Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sixth Part

ఈ సంచికలో >> సీరియల్స్

ఆమళ్ళదిన్నె శర్మ గారి అబ్బాయి అను ఏసోబు - వల్లూరి రాఘవరావు

Aamalladinne Sarmagari Abbayi

మండువా లోగిలి ఆ రోజు అంత సందడి లేకుండా వుండినది. మా పెదనాయన (సోమంచి కృష్ణయాజులుగారు) బయట పెణక కింద నించోని జంధ్యాన్ని వొకచేత్తో ముందుకు వెనక్కూ లాగుతూ వీపు తీట తీర్చుకుంటున్నారు. అలాటి వొకదారపుపోగు అందుకు తప్ప మరిదేనికీ వాడడం నేను చూడలేదు.

-మాల్లంబ్డీకొడుకులు. థూ మాల్లంబ్డీకొడుకులు అంటూ రొంటి నుంచి పొడంకాయ తీసి వొక్క పీల్పు పీల్చినాడు ఆవేళ కొద్దిగా మబ్బుపట్టి వుండింది. వంట గదిలోంచి ఇంగువా చారు, అగరొత్తుల పొగ కలిసిన వింత వాసన లోగిలి అంతా వ్యాపించినది.

-మిషనరీ స్కూల్సు రావడం ప్రాణాంతకం అయింది. జాత్తక్కువ పీనుగులంతా బరి తెగించేవారు అని మళ్ళీ మాల్లంబ్డీకొడుకులు, మాల్లంబ్డీకొడుకులు అంటూ పెదనాయన గురగుర లాడేవాడు.

తేళ్ళ విశ్వాసం అనే రెవిన్యూ గుమస్తా వొకాయన మా ఇంటి ముందు నుంచి అప్పుడే వెళ్ళేవాడు. నేను చెప్పజాలని రంగుగల అత్యద్భుతమైన బష్ కోటును, ఆకుపచ్చ పంట్లాం లోకి దోపి మిల్లరు బూట్సులు వేసుకుని ఉండినాడు. అది నాకెంతో నచ్చినది మా పెదనాయన మాత్రం ఎందుకో అదేపని తిట్టినాడు. మనిషై పుట్టాక అలాంటి రంగుల గల మహాతమాషా అయిన గుడ్డలు వేసుకోవాలని పెద్ద బ్రాహ్మలకి వుండదు. నాలాంటి చిన్న బ్రాహ్మలు అడిగితే - ఎగ్గు మాలిన పనులు తల పెట్టకు అని తిట్టినారు.

మొలకు తప్ప వొంటిమీద వొక్క గుడ్డ అయినా లేకుండా మా నాయన, పెద్దనాయన, బాబయ్యలు వీధులలోకి బోర విరుచుకుని పోయేవారు. వాళ్లకు దక్షిణలు, దణ్ణాలు బానే వుంటాయి. వొంటిమీద ఏ అచ్చాదనా లేక పోయినందుకు వాళ్లకు ఎగ్గులేదు. విశ్వాసం వంటి మాలాడు మహా తమాషా అయిన గుడ్డలు వేసుకుని వెడితే అంతా చోద్యంగా నవ్వుకోవడం నేనెరుగుదును. వొంటిమీద అన్ని గుడ్డలు వున్నప్పటికీనూ విశ్వాసం నంగి నంగిగానే పోతుంటాడు.

-బ్రాహ్మలలో గుడ్డలు వేసుకోవాలన్న తహతహ యేదీ వుండదా? అని నేను యోచిస్తుండగా, మా దొడ్డమ్మ మాటలు వినపడినయి బోడిగుండుపై ముసుగు సరిచేసుకుని జీలుగు బుర్రతో మడిబట్టను గోడమీంచి లాగి.

-ఈ కుర్ర ముండలతో వేగలేక చస్తున్నాను. ముట్టూ అంటూ లేకుండా శుద్రాళ్ళు ఫాయివా తయారైవారు అంటూ తిట్టినది. అంతలో మా పెదనాయన అందుకొని మాల్లంబ్డీకొడుకులు వల్లే ఇదంతాను... ఈ వెధవముండలకి మిషనరీ స్కూల్సు  కావల్సొచ్చిందేం? అంటూ మా అక్కయ్యలను తిట్టినాడు.

