదులో స్థిర పడి పోయాను... మొదట్లో శెలవులలోనో లేక శెలవులు పెట్టుకునో ఈ రంగంలో పని చేసిన నాకు, అవకాశాలు అధికంగా వస్తూండటం, ఆదాయానికి ఢోకా లేకపోవడం, అన్నిటికీ మించి ప్రతి వారినీ ఊరించే రంగుల సినిమా ప్రపంచం దగ్గరవటంతో... ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిగా నగరానికే అంకితమయి పోయాను.  సాహిత్య రంగంలో నా ప్రవేశాన్ని నాన్న గారు అభినందించినా, సినిమా రంగ ప్రవేశాన్ని హర్షించ లేక పోయారు.. కాని, ఏనాడూ తన అభిప్రాయాన్ని మాపై రుద్దే తత్వ కాక పోవటంతో... నాకు అది ఒక రకంగా అర్ధాంగీకారం గానే తోచింది.

సినిమా కథల సిట్టింగులకు ఒక టైమంటూ లేక పోవటం, ఒక ప్లేసంటూ కాకుండా అన్ని చోట్లకీ తిరగాల్సి రావడంతో... మా ఊరికి వెళ్ళడం రాన్రానూ తగ్గి పోయింది. పల్లె అందాల గురించి, పల్లెటూరి ఆత్మీయతల గురించి కవితలు, కథలు రాస్తున్నా, వాస్తవానికి వాటన్నింటికీ దూరంగా బతుకుతున్నానని, తెలిసి, అప్పుడప్పుడు మనసు అపరాధ భావనతో మూలుగుతుంది... మళ్ళీ కవితా గోష్ఠులు, కథా చర్చలతో కాలం పరిగెడుతూనే ఉంటుంది... అందులోనూ, నాన్నగారు పోయాక, ఊరికి వెళ్ళడం మరీ తగ్గి పోయింది. గత పదేళ్ళుగా కేవలం నాన్నగారి ఆబ్దీకానికి, అది కూడా పొద్దున్న బస్సుకి దిగి, సాయంత్రానికి ప్రయాణం కావడం జరుగుతోంది... ముత్తాతల నాటి పెద్ద మండువా ఇల్లు పాడై పోతోందని అమ్మ బాధ పడుతున్నా, అందరం తలో చోటా. తలో ఇల్లూ కట్టుకుని సెటిలై పోవటంతో, మా అన్నదమ్ములకు ఆమె బాధ పట్టించుకునే ఆసక్తి, తీరిక కొరవడ్డాయి.

తెలిసిన వాళ్ళు ఎవరయినా, 'మీరు ఉండనప్పుడు అయిన కాడికి అమ్మెయ్యొచ్చు కదా' అని అంటే, ఆ మాట సరదాకి కూడా మా అమ్మ దగ్గర ప్రస్తావనకి తెచ్చే ధైర్యం కూడా లేదు.. ఆ యింటి ఆత్మీయతలు, మండువా లోగిలి ముచ్చట్లు, వంటింటి సందళ్ళు, మూడు తరాలను చూసిన ఉయ్యాల బల్ల చేసే కిర్రు కిర్రు శబ్దాలు అమ్మకి తియ్యని అనుభూతులు... జ్ఞాపకాలు... అందుకే.. వయసు మీద పడినా, ఊరి వారి స్నేహంతో, దూరపు బంధువుల సాయం తోనో కాలక్షేపం చేస్తుంది తప్ప ఊరు దాటి రానంటుంది....

ఊరితో సంబంధాలు తగ్గి పోవడంతో... ఊరి వారితో అనుబంధాలు కూడా తెగి పోతున్నాయి... మా మావ గారిది కూడా దగ్గర్లోని ఊరే కావడంతో అప్పుడప్పుడూ మా ఆవిడ మాత్రం పిల్లల్ని తీసుకొని మా బావ మరుదుల ఇళ్ళకు, మా అమ్మ దగ్గరకు వెళ్ళి వస్తుంటుంది.. కానీ, అమ్మ ఏనాడూ ఏమి ఉందో, ఏమి తిందో చెప్పదు... ఏమిచ్చినా తీసుకోదు... ఉన్న ఆరెకరాల పొలం మీద వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే .. ఎందుకంటే.. కౌలు వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసే తత్వం కాదు అమ్మది.

