Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పన్నెండవ భాగము

Twelth part

ఇద్దర్నీ లేపి "వందేళ్ళు చల్లగా ఉండండ్రా... నాకేంరా గుండ్రాయిలా ఉన్నాను. చూస్తున్నారుగా " అంటూ ప్రేమగా మనవడి నుదుటిమీద, మనవరాలి నుదుటి మీదా ముద్దులు పెట్టింది.

"నాయనమ్మా! పెదనాన్న, పెద్దమ్మా, వాళ్లపిల్లలంతా బాగున్నారా?" అడిగింది శివాని.

"బాగున్నారమ్మా! అందర్నీ అడిగినట్టు మరీ మరీ చెప్పమన్నారు."

"మరి మావయ్య, అత్తయ్యలు ఎలా ఉన్నారు? శివాని బాగా చదువుతోందా?" అడిగాడు అనంత్.

"అవును నాయనమ్మా! నవీన్ ఎలా ఉన్నాడు? ఇప్పుడూ అల్లరి చేసి తన్నులు తింటున్నాడా?" నవ్వుతూ అడిగింది శివాని.

వాళ్ళిద్దరూ తమ వాళ్ళందర్నీ గుర్తుపెట్టుకుని అలా అడుగుతూ వుంటే చాలా మురిసిపోయింది అన్నపూర్ణేశ్వరి. అనవసరంగా వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలు విని, వీళ్ళిక్కడ అమెరికా పద్ధతిలో పెరిగి, మన పద్ధతులు, కట్టుబాట్లు వదిలేశారని భయపడింది.

అదేం లేకుండా మన పద్ధతుల్లో పెరిగారు అనుకుంది మనసులో. అయితే పాపం తల్లిదండ్రుల ప్రోద్భలంతోనే వాళ్ళిద్దరూ చిలక పలుకుల్లా వల్లెవేస్తున్నారని, అలా మాట్లాడుతున్నారని అన్నపూర్ణేశ్వరికి తెలీదు. మనవడు, మనవరాలు, కోడలితో బాటు ఆవిడ లోపలకు నడిచింది.

డ్రైవర్ కారు డిక్కీ లోంచి లగేజీ కిందపెట్టాడు. డాక్టర్ గోపాల్ వద్ద పేమెంట్ తీసుకొని, కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు నౌకర్లు వచ్చి లగేజీని లోనకు తెచ్చారు.

మేడపైకి ఆమె నడవలేదనే ఉద్దేశంతో హాలునానుకునే ఉన్న బెడ్ రూంలో లగేజీ పెట్టించాడు గోపాల్.

సత్యవతి స్వయంగా అందరికీ కాఫీ చేసి తీసుకొచ్చింది. కాఫీ తాగుతూ కబుర్లలో పడిపోయారంతా. ఊళ్ళో విశేషాలు, తమ బంధువుల పరిస్థితులు అన్నీ అన్నపూర్ణేశ్వరి చెప్తూంటే ఆసక్తిగా విన్నారు.

మధ్యలో ఆవిడ తనకిచ్చిన గదిలోకెళ్ళి సూట్ కేస్ తెరిచి ప్రత్యేకంగా తయారుచేసి, ప్యాక్ చేసి తెచ్చిన సున్నుండల పార్శిలు తెచ్చింది. అంతా తలొకటి తీసుకున్నారు.

"అమ్మా మీరు మాట్లాడుతూ ఉండండి. నేను బయటకు వెళ్ళాలి" అంటూ లేచాడు మధ్యలో గోపాల్.

"బయట చీకటి పడుతోంది. ఇప్పుడు ఎక్కడికిరా?" కొంచెం ఇబ్బందిగా చూస్తూ అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"అర్జంట్ ఆపరేషన్ ఒకటి వుందమ్మా! వెళ్ళాలి. ఫ్లైట్ లో వెళ్లి రావడం. ఉదయానికి వచ్చేస్తాను" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వెనకే సత్యవతి వెళ్ళింది.

