Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( పది+నాలుగవ భాగం) - కర్రా నాగలక్ష్మి

రాజస్థాన్  అందాలు చూద్దాం రారండి ( పది+నాలుగవ భాగం)

సాలాసర్ బాలాజీ , ఖటు శ్యామ్ జీ , బికనీర్  

రాజస్థానీ సముదాయంలో ' సాలాసర్ బాలాజీ ' అంటే మంచి భక్తి నమ్మకం వుంది . ఇంటికి ప్లోరింగ్ కని పాలరాయి కొనడానికి వెళితే అక్కడ షాపులో పూజా స్థానంలో వున్న రెండు పటాలు నన్ను ఆకర్షించేయి . వాటి గురించి షాపు అతనిని అడిగితే అవి ఒకటి ' సాలాసర్ బాలాజీ ' మరియు ' ఖటు శ్యామ్ జీ ' ల వని రాజస్థాన్ లో మహిమగల దేవుళ్లని చెప్పేరు . అప్పటి నుంచి వీలైనప్పుడల్లా ఢిల్లీ నుంచి యెలా వెళ్లాలి , యెంతదూరం మొదలయిన వివరాలు సేకరించి మా కారులో ప్రయాణమయేం . ఢిల్లీ నుంచి సుమారు 334 కిలోమీటర్ల దూరంలో రాజస్థాను రాష్ట్రం ' చురు ' జిల్లాలో వుంది '  సాలాసర్ ' గ్రామం . సాధారణంగా వేంకటేశ్వర స్వామిని ఉత్తరభారతీయులు ' బాలాజీ ' అని పిలవడం అనుభవమే . పటం లో చూస్తే మీసాలతో వున్న దేవుడు విష్ణు మూర్తి అవతారమో  మరే దేవుడు అన్నది అర్దం కాలేదు . ఢిల్లీ నుంచి జయపూర్ రోడ్డు మీద నీమ్ రాణా వరకు ప్రయాణించి , అక్కడి నుండి స్టేట్ హైవే మీద ప్రయాణించి ' సాలాసర్ ' చేరుకున్నాం . చిన్న కోట ఆకారంలో కట్టిన విశాల మైన మందిరం . పెద్ద పెద్ద పాత్రలలో ప్రసాదాలు తీసుకు వస్తూనే వున్నారు . లోపల విశాల మైన సభా మండపం వేల సంఖ్యలో భక్తుల కూర్చొని భజన చేయగలిగేందుకు వీలుగా వుంది . గుట్టలు గుట్టలుగా కొబ్బరికాయలకు యెర్రదారం కట్టినవి వ్రేలాడదీసి , కొన్ని కిందన పడేసే వున్నాయి . కొందరు భక్తులు దారం కట్టిన కాయలను దేవునికి సమర్పిస్తున్నారు . చిన్న పిల్లలకి పుట్టువెంట్రుకలు తీస్తున్నారు . కొందరు చెవులు కుట్టిస్తున్నారు . చాలా మంది మానసిక రోగులను దేవుని దర్శనం కోసం తీసుకు వస్తున్నారు . పాలరాతి మీద వెండి , బంగారాలు కలిపి చెక్కిన కళ యీ మందిరం లో అడుగు అడుగున కనిపిస్తుంది . గర్భగుడి తలుపులు , పూజా సామాగ్రి అంతా వెండివే . చాలా భాగం బంగారు తాపడంతో కనిపిస్తుంది . ఇక్కడ ఉత్తర భారతం లో అరుదుగా వుండే పూజా రుసుము వసూలు చేయడం అనేది కనిపిస్తుంది . పెద్ద పెద్ద మీసాలతో నవరత్నాలను పొదిగిన విలువైన నగలతోనూ , పూలతోనూ అలంకరించిన విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది . తీర్ధం ప్రసాదాలు యిచ్చిన పూజారిని దేవుని గురించి అడిగితే " బాలాజీ " అంటే హనుమంతుడు అని హనుమంతుడుని బాలునిగా ఆరాధించడం వల్ల ' బాలాజీ ' మందిరం గా ప్రసిద్ది కెక్కింది అని చెప్పేరు . నేను విగ్రహాన్ని పరికించి చూసేను . హనుమంతుని మూతి ఈ విగ్రహానికి లేదు . మనకి హనుమంతుడు అంటే కోతి మూతితోనే కదా పరిచయం . నేను అశ్చర్యంగానూ , కుతూహలంతోనూ వేసిన ప్రశ్నలకు పూజారి మరో అతనిని పిలిచి యితను మీకు సమాధానాలు చెప్తాడు అని అతనితో పంపేడు . అతను ఆ మందిరంలో వున్న అంజనాదేవిని , బాల హనుమంతుని విగ్రహాలను చూపించేడు . అతను చెప్పిన ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి హనుమంతునికి పుట్టుజుత్తులు తీయించిన ప్రదేశం యిది . హనుమంతునకు తల్లి చాలా గారాబం చేసేదట , అది అతనికి యెంతో యిష్టం . అందుకని హనుమంతుడిని బాలరూపంలో పూజిస్తే తొందరగా ప్రసన్నుడై కోరిన కోర్కెలు తీరుస్తాడుట . ఆ ప్రదేశం హనుమంతుని శక్తి స్థలం , భూత , ప్రేత , పిశాచాలకు హనుమంతుని నామం వుఛ్చరించిన మాత్రాన ఆ చుట్టు పక్కలకు చేరవు . అందుకని యిక్కడి హనుమంతుడుని దర్శించుకుంటే అన్ని దోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం . హనుమంతుడికి కోతి మూతి లేదేమి అనే నా ప్రశ్నకు భగవంతునికి రూపం యిచ్చిందే భక్తుడు , ఈ విగ్రహానికి రూపకల్పన చేసిన భక్తుడు హనుమంతుడు యిలా వుండాలని అనుకున్నాడు . నీకు హనుమంతుడు కోతి మూతితో కావాలంటే అలాగే వూహించుకో అనే సమాధానం తో సందేహనివృత్తి చెయ్యబడింది .

