Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

నా కన్నీ రెండే

కళ్ళు, కాళ్ళు, చేతులు లాంటి అందరికీ సాధారణంగా ఉండే అవయవాలు కాదు - చిన్నప్పట్నుంచి నా ప్రస్థానంలో నా ముందుకొచ్చిన అవకాశాలు. చందమామ విజయాకంబైన్స్ లో భైరవద్వీపం చిత్రానికి పనిచేసిన తర్వాత, అదే బేనర్ లో కమల్ హాసన్ హీరోగా 'నమ్మవర్' చిత్రానికి పనిచేయమని నిర్మాత శ్రీ బి. వెంకట్రామిరెడ్డి గారు, నిర్మాణ సంచాలకులు శ్రీ రావి కొండలరావు గారు అవకాశమిచ్చారు. అదే సమయంలో తన డైరెక్షన్ టీమ్ లో కంటిన్యూ అవ్వమని రాజేంద్రప్రసాద్ గారు హీరోగా 'మేడమ్' చిత్రానికి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు అవకాశమిచ్చారు. నేను నిర్మాణ సంస్థకే ప్రాధాన్యమిచ్చాను. ఎలాగూ ఆ సంస్థలో తదుపరి తెలుగు చిత్రం కూడా సింగీతం గారితోనే అని అప్పటికే తెలుసు గనక.

'నమ్మవర్' సినిమా పూర్తయ్యాక కమల్ హాసన్ గారు ఎ. ఎమ్. రత్నం గారి బేనర్ లో శంకర్ దర్శకుడిగా 'భారతీయుడు' చిత్రానికి పనిచేయమని అవకాశమిచ్చారు. చందమామ విజయా కంబైన్స్ లో బాలకృష్ణ గారు హీరోగా సింగీతం గారి దర్శకత్వంలో 'శ్రీ కృష్ణార్జున విజయం' కి పనిచేయమని నిర్మాత అవకాశమిచ్చారు. మల్లా నేను నిర్మాత అవకాశాన్నే ఎంచుకున్నాను.

వీటన్నిటికంటే ముందు రావి కొండలరావు గారు 'బృందావనం' సినిమా షూటింగ్ ని అబ్జర్వ్ చేయమని తిరుపతిలో అవకాశం ఇస్తే, అదే సమయంలో కె. వి. రావు గారు బాపు గారి 'మిస్టర్ పెళ్ళాం' షూటింగ్ ని అబ్జర్వ్ చేయమని అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను తిరుపతిలో 'బృందావనం' చిత్రం ఎంచుకున్నాను. అందువల్లే తర్వాత అదే సంస్థలో 'భైరవ ద్వీపం' చిత్రానికి నాకు అవకాశం దక్కిందనుకుంటాను.

'శ్రీ కృష్ణార్జున విజయం' తర్వాత చందమామ విజయా కంబైన్స్ లో పని తగ్గడం, పరిశ్రమ హైదరాబాద్ కు మళ్లడం, నేనూ హైదరాబాద్ వచ్చేయడం చక చకా జరిగాయి. చందమామ విజయా కంబైన్స్ లో మా డైరక్షన్ డిపార్ట్ మెంట్ కి ఎక్కువ తిరిగిన అంబాసిడర్. కారు డ్రైవర్ ధొరై అని ఒక పెద్దాయన రోజూ నాతో ఒకేమాట చెప్పేవారు.  మీరు ఇక్కడ ఇంత పెద్ద సంస్థ లో పనిచేశాక, మళ్ళీ హైదరాబాద్ వెళ్లి సురేష్ సంస్థలో రామానాయుడి గారి దగ్గరే పనిచేయండి. మీ పనికి, ప్రతిభకి అక్కడ మాత్రమే గుర్తింపు వస్తుంది. అక్కడే మీరు దర్శకులౌతారు అనేవారు.