నాన్న గారు పోయినా, అమ్మ మాత్రం ఆ ఊరు, ఇల్లు వదలడానికి సుతరామూ ఇష్ట పడక పోవడంతో ఆమెని ఎక్కువగా ఒత్తిడి చెయ్య లేక, ఆమెని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక సతమతమవుతుంటాను.. అమ్మ దగ్గర కొంత కాలం గడప లేక పోతున్నానన్న వేదన.. బిజీ లైఫుతో మరపుకు వస్తుంటుంది.

మరలా ఫోను రింగవటంతో.. ఆలోచనలను పక్కన పెట్టి, ఫోను అందుకున్నాను... అవతల లైనులో ఉన్నది- పద్మనాభం. మా ఊరి వాడు, నా క్లాసు మేటు - ఉన్నత విద్యా శాఖ మంత్రి..         ఉగాది శుభాకాంక్షలు చెప్పాడు. ఎంత బిజీగా ఉన్నా స్నేహితుని గుర్తుంచుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది.. ఈ రోజు ఉగాది కార్యక్రమానికి తనే ముఖ్య అతిథి... అందుకని, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందాం.. అంటూ ఫోను సంభాషణ ముగించాడు.  తను పి.జి. చేసి, మా దగ్గర ఊరిలోనే కొన్నాళ్ళు లెక్చరర్ గా చేశాడు. విద్యా రంగ సంస్కరణల కోసం ఉద్యమాలు చేసి, ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్.ఎల్.సి. గా గెలిచేడు.  రెండోసారి కూడా గెలవటంతో విద్యాశాఖ మంత్రి గానే అవకాశం దక్కింది. దాంతో...రాజకీయాల ఆకర్షణలో ఆదర్శాలకు తాత్కాలికంగానైనా విరామం ఇవ్వక తప్పలేదు. విద్యా రంగం అభివృద్ధి పట్ల శ్రద్ధ తగ్గి, కార్పొరేట్ కాలేజీల ప్రయోజనాలకే కొమ్ము కాస్తున్నాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. ఈ మధ్యనే మామగారి ప్రోద్బలంతో వ్యాపారం లోకి అడుగు పెట్టాడని, బినామీ పేర్లతో ఇంజనీరింగ్ కాలేజీలలో వాటాలు పొందాడని అభియోగాలు వచ్చాయి..  పదవీ లాలస, ఎంతటి ఆదర్శవంతుడినైనా ఎలా మార్చేస్తుందో అనిపిస్తుంది తనని చూస్తే.

పండగ సందర్భంగానైనా.. సిటీలో ఉన్న మా ఊరి స్నేహితులకి ఫోను చేసి మాట్లాడాలనిపించింది... ముందుగా సుబ్బరాజుకి ఫోన్ చేసాను.. చాలా సంతోష పడ్డాడు.. 'ఎన్నాళ్ళయింది శర్మా! నీ గొంతు విని, నీకు ఇంటికి ఫోన్ చేస్తేనేమో బయట ఉన్నావంటారు.. మొబైల్ కి చేస్తే స్విచాఫ్ వస్తుంటుంది... కలవడానికి కూడా తీరికలేనంత బిజీ అయిపోయావ్... అవునులే.. సినిమా మనుషులు కదా.. రాత్రీ పగలూ బిజీ... సరే! మాకెప్పుడు కాల్షీట్లు ఇస్తావు? అంటూ గడ గడా మాట్లాడేసాడు... ఆప్యాయత, అనుబంధం తన మాటల్లో కల గలిపి. "ఈరోజు సాయంత్రం రవీంద్రభారతి లో కార్యక్రమం ఉంది కదా.. నేను, పద్మనాభం వస్తున్నాం.. నువ్వు కూడా అక్కడకు రా.. అని పిలిచాను. తప్పకుండా వస్తానన్నాడు.   

