Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాను అందాలు చూద్దాం రారండి ( పదిహేడో భాగం ) - కర్రా నాగలక్ష్మి

జైసల్ మేరు -1

జైసల్మేరు కోట-----

మర్నాడు యెప్పటిలాగే పొద్దున్న ఫలహారాలు కానిచ్చి జైసల్మేరు కోట చూడ్డానికి వెళ్లేం . కోట అంటే మనుష్యులు నివసించని కోటలు చూసేం కాని ఈ కోటలో నేటికీ జైసల్మేరు జనాభాలో మూడో వంతు  ఈగోడల మధ్య వున్న నగరం లో నివసిస్తున్నారు . ఈ మధ్యన పర్యాటకులు పెరగడం తో వారికి కావలసిన సదుపాయాల కొరకు కట్టిన కట్టడాలతో పెరిగిన పట్టణం మాత్రమే కోట బయట వుంది . మేము వున్న హోటలు నుంచి ఆటోలలో వెళ్లి ఆటో స్టాండు దగ్గర దిగి కోట వరకు నడిచేం .



పెద్ద కోట ముఖద్వారం లోంచి లోనికి వెడితే కుడిచేతి వైపు రాజభవనాలు , యెడమ చేతి వైపు మందిరాలు వున్నాయి .

1156 లో రాజపుత్ర రాజైన మహారావల్ జైసల్ సింగు ' మేరు ' అనే పర్వతం మీద కోటను , భవనాలను ' త్రికూట ' పర్వతం మీద నిర్మించి  రాజభవనాలకు ' త్రికూట ఘర్ '  అని నామకరణం చేసేడు . ఈ కోట అంతా బంగారు రంగు యిసుక రాతి నిర్మాణం కావడంతో సోనార్ ఖిలా అని కూడా వ్యవహరిస్తూ వుంటారు . ఈ కోట ఉదయపు సూర్యకాంతి లో సింహం జూలు రంగులోనూ , అస్తమించే సూర్యకాంతిలో తేనె రంగులోకి మారుతుండడం తో దీనిని రంగులు మారే కోట అని కూడా అంటారు . ఢిల్లీ నుంచి అరేబియా పెర్షియా , ఈజిప్టు , దక్షిణ ఆఫ్రికా దేశాలకు వెళ్లే వాణిజ్య మార్గం ఈ దేశం గుండా వెళ్లడంతో అప్పటి రాజులకు యీ కోటను గెలుచుకోవాలనే ధ్యేయం వుండేది . 1276 లో యీ కోటను రాజా జెట్సి ఢిల్లీ సుల్తానులనుంచి రక్షించే వుద్దేశ్యం తో కోటను మూడు సురక్షా వలయాలతో పటిష్టం చేసేడు . 1500 అడుగుల పొడవు 750 అడుగుల వెడల్పు 15 అడుగుల యెత్తు వున్న గోడను నిర్మించేడు . మొదటి గోడ రెండవ గోడలకు మధ్య సైనికుల మొత్తం 4000 మంది సైనికులను 56 చిన్న చిన్న సమూహాలుగా మరుగుతున్న నూనె , నీళ్లు , రాళ్లతో తయారుగా వుంటారు . రెండవ మూడవ గోడల మధ్య విషనాగులు తిరుగుతూ వుండేటట్లు యేర్పాటు చేసారు . పదమూడవ శతాబ్దం లో అల్లావుద్దీను ఖిల్జీ యెనిమిది సంవత్సరాలు యేకాద్రంగా సాగించిన పోరులో కోట పూర్తిగా ద్వంసం చెయ్యబడింది .కోటలోని రాణీవాసపు  కాంతలు ' జవ్హర్ ' ( ఆత్మాహుతి ) చేసుకున్నారు ,

