Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Twelth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఆరవ భాగము

Sixth Part

"సీన్ లాస్ట్ లో హీరో హీరోయిన్ ని ముద్దుపెట్టుకోవాలని... ఉంటేనూ" సిగ్గుపడుతూ అడిగింది.

"చాల్రోజుల తర్వాత అనుకోకుండా కలిసిన హీరోహీరోయిన్లు కదా! అందులో వీర ప్రేమికులు. కాస్త రొమాంటిక్ టచ్ ఉంటే బాగుంటుందనీ... డైరక్టర్ గారే లాస్ట్ లో ఆ కిస్ యాడ్ చేసారు" చెప్పాడతడు.

"అంటే... హీరోగారిచేత నేను ముద్దు పెట్టించుకోవాలా?"

"కోవాలి... తప్పదు. అయినా, లిప్ టు లిప్ కిస్ కాదుకదా! బుగ్గపై చిన్నముద్దు. మీరు తన్మయత్వంతో కళ్ళుమూసుకున్నట్లు కళ్ళు మూసుకుని మీ మమ్మీని తలచుకోండి.
సింపుల్"

"అంతేనా?" అడిగింది గాయత్రీపాటిల్.

"అంతే..." అన్నాడు అసిస్టెంట్ డైరక్టర్.

"రెడీనా..." అరిచాడు డైరక్టర్ అంత దూరం నుంచీ మైకులో.

"రెడీ సార్..." ఆన్సరిచ్చాడు అసిస్టెంట్ డైరక్టర్ ఇక్కడ్నుంచి.

తర్వాత అతడు హీరోయిన్ వేపు తిరిగి - "మేడమ్... హీరో ప్రదీప్ తో మీ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో... మరే భయాలు పెట్టుకోకండి. ఈ సీన్ సూపర్బ్ గా వస్తుంది" అన్నాడతడు.

"సరే..." అంది ఆమె.

తర్వాత అతడు హీరోయిన్ నిల్చోవలసిన చోటు, పొజిషన్ చూపించాడు.

"సైలెన్స్... స్టార్ట్ కెమెరా... యాక్షన్" అని అరిచాడు డైరక్టర్.

వెంటనే గాయత్రీపాటిల్ చేతిలో ఎర్ర గులాబీతో హీరోవేపు ఉత్సాహంగా దూసుకెళ్ళి ఒక్క ఊదుటున కౌగలించుకుని - 'ఐ... లవ్... యూ...' చెప్పింది.

ఆమెని వదిలించుకునేందుకు హీరో ప్రయత్నిస్తున్నాడు. అయినా, ఆమె వదలడం లేదు. సీన్ పేపర్లో ఉన్న వరుస డైలాగులు వల్లెవేస్తున్నారిద్దరూ.

ఆ సమయంలో ఆమెకి హీరో ప్రదీప్ తన అభిమానిలాగే కనిపించాడు. దాంతో, ఆమె అతడ్ని మరింత మత్తుగా దగ్గరికి హత్తుకుంది.
హీరో ప్రదీప్ కి ఆ స్పర్శ భాష అర్ధమవుతోంది.

'అంటే... ఇన్నాళ్ళూ తమ మధ్య ఉన్నది కేవలం స్క్రీన్ కెమిస్ట్రీ అనుకున్నాను. కానీ, ఇదేమిటి... ఇవాళ ఆమె స్పర్శ చాలా కొత్తగా ఉంది. ప్రేమించి దూరమైన తన లవర్ ని చాలా కాలం తర్వాత నిజంగానే కలుసుకున్నట్లు... ఆమె అనుభూతి చెందుతోంది. అంటే... సీన్ లో అంతలా లీనమైందనుకోవాలా? లేక..." ఆలోచిస్తూ డైలాగ్ చెప్పడం మరిచిపోయాడు ప్రదీప్.

'కట్... చెప్పాడు డైరక్టర్.

తర్వాత హీరోవేపు చూసి... "సింగిల్ షాట్ లో ఒకే చేద్దామనుకున్నా. చివరిదాకా వచ్చేసాక... నీ డైలాగ్ మరిచిపోయావ్. మళ్ళీ ఇంకోసారి ఇదే సీన్' అన్నాడు.

