Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  niharika

ఈ సంచికలో >> సినిమా >>

ఒక మనసు చిత్ర సమీక్ష

oka manasu movie review

చిత్రం: ఒక మనసు 
తారాగణం: నాగశౌర్య, నిహారిక, రావు రమేష్‌, ప్రగతి, అవసరాల శ్రీనివాస్‌, నాగినీడు, రాజా రవీంద్ర తదితరులు 
సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 
ఛాయాగ్రహణం: రామ్‌ రెడ్డి 
దర్శకత్వం: రామరాజు 
నిర్మాత: మధుర శ్రీధర్‌ రెడ్డి 
నిర్మాణం: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 24 జూన్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

రాజకీయ నాయకువడ్వాలనుకునే కుర్రాడు సూర్య (నాగశౌర్య). అతనికి సంధ్య (నిహారిక) పరిచయమవుతుంది. పరిచయం, ప్రేమగా మారుతుంది. అయితే, కొన్ని కారణాలతో ఇద్దరి మధ్యా మనస్పర్ధలు పెరుగుతాయి. అదే సమయంలో ఓ చిన్న గొడవ కారణంగా, చేయని తప్పుకి జైలుకు వెళతాడు సూర్య. జైలుకు వెళ్ళిన సూర్యతో సంధ్య ప్రేమ కొనసాగిందా? రాజకీయ నాయకుడవ్వాలనే సూర్య కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

నాగశౌర్య మంచి నటుడు. ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాలతోనూ నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇందులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్‌గా కనిపిస్తూనే, భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు. డ్రమెటిక్‌గా కాకుండా సినిమాలో జీవించేస్తున్నాడనేంతలా అతని పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. చాలా మెచ్యూర్డ్‌గా చేశాడు.

తొలి ప్రయత్నంలోనే నిహారిక మంచి నటి అనిపించుకుంది. అనుభవమున్న నటితో చేయించాల్సిన పాత్రను నిహారికతో చేశారు. ఆమె ఆ పాత్రకు న్యాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నించింది. చాలా బాగా చేసింది. తొలి సినిమా కాబట్టి, స్క్రీన్‌ ప్రెజెన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌లో చిన్న చిన్న లోపాలున్నా, అవి తదుపరి సినిమాకి వుండకపోవచ్చు. అంతలా మెచ్యూరిటీని మొదటి సినిమాలోనే చూపించింది. నటిగా ఆమెకు తొలి సినిమానే పెద్ద పరీక్ష పెట్టిందనడం నిస్సందేహం.

రావు రమేష్‌ ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీనివాస్‌ అవసరాల కథలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
కొత్తదనంతో కూడిన కథ, భావోద్వేగాల నడుమ నడిచే కథ అంటే కొంచెం నమ్మదిగా నడవడం సహజం. ఇక్కడే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. కథలా కాకుండా, జీవితంలా సినిమా తెరకెక్కించాడు. మంచి ఫీల్‌ని మిగిల్చాడు దర్శకుడు. కథనంలో వేగం ఇలాంటి సినిమాల్లో ఆశించడం తప్పు కాదుగానీ, ఫ్లేవర్‌కి ఏమాత్రం ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్‌, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ బాగున్నాయి. నిర్మాణపు విలువలు చాలా బాగా ఉన్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది.

ప్రేమకథను కొత్తగా, హృదయానికి అత్తుకునేలా చెప్పగలిగితే ఎన్ని ప్రేమకథలు వచ్చినా బోర్‌ కొట్టదు. ప్రేమ కథలో ఉండే ఫీల్‌ అలాంటిది. ఈ సినిమా కూడా అలాంటి మంచి అనుభూతినే ప్రేక్షకుడికి కలిగిస్తుంది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ రెండూ సరి సమానంగా నడిచాయి. అక్కడక్కడా ఎమోషన్స్‌ పెరగడం, సినిమా స్లోగా నడుస్తున్నట్లు అనిపించడం, అంతలోనే మంచి ఫీల్‌ని కలిగించడం ఇలా సాగుతుంది సినిమా. చక్కని కాస్టింగ్‌ ఎంపికతోనే సినిమాకి మంచి ఫ్లేవర్‌ తీసుకురాగలిగాడు దర్శకుడు. పొయెటిక్‌గా సినిమా చెప్పడం ప్లస్‌ పాయింట్‌. యూత్‌ని టార్గెట్‌ చేసిన సినిమా ఇది. అయితే కమర్షియల్‌ లవ్‌ స్టోరీస్‌కి భిన్నంగా రూపొందించిన ఈ అందమైన సినిమాకి నేటి యూత్‌ ఎంతవరకు కనెక్ట్‌ అవుతారో చూడాలి. ఓవరాల్‌గా నిజాయితీతో కూడిన ప్రేమని, అంతే నిజాయితీగా దర్శకుడు తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. సినిమాకి జరిగిన పబ్లిసిటీ, క్రియేట్‌ అయిన హైప్‌ సినిమాకి ప్లస్‌ అవుతాయి ఖచ్చితంగా. ఓ మంచి సినిమా తీశాడనే ప్రశంసలైతే దర్శకుడికి దక్కుతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
అందమైన, అచ్చమైన, స్వచ్ఛమైన మనసు

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
mega star ready.. start action camera