సుబ్బరాజు, మా ఊరి పెద్ద సూర్యనారాయణ రాజు గారి అబ్బాయి.  వాళ్లది పెద్ద దివాణం. ఆడంబరాల మూలానయితేనేం, అయిన వాళ్ళ మోసాల వల్ల నయితేనేం.. ఆస్తులన్నీ కరిగి పోయి, ఆ దివాణం ఒక్కటీ మిగిలింది.  సుబ్బరాజు బాగా చదువుకుని, ప్రభుత్వోద్యోగం పొంది రెవిన్యూ డిపార్టుమెంటులో మంచి హోదాలో పని చేస్తున్నాడు . మొదట్లో సేవా భావంతో, పాప భీతితో ఉన్నా, క్రమంగా అవినీతికి, అక్రమార్జనకి అలవాటు పడ్డాడు. ఈ డిపార్టుమెంటులో పని చేయాలంటే మనం తినాలి... పైవాడికి పెట్టాలి... తప్పదురా! అంటాడు సమర్ధనగా.. దురలవాట్లకు కూడా లోనవుతున్నాడన్న విషయం తెలిసి వాళ్ళ తల్లి దండ్రులు మందలించారని.. ఈ మధ్యన ఊరు వెళ్ళడం కూడా మానేశాడు.. ఒకసారి ఎ.సి.బి. కి పట్టుబడ్డాడు.. మంత్రి గారికి కొంత ముట్టచెప్పి బయట పడ్డాడు. అయినా బుద్ధి మార లేదు.. ఆదాయం మీదున్న శ్రద్ధ పిల్లల మీద లేక పోవటంతో, వాడి కొడుకు, కూతురు కూడా చెడు అలవాట్లకు లోనై దారి తప్పుతున్నారని తెలిసింది... మిగతా విషయాలు ఎలాగున్నా, స్నేహితులంటే వాడికి ప్రాణం. అదే వాడిలో ఉన్న గొప్ప సుగుణం.

ఇక కుమార్ కి ఫోను చేయాలి అని అనుకుంటుంటే.. వాడి నుండే ఫోను వచ్చింది. పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొని, సాయంత్రం రవీంద్ర భారతిలో కలుసుకుందాం అనుకున్నాం. ఈరోజు కార్యక్రమం స్పాన్సరర్స్ లో వాడి సంస్థ కూడా ఉంది. కుమార్ వాళ్ళది మా ఊర్లో కిరాణా కొట్టు. మా చిన్నప్పుడు వాడిని కలిసే వంకతో వాళ్ళ కొట్టుకు వెళ్ళడం, అటుకులో, బెల్లమో తీసుకుని రావడం ఇంకా గుర్తే.. పైగా, వాళ్ళ నాన్నగారు శంకరం గారు మా రామాలయానికి ధర్మ కర్తగా ఉండి, వెండి దశావతార మూర్తులను తయారు చేయించారు. బి.కాం. చదివిన వెంటనే, కుమార్ హైదరాబాద్ వచ్చి చార్టర్డు అకౌంటెంటు కోర్సు పూర్తి చేసి పిల్లనిచ్చిన మామగారి సహకారంతో వ్యాపారంలో ప్రవేశించి అచిర కాలం లోనే అభివృద్ధి చెందాడు.  పిల్లలు, వ్యాపారాల బిజీలో పడి, దాదాపు తల్లి దండ్రుల గురించి పట్టించుకొనే తీరిక లేకుండా ఉన్నాడు.. ఊరు వెళ్ళితే ఖర్చయ్యే సమయం కూడా, వ్యాపారానికి వెచ్చిస్తే లక్షలు గడించ వచ్చనే స్థితికి చేరుకున్నాడు.

ఒకే ఊరికి చెందిన వాళ్ళం, క్లాస్ మేట్స్ నలుగురం ఒకే కార్యక్రమంలో కలుసుకోవడం కాకతాళీయమే అయినా - చాలా రోజుల తరవాత ప్రాణ శ్నేహితులను కలుసుకుంటున్న సంతోషం - సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేటట్లు చేసింది.