"మళ్ళీనా?" అంది గాయత్రీపాటిల్.

"తప్పదు. ఈ సీన్ రక్తి కట్టాలంటే మళ్ళీ ఇంకోసారి తప్పదు... రెడీ... కెమెరా స్టార్ట్... యాక్షన్" సాంకేతిక పదజాలాన్ని వల్లె వేయడం ప్రారంభించారు డైరక్టర్.

కెమెరా రన్ అవుతోంది. గాయత్రీ పరుగుపరుగున వచ్చి మళ్ళీ హత్తుకుని - 'ఐ... లవ్... యూ...' చెప్పింది.

మళ్ళీ మరోసారి... హీరో అక్కడే తప్పులో కాలేసాడు. తను చెప్పాల్సిన డైలాగ్ ని మరిచిపోయాడు.

మళ్ళీ... మళ్ళీ... అలా పదోసారి తీసేసాక డైరక్టర్ కి అలుపొచ్చినట్లయింది.

"సరే... డబ్బింగ్ థియేటర్లో డైలాగ్ మిక్స్ చేసుకుందాం. మీరేమీ డైలాగ్ చెప్పకండి. ఎ... బి... సి... డి... అంటే చాలు" అన్నాడు డైరక్టర్.

"సార్... నన్ను అవమానపరుస్తున్నారు. నేను సిమ్లా నుంచి వచ్చిన హీరోని కాను. అచ్చ తెలుగబ్బాయిని. అన్నగారిలా డైలాగ్ బాగా చెప్పగలను"

"మరి... ఇప్పటిదాకా చెప్పలేదేం?"

"టెన్షన్... టెన్షన్"

"ఎందుకో... సిమ్లా యాపిల్లాంటి అమ్మాయిని మళ్ళీ మళ్ళీ కౌగలించుకుందామనా... డైలాగ్ చెప్పడం లేదు" అడిగాడు నిర్మొహమాటంగా డైరక్టర్.

"అదేం కాదు సార్..." అదేనని చెప్పడానికి సిగ్గుపడ్డ హీరో ప్రదీప్ మాట మార్చాడు.

ఆ సన్నివేశంలో డైలాగుల్లేని హీరోయిన్ లా గాయత్రీపాటిల్ అలా నిల్చుండిపోయింది.

"అసలేమైంది నాకు... నిజంగానే ఈ అమ్మాయి నన్ను కావాలని కోరుకుంటోందా?" ఆలోచిస్తున్నాడు ప్రదీప్.

"అసలేమైంది నాకు... నిజంగానే ఈ అబ్బాయిని ఇంత గట్టిగా తను కౌగలించుకుందా?" ఆలోచిస్తోంది గాయత్రీపాటిల్.

'హీరో హీరోయిన్ల మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నిర్మాత దర్శకులు తరచూ చెప్తుంటారు కదా? అంటే ఏమిటీ?" అడిగాడు సుదర్శన్ హీరోయిన్ గాయత్రీపాటిల్ ని.

'నవతార' పత్రిక కోసం స్పెషల్ ఇంటర్వ్యూ కావాలని పదిరోజులుగా ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగితే ఎట్టకేలకు షూటింగ్ గాప్ లో ఇంటర్వ్యూ చేసుకునేందుకు అనుమతిచ్చాడతడు. సాధారణంగా హీరోయిన్ల కాల్ షీట్లు చూసేందుకు... ఇలాటి ఇంటర్వ్యూలు మేనేజ్ చేసేందుకు... తమ హీరోయిన్ కి మీడియా పబ్లిసిటీ ప్రముఖంగా వచ్చేలా చూసుకునేందుకు పిఎ (వ్యక్తిగత కార్యదర్శి)లు ఉంటారు. కానీ, గాయత్రీపాటిల్ అన్నీ తనే చూసుకోవడం వల్ల... నిర్మాణ సంస్థ పెట్టే ప్రెస్ మీట్ లలోనే జర్నలిస్ట్ లను కలిసేందుకు ఇష్టపడుతోంది. ఎంతో వత్తిడి ఉంటే తనే మూవీ చేస్తుందో ఆ మూవీ ప్రొడ్యూసర్ పర్మిషన్ తోనే షూటింగ్ విరామసమయంలో ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలా ఆమె ఇంటర్వ్యూ తీసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు సుదర్శన్.