యిక్కడి స్థల పురాణం -----

1754 సంవత్సరం లో శ్రావణ శుక్ల నవమి శనివారం నాడు ' గింధల ఝాట్ ' తెగకు చెందిన రైతు " అసోటా " గ్రామంలో పొలం దున్నుతూ వుండగా పలుగుకి తగిలి మన్నుతో కూడుకొని వున్న యీ విగ్రహం బయటపడింది . రైతు , అతని భార్య విగ్రహం పైనున్న మన్ను కడిగి విగ్రహానికి పొలంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు . ఆ నోటా ఆ నోటా విషయం విన్న గ్రామ పెద్దకు రాత్రి కలలో హనుమంతుడు కనబడి విగ్రహాన్ని ' సాలాసర్ ' గ్రామానికి తరలించమని చెప్తాడు . మరునాడు ఒక వార్తాహరుడు అసోటా గ్రామపెద్దను కలిసి సాలాసర్ లోని హనుమాను భక్తుడిగా పేరుపొందిన ' మోహన్ దాసు మహారాజ్ ' కు రాత్రి కలలో హనుమంతుడు తాను స్వయంభూ గా అసోటా గ్రామం లో దొరికినట్లు , తనను సాలాసర్ తరలించవలసినదిగా చెప్పేడని , విగ్రహాన్ని తరలించేందుకు తనని పంపినట్లు చెప్తాడు . విషయం విన్న గ్రామపెద్ద హనుమంతుని మహత్యం తెలుసుకొని , విగ్రహాన్ని యెద్దుల బండి పై పెట్టి యెద్దులు ఆగిన ప్రదేశం లో మందిరం నిర్మించమని చెప్తాడు . ఆ యెద్దులు ఆగిన చోట మందిర నిర్మాణం చేపట్టిన మోహన్ దాసు ' శిఖర్ ' జాగీరుదారు రావు దేవి సింగ్ సహాయంతో మట్టి రాళ్లు వుపయోగించి పూర్తి చేస్తాడు . రావు దేవీసింగ్ వంశస్థులైన కణిరామ్ , ఈశ్వరదాసులు ప్రస్తుతం వున్న విశాల మందిర నిర్మాణం చేసేరు . ఈ మందిరం లో ముఖ్యం గా రెండు రకాలయిన మొక్కుబడులు జరుగుతూ వుంటాయి . మొదటిది కొబ్బరికాయ కు యెర్రదారంకట్టి మనసులో కోరిక కోరుకొని బాలాజీ కి సమర్పిస్తారు . అలా సమర్పించిన భక్తుల కోరికలు బాలాజీ తప్పకుండా తీరుస్తాడని స్థానికులు నమ్ముతారు . ' శిఖర్ ' జాగీర్దారైన రావు దేవీ సింగు సంతానాపేక్షతో యిలా కొబ్బరికాయను బాలాజీ కి సమర్పించి సంతానాన్ని పొందేడు .