రొండో వాటా లోంచి మా బాబయ్య వొక పత్రికను గుండ్రప్పటిగా చుట్టి బయటకొచ్చినాడు. ఒరే వొక సిజర్స్ పెట్టి గుర్రం నాడా అగ్గిపెట్టె తేఫో! అని నన్ను కొట్టుకు బెత్తాయించినాడు. ఆ కొట్టు కివతల చింతచెట్టు కింద శూద్రాళ్ళ ఆడమనిషి పుల్లట్లు మహా రుచిగా వేస్తుంది. పావలాకు మూడు!! సిజర్స్ తేగా మిగిలిన చిల్లరతో అట్టు తినవలెనని నా ఆశ. దాని కూతరు నా ఈడుదే!

-ఓలమ్మా... బేపనోడు ఆ పాలు తింటాడంట. అహ్హహ్హ... అంటూ నవ్వుతుంటే దాని ఆగడం చూసి నాకు ముచ్చెమటలు పోసేవి. కొంపలో ఈ విషయం పొక్కినట్లాయేవా? నాకు బడితెపూజ తప్పదు.

వొకసారి మా పెద్దనాయన వేస్తు కుప్పాయెగ్గెన్న శాస్త్రి పన్ను చింతచెట్టు కింద ఆపాలు తింటుండగా చూసినాడు. ఆ సాయంత్రం మా నాయన కాపుకాసి నన్ను బల్లోంచి తీసుకుపోయినాడు. ఆరి మ్లేచ్చుడా! నీకేమి దొమ్మ దాపురించిందిరా? హవ్వ!! శూద్రకూడుపై యావ పోయిన దేమిరా? త్రాష్టుడా! అని బాగా తిట్టి వొక జంతిక కొని పెట్టినాడు. అలా చేయవాకు... పెదనాయనకు తెలిస్తే. అక్కడితో సరి! నేనిట్లా నిన్ను కలిసినట్టు ఎవరికీ చెప్పకు. యెగ్గెన్న పెదకాలవ దగ్గర కనబడి నీ త్రాష్టాన్ని చెప్పినాడు. మరికపై ఇలాంటి పనులు చేయకు అని సైకిలెక్కి మూడు లాంతర్ల సెంటరు వైపునకు వెళ్ళిపొయినాడు. తదాదిగా నాకు పుల్లట్టు తినాలన్న ఆశ బాగా పెరిగినది. మా నాయన ఆ రోజు నాకు కొనిచ్చిన జంతికను బహుశా శూద్రాళ్ళే తయారు చేసారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను.

బడి గంట మూడవసారి మోగినది ఎండ చుర్రుమంటున్నది. యాకుందేందు తుషార హరధవళా... అని బడి అసెంబ్లీలో లక్కవాజుల గోపాలం గారి అమ్మాయి ప్రార్ధన మొదలు పెట్టి వుండింది. ఆ రోజు యెంచేతో నాకు ప్రార్ధన మీద భక్తి తగ్గినది. ఎండ వలన పిల్లలకు భక్తి తగ్గడం అందరం ఎరిగిన విషయమే కదా?

నా పక్క వరస నుంచి ఏసోబు తెల్లగా నవ్వినాడు. వాడట్లా నవ్వుతుంటే మనక్కూడా అట్లా నవ్వాలనిపిస్తుంది. పల్లటి రంగు మొత్తంగా వున్న వాడి శరీరంలో పళ్ళకే తెల్లరంగు వుండింది. వాడు నాకు పరమ ఆప్తుడు చీమ చింతకాయ గుబ్బలు సన్నగా బ్లేడుతో చీరిన తేగ ముక్కలు, పప్పు చెక్కలు జామెంట్రీ బాక్సులో వేసుకొచ్చి నాకు పెడతాడు. ఆ బాక్సునందు కోణమానిని, వృత్తలేఖని వంటివి నేనెప్పుడూ చూసి ఉండలేదు. మినపనుల్నీ, గోరుమీటెలు, తొక్కుడు లడ్లు నేను తెస్తాను. వాటికన్నా చీమ చింతకాయల్లోనే ఏదో మజా వుండింది.