"ఇవాళ లంచ్ టైంకి రావయ్యా. హీరోయిన్ ఇంటర్వ్యూ ఇస్తానంది...' ప్రొడ్యూసర్ దగ్గర్నుంచీ ఫోన్ రావడంతో  ఎగిరిగంతేసి గబుక్కున కిందపడ్డాడతడు. ఫలితంగా... కాలు బెణికి కాస్త కుంటుతూ నడుస్తున్నాడు.

"అరే... మీ కాలికి ఏమైంది?" కుంటుతూ సుదర్శన్ తన దగ్గరికి రావడం చూసి పరామర్శించింది గాయత్రీపాటిల్.

"కాలుజారి... కిందపడ్డా. బెణికింది" చెప్పాడు సిగ్గుపడుతూ. జర్నలిస్ట్ హీరోయిన్ ని ప్రశ్నలడగాలి. జవాబులు రాబట్టుకోవాలి. కానీ... ఇక్కడ హీరోయినే జర్నలిస్ట్ ని ముందుగా ప్రశ్నించింది. ఆ చిన్నపాటి పరామర్శకే పరవశించిపోయాడు సుదర్శన్. గాయత్రీపాటిల్... సిల్వర్ స్క్రీన్ సిజ్లింగ్ బ్యూటీ. రంగురంగుల ఇంద్రధనుస్సు. వయారాల జలపాతం. చిర్నవ్వుల మల్లెలజల్లు. దూరం నుంచి ఆమె కటౌట్ చూస్తేనే నిలువునా నీరు కారిపోయే అభిమానులెందరో? వాళ్ళెవరూ ఇంత దగ్గరగా ఇంత అందాన్ని చూడలేరు. కేవలం తను జర్నలిస్ట్ అయినందువల్ల ఆమె చెంతనే ఓ చైర్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని అనేకానేక ప్రశ్నలడిగే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. అడిగేవారికి చెప్పేవాడు లోకువ... ఈ సామెత జర్నలిస్ట్ లకు ఎంచక్కా సూటవుతుంది.

"అడగండి... చెప్తాం" అని సినీ సెలబ్రెటీలు ఎదురుగా కూచుంటే సినిమాలకు సంబంధించినవే కాకుండా... వ్యక్తిగత జీవితాల్లోకి చొరవగా తొంగిచూడాలనుకుంటారు వీళ్ళు. మరింత చనువు కనుక ఇస్తే... 'మీ శరీరంలోని పుట్టుమచ్చలెక్కడెక్కడ ఉన్నాయో కాస్త చెప్తారా?" అని కూడా అడిగేందుకు ఏమాత్రం వెనుకంజ వేయనివాళ్ళు కూడా వీళ్ళే. ఈ పాత్రికేయ లక్షణాలకి సుదర్శన్ కూడా మినహాయింపు కాదు. నెమ్మదినెమ్మదిగా 'ఇంటర్వ్యూహం'లోకి చొరపడ్తూ చేస్తున్న సినిమాలోని కేరక్టర్ గురించి వివిధ ప్రశ్నలు సంధించాడు.

తర్వాత్తర్వాత... తెలుగునాట హీరో ప్రదీప్ కి ఉన్న క్రేజ్... ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేస్తున్న గాయత్రీపాటిల్ కి లభించిన అదృష్టం గురించిన పొగడ్తల్తో మాటకు మాట పేర్చాడు.

ఆ తర్వాతే అసలైన ప్రశ్న సంధించాడు - "హీరో హీరోయిన్ల మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నిర్మాత దర్శకులు తరచూ చెప్తుంటారు కదా? అంటే ఏమిటి?"

