Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాను అందాలు చూద్దాం రారండి! - కర్రానాగలక్ష్మి

బికనేరు --2

లక్ష్మీనాథ్ జీ మందిరం ----

బికనేర్ ని నిర్మించిన మహారాజా రావు బిక విష్ణు భక్తుడు . విష్ణుమూర్తి ని రాజ్యానికి అధిపతి గాను తాను అతని సేవకునిగా భావించుకొని పరిపాలన చేసేవాడు . ఇతని కాలంలో అనేక విష్ణు మందిరాలు నిర్మింపబడ్డాయి . ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటపుడు రాజు సమస్యను విష్ణుమూర్తి కి వినిపించి అతని అనుమతి తో పరిష్కారాన్ని యెన్నుకొనేవారు . బిక వంశస్థులు కూడా అదే ఆచారాన్ని కొనసాగించేరు . 1504 లో  ' మహారాజా రావు లునకరణ్ ' విష్ణు మూర్తి కి పాలరాతితో విశాల మందిర నిర్మాణం చేసేడు . యిది కూడా కోటను పోలినట్లు పెద్ద బురుజులు కలిగిన ప్రహారీగోడ లోపల నిర్మించబడి వుంది . కోవెల అంతా రాజస్థానీ శిల్పకళతో నిండి వుండి ఓ అద్భుత అనుభూతిని కలుగజేస్తుంది . ఈ మందిరం లో విష్ణుమూర్తి  సందిటలో లక్ష్మీదేవి వున్నట్లుగా వున్న సుమారు 1 1/2 , రెండు అడుగుల విగ్రహం వుంటుంది . ఈ మందిరం లో శ్రీ బదరీనాథ్ జీ , నీలకంఠ మహదేవ్ , శ్రీరూప చతుర్భుజీ ,  శ్రీ మాఘ విద్యాజీ , శ్రీ సూర్యనారాయణ జీ మొదలయిన విగ్రహారాలను చూడొచ్చు .

ఈ మందిరం పొద్దున్న 5-00 గం. లనుంచి 1-00 గం..వరకు తిరిగి సాయంత్రం 5-00 నుంచి రాత్రి 11-00 గంటలవరకు తెరచి వుంటుంది .ప్రొద్దుట సాయంత్రం హారతి సమయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు . ఆ సమయంలో విష్ణు మూర్తి లక్ష్మీదేవి సమేతంగా వచ్చి భక్తులకోరికలు తీరుస్తాడని నమ్మకం . మేము రెండుసార్లు ఈ మందిరానికి వెళ్లేం ,  హారతి దర్శనం చేసుకొని బయటికి వచ్చేక కొందురు అక్కడ చెట్లదగ్గర హారతి యిస్తూ   కనిపిస్తే మేం అక్కడవున్న చెట్ల దగ్గరకి వెళ్లేం అక్కడ చెట్లలో ఓ పెద్ద గ్రద్ద , ఓ గుడ్లగూబ వున్నాయు . హారతి సమయానికి విష్ణుమూర్తి , లక్ష్మీ దేవి వారి వాహనాలమీద వచ్చి  యిక్కడ హారతి అందుకుంటారని అందుకే ఆ సమయానికి గ్రద్ద , గుడ్లగూబ వస్తాయని , హారతి తరువాత తిరిగి విష్ణుమూర్తిని , లక్ష్మీదేవిని స్వర్గానికి తీసుకు వెళ్లిపోతాయని భక్తుల నమ్మకం . ఓ అయిదు నిముషాల తరువాత యెగిరిపోయేయి .  ఇలా మేము రెండుసార్లు  వెళ్లినప్పుడు చూడ్డంతో నిజమేనేమో అనిపించింది .

జైనమందిరం ----

లక్ష్మీనాథ్ మందిరం ప్రాంగణానికి ఆనుకొని వుంటుంది యీ జైనమందిరం . పాలరాతితో కట్టిన వో మోస్తరు మందిరం . దీనిని ' భండాసర్ జైస్వాల్ ' అనే వ్యాపారి 1468 లో అయిదవ జైన తీర్థంకరుడైన సుమతినాధ్ జీ కోసం నిర్మించిన మందిరం . లోపల మకరతోరణాలు , మిగతా శిల్పాలు చూడ ముచ్చటగా వున్నాయి .