అరగంట లోపలే స్నానం చేసి డ్రస్ మార్చుకుని బ్రీఫ్ కేస్ తో బయటకొచ్చాడు. తన కార్లో బయలుదేరి వెళ్ళిపోయాడు.

తను వచ్చిన రోజున కూడా ఇంటిపట్టున ఉండకుండా. ఎంత గొప్ప డాక్టరయినా ఇలా బయలుదేరి కొడుకు వెళ్ళిపోవడం ఎందుకో వెలితిగా అన్పించింది అన్నపూర్ణేశ్వరికి.

"మీరేం అనుకోకండి అత్తయ్యా! ఆయన ఎంత బిజీనో నాకు తెలుసు. నిజానికి ఈ ఆపరేషన్ కోసమే ఉదయం వెళ్ళాలి. మీరు వస్తున్నారని ప్రోగ్రాం చేంజ్ చేసుకొని ఆగారు. మనదేశంలోలా కాదిక్కడ. టైం కి చాలా విలువిస్తారు. ఒక్కసారి ప్రోగ్రాం ఫిక్సయ్యిందంటే మార్చడం కష్టం. సమయపాలన చాలా ముఖ్యం. పది అంటే పదిగంటలకి అక్కడ ఉండాల్సిందే. మన దేశంలో అయితే కాస్త ఆలస్యమయినా పరవాలేదనుకుంటాం... ఇక్కడ వీలుకాదు. పైగా మీ అబ్బాయికి ఇక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతలున్నాయి. గొప్ప గొప్ప వాళ్లే ఈయన అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. రేపు మనం ఆస్పత్రికి వెళదాం. మీరు స్వయంగా చూద్దురు గాని.." అంటూ అత్తగారి మనసు కనిపెట్టి వివరించింది సత్యవతి.

ఆ రాత్రి సత్యవతి తనే మున్నలూరులోని తమ ఇంటికి ఫోన్ చేసి వీడియోఫోన్లో అక్కడ అందరిచేత మాట్లాడించింది.

పెద్దకొడుకు రామలింగేశ్వర్రావు, కోడలు మహాలక్ష్మి, వాళ్ళపిల్లలు. అలాగే అల్లుడు రఘునాధ్, కూతరు భ్రమరాంబ, వాళ్ళ కొడుకు నవీన్, కూతరు మహేశ్వరి అంతా అన్నపూర్ణేశ్వరితో మాట్లాడారు. క్షేమంగా చేరుకున్నందుకు వాళ్ళంతా సంతోషించారు.

ఆ రాత్రి సంతోషంగా గడిచిపోయింది.

అన్నపూర్ణేశ్వరి డెట్రాయిట్ నగరం వచ్చి వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి.

ఇంట్లో వున్న పూజామందిరం ఆవిడకు ఎంతో నచ్చింది. ఇంట్లో మన దేవుళ్ళకు యధావిధిగా పూజలు పురస్కారాలు జరగడం ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తున్న విషయం.

అలాగే ఇంట్లో  ఉపయోగించే పండ్లు, కూరగాయలు తమ తోటలో పండుతున్నవే. పది ఎకరాల సువిశాలమైన తోటలో రెండెకరాలు ఇంటికి పూలకు తీసేస్తే, మిగిలిన ప్రాంతం అంతా పండ్లు, కాచే చెట్లు, కూరగాయల తోట ఆక్రమించుకున్నాయి.

పదిమంది పనివాళ్ళు. కానీ వాళ్ళలో ఒక్కరూ తెలుగువాళ్ళు లేరు. అంచేత వాళ్ళ భాష ఈవిడకు తెలీదు. ఈవిడ భాష వాళ్లకు తెలీదు. వాళ్ళతో ఏదన్నా పని వుంటే సైగలు చేసి చెప్పాల్సిందే. ఇక అక్కడ దొరికే పండ్లు, కూరగాయల్లో ఆవిడకు కొన్ని మాత్రమే తెలుసు. ఎందుకంటే, అవి ఇండియాలో దొరుకుతాయి కాబట్టి. మిగిలినవన్నీ ఆమెకు కొత్తే.