"కెమిస్ట్రీ అంటే... తెలీనట్లు అడిగింది గాయత్రీపాటిల్. ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాతే... హీరో హీరోయిన్ల స్క్రీన్ ప్రెజన్స్ గురించి ఎక్కువగా చెప్తూ 'కెమిస్ట్రీ...' అనే పదం వాడ్తారని
తెలుసుకుందామె.

"కెమిస్ట్రీ అంటే..." నీళ్ళు నములుతున్నాడు సుదర్శన్.

"ఊ... చెప్పండి. నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని. నాకు ఇంగ్లీష్ తెలుసు... ఇండియన్ హిస్టరీ తెలుసు. కానీ, కెమిస్ట్రీయే తెలీదు"

"నేనడుగుతోంది ఆ కెమిస్ట్రీ గురించి కాదు..."

"మరి... ఏ కెమిస్ట్రీ గురించి?"

"అదే... సిన్మాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ గురించి... ఈ సిన్మాలో ప్రదీప్ తో మీరు చాలా దగ్గరిగా ఉన్నారటగా?" అతడి మాటల్లో అసూయ ధ్వనిస్తోంది.

"స్టోరీ డిమాండ్ చేస్తే ఏ సినిమాలో హీరోతోనైనా దగ్గరిగానే ఉంటాను" చెప్పింది గాయత్రీపాటిల్.

"అదికాదు... ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కదా... మీరు మరింత దగ్గరగా ఉన్నారని విన్నాను"

"ఉండొచ్చు. కానీ, అది తెరవరకే..."

"ఒక్క విషయం సూటిగా చెప్పండి. వయసులో ఉన్న ఓ హీరో... హీరోయిన్ గట్టిగా కౌగలించుకుంటే ఏమీ అనిపించదా?"

"ఏమనిపిస్తుంది?"

"అదే... తామిద్దరం ఆడామగా అనే ఫీలింగ్ తో అస్సలేమీ అనిపించదా?"

"అనిపిస్తుంది..." అంది గాయత్రీపాటిల్.

"అదే... బాడీలో ఎక్కడెక్కడో తుఫానులు, సునామీలు ఎగిసిపడ్తున్న ఫీలింగ్ కలుగుతుంది కదూ! ఔను... హీరో హీరోయిన్లయినంత మాత్రాన వాళ్ళూ ఒకరికొకరు అపోజిట్ సెక్సే కదా! భిన్నదృవాలు ఆకర్షించుకుంటాయని సైన్స్ లో చదివాను. అది కరెక్టే కదా!"

భిన్నదృవాలు ఆకర్షించుకోవడం... అనగానే గాయత్రీపాటిల్ కి మళ్ళీ అభిమానే గుర్తుకురావడంతో కాసేపు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ అదే ప్రశ్నని సుదర్శన్ రెట్టించి అడిగేసరికి చిరాకుగా ముఖం పెట్టి - "ఏం మీరు ఎపుడూ ఏ ఆడదాన్నీ గట్టిగా కౌగలించుకోలేదా?"అనడిగింది.

ఆమె అంత సూటిగా అడిగేసరికి సమాధానం చెప్పలేక బిత్తరపోయి ఆమెవేపు చూడసాగాడు.

తర్వాత ఆమె అంది - "చూడండి... నాకు జర్నలిస్ట్ లంటే గౌరవం ఉంది. అంతకుమించి అభిమానం ఉంది. దాన్ని మీరు దిగజార్చుకోకండి. ఈ సినిమాలో నేను ప్రదీప్ ని కౌగలించుకున్నా... నన్ను ప్రదీప్ గట్టిగా ముద్దుపెట్టుకున్నా మేం ఒకరికొకరం హీరో హీరోయిన్లం మాత్రమే. అర్ధమైందనుకుంటాను"

"అంటే... హీరో ప్రదీప్ మిమ్మల్ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడా?"

"స్క్రీన్ మీదనే... నిజంగా కాదు..."

