Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue157/445/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

కొండకోనల వెంట ప్రతిధ్వనిస్తున్న సింహ గర్జన వింటూ వీరావేశంతో తన ఖడ్గం దూసాడు ధనుంజయుడు.

‘‘భద్రా! సింహం మన హయము వైపు పోతున్నట్టున్నది. అది వాటి మీద దాడి చేయక ముందే దానిని నిర్జింప వలె. నీవిచటనే ఉండుము.’’ అంటూ వేగంగా కదిలాడు. కాని వెంటనే అతడ్ని అడ్డుకుంది భద్రాదేవి.

‘‘ప్రభూ! తొందర వలదు. ఒకింత శాంతించండి’’ అంది.

విభ్రాంతి చెంది చూసాడు ధనుంజయుడు.

‘‘ఏమంటివి భద్రా! శాంతించ వలెనా? మన అశ్వములు ప్రమాదముననున్నవి. సింహము వాటిని చంపి తినుటకు పోనున్నది. చూస్తూ శాంతముగా ఉండమందువా?’’ అనడిగాడు ఆవేశమున.

‘‘అయ్యో! నా ఉద్దేశము అది కాదు. నా మాట వినండి. అది హయము వైపు పోవుట లేదు’’ అంది భద్రా దేవి. ధనుంజయుడు సందేహ నివృత్తికి ఏదో అడిగే లోనే మరోసారి విన వచ్చింది సింహ గర్జన.

‘‘ఆలకించితిరా ప్రభూ! అది సింహ కిశోరమే గాని దాని గర్జనలో వేదన ధ్వనిస్తోంది. వేటాడే పరిస్థితిలో ఉన్నట్టు లేదు. బహుశ గాయపడి ఉండాలె. నేను పోయి జూచి వత్తును. మీరిచటనే వుండండి’’ అంటూ అపర్ణుడిగా వున్న భద్రా దేవి వడి వడిగా గర్జన విన వచ్చిన వైపు అడుగులు సారించింది.

ధనుంజయునికి ఏమీ అర్థం గాక మతి పోయినట్టు చూస్తున్నాడు. ఏమి యీ అమ్మాయి సాహసము? గర్జనను బట్టి అది బాగున్నదా, అనారోగ్యముగా నున్నదా అని ఎలా తెలుస్తుంది? సింహము... అందులోనూ గాయ పడిన సింహమైతే మరీ ప్రమాదము గదా... దాన్ని ఎదిరించి పోరాడగలదా? ఈ భద్రాదేవిలో మొండి తనము పెంకి తనము కూడ కగలిపి ఉన్నట్టున్నవే? పరి పరి విధాలా ఆలోచిస్తూ ఆమెను ఒంటరిగా వదలకుండా వెనకే తనూ వెళ్ళాడు.

అలా కొంత దూరము ముందుకెళ్ళి చెట్ల గుబురును దాటగానే ఎదురుగా దృశ్యమును గాంచి ఆశ్చర్య సంభ్రమాలతో ఉన్న చోటే చిత్తరువులా నిలబడి పోయాడు.

భద్రా దేవి చెప్పింది అక్షర సత్యమై కళ్ళ ముందు సాక్షాత్కరించటమే అందుక్కారణం. అతడున్న చోటుకు వంద ధనువుల దూరంలోనే ఉన్నదా కేసరి. కోడె వయసు సింహ కిశోరం. అది ముందుకు రాకుండా వెనక కాళ్ళ మీద కూచునుంది. కుడి పంజాపైకి లేపి ఉంచటంతో గాయం స్పష్టంగా కన్పిస్తోంది.