అనుకున్న సమయం రానే వచ్చింది.  అధ్యక్షుల వారి పరిచయం, ముఖ్య అతిథి పద్మనాభం ఉపన్యాసం అయ్యాక- అసలు కార్యక్రమం 'ఉగాది- కవిసమ్మేళనం' ప్రారంభమైంది.  అందులో ఈ సంవత్సరం తరపున ఉగాది పురస్కారాలు పొందిన యువకవులు కూడా కొందరు ఉన్నారు. 

ఒక్కొక్కరూ తమ కవితల్ని చదివి వినిపిస్తున్నారు. కోయిలల్ని, మావి చిగురుల్ని మరచి పోలేని భావకవులు, పండగనేది పెత్తం దార్లకే గాని, పేద వారికి కాదనే అభ్యుదయ కవులు, ఉగాది పచ్చడి చేసేది స్త్రీలు, తినేది పురుషులు- ఇది అనాదిగా జరుగుతున్న అణచివేతకు సాక్ష్యం - అంటున్న స్త్రీ వాద కవయిత్రులు - ఇలా సాగి పోతుండగా, నా పేరు వినిపించింది.

నా పేరు ప్రకటించడంతోనే, అప్పటివరకూ చప్పగా ఉన్న హాలు, చప్పట్లతో చైతన్యవంతమైంది.  కేవలం వచన కవిత్వం చదవకుండా, గేయ కవితను పాడటం నాకు అలవాటు.  అంతే కాదు... నాటక రంగ, సినీ రంగ రచయితగా ఉన్న పేరు వల్ల కూడా కావచ్చు, ప్రేక్షకులు నన్ను కరతాళ ధ్వనులతో స్వాకతించారు. "నవ ఉగాదివా? నవతకు నీవు నాందివా? ఓ యుగాది, మానవతకు నువు పునాదివా? నా మదిలో ప్రశ్నలకే నువు జవాబువా? నీవె ప్రశ్నవా?..." అంటూ, సమ కాలీన జాడ్యాల మీద, సామాజిక రుగ్మతల మీద గేయ కవితాస్త్రాన్ని సంధించాను.

ఊహించిన దాని కన్నా ఎక్కువగా ప్రేక్షకులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని మార్మోగే చప్పట్లతో తెలియ జేసారు.  నేను కూర్చున్న రెండు నిముషలకు కూడా సద్దుమణగలేదు. అప్పుడు వ్యాఖ్యాత - "ఇప్పటి వరకు ప్రముఖ కవుల కవిత్వాన్ని విని ఆనందించారు.  ఇప్పుడు నేటి ఉగాది పురస్కార గ్రహీత, యువ కవి, పల్లె వాసనల్ని పట్టి మనకందించే జానపద గాయకుడు రామా చారి తన గేయ కవిత్వం వినిపిస్తారు..” అంటూ ప్రకటించాడు.

సన్నగా, పొడుగ్గా, నామం పెట్టుకుని, లాల్చీ వేసుకున్న ఒక కుర్రాడు లేచాడు.  బహుశా ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుందేమో... ఆసక్తిగా అతని కేసి చూసాను.  ఆ యువకుడు "సభా సరస్వతికి నమస్కారం! మన తెలుగు తల్లికి, మా పల్లె తల్లికి, నా కన్న తల్లి దండ్రులకు సాష్ఠాంగ ప్రణామాలు అర్పిస్తున్నాను..." అంటూ సంస్కార వంతంగా చేసిన ఉపోద్ఘాతానికే హాలంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది.  అతను..."ఈ ఉగాది పండగ సందర్భంగా ఉగాది అంశంపై ఎందరో ప్రముఖ కవులు తమ అద్భుతమైన కవితల్ని వినిపించారు.  నేను మాత్రం మా పల్లెకి నిజమైన ఉగాది రావాలని తపిస్తూ రాసుకున్న స్వీయ గేయాన్ని వినిపించ బోతున్నాను..” అన్నాడు. ఆసక్తి కరమైన అతని  పలుకుల్ని సభ తన నిశ్శబ్దంతో ఆహ్వానించింది.  మహామహులైన కవుల మధ్య ఈ యువకుడేం చెప్పబోతున్నాడా అనే ఆశ్చర్యం, ఆసక్తి కూడా వారి నిశ్శబ్దంలో వ్యక్తమయింది. 

