Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు - టీవీయస్.శాస్త్రి

Karunasri 'Jandhyala Papayya Sastry'

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు (1912--1992) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపుగా ఉంటుంది. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత.అందునా కరుణ రసప్రధానముగా చాలా కవితలు వ్రాసి,"కరుణశ్రీ"గా ప్రసిద్ధులైనారు.

కరుణశ్రీ, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాధమిక, మాధ్యమిక విద్య చదివిన పాపయ్యశాస్త్రి గారికి  సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రిగార్ల వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్రభాషా, విశారద, ఉభయభాషాప్రవీణ, హిందీ భాషాప్రవీణ పరీక్షలలోఉత్తీర్ణుడై అమరావతి లోని రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేసారు.

శ్రీ  N.T.Rama Rao గారు వీరి విద్యార్దే! ఆయన పద్యం చదివే తీరు, వారి కమనీయమైన గాత్రం ఇప్పటికీ నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. చక్కని పంచెకట్టు, భుజం మీద శాలువా, చేతిలో పుస్తకం, ముఖం మీద చెరగని చిరునవ్వు, గంభీరమైన నడకతో వారు నడిచే తీరు ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లు ఉంది. ఆ కమనీయమూర్తిలో, మొదటి సారిగా నేను విచారం/విషాదం చూసింది, ఘంటసాల గారి మరణవార్త విన్నప్పుడే! ఘంటసాల గారు, గుంటూరు వచ్చినప్పుడు విడిది చేసేది వారి ఇంటిలోనే. సరస్వతీదేవి యొక్క కవల పిల్లలు వారు. ఒకరు సాహిత్యమూర్తి, మరొకరు సంగీత మూర్తి.

ఇద్దరూ కలసి, శారదాదేవి ఆస్థానంలో సాహిత్య, సంగీత సభలు నిర్వహించటానికే , ఈ లోకం విడిచి వెళ్ళారు. ఒక చెప్పులు కుట్టుకొనే మనిషి, వారి గీతాలను స్వర బద్ధంగా ఉఛ్ఛారణ దోషం లేకుండా పాడటం విని ఆయన ఎంత సంతోషించారో! బ్రతికినంతకాలం రిక్షా ఎక్కలేదు. మనిషిచే మోయించుకోవటం, మానవత్వానికే తీరని మచ్చ అని వారి అభిప్రాయం. తన దగ్గరికి వచ్చే ఒక బీద విద్యార్ధి అయిన, మహబూబ్ భాషాను పోషించటమే కాకుండా, అతను వ్రాసే పద్యాలను సవరించి, ప్రోత్సహించేవారు. మానవతా విలువులున్న మహామనీషి ఆయన. పద్యాన్ని చక్కగా భావయుక్తంగా చదవమని, అందరికీ సూచనలు ఇచ్చేవారు.

వారి శ్రీమతి అనసూయమ్మగారు ఆయన సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయనకు ఉన్న ఒక గొప్ప స్నేహితురాలు. వారికి ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ ఉన్నారు. 'కళ్యాణ కల్పవల్లి' పేరు మీద తెలుగు లోని ప్రఖ్యాత కవులను గురించి ఒక కావ్యాన్ని చాలా గొప్పగా వ్రాసారు. 'ఉమర్ ఖయ్యాం' అనే పద్య కావ్యం కూడా కమనీయంగా ఉంటుంది. వారి కలంలో సిరాకు బదులుగా పంచదార, తేనే కలిపి వ్రాస్తారేమో! అంత మధురంగా ఉంటుంది వారి కవిత్వం. అంతేకాకుండా జనబాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకొని వెళ్ళిన వారి పద్యాలను గురించి వారితో ముచ్చటిస్తుంటే, వారి ముఖంలో ఆనందరేఖలు స్పష్టంగా కనపడేవి. పిల్లలకోసం వారు వ్రాసిన 'తెలుగుబాల'--ఆ రోజుల్లో మేము ఆనందంగా చదువుకునేవారం.