ఎలా దిగిందో గాని కోసుగా వుండే సన్నటి కట్టె దాని పంజాను చీల్చుకుని ఇటు నుండి అటు దూసు కెళ్ళి విరిగింది. గాయం పుండై బాధ పెడుతూంటే తట్టుకో లేక గర్జిస్తోంది. కొండకి అవతల లోతట్టు అటవీ ప్రాంతంలో సంచరించే ఆ సింహానికి గాయం ఎలా తగిలిందో ఎప్పుడు తగిలిందో తెలీదు. వేటాడ లేని పరిస్థితిలో చిక్కి సగమై వుంది. దారి తప్పి కొండ దారుల్లో ఇటు వచ్చేసి వుంటుంది. అదలా ఉంచితే`
ఆకలితో నక నక లాడుతున్న సింహం వద్దకి చేతిలో ఆయుధం కూడ పట్టకుండా నిర్భయంగా వెళ్తున్న భద్రా దేవిని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక కళ్ళప్పగించి చూస్తూండి పోయాడు ధనుంజయుడు.

విచిత్రం ఏమంటే` మొదట తనను సమీపిస్తున్న భద్రా దేవిని కౄరంగా చూస్తూ లేవటానికి ప్రయత్నిస్తున్న సింహం ఆమె చేయెత్తి వారిస్తూ తనను సమీపించ గానే సాధు జంతువులా తోకాడిస్తూ జాలిగా చూడనారంభించింది.

ఆ సింహం పరిస్థితికి చాలా నొచ్చుకుంది భద్రాదేవి. ఇసుమంత కూడ జంకు లేకుండా నిర్భయంగా చెంత కెళ్ళింది. దాని తల మీద చేయి వేసి వాత్సల్యంగా జూలు నిమురుతూ పంజా గాయాన్ని పరిశీలించింది. ‘‘అకటా... ఏమైనదిరా నీకు? ఎంతగా అడవికి రాజువయితే మాత్రం అంత చూసుకోకుండా పంజా విసిరితివా? కొద్ది సమయం ఓర్చుకొమ్ము. నీ గాయమును నేను గుణ పర్చెదనులే’’ అంటూ ధైర్యం చెప్పింది.
సింహం ఆమె పట్ల కృతజ్ఞతగా చూసింది. అది గమనిస్తున్న ధనుంజయునికి ఒక విషయం గుర్తుకొచ్చింది. కొన్ని రోజుల క్రిందట అపర్ణుడు తనను కలిసిన రోజు... మడుగు చెంత విశ్రాంతి కోసం ఆగినపుడు అలాగే కౄరమైన ఎలుగ్గొడ్లతో పూబంతితో చిన్నపిల్లలా ఆటలాడుతూ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు చూస్తే మృగ రాజే ఆమె ముందు       శునకంలా ప్రవరిస్తున్నాడు. సందేహం లేదు, ఈమెకు వశీకరణ విద్య ఏదో తెలిసి వుండాలి.

చూస్తూండగానే సమీప పొదల యందు గాలించి రెండు రకాల ఔషధి మొక్కల్ని పెకలించి తెచ్చింది భద్రా దేవి. చెంతకు రమ్మని ధనుంజయునికి సైగ చేసింది.

వెంటనే అటు నడిచాడు ధనుంజయుడు. సింహము తన పైకి దూకుతుందన్న సందేహంతో ఓ చేతిని ఖడ్గం పిడి మీదనే ఉంచి భద్రా దేవిని సమీపించాడు. కాని అతడ్ని చూసి కూడ మృగరాజు మునిలా మౌనం గానే ఉంది.. గాయమైన పంజాను ఎత్తి ఉంచి మూడు కాళ్ళ మీద కూచుని అలాగే వుంది. గాయాన్ని పరిశీలించాడు. ప్రమాదకరమైన గాయం. పంజాలో దిగ బడిన కొయ్య ముక్కను లాగి చికిత్స చేయాలి. గాయం నుండి చీమురసి ఓడుతూ ఈగలు ముసురుతున్నాయి.