గొంతు సవరించుకున్న ఆ యువకుడు-

"ఏడాకెళ్ళావంటూ... ఏడుస్తున్నాదయ్యో...

నీ పల్లే తల్లీ - నీకోసం...

ఎప్పూడొస్తావంటూ... ఎదురూ చూస్తోందయ్యో...

నీ కన్నాతల్లీ- నీకోసం...

మా పల్లే పిల్లాగాడా.. పట్నామొచ్చీనోడా...

ఒక్కాసారీ విను నా పాటా...

పట్టారా నీ పల్లె బాటా...."

అంటూ తన గంభీర స్వరంతో గేయం ఆలపించేసరికి, సభా ప్రాంగణమంతా గంభీరత సంతరించుకొంది.  పిల్లా, జెల్లా సందడి లేక బోసి పోయిన పంతులు గారి మండువా లోగిలి, పంక్తి భోజనాల ఊసే కరువై పోగా బావురు మంటున్న వంటింటి సావిడి, అతని తొలి చరణంలో వినపడగానే.. నాకు తెలియ కుండానే, నా శరీరం వణికింది, గుండె కలుక్కుమంది... పిలిచి అన్నం పెట్టే పెద్దమ్మ నేడు పట్టెడన్నం లేక పస్తులుంటున్న కరుణ రసాత్మకమైన దృశ్యం మనసును కలచి వేసింది...ఊరంతా పెద్డమ్మా, పెద్దమ్మా.. అంటూ పిలిచే అమ్మ కళ్ళ ముందు మెదిలింది.  నా ప్రమేయం లేకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. వాటిని తుడుచు కొనే ప్రయత్నం చేయాలనిపించ లేదు.

ఆ యువకవి తన గేయం రెండో చరణంలో...మనుషులు మసలక, బూజు పట్టిన రాజుల దివాణం, చూసే దిక్కు లేక, సాకే మనుషులు రాక, ఘోషాలు పోయి, గోవులు పోయి, గిద్దెడు పాల కోసం కూడా దిక్కులు చూస్తున్న ముసలి తల్లిని వర్ణిస్తుంటే, నా ఎదురుగా ప్రేక్షకులలో ముందు వరుసలో కూర్చున్న సుబ్బరాజు ముఖం వివర్ణమవడం, అసంకల్పితం గానే, అతని చేయి కన్నీళ్ళు తుడవడం కన్పించింది. 

మూడో చరణంలో ఆ యువకుడు, పండగ నాడు కూడా సందడి కనిపించని షావుకారు ఇంటినీ, ఊరగాయ, చారుతో గడుపుతున్న దైన్యాన్ని, కొట్టు మూసేసి, ఊరిలో ఉల్లి పాయల బండి నడుపుతున్న వాస్తవాన్ని, దాన, ధర్మాలతో చితికి పోయి, దారీ తెన్నూ లేక, దీనావస్థలో ఉన్న చిత్రాన్ని కళ్ళకు కట్టేటప్పటికి, కార్యక్రమానికి పోషకుడిగా వ్యవహరిస్తూ అందరి అభినందనల్ని అందుకుంటున్న కుమార్ కి గుండె బరువెక్కిన దృశ్యం స్పష్టంగా కనబడుతోంది. ధారా పాతంగా కారుతున్న కన్నీళ్లు కోటును తడిపేస్తున్నాయి.

రైతన్నల ఇంట్లో కరువై పోయిన ధాన్యం, పల్లెల్లో బరువై పోయిన సేద్యం, చిన్న బోతున్న చేతి వృత్తులు, కూడు పెట్టని కుల వృత్తులు, పచ్చని చేలల్లో వెలుస్తున్న సెజ్జులు, పల్లె గుండెల్లో పెడుతున్న చిచ్చులు, కూలీలవుతున్న రైతులు, కూలి దొరకక వలస పోతున్న బతుకులు .... ఇలా  వల్లకాడవుతున్న పల్లె  వైనాన్ని, ఛిద్రమై పోతున్న పల్లె సంస్కృతిని గుండెలు పిండేలా.. ఆ యువకవి తన గేయంలో సాక్షాత్కరింప జేస్తుంటే, మంత్రిగా ఉన్న మా పురుషోత్తం మౌనంగా విలపిస్తుండటం నాకు స్పష్టంగా కనబడుతోంది.