అలాగే పట్టుదలగా ప్రయత్నించి మ్యూజిక్ డైరక్టర్ శ్రీ మాధవపెద్ది సురేష్ గారి ద్వారా రామానాయుడు గారిని కలిశాను. ఆయన బి. వెంకట్రామిరెడ్డి గారికి ఫోన్ చేసి నా గురించి నాలుగు మంచి మాటలు విని, నా వైపు తిరిగి, నాకు కో - డైరక్టర్ అక్కర్లేదు, నెలకి 7,500/- ఇచ్చేంత పని నాదగ్గర లేదు. నెలకి 1,500/- కి క్లాప్ కొట్టి, కంటిన్యుటీ రాసుకునే అసిస్టెంట్ డైరక్టర్ ఎవరన్నా ఉంటే పంపించు. నా సంస్థలో ముగ్గురు కో - డైరక్టర్లున్నారు. వాళ్లలో ఎవరో ఒకరు దర్శకుడవ్వగానే నిన్ను పిలుస్తాను అన్నారు. ఒక్క సెకన్లో నిర్ణయం తీసుకున్నాను. 6 సినిమాలు, నాలుగన్నరేళ్ళ అనుభవం, రెండు టీవీ సీరియల్సు, నాలుగు డబ్బింగ్ సినిమాలు, నెలకి 250/- రూపాయల నుంచి 15,000/- దాటిన సంపాదన వదులుకుని మళ్లీ మొదటినుంచి క్లాప్ కొట్టి దర్శకుడయ్యే దాకా హైదరాబాద్ లో ఎదగగలనా లేదా అని నిర్ణయించుకోవడానికి నేను తీసుకున్న సమయం ఒక్క సెకను.

నాయుడు గారికి వెంటనే చెప్పేశాను. స్క్రిప్ట్ ఫెయిర్ చేస్తాను, క్లాప్ కొడతాను, కంటిన్యుటీ రాస్తాను. మీ సంస్థలో పనిచేస్తాను. జీతం మీ ఇష్టం అని. ఆయన ప్రొడక్షన్ ఆఫీసుకి పంపించారు. అప్పటికే ముప్పాతిక శాతం పూర్తయిన 'తాతా మనవడు' సినిమాకి.  కృష్ణంరాజు గారు, వినోద్ కుమార్, సంఘవి ప్రధాన పాత్రధారులు. కె. సదాశివరావు దర్శకులు. అది అవ్వగానే సదాశివరావు గారు తన తర్వాత చిత్రానికి కో - డైరక్టర్ గా రమ్మని అడిగారు. శ్రీకాంత్ గారు హీరోగా. రామానాయుడు గారు జయంత్ గారి దర్శకత్వంలో వెంకటేష్ బాబు హీరోగా, సురేష్ బాబు నిర్మించే చిత్రానికి అసోసియేట్ గా స్టోరీ డిస్కషన్స్ కి వెళ్ళమని అవకాశమిచ్చారు. నేను మళ్ళీ నిర్మాతనే ఎంచుకున్నాను.

'ప్రేమించుకుందాం... రా" చిత్రానికి అసోసియేట్ గా పనిచేశాక జయంత్ గారు తన టీమ్ లో కంటిన్యూ అవ్వమని అవకాశమిచ్చారు. సురేష్ బాబు మన సంస్థలోనే కంటిన్యూ అవ్వమని, అక్కడే దర్శకుడయ్యే దాకా ఉండమని అవకాశమిచ్చారు. మొదటిసారి నిర్మాణ సంస్థను కాదని, దర్శకులు జయంత్ సి. పరాన్జీ గారితో "బావగారూ... బాగున్నారా" చిత్రానికి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఆ చిత్రానికి చేసిన పనే నేను దర్శకుణ్ణి అవుతానని పరిశ్రమకి నమ్మకం కలిగేట్టు చేసింది. 'బావగారూ... బాగున్నారా' తర్వాత అంజనా ప్రొడక్షన్ లో తర్వాత చిత్రానికి పనిచేయమని శ్రీ నాగబాబు గారు, "ప్రేమంటే ఇదేరా" చిత్రానికి పనిచేయమని జయంత్ గారు ఒకేసారి అవకాశమిచ్చారు. ఈసారీ దర్శకుడినే ఎంచుకున్నాను.

'మనసంతా నువ్వే' చిత్రానికి ముందు రామానాయుడు గారి సంస్థలో మొదటి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం గురువులు పరుచూరి బ్రదర్స్ కల్పించారు. కానీ, నేను వారిని ఒప్పించి, ఎమ్మెస్ రాజు గారి చిత్రానికి పనిచేయించాను. వివేకమో, అదృష్టమో, దురాలోచనో, సమయస్పూర్తో, ఒక నమ్మిన 'ఎతిక్' కి కట్టుబడి ఉండడమో, స్వేచ్చగా, ఇష్టమైన పనిని ప్రేమించి చెయ్యడమో - వీటిల్లో కారణమేదైనా గానీ, వెళ్తున్న దారి రెండుగా చీలిన ప్రతిసారీ నేను రైట్ తీసుకున్నానా, రాంగ్ తీసుకున్నానా అని ఆలోచిస్తే అన్నీ రైటే అనిపిస్తాయి. రోడ్డు ప్రయాణం లాగ జీవిత ప్రయాణానికి రైటు, లెఫ్టు ఉండవు. రైటు, రాంగు అని ఉంటాయి.