1306 లో ఈ కోట 'రావల్ ' ల పరిపాలనలోని కి వచ్చింది . 16 వ శతాబ్దం లో బాబరు చేతిలో ఓటమి పాలయి మొఘల్ పరిపాలనలోకి వచ్చింది . అప్పుడు కూడా రాణీవాసపు స్త్రీలు ఆత్మాహుతి చేసుకున్నారు . ఈ కోట చరిత్రలో యిది రెండవ 'జవ్హర్ ' చర్య . బాబరు నుంచి వంశపారంపర్య హక్కుగా అక్బరు పరిపాలనలో కి వచ్చింది . రావల్ ల రాజపుత్రికని అక్బరు పరిణయమాడడంతో మొగలులకు రావల్ ల మధ్య సంధి జరిగి యుద్ధాలకు తెరదించ బడింది . తరువాత ' ఈస్ట్ యిండియా కంపెనీ ' చేతులలోకి వెళ్లింది . స్వాతంత్ర్యం వచ్చేక దేశ బద్రతా ద్రుష్ట్యా వాణిజ్య మార్గాన్ని మూసివెయ్యడం జరిగింది . ఇప్పటికీ ఈ కోటలోపల  సుమారు నాలుగువేల జనాభా బ్రాహ్మణ , దరోగా జాతివారు నివసిస్తున్నట్లు అంచనా . జైసల్మేరు ప్రపంచ పర్యాటక పటం లో ముఖ్యమైనదిగా గుర్తింపబడగానే పర్యాటకులు సౌకర్యార్దం హోటల్స్ కట్టవలసి రావడంతో నగరం కోట గోడలనుంచి బయటకు రావలసిన వచ్చింది . ఈ కోట కు నాలుగు ప్రవేశ ద్వారాలు వున్నాయి . ముఖ్యద్వారం దగ్గర పెట్టిన ఫిరంగిని చూడొచ్చు . కోట చుట్టుపక్కల ప్రదేశం చాలా రద్దీగా వుంటుంది . ఈ ప్రాంతాలలో ఆటో ప్రయాణం సులువుగా వుంటుంది . సోనార్ ఖిల్లా లో ముఖ్యంగా చూడవలసినవి ' త్రికూట భవనము , జైనమందిరము , లక్ష్మీనాథ్ మందిరము యివికాక వ్యాపార వేత్తల భనవాలు .

కోటలోకి ప్రవేశించగానే యెడమవైపున రాజభవనాలు , కుడి చేతివైపున జైన , లక్ష్మీనాధ్ మందిరాలు కొన్ని అడుగుల దూరంలో వుంటాయి . ఈ కోటలో మొత్తం యేడు జైనమందిరాలు వున్నాయి . ఇందులో పార్శనాథుని మందిరం పెద్దది . చంద్రప్రభు , శీతలానాథుడు , కుంటునాధుడు , శాంతినాథుడు మందిరాలు వున్నాయి . జైనులకు యిది పవిత్రస్థలం .

త్రికూట భవనం---

త్రికూట భవనం , రాజ్ మహల్ , జుణా మహల్  ( పాత భవనము ) అని పిలువబడే అంతఃపుర భవనానికి  వెళ్లేవారు కొంత రుసుము చెల్లించి లోనికి వెళ్లాలి . ఈ భవనం 1500 ల సంవత్సరం లో నిర్మింప బడ్డ యేడంతస్తుల యిసుకరాతి నిర్మాణం . లోపల రాజులు వారి పరివారము వుపయోగించిన దుస్తులు , వస్తువలు , ఆయుధాలు , పడకలు ప్రదర్శించే మ్యూజియం వుంది  . అన్ని రాజస్థానీ రాజభవనాలలాగే నగిషీలు చెక్కిన కిటికీలు బాల్కనీలు స్థంబాలు కనువిందు చేస్తాయి . అప్పటిరాజులు వాడిన డ్రైనేజి సిస్టం ' ఘటినాలి ' యిప్పటి వారిని అబ్బుర పరుస్తుంది . ఈ మ్యూజియంలో 800 బిసి కి చెందిన గ్రీకు , ప్రెంచ్ శిల్పాలు సంరక్షించి ప్రదర్శిండం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది . 800 నుంచి 320 బిసి కి చెందిన ' డెల్ఫి ' త్రవ్వకాలలో దొరికిన శిల్పాలను , భారతదేశ శిల్పాలను చూడొచ్చు . 146 బిసి నుంచి 324 ఎడి కి చెందిన రోమన్ శిల్పాలను చూడొచ్చు . ' టుటుఖామున్ ' సమాధికి చెందిన చిత్రాలను చూడొచ్చు . యీ కోటలోపల యిటాలియన్ , ప్రెంచ్ భోజనాలు దొరకుతాయి .

లక్ష్మీనాధ్ మందిరం----

జైసల్మేరు లో అతిపురాతనమైన కట్టడం యీ లక్ష్మీనాధ్ మందిరం దీనిని 1494 లో యిసుక రాతి తో నిర్మించేరు . విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కి సమర్పించబడింది . ఈ విగ్రహాలను ' లోదర్వ ' నుంచి తెప్పించేరు . మందిరం లోపల యే ఆర్భాటమూ లేని శిల్పకళ మనలను కట్టిపడేస్తుంది . మందిరం తలుపులకు వెండిరేకు పై వున్న సున్నితమైన పనితనం మనలను ఆకర్షిస్తుంది .