అత్తగార్ని వెంటపెట్టుకొని రోజూ సాయంత్రం వేళ తోటంతా తిప్పి చూపిస్తూంటుంది సత్యవతి. డెట్రాయిట్ లో ఉండడానికి ఇండియాకు చెందిన వారి కుటుంబాలు ఏభై వరకూ ఉన్నా, వాటిలో పది కుటుంబాలు మాత్రమే తెలుగు వాళ్ళవి. మిగిలిన వాళ్ళు పంజాబీలు, గుజరాతీయులు, కేరళ, కన్నడ రాష్ట్రాలకు చెందినవారు.

డాక్టర్ గోపాల్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటారు వాళ్ళంతా.

సత్యవతి రోజూ ఏదో ఒక టైం లో అత్తగారిని తన కారులో ఆయా ఇళ్ళకు తీసుకెళ్ళి పరిచయం చేసేది. తెలుగు కుటుంబాలు తను చూసినంతలో తన కొడుకు కుటుంబమే మార్పు లేకుండా తెలుగుదనంతో జీవిస్తున్నారన్పించింది ఆమెకు. మిగిలిన కుటుంబాల్లో పెద్దాళ్ళు, పిల్లలు కూడా అమెరికన్ పద్ధతులకే అలవాటు పడిపోయారు. కొందరు పిల్లలకు తెలుగు మాట్లాడటం కూడా రాదు. పరాయి భాష మాట్లాడినట్టు పట్టి పట్టి మాట్లాడుతున్నారు.

ఇక ఈలోపల అనంతసాయి, సాయిశివానీలకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి, వాళ్ళు పూర్తిగా చదువులో మునిగిపోయారు. నాయనమ్మ ఇంట్లో వుందిగాబట్టి డ్రస్సుల విషయంలో జాగ్రత్తగానే వుంటున్నారు. నీట్ గా మన పద్ధతుల్లోనే డ్రస్ చేసుకుంటున్నారు.

లంగా, ఓణీలు, పంజాబీ డ్రస్సులు వేసుకుంటోంది శివాని. అయితే శివాని తన కారులో డ్రస్సు తీసుకెళ్ళి దారిలో పంజాబీ డ్రస్ లో నుంచి తొడలు కన్పించేలా ఫ్రాక్, జబ్బలు కనబడేలా స్లీవ్ లెస్ స్కర్టులోకి మారిపోతోందన్న విషయం అన్నపూర్ణేశ్వరికి తెలియదు.

పదిరోజుల వరకు డెట్రాయిట్ నగరం నుండి బయటకు తీసుకెళ్ళి ఎవరూ, ఏమీ చూపించలేదు. అమెరికాలో చూడతగ్గవి ఎన్నో వున్నాయి. చూడాలని ఆవిడకు లేకపోయినా వెంటబెట్టుకొని తీసుకెళ్ళి చూపించాల్సిన బాధ్యత తమకుంది.

రేపు ఇండియా వెళ్ళాక అమెరికా వెళ్లి ఇంట్లోనే ఉన్నానని ఆవిడ చెప్తే అంతా నవ్వుతారు. ఈ విషయం డాక్టర్ గోపాల్ కి తెలుసు. తనకు తల్లిని వెంటబెట్టుకొని తీసుకెళ్ళే తీరిక ఎలాగూ లేదు. కాబట్టి బాధ్యతను సత్యవతికి కేటాయించాడు. డబ్బుకి లోటు లేదు. తిరిగి చూపించే ఓపికే కావాలి.