‘‘సింహము కౄర జంతువు. అందరికీ తెలిసిన విషయమే. ఎంత గాయ పడినా మనిషి కంట పడగానే పంజా విసిరి ప్రాణం తీయక మానదు. అలాంటి ఈ కిశోరము నిను గాంచగనే శునకము వలె విశ్వాసము ప్రకటించుచున్నదే. ఇది ఏమి మాయ? దీని మర్మమేమి? నీకు వశీకరణ విద్యు ఏమన్నా తెలుసునా?’’ ఆశ్చర్యం నుండి తేరుకుంటూ భద్రా దేవిని అడిగాడు ధనుంజయుడు.

అవునన్నట్టు తల ఊపింది భద్రా దేవి.

‘‘ప్రభూ! తమకీ సందేహము స్ఫురించుట సహజమే. రాజవశ్యం, భూతవశ్యం, అస్త్రవశ్యం, మృగ సర్ప వశ్యమను పలురకముల వశీకరణ విద్యులున్నవి. నా తండ్రి గారు నా చిరు ప్రాయము నుండే నాకు ధైర్య సాహసములు నూరి పోసే వారు. ఒక్కతెనూ సంతానమగుట వలన కొడుకయినా కూతురయినా నేనే అని భావించి నను మగరాయునిగా పెంచారు. మీరు చూస్తున్న ఈ మగ వేషము ఇప్పుడు కొత్తగా ధరించినది కాదు. నా వూహ తెలిసినప్పటి నుండి ధరిస్తూనే వున్నాను.

నా తండ్రి గారు ఆయుర్వేద వైద్యులు అలాగే గొప్ప మంత్ర వేత్త కూడ. మూలికా సేకరణకు అడవులకు తోడుగా నన్ను మాత్రమే తీసుకెళ్ళెడి వారు. అడవులందు సంచరించు భూతములు గాని మృగ సర్పాదులు గాని నన్ను బాధింపకుండేందుకు నా చిరు ప్రాయమునే నాకు వశీకరణ మంత్ర విద్యలు కూడ నేర్పి సిద్ధంప జేసినారు. అందుకే అవి నన్నేమీ చేయ జాలవు. అలా పసి తనము నుండి అడవులు తిరిగిన అనుభవం గనుకనే ఈ అడవుల మృగ పక్ష్యాదుల గూర్చి సర్వం తెలియును. అయితే ఎలాంటి వశీ కరణము పని చేయని మృగ మొండు కలదు’’ అంటూ చెప్పటం ఆపింది భద్రా దేవి.

ఆసక్తిగా వింటున్న ధనుంజయుడికి ఆమె చివరి మాటలు ఆశ్చర్యం కలిగించాయి` ‘‘ఏమిటవి? వశ్యము గాని మృగమా... ఏమిటది?’’ అనడిగాడు.

‘‘అది ఖడ్గ మృగము.’’

‘‘ఖడ్గ మృగమా...’’

‘‘అవును ప్రభూ! అది ఖడ్గ మృగమే. ఏ మంత్ర శక్తికీ అది వశం కాదు. ఉక్కు కవచాల్లాంటి దాని చర్మము, బలమైన దాని ముట్టె మీది కొమ్ము మంత్ర శక్తిని క్షణంలో హరిస్తాయి. దాన్ని సంహరించుట కూడ కష్ట సాధ్యమైన పని. ఖడ్గ మృగము ఎదురు పడిన తప్పించుకు పోవుట తప్ప తెగించి పోరాడి దాన్ని జయింప లేము.’’

‘‘మరి నీ మచ్చల గుర్రం ఎక్కడిది? విచిత్రమగు ఈ జాతి అశ్వాల గురించి నేను విన లేదు.’’