ఇదే మీ మాంస దర్శకుడిగా 'రెయిన్ బో' ను నేననుకున్నట్టు తియ్యాలా, నిర్మాతగా నష్టం రాకుండా చుట్టేయాలా అని నాలో నాకే ప్రశ్న వచ్చినప్పుడు నిర్మాతగా నేను నష్టపోయినా పర్వాలేదు. నాలో చిన్నప్పట్నుంచి పెరుగుతూ, నాకింతటి ఆత్మ తృప్తిని ఇచ్చిన దర్శకుడికి నేను అసంతృప్తిని ఇవ్వకూడదు అనుకున్నాను. బహుశః ఆ నిర్ణయం వల్లే ఇంకా దర్శకుడిగా ఉండగలిగాను అనుకుంటున్నాను. నామీద అభిమానంతో అగ్ర దర్శకులు శ్రీ రాజమౌళి గారు, శ్రీనువైట్ల గారు, శ్రీ కోడి రామకృష్ణ గారు, శ్రీ సముద్ర గారు, తదితరులు తమ సమయాన్ని వెచ్చించి అందులో నటించడం నాకు ఎప్పటికీ సంతోషకరమైన విషయం. ఆ విషయంలో వారందరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటాను.

కమర్షియల్ తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన, నాకు స్ఫూర్తినిచ్చిన దర్శకులు ఇద్దరు - దాసరి గారు, రాఘవేంద్రరావు గారు. ఒకరు కథ రాసుకుని తీస్తారు, ఒకరు రచయితని నమ్మి తనకి కావల్సినది రాయించుకుని తీస్తారు.

నేను ఇద్దరి బాణీల నుండీ స్ఫూర్తి పొందాను. ఆ విషయం నిరూపించుకోవడమే తరువాయి. 

వ్యక్తిగత జీవితంలో అన్ని వేళలా ఆదరాభిమానాలతో సలహాలు, ప్రోత్సాహాలనిచ్చే తోడబుట్టిన అన్నయ్యలు కూడా విచిత్రంగా ఇద్దరే. నేను మూడోవాడ్ని.

వృత్తి జీవితంలో ఎనీ డే, ఎనీ టైమ్ నాకు ఏ సహాయం కావాలన్నా నేను అడగగలిగిన స్నేహితులు కూడా ఇద్దరే - వాళ్లు చేసినా, చెయ్యకపోయినా కూడా నేను బాధపడని రేంజ్ లో -

ఒకరు, తనంత తాను పరిశ్రమలో కొచ్చి, ప్రతిభతో మంచి స్థానానికి చేరుకున్న గాయని సునీత - స్వయం భూ.

ఇంకొకరు నన్ను చూసి, నా వల్ల తన గమ్యం మార్చుకుని, పరిశ్రమలో కొచ్చి ఇవ్వాళ సహ నిర్మాతగా పలు ప్రముఖ సంస్థల్లో మంచి చిత్రాలు తీస్తున్న మిత్రుడు వివేక్. కూచి భొట్ల - ముముక్షువు. 

ఇలా ప్రతి విషయంలోనూ అవకాశాలు రెండిచ్చిన భగవంతుణ్ణి సదా కృతజ్ఞతతో తల్చుకుంటున్న సమయంలో, తెలుగువాడిగా, ఈరోజు నుండి నా రాష్ట్రాలు కూడా రెండే. సీమాంధ్ర, తెలంగాణ ఇకనుంచి నా రెండు కళ్ళు. 

అందుకే అన్నాను - నా కన్నీ రెండే... 

భగవంతుడిచ్చిన గుండెలోని గదులు రెండు జతలు.

నేను సెటిలైన హైదరాబాద్ కూడా రెండు సిటీలే. "ట్విన్" సిటీస్. 

కాబట్టి, దీన్ని బట్టి నాకొకటి అర్ధమైంది. 

రూపాయికి, బొమ్మా, బొరుసూ లాగ మనిషి జీవితంలో ప్రతి విషయానికీ ఉండే ఆప్షన్లు రెండు. కానీ ప్రతిసారీ, సమయానుకూలంగా, ఆ టైమ్ లో మన ఎమోషన్ వల్లో, ప్రశాంతత వల్లో మనం ఎంచుకునే ప్రతి దారీ మన గమ్యానికి మనని చేర్చే క్రమంలో అది మంచో, చెడో - పూర్తిగా అందుకు బాధ్యులం మనమే. ఎవ్వరినీ నిందించి ప్రయోజనం లేదు. 





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Raja Music Muchchatlu