అలా కోడలి వెంట వెళ్లి ఓసారి న్యూయార్క్. మరోసారి హాలీవుడ్ అక్కడి డిస్నీ ల్యాండ్ ని, సినిమా స్టూడియోల్ని సందర్శించింది. మరోసారి వెళ్లి అమెరికా, కెనడా దేశాల సరిహద్దులో వున్న నయాగరా జలపాతాన్ని చూసింది.

ఇక కొడుకు ఆస్పత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు సహాయంగా పనిచేస్తున్నారు. స్థానికంగా వచ్చే కేసుల్ని ఆస్పత్రి స్టాఫ్ చూసుకుంటారు. ఆపరేషన్స్ చేయాల్సిన కేసుల మూలంగా తరచూ ప్రయాణాలు చేస్తుంటాడు గోపాల్. అమెరికా ముఖ్యనగరాల్లోని ఆస్పత్రులు ఆయన్ని కాంటాక్ట్ చేస్తుంటాయి.

వచ్చిన నెలరోజుల్లోనూ అయిదు రోజులు మాత్రం కొడుకుతో కాస్సేపు తీరికగా మాట్లాడగల్గింది అన్నపూర్ణేశ్వరి. మిగిలిన రోజుల్లో ఒక్కసారి అతని ముఖం చూడ్డం కూడా గగనమే. కొడుకు పేరు ప్రతిష్టలు గౌరవం వింటుంటే ఆ తల్లికి ఆనందమే. కాని డబ్బు, పేరు ప్రతిష్టల కోసం కొడుకు ఇలా కుటుంబానికి దూరంగా తిరుగుతుండడం మాత్రం ఆవిడకు బాధనిపించింది. ఇదే విషయాన్ని కోడలితో మాట్లాడి చూసింది.

"ఏమిటే అమ్మాయ్. సంపాదించింది చాలదా? ఇంకా ఎంతకాలం ఇలా ఇల్లు పట్టకుండా తిరుగుతూ వాడు కష్టపడాలి. ఇక్కడే మన ఆసుపత్రిలోనే స్థిరంగా వుండి వేళకు వెళ్లి రావచ్చుగదా. అది చాలదా?" అని అడిగింది.

ఆ మాట నిజమే అత్తయ్యా! నేను చాలాసార్లు చెప్పి చూశాను. కాని ఆయన వినడం లేదు. వయసు ఉంది, ఓపిక ఉంది. సంపాదించడంలో తప్పేంటి? పైగా నాది డాక్టర్ వృత్తి. ఆపరేషన్ తో ఒక్కో రోగిని బ్రతికించిన ప్రతిసారీ వాళ్ళు నాలో దేవుడ్ని చూస్తారు. ఆ కుటుంబం కళ్ళల్లో కన్పించిన ఆనందం మాటలకందనిది. నేను కేవలం డబ్బు కోసమే డాక్టర్ వృత్తి చేయడం లేదు. రోగుల్ని బ్రతికించడం కోసం చేస్తున్నాను. ప్రజల కోసమే ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. మన సంతోషాన్ని రోగుల కోసం కొంత త్యాగం చేస్తే తప్పులేదు అంటాడు. ఇంకేం చెప్పను. అందుకే ఆయన ఇష్టానికి నేను వ్యతిరేకంగా ఏమీ మాట్లాడను" అంది సత్యవతి.

మొత్తానికి పరాయి దేశంలో ఉన్నాననే భావనరాకుండా ఆవిడకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఈలోపల అనంతసాయి, శివానీ పరీక్షలు అయిపోయాయి. వాళ్ళ పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని అన్నపూర్ణేశ్వరి మనసులో వుంది. కానీ కొడుకు ఇంటిపట్టున సరిగా దొరికితే గదా మాట్లాడడానికి.

ఇలా ఉండగా సత్యవతి అత్తగార్ని తీసుకొని వాషింగ్టన్ సిటీకి వెళ్ళింది. అమెరికా అధ్యక్షుడి నివాసం అక్కడే. పెంటగాన్ రక్షణ కార్యాలయం కూడా అక్కడే వుంటుంది. వైట్ హౌస్, అక్కడి ఇతర విషయాలు చూసి తిరిగి వస్తున్నప్పుడు కోడలి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది అన్నపూర్ణేశ్వరి.