‘‘అవును ప్రభూ! విని వుండరు. సూదిలా కొన దేరిన కర్ణము, పెద్ద కనులు, పొడవు ముఖం, బక్కపల్చని దేహం... ఈ జాతి వారువము మంగోలు ఎడారు భూముల సంచరించు సంచార తండా వద్ద మాత్రమే లభించును. నాకు పదేళ్ళ ప్రాయమప్పుడనుకొందును, ఒక తండాకు చెందిన కొందరు మంగోలులు భరత ఖండమును దర్శింప వచ్చినారు. వారి వద్ద ఈ హయమును జూచినాను. అప్పటికి నా ఢాకిని వయసు ఆరు మాసముల కూన. దాని వంటి మీద మచ్చలు నాకు నచ్చినవి. చూచుటకు గార్ధభ కూన వలె నున్నది వద్దని నా తండ్రిగారు వారించినారు. కాని అదే కావలెనని పేచీ పెట్టడంతో నా కోసం అయిదు వరహాలిచ్చి కొన్నారు. అప్పటి నుండి నా సొదరి వలె నాతో బాటే మా యింట పెరిగినది. అందుకే అది నా ప్రాణమై వున్నది. చూచుటకు బక్కగా వున్నను పరుగులో వాయు దేవునితో పోటీ పడ గలదు.’’ అంటూ భద్రా దేవి వివరిస్తుంటే మరొక్క మారు విస్మయానికి లోనయ్యాడు యువరాజు ధనుంజయుడు. ఇంకా అనేక సందేహాలున్నప్పటికీ ఇది సమయము కాదు గాబట్టి వాటిని పక్కన పెట్టి` ‘‘సరి సరి భద్రా! అవత పొద్దు వాలుచున్నది. ఇప్పుడేమి చేయ వలె?’’ అనడిగాడు.
‘‘దీని గాయమును గాంచితిరిగా ప్రభూ!’’ అంటూ సింహం జూలు నిమురుతూ దాని పంజాను చూపించింది భద్రా దేవి.

‘‘పాపము. వేటాడ లేక, ఆహారము లభించక చిక్కిశల్యయమైనది. నేను దీనికి చికిత్స నెరపెదను గాక, ఈలోపు మీరొక పని చేయవలె’’ అంది.

‘‘ఏమి చేయ వలెను?’’

‘‘మీరు పోయి ఏదో ఒక మృగమును వేటాడి తేవలె.’’

‘‘బాగా బాగు. ఏదో ఒకటియన ఎయ్యది?’’ వెంటనే అడిగాడు ధనుంజయుడు.

‘‘నీవు గజ రాజును వేటాడి ఈ మృగరాజుకి ఆహారముగా తెమ్మనిన నా వలను గాదు సుమా. ఏయిన` ఏనుగును చంప గలనుగాని ఇటకు మోసుకు రాలేను గదా.’’

‘‘అంత శ్రమ వలదులే ప్రభూ’’ అంది నవ్వుతూ భద్రాదేవి.

‘‘ఏ కొండ గొర్రెనో మేకనో వేటాడి తెచ్చిన చాలును.’’ అంది తిరిగి తనే.

‘‘మిత్రమా అపర్ణా! ఇది మిక్కిలి అన్యాయము గదూ? చంద్ర వంశ క్షత్రియుడను. పాండు వంశజుడను... కౄర మృగము నిర్దాక్షిణ్యముగా వేటాడి ప్రజా రక్షణ జేయు యువరాజును... అంతటి నన్ను ఒక కౄర మృగమును కాపాడుటకు సాధు జంతువు జంపి తెమ్మనుట న్యాయమా? మాకు నియమ విరుద్ధము గదా?’’ ఒకింత హాస్యం మేళవించి అడిగాడు.

‘‘ప్రభూ! ఈ నియమములు ఆచారములు అదిలో ఎక్కడివి? అన్నియు అవసరార్థము మనము ఏర్పరచినట్టివే గదా. ఒక జీవి మరో జీవిపై ఆధార పడుటయే గదా ప్రకృతి ధర్మము? ఏ జీవిని అయిననూ ఆపదలో ఆదుకొనుట మానవ ధర్మము. మనము ఈ సింహమును కాపాడుటలో దోషము లేదు.’’ అంది భద్రా దేవి. ఇక రాజీ పడక తప్ప లేదు  ధనుంజయునికి.‘‘సరి సరి. వాదులాటలో నిను జయించుట దుస్సాధ్యమని అర్థమైనది. పోయి వచ్చెద’’ అంటూ చర చరా అశ్వమున్న దిశగా వెళ్ళి పోయాడు.