జైసల్మేరు

జైనమందిరం చూసుకున్న తరువాత రాత్రి బికనేర్ లో వుండి మర్నాడు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసుకొని జైసల్మేరు కి ప్రయాణ మయేం . చలికాలం కాబట్టి ప్రయాణం అహ్లాదం గా వుంది . యెక్కడ చూసినా యిసుకే , కేక్టై , తుమ్మ తుప్పలు తప్ప మరిమీ లేవు . సుమారు 330 కిలోమీటర్ల దారి NH- 15 మీదుగా సాగుతుంది . దారంతా యిలాగే వుంది . తుమ్మ తుప్పలలో తుమ్మచిగుళ్లు తింటూ రాజస్థాన్ రాష్ట్ర జంతువు , రాష్ట్ర ప్రజలచే పూజలందుకొనే కృష్ణ జింకలు , మచ్చల జింకలు గుంపులు గుంపులుగా కనిపించి కనువిందు చేస్తాయి .      దారిలో యెక్కడా జనావాసాలు కనపడలేదు .  ' పోఖరాన్ ' కి వెళ్లే దారి అని ఒకచోట బోర్డు కనిపించింది . అణుబాంబు పరీక్షణా కేంద్రం . ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయం మనదేశం అణుబాంబు తయారు చెయ్యగలిగింది అంటే . ఆ వూరి పేరు చూడగానే మా అందరిలో యెదో తెలీని గర్వం , ఆనందం కలిగేయి . దారిలో ఒకటో రెండో బస్సులు కొన్ని మిలటరీ వాహనాలు తప్ప మిగతా ప్రయాణమంతా నిర్మానుష్యమైన రోడ్డు పైనే సాగింది .

మెల్లగా సాయంత్రానికి జైసల్మేరు చేరుకున్నాం . మేము మేక్ మై ట్రిప్పు వారి పాకేజ్ తీసుకున్నాం . అందులో హోటల్ బ్రేక్ ఫాస్ట్ , డిన్నరు సైట్ సీయింగు , హొటల్ బుకింగులో సేండ్ డ్యూన్ సఫారీ ఒంటె స్వారీ కూడా కలిపి వుంటుంది .

1156 లో మహారావల్ జైసింగ్ ' మేరు ' అనే పర్వతం మీద నిర్మించిన నగరం కాబట్టి ఈ వూరికి ' జైసల్మేరు ' అనే పేరు వచ్చింది . జైపూర్ కి 575 కిలోమీటర్ల దూరంలో వున్న జైసల్మేరు జిల్లా ముఖ్యపట్టణం యిది . మొత్తం భారతదేశం లోని అతి పెద్ద జిల్లా . థార్ యెడారి మధ్యలో వున్న ఒయాసిస్సు చుట్టూ నిర్మింపబడ్డ పట్టణం . ఈ జిల్లా రెండు వైపుల పాకిస్థాన్ బోర్డరుతో కలిసి వుండడంతో యిక్కడ మిలటరీ రాకపోకలు యెక్కువగా కనిపిస్తూ వుంటాయి .

కనుచూపుమేర వరకు బంగారు రంగు యిసుక తిన్నెలతోను యిళ్లు బంగారు యిసుక రాతి నిర్మితాలు కావడంతో యీ పట్టణాన్ని ' గోల్డెన్ సిటి ' అని వ్యవహరిస్తూ వుంటారు . ఈ పట్టణం లో అనేక బాలివుడ్ , హాలీవుడ్ సినిమాల నిర్మాణం సాగడంతో ప్రపంచ పర్యాటక పటంలో ముఖ్యస్థానం సంపాదించింది .

థార్ యెడారి మధ్యలో వుండడంతో వర్షపాతం చాలా తక్కువ అంటే సున్న అని చెప్పుకోవచ్చు . దానివలన పంటలేకాదు ముళ్లకంపలు తప్ప మరిమీ మొలవని ప్రదేశం . యెడారి జీవనం యెలా వుంటుందో కళ్లారా చూడగలం . చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు మట్టి యిళ్లల్లో నిలసిస్తూ వుండడం , నిరక్షరాస్యత , చేద్దామన్నా పనిలేకపోవడం , లేమి అడుగడుగునా కనిపిస్తూ వుంటుంది . మట్టిలో మాణిక్యాలు చాలా కనిపిస్తూ వుంటాయి . ఎలా అంటే స్కూలు మొహమైనా చూడని యెనిమిది తొమ్మిదేళ్ల పిల్లలు అవలీలగా మూడు నాలుగు విదేశీభాషలు మాట్లాడడం కనిపిస్తూ వుంటుంది . వారికి యెవరు నేర్పేరు అన్ని భాషలు జానెడు పొట్ట తప్ప . ఎవరైనా వారికి చేయూతనిస్తే యింకెన్ని నేర్చుకుంటారో కదా ! అని అని పించక మానదు . త్రాగే నీటికోసం కూడా సంఘర్షణ పడవలసిన బ్రతుకులు . ఇంత మంది విదేశీయులు రాకపోకలు చేస్తున్నా సాంప్రదాయాన్ని కోల్పోని పట్టణం .

