Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Swamy Vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

014. నీకే నే  శరణు

నీకే నే  శరణు నీవు నన్ను కరుణించు
యీకడ నా కడ దిక్కు ఎవ్వరున్నారికను

1. కన్నుల జంద్ర సూర్యులు  గల వేలుపవునీవు
పన్నిన లక్ష్మి  భూమి పతి వి నీవు
అన్నిటా  బ్రహ్మకు దండ్రి అయిన ఆదివేలుపవు
యెన్నగ నీకంటే ఘన మెవ్వరున్నారికను

2. దేవతలందరు నీ తిరుమేనయిన మూర్తి
ఆవల బాదాన లోకమణచితివి
నీవొక్కడవే నిలిచిన దేవుడవు
యే వేళ  నీకంటే నెక్కుడెవ్వరున్నారికను

3. అరసి  జీవులకెల్ల నంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
పురుషోత్తముడవు భువన రక్షకుడవు
యిరవైన నీవే కాక ఎవ్వరున్నారికను  (04-194)

తాత్పర్యము
వేంకటేశ్వరా! నీకే నా నమస్కారము. నువ్వు నన్ను దయతో చూడు. ఇక్కడా,(ఈ లోకంలో), అక్కడ (ఆలోకంలో)నువ్వు తప్పించి ఇంకొక దిక్కు నాకు లేదు.

01. చంద్రుడు, సూర్యుడు రెండు కన్నులుగా కలిగిన దేవుడవు నీవు. శరణన్నవారిని రక్షించుటకు సిద్ధమైన లక్ష్మీ నాథుడవు. భూ నాథుడవు. సమస్త దేవతలలోను బ్రహ్మకు తండ్రివైన  మొదటి దేవతవు నీవు. దేవతలందరిలోను లెక్కించగ నీకంటే గొప్పవారెవరు లేరు.

02. నీ శుభమయిన శరీరములో దేవతలందరూ ఉన్నారు. నీ పాదముతో బలిని అణచితివి. భక్తులకోసం నిలబడిన దేవుడవు నీవు ఒక్కడివే. ఏ యుగంలో అయినా, ఏ సమయం లో అయినా  నీకంటే ఎవరు ఎక్కువ ఉన్నారు.? (ఎవరూ లేరని భావం)

03. పరిశీలించగా ఈ జీవులందరి అంతరాత్మలలో ఉన్న దేవుడివి నువ్వే. (మనస్సు యుక్తా యుక్తాలను, ధర్మాధర్మాలను ఆలోచన చేసేటప్పుడు మనిషిని మంచి వైపు మరల్చే అంతరింద్రియం అంతరాత్మ ) చక్కటి వరములిచ్చే వేంకటేశుడివి నువ్వే. విష్ణు మూర్తివి నువ్వే. ఈ లోకాలను రక్షించే వాడివి నువ్వే. స్థిరమైన వాడివి నువ్వే. ఇంక ఎవ్వరూ లేరు.

విశేషాలు

నీకే నే  శరణు
‘’మర్తే మర్తే జగ్ మరా, మర్నా నజానేకొయి, ఐసా మర్నా కొయి నమరా జో ఫిర్ నామర్నా హొయ్"(ఈలోకంలో ప్రతిరోజూ  ప్రజలు చనిపోతూనే  ఉన్నారు. కాని  చావురాకుండా ఉండేలా చని పోయినవాళ్ళు ఎవరూ లేరు.) అన్నారు కబీర్. చావురాకుండా ఉండేలా చనిపోవటం అంటే జన్మమృత్యుచక్రం నుండి బయటకు వచ్చి, ఆ పరబ్రహ్మంలో కలవటం. ఈ మోక్షం కోసం  శరణు కోరాలని అన్నమయ్య ‘’నీకే నేశరణు నీవు నన్ను కరుణించు యీకడ నా కడదిక్కు ఎవ్వరున్నారికను “అన్నారు.

యీకడ నా కడ దిక్కు ఎవ్వరున్నారికను
‘నువ్వు తప్పించి నాకు ఇంకొక దిక్కు లేదు’ అని  కాళ్ళావేళ్ళా పడడాన్ని ‘అనన్య శరణాగతి ‘అంటారు. దేవుని అలా ఆశ్రయించాలని  వైష్ణవ మతం చెబుతోంది. అన్నమయ్య అందుకే ‘’యీకడ నా కడ దిక్కు ఎవ్వరున్నారికను’’ అన్నారు.

ఆవల బాదాన లోకమణచితివి
ఒక పాదంతో భూమిని, రెండవ పాదంతో  స్వర్గ లోకాన్ని వామనుడు ఆక్రమించాడు. దేవతలు బలిని బంధించారు. వామనుడు నవ్వి – ‘బలీ ! మూడవ అడుగు ఎక్కడ పెట్టమంటావు?’ అని ప్రశ్నించాడు.

‘’జీవితంలో ఏనాడూ అబద్ధం చెప్పటం తెలియదు. నీ మూడవ పాదం నా తల మీద వుంచు. చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు కాంతలు సంసార కారణములు ధనములస్థిరములు" అని బలి చెప్పాడు. బలి చక్రవరి భార్య వింద్యావళి "పతి భిక్షాం మమదేహి" అనే వేడింది.

‘’నాదయ భక్తుని మీద ఉన్నదంటే ముందు  వాడి సంపదలు పోతాయి. వాడి  మనసు నా మీద ఏకాగ్రంగా ఉంటుంది.. ఈ బలి ని అనుగ్రహిస్తున్నాను. సావర్మి మనువు కాలంలో ఇతను  ఇంద్రపదవిని అందుకుంటాడు. అప్పటివరకు ఆకలి దప్పులులేని 'పాతాళ లోకంలో' లో నన్ను ధ్యానిస్తూ ఉంటా’’డని వామనమూర్తి అన్నాడు.