కొద్ది సేపటికే అశ్వము పరుగెడుతున్న గిట్టల శబ్ధం విన వచ్చింది. చిన్నగా నవ్వు కొంటూ సింహము వంక చూసింది భద్రా దేవి.
‘‘ఏమిరా... నాతో నడువగలవా? రమ్ము...’’ అంటూ మడుగు వైపు దారి తీసింది. అంతే`

అంత వరకు మౌనంగా బుద్ధిగా కూచున్న సింహం లేచి మూడు కాళ్ళ మీద కుంటుతూ గుర్రు గుర్రున చప్పుడు చేస్తూ శునకము వలె అనుసరించింది.

మడుగు ఒడ్డున సింహాన్ని కూచుండ జేసింది భద్రా దేవి. ముందుగా తను తెచ్చిన రెండు రకాల ఔషధి మొక్కల్లో ఒక మొక్క నుండి కొన్ని ఆకులు కోసి అర చేతిలో బాగా నలిపింది. రసాన్ని పంజా గాయం మీద వెనక ముందు కూడ చక్కగా పిండింది. ఈ ఆకు పసరు పడిన శరీర భాగం తిమ్మిరెక్కి కొంత సమయం వరకు బాధ తెలీకుండా పోతుంది.

కొన్ని లిప్తల కాలం ఆగి`

జాగ్రత్తగా పంజాలో విరిగిన కొయ్య ముక్కను పట్టి లాగింది. సులువుగా అది వూడి వచ్చేసింది. నొప్పి తెలిసినట్టుంది చిన్నగా అరుస్తూ పంజాను వెనక్కు లాక్కుంది. దాని జూలు నిమిరి కళ్ళ లోకి చూసింది భద్రా దేవి.

‘‘ఓర్చుకోరా. అడవికి రాజువి ఆ మాత్రం బాధను ఓర్చుకోలేవా? ఇతర జంతువుల్ని వేటాడేప్పుడు ఈ నొప్పి నీకు తెలియదు కదూ.’’ అంటూ మాట్లాడుతూనే మడుగు నీళ్ళతో గాయానికి ఏర్పడిన చీము నెత్తురు అంతా శుభ్రంగా కడిగింది. తర్వాత తన తల పాగా నుంచి కొంత వస్త్ర భాగం చించి గాయాన్ని శుభ్రంగా తుడిచింది.

ఇప్పుడు రెండో ఔషధి మొక్క ఆకులు త్రుంచి బాగా అర చేతిలో నలిపి గాయం మీద పిండింది. గాయాన్ని మాన్పటంలో అద్భుతంగా పని చేసే శతాగ్నియనే ఔషధి మొక్క ఆకులు అవి. తగినంత రసాన్ని గాయానికి బాగా పట్టించాక తన తలపాగా నుండి మరి కొంత వస్త్ర భాగాన్ని చించింది. ఇప్పుడు పిండిన రెండు ఔషధి మొక్కల ఆకుల ముద్దను పంజాకు అటు యిటు గాయం మీద వుంచి చక్కగా కట్టు కట్టింది.
ఎంత బుద్ధిగా అణకువగా గాయానికి కట్టు కట్టేంత వరకు ఆమెనే చూస్తూ కూచుంది సింహం. గాయం సలుపు తగ్గి వూరట లభించటంతో దాని కనులు చెమ్మగిల్లాయి. అది చూసి నవ్వుతూ కనులు తుడిచి ప్రేమగా జూలు నిమిరింది భద్రా దేవి.