ప్రార్ధన అవగానే బడి మొదలయింది. గదంతా వొకరకమైన ఉల్లాసకరమైన వాసనతో నిండి వుండినది. చాక్ పీసుల పొడి, గోడల పక్క వచ్చే పుచ్చల వాసన మధ్య ఈ తిళ్ళు ఆ వాసన పీల్చవలసిందే యెవరైనా!!

అవుట్ బెల్లుకు ముందు వొక బట్టతల ఆయన క్లాసులోకి వచ్చి మాష్టారుతో యేదో చెప్పి నమస్కరించినాడు. ఆ తర్వాత ఆయన - బ్రాహ్మల పిల్లలంతా నాతో రండి. బులుసు దొడ్డమ్మ గారి ఇంట్లో ఇవేళ నందికేశుడి నోము. అట్లు పెడతారు. కావలసినవన్నీ తినొచ్చు. కానీ చిన్న తునక కూడా వదలకూడదు. మహాపాపం అలా చేస్తే!! బ్రాహ్మల పిల్లలంతా లేచి రండి. అని వెళ్ళి పోయినాడు వూరకే అట్లు! అవీ తిన్నన్ని తినొచ్చు. నందికేశుడి నోములు మాలో మామూలే.

మేమంతా జట్లు వేసుకుంటుండగా ఏసోబు - "బ్రాహ్మలే ఎందుకురా? అనివాడు. మరి మేమో?" అట్లు బ్రాహ్మలే తినాలి అన్నాను. ఎంచేత అలా? నువ్వేమో మా సోడా మా పంది పిల్లలతో ఆడతావు. సోడాబండిని బుర్రుబుర్రున నడిపిస్తావుకదా? అనివాడు. ఇప్పుడువాడిని తీసుకెళ్ళమంటే నాకు యేం బాగోదు! మా పెదనాయన వాడిని మాలకాకి, యానాది కుక్క అంటాడు. వాడు అట్లా నాకెప్పుడూ కనిపించలేదు. పైగా సుబ్బమ్మదేవి స్కూలు వెనుక వున్న వాళ్ళ తోళ్ళ షాపుల్లో నా ఆటలన్నీ సాగేవి. బుజ్జి బుజ్జి పందిపిల్లలూ, ఎర్రగా కమురు రంగుకు తిరిగిన తోళ్ళు, కొన్ని ఖాళీ సోడా బళ్ళు, వొక చిన్న బడ్డీ అక్కడ ఉండినవి. అవన్నీ నాకు మహా ప్రీతిపాత్రమైనవి. వాడు మాల్లంబ్డీకొడుకైతే నేను బేపన లంబ్డీకొడుకుని. వాళ్ళింట్లో నన్ను కూడా అలానే అంటారేమో? ఏది ఎట్లున్నా వాడి అట్ల నోముకి తీసుకుపోవాలి. ఇదిగో ఏసూ - నొకమాట. నువ్వు అక్కడ ఏమీ మాట్లాడవాకు. నువ్వు ఆమళ్ళదిన్నె శర్మగారి అబ్బాయివని నేనంటాను. నువ్వు తల ఊచు! అదీ నేనలా అన్నప్పుడే తల ఊచాలి సరేనా??