రెండవ మొక్కుబడిని ' సవామణి ' అంటారు . సవామణి అంటే సుమారుగా 50 కేజీలు . మణ్ అంటే మణుగు , మణుగు సుమారుగా 40 కేజీలకు సమానం , సవా అంటే ఒకటింపావు మణుగు అని అర్దం . అంటే 50 కేజీల బరువైన ఆహారపదార్థం తో చేసిన ప్రసాదాన్ని భగవంతునికి సమర్పిస్తారు . సాధారణంగా బూందీ తో చేసిన లడ్డు లని నివేదిస్తూ వుంటారు .

శ్రావణ శుక్ల నవమి , హనుమజ్జయంతి పర్వదినాలు విశేషంగా జరుపుతారు .

' దధీచి ' వంశానికి చెందినవారు యిక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ' హనుమాన్ సేవా సమితి ' ఆధ్వర్యంలో ఉచిత వసతి గృహాలు , వైద్యశాలలే కాక సాలాసర్ లో రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు .

ఖటు శ్యామ్ -------

సాలాసర్ నుంచి సుమారు 122 కిలో మీటర్ల దూరంలో ' సిఖర్ ' జిల్లాకు చెందిన  'ఖటు ' గ్రామంలో వుంది . కలియుగంలో కృష్ణుని పేరుతో పిలువబడాలనే వరం పొందిన ఘటోచ్గచుని పుతృడు త్రిబాణధారి , శీస్ కి ధని ( శిరస్సును దానం గా యిచ్చిన వాడు ) , హారే కా సహారా అని భక్తులచే పొగడబడే ఖటు శ్యామ్ ని గురించి యింతకు ముందు యిదే పత్రికలో పరిచయం చేసేను అందుకని ఆ లింక్ కిందన యిస్తున్నాను . ఖటు శ్యామ్ గురించిన వివరాలు పూర్తిగా కింద లింక్ లో చదువగలరు .

ఖటు శ్యామ్ మందిరం చూసుకొనే సరికి రాత్రి అయిపోవడం తో రాత్రి అక్కడే హొటల్ లో బస చేసి మరునాడు పొద్దుట ఉపాహారం తరువాత బికనీరు బయలుదేరేం . ఖటు నుంచి బికనీరు సుమారు 260 కిలో మీటర్లు , బికనీరు చేరే సరికి మద్యాహ్న భోజన సమయం అవడంతో భోజనాలు కానిచ్చుకొని  కేమెల్ రీసెర్చ్ ఫార్మ్ చేరుకున్నాం .

కేమెల్ రిసెర్చ్ ఫార్మ్ -----

బికనీరు కి 8 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ కేమెల్ రిసెర్చ్ ఫార్మ్ . 

ఒంటెల అధ్యయనం కొరకు 1984లో భారతదేశ ప్రభుత్వం ద్వారా స్థాపించి నడపబడుతున్న సంస్థ . మేలురకం ఒంటె జాతుల ఉత్పత్తికోసం యిక్కడ ప్రయోగాలు చేస్తూవుంటారు . మన మిలటరీ లో సేవలందస్తున్న ఒంటెలు అన్నీ యిక్కడ నుండి తెప్పించినవే .  ఈ కేంద్రం లో సుమారు 230 ఒంటెలు మూడు జాతులకు చెందినవి వున్నాయి . మేము డిసెంబరు ఆఖరి వారంలో వెళ్లడం వల్ల పిచ్చి చలిని యెదుర్కొనవలసి వచ్చింది . ఎడారిలో వుండడం తో పిచ్చి గాలి కూడా , యిసుక యెగురుతూ గాలి . పర్యాటకులకు మధ్యాహ్నం 2-30 నుంచి 5-30 వరకు అనుమతించుతారు . అన్ని పెద్ద చిన్న ఒంటెలను చూడడం ఓ వింత అనుభూతినిచ్చింది . ఒంటెలకు యిచ్చే ఆహారం గురించి తెలుసుకోడం , బుజ్జి బుజ్జి ఒంటెలను చూడడం నచ్చింది . ఓ బుజ్జి ఒంటె పిల్లను తాకబోతే తల్లిఒంటె పళ్లు బయటపెట్టి గుర్రుమని భయపెట్టడం కూడా బాగుంది . ఇక్కడ కొంత రుసుము చెల్లించి మామనవడు ఒంటె సవారి చేసేడు . ఇక్కడ ఒంటె పాలు , ఒంటె పాలతో చేసిన మిఠాయులు అమ్మకానికి వుంటాయి .
 
బికనీరు వెళ్లిన వాళ్లు తప్పకుండా చూడవలసిన ప్రదేశం .     

మరిన్ని శీర్షికలు
weekly horoscope 27th may to 2nd june