మా టూర్ ఆపరేటర్ల ప్రకారం ఆ రోజు సేండ్ డ్యూన్ సఫారీకి వెళ్లాలి . హోటల్లో చెక్ యిన్ చేసేక టీ తాగి బయలుదేరేం . హొటల్ వాళ్ల జీపులో యిసుక తిన్నెల మధ్య నుంచి ప్రయాణం చేసేం . సాధారణం గా యిసుకతిన్నలు గాలికి యిసుక యెగిరి మరో చోట గుట్టలు గా యేర్పడుతూ వుంటాయి . అలా యెంత దూరం వెళ్లామో తెలీదు . యెక్కువ దూరం వెళ్లి వుండం కాని సమయం యెక్కువ పట్టింది . ఒక చోట చిన్న యిల్లులా వుండి వరుసగా గదులు బయట నులక మంచాలు టెంట్లు వేసి వున్నాయి . అక్కడ చేరిన తరువాత టీ , పకోడా లు యిచ్చేరు . అందులో డాన్సులు చేసే పిల్లలు , పాటలు పాడే పిల్లలు  వున్నారు . అక్కడకి ఒంటెలు , ఒంటె బండి తీసుకొని వచ్చేరు . ఒంటె యెక్కలేని వారికి ఒంటె లాగే బండీ లో సూర్యాస్తమయం చూపించడానికి తీసుకు వెళ్లి తీసుకు వస్తారు . జైసల్మేరు లో ముఖ్యంగా సేండ్ డ్యూన్స్ లో రాత్రి గడపడం అదో అనుభూతి .

ఒక ఒంటె మీద యిద్దరిని కూర్చోబెట్టేరు . నేను మా ఆయన ఒక ఒంటె మీద కూర్చున్నాం . ఒంటె నడచినప్పుడల్లా కింద పడిపోతున్న అనుభూతి . అప్పుడు నాకు తెలిసింది ఒంటెలు యెందుకు యెడారి లో వుంటాయో , అదే మామూలే రాళ్లు రప్పలు వుండే జాగాలో అయితే ఒంటె సవారి చేసి కిందపడితే తలకాయ రెండు చెక్కలవడం ఖాయం , యెడారిలో పడితే యిసుకే కాబట్టి దెబ్బలు యెక్కువ తగలవు . ఒంటె కుర్రాడు ఒంటెను పరుగెత్తించేడు . ప్రాణాలు అరచేతిలో పట్టుకు కూర్చున్నాం . ఇసుకలో అయిదారు కిలోమీటర్లు ఒంటె మీద ప్రయాణించేక ఓ యిసుక గుట్ట మీద దిగేం . అక్కడ నుంచి సూర్యాస్తమయం చూడ్డానికి మాలాంటి పర్యాటకలు చాలామంది కూర్చొని వున్నారు .

మేం కూడా యిసుకలో చతికిల పడ్డాం . మూడేళ్ల నుంచి పదిహేళ్ల వరకు పిల్లలు చుట్టుముట్టేరు .పాటలు పాడి వినిపించేవాళ్లు కొందరైతే , చిన్న వాయిద్యం నోట్లో పెట్టుకొని కొందరు వాయిస్తున్నారు . వారి సంగీతం యెంతబాగుందో , వారి కంఠం లోంచి వస్తున్న పాట యెదో రాగమెదో తెలీదు అర్దం అంతకంటే తెలీదు కాని అలా వింటూ వుండిపోవాలనిపించింది .వారు పాటలు పాడి డబ్బులు అడుక్కుంటున్నారు , అదే వారి జీవనోపాధి . ఆ యిసుక గుట్టమీంచి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూసేం . మాటలకందని అనుభూతి . తిరిగి మేం ఒంటెల మీద వెనుకకు బయలుదేరేం . ఈసారి భయం చాలా తగ్గింది .

ఒంటెలు మమ్మల్ని బయలుదేరిన చోట దింపేయి . అక్కడ ' బోన్ పైర్ ' వేసి వుంచేరు దానిచుట్టూ వేసిన కుర్చీలలో కూర్చున్నాం . మేము  వెజిటేరియన్స్ వి అని చెప్పడంతో మమ్మల్ని ఆ గ్రూపులో పెట్టేరు . రకరకాలు తినే వస్తువలు సర్వ్ చేస్తూనే వున్నారు . డాన్సులు పాటలు నాన్ స్టాప్ గా జరుగుతూనే వున్నాయి . రాత్రి భోజనాలు , మళ్లా యేవేవో వేడి వేడి గా యిస్తూనే వున్నారు . మేం రాత్రి రెండుకి మా హోటల్ కి వచ్చేసేం . ఆ ప్రదేశం లో రాత్రి గడపడానికి వీలుగా గదులు వున్నాయి . మాతో కూడా వున్న మిగతా పర్యాటకులు అక్కడ రాత్రి వుండిపోయేరు , మేము వెనుక వచ్చేసేం . అలా రాత్రి వుండిపోయేవారిని ప్రొద్దున్న బ్రేక్ ఫాస్ట్ అయేకా తిరిగి హోటల్ కి పంపుతారు .      రాత్రి సేండ్ డ్యూన్స్ లో గడపడం చాలా బాగుంటుంది . సేండ్ డ్యూన్ లో రాత్రి గడపకపోతే రాజస్థాన్ పర్యాటన పూర్తయినట్లు కాదు .

 పై వారం జైసల్మేరు కోట , శాపగ్రస్థ పట్టణంగా పేరు పడ్డ ' కులధారా ' పట్టణం గురించి తెలుసుకుందాం . అంత వరకు శలవు

మరిన్ని శీర్షికలు
panch patas