మేమంతా ఒక వరసగా బయలుదేరి డొంకరోడ్డు దాటి ఒక్కసారి జట్టుగా విడిపోయినాము. పెదకాలువ హనుమంతుడి గుడిపక్కన బులుసు దొడ్డమ్మగారి యిల్లు! మమ్మల్ని అందరినీ బట్టతలాయన లోపలికి తీసుకువెళ్ళేవాడు. బాదం ఆకుల కుట్టుడు విస్తర్లలో అల్లప్పచ్చడి లేత యెరుపులో తెల్లటి పొరలవలె  వున్న అట్లూ వేసినారు. ఏసోబుగాడు ఠక్కున ముట్టినాడు. నీకు వొడుగైందా అని అడిగాను. అదేమో! అది కానట్లయితే అట్టు తినరాదా అన్నాడు. ముందు వొడుగైన వటువు ముట్టాలి. అందాకా మనం తినకూడదు అన్నాను. మా పెదనాయన అలాగే తింటాడు. అలాగే నేనూ చెప్పినాను. -వొడుగంటే ఏమివుంటుంది? "అది అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది" నేను అన్నాను. నాకు తెలియదు. తినగలినన్ని అట్లు నేనూ ఏసేబూ తినేశాము. బ్రాహ్మలు మాత్రమే చేసే, తినే నోములో శూద్రుడు కూడా తినినాడు. నా సామి రంగా! నాకు భలే మజా వచ్చింది. ప్రతి శూద్రుడు ఏసోబులాగునే బ్రాహ్మడై పోతే బాగుంటుంది. అలా అవ్వడానికి నేను కొన్ని గోత్రాలు ఇళ్ళ పేర్లు చెబుతాను. అప్పుడు అందరూ అట్లు తినొచ్చు.
 
మేమందరం ఎనమదుర్రు చెక్క వొంతెన ఎక్కేసరికి ఉగ్రరూపుడైన బట్టతల మనిషి ఒరేయ్! మాల్లంజాకొడకా, నీ కెన్ని గుండెలురా, ఆగరా అంటూ రంకెలు వేయసాగాడు. నా గుండెలు జారిపోయినవి. వొకవేళ ఏసోబు శూద్రుడని తెలిసిందా? శూద్రాళ్ళూ... మాలాళ్ళు వొక్కల్లేనా? నాకు సందేహమయి అడిగాను. మీరు శూద్రాళ్ళా, మాలాళ్ళా? ఏమిటి తేడా అన్నాను. వాడు అయోమయంగా చూసి యేదో చెప్పబోయే లోగా వొక పెద్దచెక్క పేడు వాడి వీపును తాకినది. నాకు భయమైంది. యెంత ధైర్యంరా నీకు? బులుసుదొడ్దమ్మ ఇంటిదగ్గరి బట్టతలవాడు ఏసోబును కొట్టినాడు. ఏసోబు చొక్కా ఆ పేడుకు వున్న మేకుకు దిగి చిర్రున చీలిపోయింది. వాడి పల్చటి వీపుపై ఎర్ర పెన్సిల్ తో రాసినట్టయింది. అమ్మతల్లో! అని అరిచినాడు. చాలామంది ఈ గొడవకు పోగయినారు. ఊ నడవండి అని కొందరు మమ్మల్ని తరిమేశారు. మా పెదనాయనకు ఈ సంగతి తెలిస్తే నాకు గుండె జారిపోయి వుండింది.

మూడు రోజులు గడిచి పోయినాయి. ఏసోబు గాడికి వాతం కమ్మిందని పుట్లట్ల శుద్రదాని కూతరు చెప్పింది. ఎందుకిట్లా అయిందో నాకు తెలియకుండా వుండింది.

నేను అవుట్ బెల్లుతో తోళ్ళ షాపుల దగ్గరకు వెళ్ళినాను. ఏసోబు వాళ్ళ నాయన నన్ను చూసి వొక బూతుమాట అన్నాడు. బాపనోడు బాపనోడిలా వుండాలిట. మాలాళ్ళతో నేస్త కట్టరాదని చెప్పినాడు. అలా చేస్తే మాలాళ్ళని బతకనివ్వరట.