‘‘బాధ పడకు రాజా! నీవు అడవికి రాజువి. అందానికి మృగ రాజువి. జూలు విదిలించి ఎప్పటిలా సగర్వంగా తిరగ్గలవు. వారం తిరక్క ముందే గాయం నయమై పోతుంది చూడు. కాని నీ తావు వదలి ఇలా కొండలు దాటి రావటం ప్రమాదం సుమా. వేట గాళ్ళు నిను చూసిన వారి బాణము ప్రయోగించి నీ ఉసురు తీయుదురు. చీకటి పడక ముందే కొండలు దాటి ఘోరారణ్యంలోకి మరలి పోయి నీ వాళ్ళను కలుసుకో’’ అంటూ కర్తవ్యం బోధించింది.

అర్థమైనది అన్నట్టుగా చెవులు హోరెత్తేలా తన సహజమైన గొంతుతో ఉత్సాహంగా లేచి మెడ తిప్పి గర్జన చేసింది సింహం.
ఇంతలో ఒక కొండ గొర్రెను వేటాడి తెచ్చాడు ధనుంజయుడు. దాన్ని సింహం ముందు పడేసాడు. ఆకలితో బాధ పడుతోందేమో మొహ మాట పడకుండా గొర్రె శరీరం మీద పడి గుండెలు చీల్చి ఆవురావురుమంటూ ఆరగించ నారంభించింది.

ఇక ఆ సింహ కిశోరం గొర్రె మాంసాన్ని కడుపార తిని కొండ గుట్టలు దాటి లోతట్టు అడవి లోకి వెళ్ళి పోతుందని భద్రా దేవికి తెలుసు.
‘‘ప్రభూ! సమయం మించినది. ఇక మనం బయలు దేరుట మంచిది. పోవుదము రండు’’ అంది తలపాగా సరి చేసుకుంటూ.
ఇక ఆలస్యం చేయకుండా`

తమ అశ్వాల మీద బయలుదేరారిరువురూ.

ఇదే సమయంలో`

రెండు అదృశ్య నేత్రములు చాలా సేపటిగా తమనే గమనిస్తున్నవన్న సంగతి వారికి తెలీదు. బాట మీదకు రాగానే అశ్వాలను శర వేగంతో పరుగెత్తించారు. చీకటి పడక ముందే అవి లోయ దాటి ఎగువకు వెళ్ళి పోయాయి.

*********************************************

రాత్రి రెండో జాము ఆరంభమైంది.

ఆకాశం నిర్మలంగా వుంది.

నెలరాజు మింటి నుండి వెన్నెల కురిస్తున్నాడు.

ఇంకో నాలుగు రోజుల్లో పౌర్ణమి రానుంది.

మహా పథంలో పోటీ పడి పరుగు తీస్తున్నాయి అశ్వాలు గరుడ, ఢాకినీ రెండూ. ప్రశాంతంగా ఉన్న అడవిలో అప్పుడప్పుడూ మృగాలు అరుపు విన వస్తున్నాయి. రివ్వున వీస్తున్న శీతలగాలులు ధనుంజయ, భద్రా దేవిలను సేద తీరుస్తున్నాయి. పగలు చాలా సమయం వృధా అయినందున రాత్రికి ఎక్కడా ఆగకుండా తెల్ల వారే సరికి మాళవ సరి హద్దుకు చేరుకోవాలని ఏక బిగిన రాత్రికి రాత్రి ప్రయాణం కొనసాగిస్తున్నారు.

మహా పథానికి సమీపంలో ఎక్కడో చెంచు గూడెం నుండి వేణు నాదం ఒకటి నిశీధిలో గాలి వాటున అలలు అలలుగా తేలుతూ వినవస్తోంది. బాట మీద అశ్వాల గిట్టల శబ్ధానికి వేణు నాదం తోడు కాగా ప్రయాణం ఉత్సాహంగా సాగుతోంది. నిర్మానుష్యంగా వున్న మహా పథంలో దూసుకు పోతున్నాయి అశ్వాలు. ఇంతలో `

ఎక్కడి నుండో విన వచ్చింది ఒక భీకరమైన అరుపు. ఆ శబ్ధం వింటూనే ఉలికి పడి తన అశ్వం కళ్ళాలు బిగించి భద్రా దేవి ఎప్పుడైతే ఆగి పోయిందో వెంటనే తన గుర్రాన్ని కూడ ఆపి వెనక్కి వచ్చాడు ధనుంజయుడు. చాలా వికృతంతగా వున్న ఆ అరుపును యువరాజు ధనుంజయుడు కూడ విన్నాడు. అది ఏ మృగం అరుపో అర్థం కాలేదు.