"నిజంగా ముద్దు పెట్టుకుంటేనే కదా... స్క్రీన్ మీద కనిపించేది"

"అయితే... పేపర్లో ఈ న్యూస్ వేసి సన్సేషన్ చేస్తారా?"

సుదర్శన్ సమాధానం చెప్పలేదు. గాయత్రీపాటిల్ అంటే నిజానికి ఎంత ఇష్టమో... అంతకు మించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ అంటే మరీ మరీ ఇష్టం. ఇంకా రిలీజ్ కాని ఓ సినిమాలో అపుడపుడే పైకి వస్తున్న హీరోయిన్ స్క్రీన్ సెన్సేషన్ కోసం ముద్దుసీన్ ని ఓకే చెప్పిందన్నదే... తను పాఠకులకు అందించవలసిన ప్రియాతి ప్రియమైన వార్త. అంతే! 'బాయ్...' అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.

"ముద్దు -

అధరాలపై అరుణరాగాల ఆనంద నెలవంక. ఏ వంకతోనో 'ప్రియనేస్తం' పెదవందుకోవడం హద్దులెరుగని ప్రణయానికి సాక్ష్యం. సంకేత స్థలాల్లో ఏకాంత ప్రేమికుల గుండె సవ్వడి ముద్దు. పెదవుల చివర్నుంచీ ఎదలో ప్రవహించే సందడి అది. ముద్దు ఒక పలకరింపు... ఒక పులకరింపు..." అంటూ ఆర్టికల్ మొదలెట్టాడు సుదర్శన్.

అంతేనా! సినీ నాయికానాయకులు చెంతగా చేరి కవ్వింతగా 'కిస్సి'చ్చి పుచ్చుకుంటే ప్రేక్షకులు 'కిస్ మిస్' తిన్నంత తీపితో తాదాత్మ్యం చెందుతారంటూ విశ్లేషించారు. ఎర్రెర్రని పెదవులు అందుకుంటే అదే 'ఆనందో బ్రహ్మ'. వర్తమాన సినిమాల్లో ఒక కథానాయకుడు నాయికకు ఇచ్చిన 'ముద్దు' నిమిషాల్లో లెక్కించుకోవడం విశేషమైతే... సిన్మా తొలినాళ్ళలో 'ముద్దు'సీన్లు తుఫాన్ రేపిన సంఘటనలు కోకొల్లలు... అంటూ సెలవిచ్చాడు. అప్పట్లో అక్కినేని లాంటి కథానాయకుడు బి. సరోజాదేవి లాంటి ఓ అందగత్తెని చూసి ఆనందంతో గెంతులు వేస్తూ 'అడగక ఇచ్చిన మనసే ముద్దు... అందీ అందని అందమే 'ముద్దు' అంటూ మోమాటపడ్డాడు. అంత మోమాటంలో కూడా - 'చకచకలాడే పిరిదులు దాటే జడను చూస్తే చలాకీ ముద్దు -' అంటూ ప్రేయసి అనురాగసరళిలోల 'ముద్దులవేట' సాగించేవాడని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత్తర్వాత - కొంచెం ముందుకురికిన మెగాస్టార్ చిరంజీవి లాటి హీరో - "ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు" అని మొండిగా డిమాండ్ చేసే స్థితికి చేరుకుంటే... నాయిక ఊరుకుంటుందా? 'ఇవ్వలేనివి అడగవద్దు...' అంటూ 'సెన్సార్' కత్తెరని చూపిస్తూ సుతిమెత్తగా హెచ్చరించేది. అదే చిరంజీవి మరి కొన్ని సినిమాలు చేసి రీల్ హీరోగా సీనియర్ అయిన తర్వాత... సౌందర్య లాంటి హీరోయిన్ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి - 'అబ్బబ్బా... ఇద్దూ! అదిరేలా ముద్దు' అంటూ ఖచ్చితంగా డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. అలా జంటగా ఆలపిస్తూ 'చలిపులిపంజా' తప్పించుకునే మార్గాన్వేషణలో ముందు పెదవుల మీంచి ప్రయాణానికి సన్నద్ధులవుతున్నారు నాయికానాయకులు. ఇపుడు లేటెస్ట్ గా గాయత్రీపాటిల్ ముద్దు సీన్ లో నటించి యమ రక్తికట్టించిందనే చెప్పాలి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న కొత్త సినిమాలో గాయత్రీ ముద్దు రుచిని చూసిన అదృష్టవంతుడైన హీరో ప్రదీప్. ఆయనకి కంగ్రాట్స్" అంటూ సుదర్శన్ తన ఆర్టికల్ కి ముక్తాయింపు ఇచ్చాడు.

