Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

మెగాఫోన్ పట్టిన 'సినిమాటోగ్రాఫర్లు'!

Megaphone at Cinematographers

ఒక సినిమా విజయం సాధించడంలో సంగీతం, నటన, దర్శకత్వ ప్రతిభతో పాటు కెమెరా కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. నటన పరంగా, దర్శకత్వ పరంగా, నిర్మాణ పరంగా సినిమాలు అపజయం అయ్యుండవచ్చు. కానీ సన్నివేశాల పరంగా కెమెరా ఎప్పుడూ విజయమే సాధించింది. సినిమా తీయడంలో కెమెరామెన్ ల పాత్ర చాలా కీలకమైంది. కెమెరా రంగంలో తమదైన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సినిమాటోగ్రాఫర్లు గురించి కొన్ని విషయాలు...

జాతీయస్థాయి సినిమాటోగ్రాఫర్ ప్రపంచంలోని ఏడు వింతల్ని ఎంతో అద్భుతంగా 'జీన్స్' సినిమాలో తెరకెక్కించిన అశోక్ కుమార్ తెలుగులో కార్తీక్, శోభన కాంబినేషన్ లో తీసిన 'అభినందన' మ్యూజికల్ హిట్టైంది. ఎన్నో తెలుగు సినిమాలకు కెమెరానందించిన ఎస్. గోపాల్ రెడ్డి దర్శకుడిగా మారి తమిళ 'ఆటోగ్రాఫ్' ను తెలుగులో రవితేజ, భూమిక, గోపికలతో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' గా తీసాడు. మెగా హిట్టైన తమిళ అనువాద చిత్రం 'రంగం' ను తీసిన కె. వి. ఆనంద్ గతంలో పి. సి. శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా కెమెరా రంగంలో పనిచేసాడు. పోయిన సంవత్సరం వచ్చిన సూర్య 'బ్రదర్స్' తీసాడు.

మణిరత్నం తీసిన 'మౌనరాగం, నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, అమృత' సినిమాలకు తన కెమెరానందించిన పి. సి. శ్రీరామ్ సరైన హిట్టులేక డీలాపడ్డ నితిన్ కు 'ఇష్క్' సినిమా విజయంలో తన కెమెరాతో కీలకపాత్ర వహించాడు. కమల్ హాసన్, అర్జున్, నాజర్ లతో గోవింద్ నిహ్ లానీ వివాదాస్పద రచన 'ద్రోహ్ కాల్' ని తెలుగు, తమిళ భాషల్లో తీసిన 'ద్రోహి' కి దర్శకత్వం వహించారు.

'కడలి', వివాదాస్పద చిత్రం 'బొంబాయి', షబానా అజ్మీ నటించిన 'మార్నింగ్ రాగా' మొదలైన చిత్రాలను తీసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ప్రభుదేవా, అరవిందస్వామి, కాజోల్ లతో వచ్చిన 'మెరుపు కలలు', ఐశ్వర్య రాయ్, మమ్ముట్టి, అజిత్, టబు లతో వచ్చిన 'ప్రియురాలు పిలిచింది' సినిమాలకు దర్శకత్వం చేసాడు.

వంశీ తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అన్వేషణ', కామెడీ మూవీ 'ఏప్రిల్ 1 విడుదల', 'డిటెక్టివ్ నారద', కె. విశ్వనాథ్ 'స్వాతి ముత్యం', మొదలైన ఎన్నో సినిమాలకు కెమెరాను అందించిన ఎమ్. వి. రఘు 'కళ్ళు' సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తాడు. వర్మ తీసిన 'అంతం, రాత్రి, రంగీలా' తదితర సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన 'తేజ' దర్శకుడిగా మారి 'చిత్రం, జయం, నువ్వునేను' లాంటి హిట్టులతో దర్శకుడిగా స్థిరపడ్డారు.

సుహాసిని దర్శకత్వం చేసిన ఏకైక సినిమా 'ఇందిర' తో పాటు, రోజా, దళపతి, ప్రేమతో, ఇద్దరు, కాలాపాని' లాంటి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన సంతోష్ శివన్ దర్శకుడిగా షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ లతో 'అశోకా', రాజీవ్ హత్యా ఉదంతం నేపధ్యంతో వచ్చిన 'ది టెర్రరిస్ట్', 'మల్లి' సినిమాలు తీసాడు. 'నువ్వు నేను', 'గాయం', 'చిత్రం' తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రసూల్ ఎల్లోర్ శ్రీరామ్, ఆర్తి చాభ్రియా ల 'ఒకరికొకరు', రవితేజ, శ్రీయ ల 'భగీరథ', గద్దె సింధూర తో 'సంగమం' సినిమాలకు దర్శకత్వం వహించాడు.

కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' కు, బాపు 'మనవూరి పాండవులు' కు కెమెరామెన్ గా పనిచేసిన బాలూ మహేంద్ర అనేక తమిళ, మలయాళం సినిమాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో జాతీయ ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కు అవార్డు తెచ్చిన 'వసంత కోకిల', అక్రమ సంబంధాల వల్ల పచ్చని సంసారంలో ఎలా చిక్కులు ఏర్పడతాయో హాస్యప్రధానంగా కమల్ హాసన్, హీరా, రమేష్ అరవింద్ లతో తీసిన 'సతీ లీలావతి', జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'నిరీక్షణ' సినిమాకు దర్శకుడిగా చేసాడు.

సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారడం మామూలే అయినా విజయవంతమైన దర్శకుడిగా నిలబడడం కొద్దిగా కష్టమే!
 

- సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
Short Film by Kona Venkat