‘‘భద్రా! ఏ మృగమది అంత బీభత్సముగా అరిచినది?’’ అనడిగాడు వెన్నెట్లో చుట్టూ పరికిస్తూ.

‘‘ప్రభూ! అది ఖడ్గ మృగము అరుపు’’ అంది జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ భద్రాదేవి.

‘‘ఏమంటివి? ఖడ్గ మృగమా...’’ నమ్మ లేనట్టు అడిగాడు.

‘‘అవును.’’

‘‘మన అడవులందు ఖడ్గ మృగము లెక్కడివి. అవి ఉన్నట్టు ఎన్నడూ వినలేదే!’’

‘‘అదియే అర్థము గాకున్నది ప్రభూ. కాని అది నిక్కముగా ఖడ్గ మృగము అరుపే.’’

భద్రా దేవి సవరిస్తున్నంతలోనే మరో సారి విన్పించిందా అరుపు. ఈసారి స్పష్టంగా తాము వచ్చిన మార్గం వెనక తట్టు నుండి విన్పించింది. నిశీధిలో కొన్ని లిప్తల పాటు ప్రతిధ్వనించిందా అరుపు. ఇద్దరూ తాము వచ్చిన మార్గం వైపు దృష్టి సారించారు. ఎందుకైనా మంచిదని తన ధనస్సు అందుకుని సిద్ధం చేసాడు ధనుంజయుడు.

‘‘అయిననూ అది దూరమున ఎచటనో సంచరిస్తున్నట్టున్నది భద్రా! మనకేమి? మన దారిన మనం పోవుటయే మేలు గదా?’’ సందేహ నివృత్తి కోసం అడిగాడు.

వెంటనే బదులు చెప్ప లేదు భద్రాదేవి. ఆమె కనులు ఆందోళన చెందుతున్నాయి. అంత చలిలో కూడ ఆమె నుదుట శ్వేదాన్ని వెన్నెట్లో గమనించ గలిగాడు ధనుంజయుడు. ఇది అంత తేలిక విషయం కాదని అర్థమైంది. భద్రాదేవి తలతిప్పి ధనుంజయుని చూసింది.
‘‘ఏమైనది ప్రియా! కలవరమేల?’’ అడిగాడు.

‘‘లేదు ప్రభూ! ఆ దుష్ట శక్తి మనల్ని విడువదు’’ అంది.

‘‘ఏమంటివి? దుష్ట శక్తి? ఎవరది? అది నిజంగా ఖడ్గ మృగం కాదందువా?’’

‘‘కాదు ప్రభూ! నా సందేహము వృధా పోదు. ఎక్కడో పొరబాటు జరిగినది. మనము ఏమరి ఉంటిమి. మనల్ని వాళ్ళు గమనించుచున్నారని తెలియనైతిమి. బాగుగా ఆలోచించండి. మనం సింహము చెంత వున్నప్పుడు సంభాషించితిమి గదా! ఏ వశీకర మంత్రమునకు లొంగని మృగము ఖడ్గ మృగమని వచించితిని గదా!’’

‘‘ఆ మాట నిజము. అయితే...?’’

‘‘ఇప్పటికిప్పుడు ఈ ప్రాంతమునకు ఖడ్గ మృగము ఎటు వచ్చినది? ఆ మాయావి ఎవడో ఆ మృగ రూపమున మన నిర్జింప వచ్చుచున్నాడు. వాడు ఖచ్చితముగా నాగ రాజు భృత్యుడై వుండవలె. అంతియు కాదు, ఇక్కడ జరుగుతున్నదంతయు తమ ఓజో మంత్ర విద్యతో నాగాలు చూచుచున్నారు, సందియము లేదు.’’ అంటూ తన అభిప్రాయాన్ని వివరించింది భద్రాదేవి.