పోతనగారి భాగవతంలో వామనుడు మూడవ అడుగు కోసం బలి తలమీద పాదం మోపినట్లు లేదు. బలిచక్రవర్తిని, ప్రహ్లాదుడు వెంటబెట్టుకొని సుతల లోకానికి తీసుకువెళ్లాడని మాత్రమే ఉంది. (భాగవతం 08-677వచనం) అయితే స్పష్టత కోసం, లోకంలో అనుకొనే మాటలను అన్నమయ్య తనపాదంలో 'పాదాన అణచితివి 'పేర్కొన్నాడు.

ఈ వామనావతార పాద వృత్తాంతానికి సంబంధించి ఒక అందమైన కల్పన తిరుప్పావై (24 పాశురం)లో ఉంది. భూమిని, ఆకాశాన్ని కొలిచేటప్పుడు స్వామి పాదం ఎర్రగా కందిపోయిందట. అందుకని బాధపడుతూ ఆపాదానికి భక్తురాలు తిరుప్పావైలో శుభాలు పాడింది. అభిమానించేవారిపట్ల ఆందోళన సహజం. ఆప్రేమలో ఎంత కష్ట పడ్డారో అని బెంగ వస్తుంది. అదే ఈ తిరుప్పావై.

నీవొక్కడవే నిలిచిన దేవుడవు
పుండరీకుడు అనే భక్తుని కోరిక మేరకు శ్రీ కృష్ణుడు ఒక రాయి మీద కూర్చొనకుండా నిలబడ్డాడు. విఠ్ అంటే రాయి. రాతి మీద నిలబడటం వలన శ్రీ కృష్ణుడు విఠలుడు అయ్యాడు.అన్నమయ్య చెప్పిన నిలబడిన దేవుడు ఈ విఠలుడు కావచ్చు. ఎందుకంటే ‘వసుధఁజూడ బిన్నవానివలె నున్నవాఁడువెస నన్నివిద్యలాను వెలసె విట్ఠలుఁడు’(2-217)అనే కీర్తనలో ‘గట్టిగాఁ బుండరీకుఁడు కడువేడుకం బెట్టినయిట్టిక పీఁటపై నున్నాఁడీ విఠలుడు’ అని అన్నమయ్య వర్ణన. ఇంకా రెండు మూడు చోట్ల అన్నమయ్య విఠలునికి, వేంకటేశునికి అభేదం చెబుతూ పాడుకొన్నాడు. (04-468, 20-449 ) నిలబడిన దేవుడు వేంకటేశునితో పాటు విఠలుడు కూడా.

పన్నిన లక్ష్మి  భూమి పతి వి నీవు
లక్ష్మీ దేవి, భూదేవి అని రెండు రూపాలలో మనం పూజిస్తున్నాం. నిజానికి అమ్మవారు ఒక్కరే. అమ్మవారు మూడు స్థానాల్లో లయార్చ, భోగార్చ మరియూ ఆధికారార్చ అనే రూపాల్లో దర్శనమిస్తుందని పెద్దలు చెబుతారు. లయార్చ అంటే భగవంతుని యొక్క  వక్షస్థలంపై ఉన్న రూపం. భోగార్చ అంటే భగవంతునికి  ప్రక్కగా ఉండే  రూపం. ఒంటరిగా భగవంతుడు ప్రక్కన లేని రూపంలో దర్శనమిచ్చే రూపం అధికారార్చ.

మన మానవ సంబంధాలు దేవునికి అంటగడితే కొన్ని ప్రశ్నలకు జవాబులు తెగవు. ఉదాహరణకి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో వేంకటేశుడు భూదేవి పుత్రి సీతకు భర్తగా చెబుతారు. అదే సుప్రభాతంలో భూదేవి భర్తగా చెబుతారు. రెండింటికి సమన్వయం కష్టం. నారాయణుడు భూదేవికి భర్త. శ్రీ రాముడు సీతకు భర్త. మన వావి వరుసలు సర్వము తానైన భగవంతునికి అంటకట్టకూడదు.

ఒకటికి రెండుసార్లు లేదా వేయిసార్లు దేవుని పొగడటం మనకు అలవాటు. లేకపోతే మనకు తృప్తి ఉండదు. అందుకే దేవుని ఇద్దరు  భార్యలతో కలిపి పూజిస్తున్నాం. తత్వం ఒకటే అనే జ్ఞానం వచ్చేంతవరకు వేంకటేశుని ఇద్దరు భార్యలతో కలిసి పూజించే అలవాటు పెద్దలు చేసారు. అన్నమయ్య కూడా అందుకే ‘పన్నిన లక్ష్మి  భూమి పతి వి నీవు’  అన్నాడు.

ఆర్తిగా ఈ గీతాన్ని అలపించినా , ఆర్ద్రంగా ఈ గీతాన్ని పాడినవారి గాత్రాన్ని వింటున్నా తెలియని పశ్చాతాపం ఏదో కన్నీళ్లై  ప్రవహిస్తుంది. స్వామి పాదాల దగ్గర ఈ గీతాన్ని పదే పదే పాడి  మన  పాపాలను  ప్రక్షాళన చేసుకోవాలనిపిస్తుంది. ఇది ఎవరికి వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసిన సత్యం. అన్నమయ్య ప్రతి శరణాగతి గీతం హృదయాన్ని కరిగింపచేసే గంగ. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
Karunasri 'Jandhyala Papayya Sastry'