'ఏమిటే అమ్మాయ్. గోపాల్ మనసులోగాని, నీ మనసులో గాని ఏముందో నాకు తెలీదు. చిన్నప్పట్నుంచి అనుకుంటున్న విషయమే. మీ పిల్లల్ని నా కూతురు పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయాలన్నది నా కోరిక. ఇప్పుడు చూస్తే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కాని నేను వచ్చినరోజు ఏదో లాంఛనంగా నవీన్, మహేశ్వరిల గురించి వాళ్ళు అడిగారు గాని తర్వాత ఈ వూసేలేదు. వాళ్ళ మనసులో గాని, నీ మనసులో గాని ఏముందో తెలీదు.

మీ అంతస్థు, ఐశ్వర్యం చూశాక ఇప్పుడు నాకు భయం వేస్తోంది. నా కూతురు సంబంధం మీకు తగదనే అభిప్రాయం ఏమన్నా వుంటే ముందే చెప్పు. లేకపోతే నేను బయలుదేరే రోజు మీరు మాట చెపితే నేను తట్టుకోలేకపోవచ్చు" అంది బాధగా.

"అత్తయ్యా! మీరు కూడా ఇలా సందేహిస్తే నేనేం చెప్పను చెప్పండి. మీ అబ్బాయి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. డబ్బు, ఆస్థులు సంపాదించిన మాత్రాన మేం మీకు పరాయివాళ్ళం ఎలా అవుతాం. ఆయన ఎప్పుడూ మీ సంతోషాన్నే ఆశిస్తారు. నవీన్ మా అల్లుడు. మహేశ్వరి మా ఇంటి కోడలు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక అనంత్ గాని, శివాని గాని నవీన్, మహేశ్వరిల గురించి మాట్లడకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవు. ఇప్పుడేగా వీళ్ళకి పరీక్షలు అయ్యాయి. వీలు చూసి వీళ్ళిద్దర్నీ కొంతకాలం మున్నలూరు పంపించి వుంచామనుకోండి అప్పుడు ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు. కాదా?" అంది సత్యవతి.

"అవును కొంతకాలం వీళ్ళు కలిసి మెలిసి తిరిగితే గానీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడదు" అంది ఉత్సాహంగా అన్నపూర్ణేశ్వరి.

అయినా కూడా ఆమెను మనసులో ఇంకా ఇదీ అని చెప్పలేని ఏదో వెలితి ఇబ్బంది పెడుతూనే ఉంది. అదేమిటో ప్రస్తుతం అర్ధం చేసుకోలేదు గానీ అర్ధమయ్యే సమయం దగ్గరపడుతోందని మాత్రం ఆమెకి తెలీదు.

అమెరికా వచ్చినందుకు ప్రయోజకుడైన కొడుకు, గుణవతి అయిన కోడలు, బుద్దిమంతులైన మనవడు, మనవరాలు. వీళ్ళందరి మధ్య నెలరోజులు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తులేదు అన్నపూర్ణేశ్వరికి.

ఇంట్లో నలుగురికీ తలో కారు వుంది. అన్నీ ఖరీదైన కార్లు.

ఇవిగాక ఇంటి అవసరాల కోసం పనివాళ్ళు వెళ్లిరావడానికి రెండు వేన్లు కూడా ఉన్నాయి. కాలు బయటపెడితే కార్లు, విమానం. కోడలుతో కలిసి ఇంచుమించు చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసింది అన్నపూర్ణేశ్వరి.

ధనవంతమైన అమెరికా వైభోగాలు చూసి అన్నపూర్ణేశ్వరి ఆశ్చర్యపోయింది. ఆనందించింది. ఇంట్లో ఐకమత్యంతో అంతా సజావుగాను ఆనందంగాను గడిచిపోతున్నప్పటికీ కొడుకు విషయంలో ఆవిడ మనసులో కించిత్తు బాధగానే వుంది.