ఏటికో సారైనా ఊరు రారేమంటూ, కాటికి పోయే కన్నోళ్ళను కనరేమంటూ ప్రశ్నిస్తూనే... అభిమానమడ్డొచ్చి మీ పెద్దోళ్ళు మీకు అసలు విషయాలేమీ చెప్పటం లేదంటూ... వాస్తవాన్ని విశదీకరిస్తున్న అతని పాట అక్కడున్న ప్రేక్షకుల గుండెల్లో బల్లెపు పోటుగా మారింది., భాగ్య నగరంలో దొరికే బంగారం కన్నా, అమెరికా దేశంలో పండే డాలర్ల కన్నా విలువైన ప్రేమాభిమానాలు పల్లె తల్లి పంచే బహుమానాలని- అతను ఎత్తి చూపుతుంటే, అతని ముఖం లోకి సూటిగా చూసే ధైర్యం ఎవరికీ లేదని, వాలుతున్న కళ్ళూ, రాలుతున్న కన్నీళ్ళూ చెపుతున్నాయి.        

"పల్లే దేశానికి పట్టు కొమ్మన్న నేతల మాటలు నీటి మూటలయ్యాయని, రైతు రాజయ్యే రోజొస్తుందని ఎదురు చూసీ చూసీ, కళ్ళూ కాయలు కాసాయని, తల్లి దండ్రులంటే దైవ స్వరూపులనే పెద్దల మాటలు పెడ చెవిన పడ్డాయని..." అతను నిష్ఠూరంగా పాడుతుంటే.. నిలువెల్లా గాయాలైన పల్లె తల్లీ, గుండెల్లో మౌనంగా బాధలు  నింపుకున్న తండ్రీ, తల్లీ ప్రతి ఒక్కరి ముందూ ప్రత్యక్షమవుతుంటే... ఒకరికి తెలియకుండానే ఒకరు మౌనంగా రోదిస్తున్నారు...

"నిచ్చేనల్లే పల్లేనెక్కీ ఎదిగీనోడా....

సచ్చీపోతన్నానూ... సూడంగా రావేరా....

మా పల్లే పిల్లాగాడా.. పట్నామొచ్చీనోడా...

ఒక్కాసారీ విను నా పాటా...

పట్టారా నీ పల్లె బాటా...."

అంటూ పాడుతున్న ఆ యువకుడి గొంతు దు:ఖంతో జీర బోవడం, సభ మొత్తం ఘొల్లుమనడం ఒకే సారి జరిగింది.

ఆగకుండా వినిపిస్తున్న కరతాళ ధ్వనులు, ఆపకుండా కారుస్తున్న కన్నీటి జడులు, ఆ యువకునికి అభినందనలు తెలియజేస్తోంటే... భేషజాలన్నీ వదిలి, ఆ కుర్రాణ్ణి ఆలింగనం చేసుకున్నాను. మంత్రినన్న మాట మరచిన పురుషోత్తం, కుమార్,  అప్పుడే వేదిక మీదికి వచ్చిన సుబ్బరాజు,  నన్ను అనుసరించారు.