పిల్లలే కాదు, పెద్దలు కూడా చదవలసిన పద్య కావ్యమది. సులభ శైలిలో ఉంటుంది. సాంప్రదాయ కవితా రీతులతో, పిల్లలకు, పెద్దలకు, సామాన్య ప్రజలకు అర్ధమయేటట్లు కవితలల్లిన మొదటి 'ప్రజాకవి' ఆయనేనని చెప్పవచ్చు. ప్రఖ్యాత తెలుగు సినీ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వరరావు గారు, వారి అమ్మాయిలకు, ఉదయశ్రీ, విజయశ్రీ అనే  పేర్లు పెట్టి ----శ్రీ పాపయ్య శాస్త్రిగారి మీద ఉన్న అభిమానాన్ని, వారి కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు, శ్రీ పాపయ్య శాస్త్రిగారు, ఎంతో సంతోషించారు. తెలుగు సాహిత్యంలో 50 ముద్రణలు చూసిన ఏకైక గ్రంధం ఒక్క 'ఉదయశ్రీ'నే! వారణాసిలో, ఒక కవి సమ్మేళనంలో, ఒక హిందీ కవి తన పుస్తకం పదిసార్లు ముద్రించ పడిందని ఆనందపడుతున్న సందర్భంలో, 50 ముద్రణలు చూసిన 'ఉదయశ్రీ' కావ్యకర్త శ్రీ పాపయ్య శాస్త్రి గారిని చూసి ఆశ్చర్యంతో, ఆదరంతో ఆలింగనం చేసుకున్నారు.

శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు, మనసు ప్రశాంతంగా లేనపుడు, ఘంటసాల గారు పాడిన పుష్పవిలాపం వింటానని, వారే పలుమార్లు చెప్పారు. ఆయన కనపరచిన ప్రతిభకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాలేదు. అదే విషయం వారితో ప్రస్తావిస్తే, ప్రజల మెప్పే తనకు  పద్మశ్రీ, పద్మభూషణ్ కన్నా గొప్ప బిరుదులు, అనే వారు. బుద్ధునిలోని కరుణ ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసింది. అందుకనే, వారు 'కరుణశ్రీ' అనే పేరుతోనే అనేక కావ్యాలు వ్రాసి ప్రసిద్ధులయ్యారు. పుష్పవిలాపం మరియు కుంతీకుమారి వంటి కవితలు ఘంటసాలగారి గంధర్వగానం వల్ల మరింత ప్రసిద్ధి చెందాయి.

'పుష్పవిలాపాన్ని' చిరకాలం తెలుగు వారు గుర్తుంచుకునేటట్లు చేసిన ఘనత ఘంటసాలదే! జీవించినంత కాలం కవిత్వం రాసి, రాసినంత కాలమే జీవించిన కవి కరుణశ్రీ. జనరంజకుడైన ఈ కవి తన  కలాన్ని తేనెలో ముంచి మధురాతి మధురమైన కవితా పద చిత్రాలతో పఠితల హృదయాలను రసప్లావితం చేసాడు. ‘కరుణశ్రీ’గా ఖండాంతర ఖ్యాతినార్జించిన ఆయనకు పోతన భాగవతమే గురువు. పోతనలాగే లలిత పదకవితలనల్లుతూ పండిత, పామరుల ప్రశంసలను అందుకున్నారు.

పూబాలల గుండె కోతను వినిపించుకున్న వారు ఎవరున్నారు? ఒక్క కరుణశ్రీ తప్ప. అలాగే ‘కుంతి కుమారి’ ఖండకావ్యము కూడాను. కరుణశ్రీ కలం నుంచి జాలువారిన అలాంటి కవితలెన్నని ఎంచి చెప్పగలం? "ఉదయశ్రీ నా హృదయం, విజయశ్రీ నా శిరస్సు, కరుణశ్రీ నా జీవితం" అంటూ శాస్త్రిగారు ఖండాంతర ఖ్యాతి గాంచిన ఈ మూడు కావ్యాలను తనకు ప్రీతిపాత్రమైనవని పేర్కొన్నారు. కవిగా, పండితునిగా, విమర్శకునిగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా, బాలసాహిత్య కథకునిగా, ఉపన్యాసకునిగా భాసిల్లిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి 76 గ్రంథాలను రచించారు. ఆయన సాహిత్య కృషిపై కనీసం మూడు పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయనకు శ్రీవెంకటేశ్వర విద్యాలయం గౌరవ డాక్టరేటును ఇచ్చి గౌరవించింది.