ధన సంపాదనే ధ్యేయంగా మరీ వృత్తికి అంకితమైపోయి యాంత్రికంగా కొడుకు పడే శ్రమ చూస్తుంటే ఆవిడకు చాలా బాధగా వుంది. మరీ ఇల్లు పట్టించుకోకుండా ఇంటి బాధ్యతలన్నీ భార్య సత్యవతికి వదిలేయడం కూడా ఆవిడకు నచ్చలేదు.

అమెరికా రావడంలో తప్పులేదు. సంపాదించడంలోనూ తప్పులేదు. కాని సంసార బాధ్యతల్ని విస్మరించడం ఎంత వరకు న్యాయం? ఇదే విషయాన్ని ఓ రోజు కోడల్ని అడిగింది.

"మీరు ఇలా అనుకోవడం తప్పులేదు అత్తయ్యా! ఎందుకంటే ఇక్కడి మనుషుల పద్ధతుల గురించి మీకు తెలియదు గదా. ఇక్కడ టైం కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇవాళ పని రేపుచేద్దాం అనుకోరు. ఖాళీగా కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు. శ్రమ దోపిడీ వుండదు. పన్నెండేళ్ళు రాగానే పార్ట్ టైం జాబ్ చేసి సంపాదిస్తూ తమ చదువులను తామే చదువుకుంటారు.

చదువులకోసం తల్లిదండ్రుల అధిక మొత్తాల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. వారమంతా కష్టపడి పనిచేసి వారంతా సెలవుల్లో ఆనందంగా గడుపుతారు. వీళ్ళ సంపాదనలో చాలావరకు విందులు, వినోదాలకే ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ సంపాదించుకోవడానికే ఇక్కడికి వచ్చిన మనలాంటి వాళ్ళు వీలైనంత వరకు సంపాదించుకోవడానికే పని చేస్తూంటారు. అలాగే మీ అబ్బాయి కూడా వృత్తిని అలక్ష్యం చేయకుండా ఇప్పటికీ పనిచేస్తున్నారు. సంపాదిస్తున్నారు.

ఇక్కడి ప్రజల సంస్కృతి ఆచారాల్లో కూడా చాలామంచి పద్ధతులున్నాయి. కొన్ని మనకి నచ్చనవీ ఉన్నాయి. అంతమాత్రం చేత వాటిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

అమెరికా వచ్చిన ప్రతి తెలుగు కుటుంబం ఎదుర్కొనే సమస్యలే మాకూ ఉన్నాయి. ముఖ్యంగా అడుగు బయటపెడితే మనం అమెరికా సంస్కృతిలోనే తిరగాలి.

ఆ ప్రభావం మనమీద, మన కుటుంబం మీద పడకుండా తెలుగుదనంలోనే మనం జీవించాలనే తలపు మాలాంటి వాళ్ళు అందరిలోనూ వుంటుంది. కాని ఆచరణలో అది చాలా కష్టమని తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పిల్లల విషయంలో. ఇక మీ అబ్బాయి అంటారా. ఆయన మన కుటుంబం కోసమే శ్రమపడుతున్నారు. అందుకే నేనూ సర్దుకుపోవడానికి అలవాటు పడ్డాను. మేం చాలా సంతోషంగా ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా.

ఈ విషయంలో మీరేమీ దిగులు పడక్కర్లేదు" అంటూ అత్తగారికి నచ్చజెప్పింది సత్యవతి. అయితే ఆమె వివరణ అన్నపూర్ణేశ్వరికి సంతృప్తి కలిగించలేదు.

ఈ పరిస్థితిలోనే ఆ రోజు, మనవరాలి అసలు వేషం అనుకోకుండా ఆవిడ కంటబడిపోయింది.

(...ఇంకా వుంది)
 

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
Sixth Part