"గాయత్రీ గారూ...! 'నవతార' సినీ పత్రిక చూసారా?" అడిగాడు ప్రదీప్ ఆరోజు షూటింగ్ విరామసమయంలో.

"లేదు..." తల అడ్డంగా ఊపింది గాయత్రీపాటిల్.

"ఆ పత్రిక్కి మీరేదో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారటగా... ప్రముఖంగా వేసారు" నవ్వుతూ చెప్పాడు.

"ఔనా?"

"మీరా పత్రిక చూస్తానంటే నా కారులో ఉంది. తెప్పిస్తాను" అన్నాడు ప్రదీప్. అతడికెందుకో... గాయత్రి ఆ పత్రికని చూస్తే బాగుండునని ఉంది. ఎందుకంటే... ఆరోజు షూటింగ్ లో ఆమెకి ముద్దిచ్చినపుడు... ఆమె గట్టిగా హత్తుకున్న విధానంలో అంతకుముందులేని స్పష్టమైన తేడాని అతడు గుర్తించాడు. ఆ స్పర్శ సౌఖ్యాన్ని అతడి మనసు కోరుకుంటోంది. తన సమ్మోహన విగ్రహాన్ని చూసి ఆమె నిగ్రహం కోల్పోయిందా? కథ డిమాండ్ మేరకే సిన్మాలో కౌగలింతలు... ముద్దుసీన్లు ఉంటాయంటూ రిపోర్టర్ల ముందు ఎంత బిల్డప్ ఇచ్చి మాట్లాడినా 'ఆపోజిట్ సెక్స్' ఆకర్షణ అంతా ఇంతా కాదు. అది 'వయస్కాంతం'లా చటుక్కున ఆకట్టేసుకుంటుంది. ఎంతైనా... నిప్పు, దూది దగ్గరదగ్గరగా ఉంటే అగ్గిరాజకుండా ఉంటుందా? ఉప్పుకారం తింటున్న హీరోహీరోయిన్లు ఎవరైనా ఆ 'దగ్గరితనం' లోని ఆనందాన్ని అనుభవించలేదని... తాము పక్కా ప్రొఫెషనల్ అనీ... చుట్టూ కెమెరాలు, అంతమంది జనాలు చూస్తుండగా సినీ 'కౌగిలి' సౌఖ్యాన్ని కించిత్ కూడా అందుకోవడం అసాధ్యమని చెప్తున్నారంటే అది కేవలం అబద్దమే... అనుకున్నాడు ప్రదీప్. అందుకు నిలువెత్తు సాక్ష్యం తనెదురుగా ఉన్న గాయత్రీపాటిల్. ఆరోజు ఆమె లేలేత శరీరాన్ని అంత దగ్గరగా కౌగలించుకున్నప్పుడు తనలో కలిగిన సంచలనమే ఆ ప్రకటన అబద్ధమని చెప్పడానికి నిదర్శనం. ఆమె భుజం చుట్టూ రెండు చేతులు వేసి కేరక్టర్ పరంగా ఆత్మీయతను వ్యక్తం చేస్తున్నా... కేరక్టర్ పరిధిని దాటి కూడా ఆ ఆత్మీయతా ప్రకంపనాలు హృదయాన్ని తాకిన దాఖలా అది.

ఆలోచిస్తూనే దూరంగా ఉన్న తన అసిస్టెంట్ ని పిలిచి కారులో ఉన్న 'నవతార' పత్రికని తీసుకురమ్మన్నాడు.

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
Aamalladinne Sarmagari Abbayi