ఇకపై ఇక్కడికి రావాకు. మా లంజోడిక్కి తలలేదు. నీకేమొచ్చింది? అన్నాడు. నాకు పెద్దగా ఏడుపు వచ్చింది. ఏసోబును తీసుకెళ్ళినందుకు నన్ను కూడా కొట్టాలి. నా వీపు చీరేయాల. అలా కాలేదు. ఆ తర్వాత వాడు బడి మానేశాడు. వొకనాడు చీమ చింతచెట్ల దగ్గర ఆవుపడివాడు. ఆ నోముకు వచ్చినందుకు దొడ్డమ్మగారి దత్తుడు చావబాదివాడిని, ఆ తర్వాత వాళ్ళ నాయనా, వాళ్ళ అమ్మ కూడా తననే బాదేవారని అలాటి పెద్ద ఇళ్లకు మాలోళ్ళు వెళ్లకూడదని చెప్పినారని అన్నాడు. నేను మా దొడ్డమ్మలా బుగ్గలు నొక్కుకుని హవ్వహవ్వ!! అనినాను. నాకు అలా అనాలనిపించింది. ఆ తర్వాత వాడు బాగా ఏడ్చినాడు. నేను కూడా ఏడ్చినాను. "నా జోలికి రావాకు! నువ్వు వచ్చినప్పుడల్లా నేను దెబ్బలు తింటున్నాన"ని చెప్పినాడు.

తదాదిగా వాడు నన్ను ఎక్కడ చూసినా వొక భూతాన్ని చూసినట్టు జడుసుకునే వాడు. నాకు ఇదంతా బాధ అయింది. మాలాళ్ళకీ, బ్రాహ్మలకి వొకేలా ఆకలి వేస్తుందని, వొకేలా అట్లో, అన్నమో తింటారు అనిపించింది. ఇదంతా ఎందుకు ఇలా జరిగిందని మాతెలుగు మాస్టారిని అడిగాను.

గవర్నమెంటు రూల్స్ వచ్చి మాలమాదిగలు సంఘంలోకి వొచ్చేసినారని వాళ్ళతో గవర్నమెంటుకు యెంతోపని వుందని, అలా కావడం చేతనే లోకంలో పాపం పెరిగిందని ఆయన చెప్పినాడు. ఎవడు ఎక్కడ వుండాలో అక్కడే వుండాలి అన్నాడు. - అలా యెంచేత? అని అడిగినాడు. నా చెవిని మురిపెంగా మెలిబెట్టి ఇదే చురుకు వుంటే పెద్దవాకా వార్డు కౌన్సిలరవు అయ్యే లక్షణాలు వున్నాయని చెప్పి వెళ్ళిపొయినాడు. ఆల్ జీబ్రాలోని కొన్ని లెక్కలు ఇప్పుడునేను బాగా అర్ధం చేసుకోగలను. ఆ మాటలు మాత్రం అర్ధం కావు.

నా సాయంత్రాలు ఇపుడు మా ఇంటి పెనక కింద నిర్భాగ్యంగా గడిచిపోతున్నాయి. సరదా మజా యేవీ లేవు. ఏసోబుగాడి తెల్లటి నవ్వు, కుయ్యోమని నవ్వొచ్చేలా మోగే గోలి సోడా, బుర్రుబుర్రు మనే సోడా బండి, లేత తోళ్ళు యేవీ నాకిప్పుడు లేవు. ఈ పెద్దలంతా కలిసి యేదో చేసినారు. నాకు గోలీ సోడా కావాలంటే, పంది పిల్లలతో చేరి వుల్లాట ఆడాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇవన్నీ నాకు కాకుండా బులుసు దొడ్డమ్మ గారి దత్తుడిని పెద్దైనాకా చంపి పారేయ్యాలని అనుకున్నాను. అయినా నాకు ఆత్మ శాంతి చాలలేదు. అంచేత గుండ్రప్పటి గులకరాయి వొకటి చేత్తోపట్టుకుని పెద్ద కాలువ హనుమంతుడి గుడి వైపునకు పరుగు పెట్టాను.

(నా బాల్యాన్ని మింగేసిన కులం సాక్షిగా ఈ కథ అందరినీ వుద్దేశించి రాసిందే! ఏ మాత్రం కల్పితం కాదు)

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్