జైనమందిరం---

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ' దిల్వారా ' శిల్పకళను అనుకరించి కట్టిన కోవెల బయటకు చాలా చిన్నదిగా కనిపించినా లోపల చాలా స్థంబాలతో అంతస్తులలో నిర్మించిన కట్టడం . ఈ మందిరంలో ముఖ్యంగా ' జంబూద్వీపం , జైన తీర్ధంకరుల శిల్పాలు చూడదగ్గవి . ఈ మందిరం వృషభ దేవునకు , సంభవదేవునికి సమర్పించేరు . ఈ మందిరం 12 గంటలవరకు మాత్రమే తెరచి వుంటుంది కాబట్టి ముందుగా యీ మందిరాన్ని చూసుకోమని పర్యాటకులకు మనవి .

శిల్పకళకు సంబంధించిన అనేక దుర్లభమైన గ్రంథాలు యీ మందిరం లో నిక్షిప్తం చేసేరు . ఆసక్తి వున్నవారు చూడొచ్చు . ఈ కోవెలలో వివిధ దేవతా మూర్తులు , వివిధ జంతువుల శిల్పాలు చూడొచ్చు . జైసల్మేరు ని అత్యధిక జైనమతస్థులు నివసించే పట్టణంగా చెప్పొచ్చు .16 తీర్థంకరుడైన శాంతినాథుడు , 23 వ తీర్థంకరుడైన పర్శ్వనాథులకు సమర్పించన మందిరాలు సమయాభావం లేనివారు దర్శించుకో వచ్చు .

సోనార్ ఖిలాని UNSCO వారు world heritage site గా గుర్తించేరు . ప్రసిద్ధ బెంగాలీ సినిమా డైరెక్టర్ ' సత్యజిత్ రే ' రచించి అనంతరం సినిమాగా రూపొందించిన డిటెక్టివ్ నవల ' సోనార్ ఖిలా ' యీ కోట లో జరిగినట్లుగా రాసిన దేనని అంటారు . అలాగే చాలా బాలివుడ్ సినిమాలు , టీవీ సీరియల్  ' బాలిక బధు ( చిన్నారి పెళ్లి కూతురు ) ' యిక్కడ నిర్మింప బడ్డాయి . రాజస్థాను లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజ భవనాలను పోలిన భవనాలు నిర్మించుకుని నివశించడం సాధారణ విషయం . అలాంటి భవనాలు పర్యాటకులు సందర్శనార్దం రెండు భవనాలు వున్నాయి . ఒకటి పెద్ద వ్యాపారి నిర్మించి నివసించిన ' వ్యాస ' భవనం . రాజ భవనాన్ని పోలిన ఈ భవనం అనేక గదులతో విశాలమైన వాకిళ్ల తో వారు గడపిన విలాసవంతమైన జీవనానికి ప్రతీకగా వుంటుంది . రెండవది జైసల్మేరు రాజ్య మంత్రులు నివసించే భవనం . దీనిని శ్రీనాధ భవనం అని అంటారు . ఈ భవనాలకు యెదురుగా ' జలమహల్ ' వుంది . పరిశుభ్రత లోపం జైసల్మేరు లో అడుగడుగునా కనిపిస్తూ వుంటుంది . ముఖ్యంగా జలమహల్ నీటిలో పాచు పట్టి , చెత్తలు పోసి నీటిని కలుషితం చెయ్యడం చూస్తే చాలా బాధ కలుగుతుంది . రోడ్ల వెడల్పునకు , శుచి శుభ్రం పై నగర పురపాలక సంగం వారు దృష్టి పెట్ట వలసిన అవుసరం యెంతైనా వుంది .

జైసల్మేరు లో వివిధ రంగుల బట్టలను వుపయోగించి తయారు చేసే వాల్ హేంగింగులకు ప్రసిద్ధి . ఒంటె చర్మం తో చేసే రకరకాలైన సామానులు సరిసమైన ధరలకు దొరకుతాయి . అలాగే ఒంటె యెముకలతో , పళ్ల తో తయారు చేసిన ఆభరణాలు పర్యాటకులు ఆకర్షిస్తాయి , సరిసమైన ధరలకు దొరకుతాయి . ఆసక్తి వున్నవారు పై వస్తువులను జైసల్మేరు కొనుక్కోవచ్చు .

ఏ వస్తువులకు యే ప్రదేశం ప్రసిధ్దో అక్కడ కొనుక్కుంటే మనకి మంచి ధరకు నాణ్యమైన వస్తువులు దొరకుతాయి . అలాగే బికనీరు భుజియా , సేవ్ లు , స్వీట్స్ కి ప్రసిద్ధి . జైసెల్మేరు ' కచోరీ ' లకి కూడా ప్రసిధ్ది .  యెన్నోరకాల కచోరీలు జలమహల్ కి యెదురుగా వున్న సందులో దొరకుతాయి . ఆసక్తి వున్నవాళ్లు ట్రై చెయ్యొచ్చు .

మరిన్ని శీర్షికలు
pounch patas