తిరుమల తిరుపతి దేవస్థానంవారు పోతన భాగవత వ్యాఖ్యాన సంపాదుకులుగా పనిచేయడానికి  కరుణశ్రీనే సరైన వ్యక్తిగా గుర్తించి గౌరవించింది. 21 -06 -1992 న వారు తమ కవితా ప్రస్థానానికి ముగింపు చెప్పి, శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. వారు గుంటూరులోని రవీంద్రనగర్ లోని మా ఇంటి సమీపంలోనే ఉండేవారు. నాకు వారితో పరిచయ భాగ్యమే కాక, కొంత చనువు కూడా ఉండేది. అది వారు ఇచ్చినదే! నేను అప్పుడప్పుడూ వారిని కలిసి నాకు కలిగిన సందేహాలు అడిగి తీర్చుకునే వాడను.

ఆయనకు పోతన కవిత్వమంటే ప్రాణం. నిజం చెప్పాలంటే, పోతన మహాకవియే శ్రీ పాపయ్యశాస్త్రి గారిగా మరల జన్మించారని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నేను ఒకసారి వారితో ఇలా నా సందేహం అడిగాను---"కాటుక కంటి నీరు చనుపయింబడ ఏల ఏడ్చదవమ్మ భారతీ!" అని పోతన గారు అన్నారు కదా!, అంత కరుణరస సన్నివేశంలో 'చనుపయింబడ' అనే పదం ఎందుకు వాడారు?, సామాన్యంగా ఎవరైనా ఏడుస్తే కంటి నీరు పాదాలమీద పడుతాయి. పోతన గారు, 'చనుపయింబడ' అని అనటంలో శారదాదేవి వక్షసంపదను గుర్తుచేసినట్లున్నది.

కరుణరస సన్నివేశంలో ఈ శృంగార భావం ఎందుకు?--- అని నేను అడుగగానే, వారు ఇలా చెప్పారు--శిశువు తల్లివద్ద చనుబ్రాలు త్రాగేటప్పుడు, పాలు త్రాగుతూ మరొక చేతితో వేరొక వక్షం పైన చేయి వేసుకుంటాడు. ఆ సన్నివేశం, సందర్భంలో వాడికి ఎటువంటి మనో వికారాలు ఉండవు. మనంకూడా అలానే 'శారదాదేవి' శిశువులమే! ఆ భావం తోనే అమ్మను చూడాలి.---అని నాకు వారు వివరించి చెప్పిన సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. వారు వ్రాసిన ఒక ప్రబోధ గీతాన్ని మీకోసం ఈ క్రిందనే పొందుపరుస్తున్నాను. జాతీయతను, దేశభక్తిని రగిలించే ఈ మహత్తర పద్యాన్ని చదివి ఆస్వాదించండి.

తెనుగుతల్లి
కనిపింపదే నేడు! కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయ పతాక
వినిపింపదేనేడు! విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుల మ్రోత
వెలగదే నేడు! బొబ్బిలి కోట బురుజుపై
తాండ్రపాపయ తళత్తళల బాకు
నిప్పచ్చరంబయ్యెనే నేడు-వీర
పల్నాటి యోధుల సింహనాద లక్ష్మి

చెక్కు చెదరని - యేనాడు మొక్కవోని-
ఆంధ్ర పౌరుషమిప్పుధ్వాన్నమయ్యె;
మరల నొకమాటు వెనుకకు మరలి చూచి
దిద్దుకోవమ్మ: బిడ్డల తెనుగు తల్లి

"వాణి నా రాణి" యంచు సవాలు కొట్టి
మాట నెగ్గించు "వీరు" లీ పూట లేరు!
తిరిగి యొకమాటు వెనుకకు తిరిగి చూచి
దిద్దుకోవమ్మ! బిడ్డల, తెనుగు తల్లి!

శ్రీ పాపయ్య శాస్త్రి గారు చక్కని,హాస్య ,వ్యంగ్యోక్తులతో పద్యాలు వ్రాసి,చదువుకున్నామని విర్రవీగే వారికి మంచి చురకలు వేసే వారు. మచ్చుకి, ఈ క్రింది పద్యాన్ని చూడండి.

చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు
చదువు కొనెడివేళ 'సంకరు'డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస!

వారి అబ్బాయి శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ కూడా సాహితీ పిపాసే, తండ్రి గారిలాగా! గుంటూరులోని హిందూ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేసి, ప్రస్తుతం గుంటూరులోనే విశ్రాంత జీవితం గడుపుచున్నారు.

ఈమధ్యనే శ్రీ పాపయ్య శాస్త్రిగారి శతజయంతి ఉత్సవాలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్న సందర్భంలో, వారికి నా ఘనమైన నివాళి !

మరిన్ని శీర్షికలు
weekly horoscope(August 02 - August 08)