ఉద్విగ్న భరిత వాతావరణం నుంచి సభికులు తేరుకోడానికి చాలా సమయమే పట్టింది.  ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య... " ఈ యువకుడు రామాచారి, సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యుడు.  యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్... అయినా, తన పాటలతో సామాన్యులలో చైతన్యం తేవాలని, పల్లె తల్లి సేవలో పునీతం కావాలని, అతని స్వగ్రామం .. శ్రీరామ పురానికే అంకితమవుతున్న నిజమైన అభ్యుదయ వాది….అంతే కాదు, తనకు పురస్కారంగా లభించిన ఏభై వేల రూపాయలను తన ఊరిలో రామాలయ పునర్నిర్మాణానికి వినియోగిస్తున్న ఆదర్శ వాది... " అంటూ.. వ్యాఖ్యాత గొంతు వినిపిస్తుంటే, మేం నలుగురం ఆశ్చర్యపోయాం... సంతోషం, సందేహం కలగలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తోంటే, ఆ కుర్రాడిని అడిగాను..." బాబూ! నీ ది ఏ  శ్రీరామపురం?" అని.   "కోనసీమ లోదండీ... అమలాపురం దగ్గర.." అన్నాడు అతను. అంటే, మా ఊరే... మరింత ఆశ్చర్యంతో అడిగా... "ఎవరబ్బాయివి?" అని. "రామాలయం అర్చకులు శేషాచార్యులు గారి అబ్బాయినండీ...." అన్నాడు. అంతే... "మా కళ్ళు తెరిపించావయ్యా...చిన్న వాడివయినా, పల్లెనీ, తల్లినీ మా కళ్ళముందుంచావు, మా కర్తవ్యం గుర్తు చేసావు..." అంటూ నలుగురం, ఆ అబ్బాయిని మరో సారి హత్తుకున్నాం. 

ఆ రాత్రికి మా ఇంట్లోనే అతనికి భోజనం ఏర్పాటు చేసాను.  నా స్నేహితులు ముగ్గురినీ కూడా సకుటుంబంగా ఆహ్వానించాను. ఛిద్రమైన మా పల్లె, మరింత శిథిలమై పోకూడదని నలుగురం నిర్ణయం తీసుకున్నాం. మర్నాడే, పురుషోత్తం, మా గ్రామంలో పాఠశాల, కళాశాలల అభివృద్ధికి అక్కడే మకాంవేసి, కృషిచేయడానికి ఊరికి బయల్దేరాడు.  నేను అమ్మకు ఫోన్ చేసి, ఊరు వస్తున్నానని చెప్పాను... సకుటుంబంగా, శాశ్వతంగా అక్కడే ఉండటానికి.

సుబ్బరాజు స్వచ్ఛంద పదవీ విరమణకి అప్లయ్ చేస్తానన్నాడు... ఊరిలో దివాణానికి పూర్వవైభవం తేవడానికి, ఆ దివాణంలో ఉచిత వైద్యశాల ఏర్పాటు చేయడానికి. గుప్తా వ్యాపారాల ఆకాశం నుంచి, వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు, గ్రామంలో స్థానికి వనరులను వినియోగిస్తూ, ఉపాధి కలిగించే విధంగా పరిశ్రమల స్థాపనకు ప్రణాళిక సిద్ధం చేసాడు.

శ్రీరామనవమికి వారం రోజుల ముందే అందరం కుటుంబాలతో సహా గ్రామానికి చేరుకున్నాం.  సీతారాముల కళ్యాణానికి దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేసాం. ఆ ఊరినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారందరికీ ఫోన్లు ద్వారా కళ్యాణానికి రావాలని ఆహ్వానించాం... సీతారాముల కళ్యాణానికి ఊరంతా తరలి వచ్చింది.. సహపంక్తి భోజనాలతో సోదర భావం మరలా వెల్లి విరిసింది... మా పల్లె మురిసింది.

పాడుపడి, శిథిలమైపోతున్న రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  అది మా గ్రామ పున:ప్రతిష్ఠకు కూడా శంకుస్థాపనే... ఊర్లో ఉండగా.. నాటక సమాజాన్ని నడిపే సుబ్రహ్మణ్యం ఫోన్ చేసాడు... "శర్మ గారూ! ఎంత ట్రై చేసినా,  మీ ఫోన్ దొరకట్లేదు..ఎక్కడున్నారు?  నంది నాటకోత్సవాల పోటీకి  మీరు మాకు ఒక కొత్త నాటకం రాసిపెట్టాలి..." అన్నాడు. "తప్పకుండా... టైటిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను..."పున:ప్రతిష్ఠ"... రాయటం పూర్తయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను" అంటూ  ఇంట్లోకి నడిచాను, మూలపడిన నాన్నగారి రాతబల్ల శుభ్రం చేయడానికి. 

మరిన్ని కథలు
asalainapanduga