ఆ మాటలు వినగానే ధనుంజయుని ఛాతీ ఉప్పొంగింది. ఆవేశంతో ముక్కుపుటాలు అదిరాయి. కనులు ఎర్ర బారాయి.
‘‘రానిమ్ము భద్రా. అది ఎలాంటి దుష్ట శక్తి అయినా గానిమ్ము, నా కరకు బాణము దెబ్బకు అది మట్టి కరువక తప్పదు.’’ అంటూ ధనుష్టంకారం చేసాడు. అది యుద్ధానాదాలకి సంకేతం. వింటి నారి శబ్ధం కొన్ని లిప్తల పాటు చెవుల్ని హోరెత్తించింది. అయితే అతడి క్రోధావేశాన్ని వెంటనే తన మాటలతో అదుపు చేసింది భద్రాదేవి.

‘‘ప్రభూ! మీరంతటి సమర్ధుని నాకు తెలియు. కాని మాయను మాయతోనే జయింపవలె. బలమున నిర్జింప లేము. మీరు ధనుర్భాణముతో సిద్ధముగా ఉండండి. తక్క సమయము నేను తెలిపెదను. అప్పుడు శరమును సంధించి వదిలిన చాలును. ఈలోపల ముందు ఆ నాగాలకు బుద్ధి చెప్పవలె’’ అంటూ తన మచ్చల గుర్రం నుండి క్రిందకు దూకింది భద్రా దేవి. వంగి గుప్పెడు ఇసుక తీసుకొని అభి మంత్రించి ఈశాన్య దిక్కును చూస్తూ గాల్లోకి బలంగా ఊదింది. అంతే`

ఆమె చేతి నుండి ఇసుక రేణువులు నిప్పురవ్వలుగా మారి గాల్లోకి ఎగసి అదృశ్యమయ్యాయి.

సరిగ్గా ఇదే సమయంలో మార్గం ఎగువ నుండి మరొక్క మారు భీకరంగా విన వచ్చింది ఖడ్గ మృగం అరుపు. దాంతో బాటే భూకంపం వస్తున్నట్టు నే అదర నారంభించింది.

అదిరి పడి ఎగిరి తన అశ్వం మీద కూచుంది భద్రా దేవి. అటు చూసిన ధనుంజయ, భద్రాదేవిలకు వెన్నెల వెలుగులో బాట మీద ఒక బీభత్స దృశ్యం గోచరించింది.

ఓ మోస్తరు చిన్న కొండలా వున్న ఖడ్గ మృగం ఒకటి వికృతంగా అరుస్తూ మహా రౌద్రంగా ఎగువ నుంచి దూసుకొస్తోంది. విశృంఖలంగా ఎగ బడి దూసుకొస్తోంది. దాని పద ఘట్టన తోనే అదిరి పోతోంది. ముట్టె మీద బలమైన కొమ్ముతో చెట్లను కూలగొడుతూ తట్టలకొద్ది మట్టిని పెళ్ళగించి పోస్తూ అట్టహాసంగా వస్తోంది.

అది సహజమైన ఖడ్గ మృగం కాదని దాని భారీ ఆకారం చూస్తేనే అర్థమై పోతోంది. అది తమను వెంటాడి వేటాడేందుకే వస్తోందని కూడ గ్రహించారు. దాని ఆర్భాటానికి గొంతు తడారి పోతూండగా ధనుంజయ, భద్రా దేవిలు నిశ్చేష్టులై అలా చూస్తుండి పోయారు.

**********************************************

ఎక్కడో ఈశాన్య  భారతంలో`

మర్మ భూమి అటవీ ప్రాంతంలో`

మిగతా భాగం వచ్చేసంచికలో... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali