Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padya mandapam book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఓ పెద్ద దురభిప్రాయం.. - భమిడిపాటి ఫణిబాబు

O pedda durabhiprayam

మనలో చాలామందికి మనమీద మనకే,  ఓ గొప్ప impression ఉంటూంటుంది. ఉండాలిలెండి, అవతలివారికి ఎలాగూ ఉండదు, మనపైన మనకుండడంలో తప్పేమిటీ? కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఆ భావం మరీ ఎక్కువైపోతూంటుంది. ఇలాటివాటిల్లో ఉద్యోగాలు చేసి రిటైరయినవాళ్ళదే మొదటి స్థానం ! అక్కడికేదో తను పదవీ విరమణ చేసిన తరువాత, తనుండే 'సీటు' లో పని ఇంక ఏమీ జరగదనీ, పాపం ఆఫీసరుకి మార్గదర్శనం చేసేవాళ్ళే ఉండరనీ, బాధ పడిపోతూంటారు. దానికి సాయం ఈయనగారి ఆఫీసులో ఆఖరి రోజున ఏదో పార్టీ గట్రా చేస్తారే, అందులో ఒకడి తరువాత ఇంకొకడు లేచి, ఈయనగారి గురించి లేనిపోని పొగడ్తలు చేసేస్తారే అవన్నీ నిజమే అనుకుంటాడు. అదంతా తన పనితనం ఘనతే అనికూడా అనుకుంటాడు.

చివరాఖరుగా, ఆఫీసరుగారు లేచి, " ఇంక మీరు లేకపోయినతరువాత, నన్ను రక్షించేవాడెవడూ , అవసరం వచ్చినప్పుడల్లా ( లేనిపోని ) సలహాలు ఎవరివ్వగలరూ? మీరు రిటైరయిపోయినా ,  ఈ ఆఫీసు ద్వారాలు మీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.." అని ఉత్తేజపూర్వకమైన ఒక ప్రసంగం చేసేసి, ఓ భగవద్గీత, ఓ గొడుగు, ఓ శాలువా కప్పేస్తారు. పాపం ఈ వెర్రిప్రాణి, ఈ ప్రసంగాలన్నీ సీరియస్సుగా తీసేసికుంటాడు.

నిజం చెప్పాలంటే ఆ సత్కారసభలో వక్తలు చెప్పినవన్నీ,  అమ్మయ్య, ఈయన గొడవ వొదిలిందిరా బాబూ అనుకుని చెప్పినవే. ఎలాగూ మళ్ళీ ఆఫీసుకి రాడూ, అని ఆనందోత్సాహాలు పట్టలేక వ్యక్తపరిచిన భావాలు అవన్నీ. కానీ, మన మాస్టారున్నారే ఆయన రిటైరయిన తరువాత, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చుగా, అబ్బే, తను పనిచేసిన ఆఫీసుకి బయలుదేరతాడు. ఏదో రిటైరయిన తరువాత, మొదటిసారి వచ్చాడు కదా అని, అందరూ యోగక్షేమాలు అడుగుతారు, ఆఫీసరుగారి రూమ్ములోకి వెళ్ళగానే ఆయనకూడా, లోపల్లోపల మళ్ళీ ఎందుకొచ్చాడీయనా అనుకుంటూనే, బాగుండదని, మొహం నిండా ఎక్కడలేని నవ్వూ పులిమేసికుని, సీటులోంచి లేచి, ఓ షేక్ హాండ్ కూడా ఇస్తాడు. తదనంతరం ఓ కాఫీకూడా తెప్పిస్తాడు.

ఇంతట్లో ఏదో పేద్ద పనున్నట్టుగా, 'మాస్టారూ ఓ మీటింగు పెట్టానూ, ఈసారి సావకాశంగా కలుద్దామూ.." అని సున్నితంగా చెప్పి ఈయన్ని వదిలించుకుంటాడు. పోనిద్దూ నిజమే కాబోసు అనుకుని మన మాస్టారుకూడా బయటకి వెళ్తాడు.

పోనీ అలాగని ఇంటికి వెళ్ళిపోతాడా అంటే అదీ కాదూ, మళ్ళీ తను ఇదివరకు పనిచేసిన క్యాబిన్ లోకి వెళ్తాడు.అక్కడేమో తన స్థానంలో ఇంకొక కుర్ర సూపర్నెంటు కూర్చునుంటాడు. తను పనిచేసే రోజుల్లోలా ఏమిటీ, సూపర్నెంటు అవడానికి తనకి నలభై ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడో, ఏవో పరీక్షలంటారు, ఏవేవో కోటాలంటారు, ఇంకోటేదో అంటారు, మొత్తానికి సూపర్నెంటు కావడానికి వయస్సేమీ అడ్డురాదు. తనవయస్సులో సగమైనా లేనివాడు, వీడా సూపర్నెంటూ అనుకోవడంతో ప్రారంభం అవుతుంది ఈయనగారి అహానికి దెబ్బ.

