Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
katha cheppu mama - rashmi mayur

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda
విద్యాభ్యాసం

నరేంద్రునికి ఆరవ సంవత్సరం రాగానే తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పురోహితునిచే అక్షరాభ్యాసం చేయించారు. విశ్వనాథుడు ప్రత్యేకంగా నరేంద్రునికి ఇంటివద్ద ప్రయివేటు కూడా ఏర్పాటు చేశాడు. చాలా తక్కువ సమయములోనే నరేంద్రుడు బాగా చదవటం, వ్రాయటం నేర్చుకున్నాడు. సంస్కృత వ్యాకరణము, దానితో పాటు అనేక పురాణగ్రంధాలు కంఠస్థం చేశాడు. నరేంద్రుడికి 7వ సంవత్సరం రాగానే ఈశ్వర చంద్ర విద్యాసాగారుని పాఠశాలలో ఒకటవ తరగతిలో చేర్పించారు. అందులో చేరిన కొద్దిరోజులకే నరేంద్రుని తెలివితేటలను, ఉపాధ్యాయులు గుర్తించారు. అయితే అతను ఎప్పుడూ క్లాసులో సరిగ్గా కూర్చునేవాడు కాడు. ఒకవేళ క్లాసులో కూర్చున్నా తోటి విద్యార్ధులను కూడ, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విననివ్వకుండా, తానే ఏదో పురాణ కథలను చెప్తూ ఉండేవాడు.

నరేంద్రుడు మొదట ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ తల్లి తండ్రుల ఒత్తిడి వల్ల ఇంగ్లీషు నేర్చుకోవడానికి అంగీకరించాడు.
నరేంద్రుని తండ్రిగారైన విశ్వనాథుడు కొంతకాలానికి కలకత్తా నగరం విడిచి రాయపురం చేరాడు. అక్కడ వారి ఇంటికి చాలా మంది పండితులు వచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు. నరేంద్రుడు వారి ప్రసంగాలన్నింటినీ జాగ్రత్తగా వింటూ తనకు తోచిన సందేహాలను అడుగుతూ తన అభిప్రాయాలను వారికి వివరించేవాడు.

బాల్యం నుంచీ కూడా నరేంద్రునికి అతని తల్లిదండ్రులు అద్భుతమైన శిక్షణనిచ్చేవారు. అందులోనూ అతని తల్లి గారైన భువనేశ్వరీదేవి లోకంలో, నీతులన్నిటినీ చెప్పేవారు. నరేంద్రుడు, వివేకానందుడై విశ్వవిఖ్యాత పురుషుడిగా, కీర్తి ప్రతిష్టలు రావటానికి ఆ మాతృమూర్తి క్రమశిక్షణ యే కారణం. నరేంద్రుడు కూడా, తల్లిని దైవంగా భావించి పూజించేవాడు. ఆమె మాటకు అతనెప్పుడూ ఎదురు చెప్పలేదు. అంతేకాదు, తల్లిని గౌరవించని వారు, ఎవ్వరూ కూడా ఉన్నత స్థితిని పొందలేరని చెప్తూ వుండేవారు. తండ్రిపై కూడా నరేంద్రుడు చాలా భక్తిని ప్రదర్శిస్తూ ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విని ఆచరణలో పెట్టేవాడు.

నరేంద్రుని బుద్ధి బలమెటువంటిదో దేహబలం కూడా అలాంటిదే. అందుకుకారణం అతడు చిన్నతనం నుంచీ వ్యాయామ క్రీడలకు బాగా అలవాటుపడ్డాడు. తాను స్వయంగా ఒక వ్యాయామశాలను కూడా స్థాపించాడు. అయితే రాయపురంలో వున్నంతకాలమూ అతని చదువు మాత్రం చురుకుగా సాగలేదు. తిరిగి 1878 సంవత్సరంలో వారు కలకత్తా చేరగానే నరేంద్రుడు పాఠశాలలో చేరి మూడు సంవత్సరాల కోర్సును ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి, ప్రవేశ పరీక్షలో పాసయ్యాడు. పాటలు పాడటం, హార్మోనియం - ఫిడేల్ వంటి వాటిలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు.

దాదాపు 8 - 10 సంవత్సరాల వయస్సులో నరేంద్రుడు, తన స్నేహితులతో కలిసి పడవలో కలకత్తా నుంచి వస్తుండగా, వారిలో ఒక బాలుడు పడవలో వాంతి చేసుకున్నాడు. పడవ నడిపేవారికి చాలా కోపం వచ్చి వాళ్ళెవ్వరినీ క్రిందకి దిగనివ్వలేదు. ఈ అపాయాన్ని గమనించి, తెలివైన నరేంద్రుడు మెల్లగా పడవ నుండి దిగి, ఆ నది ఒడ్డున తిరుగుతున్న ఇద్దరు బ్రిటీషు సైనికుల వద్దకు వెళ్ళి, పరిస్థితి వివరించి, వారిని పడవవద్దకు తీసుకువచ్చాడు. ఆ సైనికులు, ఆ బాలురను వెంటనే వదిలి వేయమని పడవవాళ్ళను ఆదేశించారు. ఆవిధంగా నరేంద్రుడు తన తీక్షణ బుద్ధి వలన, తన స్నేహితులను క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించగలిగాడు.

నరేంద్రుడు కళాశాలలో చేరేటప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు. కళాశాల జీవితంలో ప్రవేశించగానే అతడు పాఠ్య పుస్తకాలతో పాటు, రోజూ విజ్ఞానదాయకమైన ఇతర గ్రంధాలను చదువుతూ వుండేవారు. రోజూ కళాశాల లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకువెళ్ళి చదువుతూ వుండేవారు. అయితే, రోజుకొక కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళి, మర్నాడు దానిని తిరిగి ఇచ్చేస్తుండేవాడు. గ్రంధాలయం అధికారి ఇదంతా చూసి, నరేంద్రుడు ఆ పుస్తకాలేవీ చదవటం లేదనీ, చూసే వారికి ఆయన పుస్తకాలు బాగా చదువుతాడన్న అభిప్రాయం కలుగచేయటానికి ప్రయత్నిస్తున్నాడని భావించి, ఒకరోజు నరేంద్రుని ఆపేసి, "రోజూ ఒక పుస్తకం తీసుకెళ్తున్నావు. తీసుకెళ్ళిన పుస్తకం చదవటం పూర్తి చెయ్యి, ఈరోజు కొత్తపుస్తకం ఇవ్వను" అన్నాడు.

దానికి నరేంద్రుడు "పుస్తకాన్ని చదివేశాను పూర్తిగా. నాకు కొత్తది కావాలి, దయచేసి ఇవ్వండి" అని అడిగాడు. అప్పుడు ఆ లైబ్రేరియన్, "అలాగా... ఆ పుస్తకం చదివేశావా? సరే... ఆపుస్తకం ఇలా ఇవ్వు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చేప్తే ఇవాళ నీకు వేరే పుస్తకం ఇస్తాను. లేదంటే ఇంక ఇవ్వను అన్నాడు. నరేంద్రుడు చిరునవ్వుతో సరేనన్నాడు.

(ఇంకా వుంది)

మరిన్ని శీర్షికలు
annamayya pada seva