తను కూర్చునే క్యాబిన్ రూపే మారిపోయింది. ఇదివరకటిరోజుల్లో ఎప్పుడైనా ఆఫీసరుగారు, ఏదైనా సమాచారం అడిగితే, తను ప్రాణప్రదంగా డ్రాయరులో దాచుకున్న డైరీలో చూసి, కావలిసినదేదో చెప్పేవాడు. ఒక్కరోజు కూడా శలవు పెట్టి ఎరగడు. తను ఒక్కరోజురాకపోతే, సూర్యచంద్రులు గతులుతప్పుతారేమో అన్నంతగా బాధపడిపోయేవాడు. ఆ ఆఫీసు మొత్తానికి ఎవరికైనా ఎలాటి సందేహమున్నా, తన దగ్గరకు రావాల్సిందే మరి. అంతలా రూల్సూ అవీ ఔపోసనపట్టేశాడు.ఫలానా ఆఫీసూ అంటే ఫలానా ఆయనే అని ఈయన పేరే చెప్పుకున్న రోజులాయే. అసలారోజులే వేరూ, పుస్తకంలో ఉండే రూల్సన్నీ తనకి కంఠస్థం అంటే నమ్మండి. ఒక ఫైలుమీద ఆఫీసరు సంతకం చేసేముందర తను ఏమి వ్రాశాడో చూడాల్సిన అవసరమైనా లేకుండా సంతకం చేసేవాడని చెప్పుకుంటూంటారు.

తను వ్రాసినది శిలాశాసనం అనుకోండి. ఇప్పుడేమో, అక్కడ ఓ కంప్యూటరూ, ఓ ప్రింటరూనూ. మన మాస్టారు రిటైరయే రోజుకోసమే ఎదురుచూసి, ఆయన ఆ చివరిరోజున బయటకెళ్ళాడో లేదో, ఆమర్నాడే ఆ వస్తువులన్నీ వచ్చేశాయి. అవన్నీ చూసైనా గ్రహించొద్దూ, ప్రస్తుతం అంతా కంప్యూటరు లోకం అనీ.ఇదివరకటి రోజుల్లో, అంటే ఈయన పరిపాలనా రోజుల్లో అన్నమాట, ఓ circular వెళ్ళాలంటే ఎంత హడావిడీ, ముందుగా ఈయనగారు ఒక చిత్తుప్రతి తయారుచేయాలి, దాన్ని ఆఫీసరుగారు చూసి, ఈయన డ్రాఫ్టింగుని మెచ్చుకోవాలి, ఈయనేమో ఒకసారి కాలరెత్తుకోవాలి, టైపిస్టుని పిలిచి టైపుచేయించాలి, మళ్ళీ అందులో తప్పులు దిద్దాలి, ఎంత కథా, కమామీషూ... అవన్నీ పక్కన పెట్టేసి, తన స్థానంలో వచ్చిన కుర్ర సూపర్నెంటు, తనే టైపుచేయడంట, పుటుక్కున ఓ ప్రింటౌట్ తీసికోడంట.. ఏమిటో అసలు బాధ్యతే కనిపించదూ...తనమనోభావాలు తనలోనే దాచుకుంటాడు..

కానీ బయటకెళ్ళినతరువాత మాత్రం, కనిపించిన ప్రతీవాడికీ, అడిగినా, అడక్కపోయినా " ఏమిటోనండీ, మొన్న మా ఆఫీసుకి ( ఇంకా పాపం "మా" అనే అనుకుంటున్నాడు) వెళ్ళానా, అంతా మారిపోయింది. ఎవడికీ బాధ్యతా అంటేనే పట్టింపులేదు. సావకాశంగా వస్తున్నారు ఆఫీసులకి... అదే నేనుండే రోజుల్లోఅయితేనా.". అని మొదలెట్టడం ప్రారంభం, ఆ అవతలివాడు జంపైపోతాడు. ఇంత జరిగినా మన మాస్టారు మాత్రం తన అభిప్రాయం, అంటే-- "తను రిటైరయిపోయిన తరువాత, దేశానికీ, రాష్ట్రానికీ ఎంత నష్టం కలుగుతోందో పాపం"-- లోంచిమాత్రం బయటపడడు.

ఒకానొకప్పుడు నెహ్రూగారు వెళ్ళిపోతే మన దేశం సంగతి ఏమిటో అని భయపడేవారు. ఆయన వెళ్ళా వెళ్ళాడూ, తరువాత ఎందరో మహానుభావులు వచ్చారూ, వెళ్ళారూ. అసలు ఓ ఇంట్లో, ఆ ఇంటిపెద్ద స్వర్గస్థుడైనప్పుడు, ఏదో ఆ పదకొండురోజులూ, బాధపడ్డట్టు కనిపించాలికాబట్టి కనిపిస్తారు కానీ, పనులు ఆగుతాయా, తిండితినడం మానేస్తారా, సినిమాలూ, టీవీ లూ చూడ్డం మానుతారా ఏమిటో అనుకుంటాం కానీ , ఈ ప్రపంచంలో ఎవరూ indispensable మాత్రం కాదూ అని గ్రహించలేరు.. బతికున్నంతకాలం అదో తృప్తీ....




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని శీర్షికలు
snehamera jeevitham