Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tollywood comments on Telangana

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నీ పొరపాట్లే - టీవీయస్.శాస్త్రి

anne porapaatle

'జీవితంలో తప్పులనేవి ఏమీ ఉండవు,అన్నీ పొరపాట్లేనని ,ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను'. పొరపాటును సకాలంలో దిద్దుకొనకపోతే, అది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. పొరపాటు చేసి సవరించుకోని వాడికి ఆఖరికి నిద్ర కూడా పట్టదు. 'సనత్సుజాతీయం' అనే గ్రంధంలో ఈ విషయాన్ని గురించి చాలా విపులంగా చెప్పటం జరిగింది. ధృతరాష్ట్రుడు  (తెలిసి కూడా) చేసిన పొరపాట్లను, అహంకారంవల్ల, పుత్రుల మీద గుడ్డి వ్యామోహం వల్ల సకాలంలో దిద్దుకొనక పోవటం వల్ల, అతనితోపాటు, సంతానమంతా దారుణమైన మృత్యువును చవి చూశారు. 'మృత్యువు అంటే పొరపాటే' అని సనత్సుజాతుల వంటి మహనీయులు చేసిన  హితోపదేశాలు బూడిదలో పోసిన పన్నీరు చందాన అయ్యాయి. దానివల్ల  సనత్సుజాతుల వారికేమీ నష్టం జరగలేదు.

మంచి మాటలు వినని, పొరపాట్లు దిద్దుకోని, ధృతరాష్ట్రుడు అతని సంతతి యమపాశం నుండి తప్పించుకోలేక పోయారు. విదురుడు ఎన్నో నీతులు చెప్పాడు. ---"పెద్దవాళ్లను గౌరవించి వారినుండి జ్ఞానము పొందటానికి ప్రయత్నంచేయాలి. చేతకాని పనులు నిపుణత లేనప్పుడు అసలు చేయకూడదు. ఏదైనా ఒక పని చేయదలచినచో, దానిని స్వీకరించి పూర్తి అయ్యే వరకు విశ్రమించ కూడదు. గొడ్డుటావును పితికితే పాలు ఇవ్వదు సరిగదా, మూతిపళ్ళు రాలగొటుతుంది. అట్లే మూర్ఖుడైన రాజుని సేవించుట వలన లాభ మేమియూ ఉండదు. పాము మిక్కిలి భయంకరమైనది, అయినా అది మానవుడు చెప్పినట్లు విని ఆడుతుంది. మూర్ఖుడు ఎవరి మాట విననే వినడు."  విదురుడు ఇలా ఎన్నో నీతులు చెప్పాడు. రోగికి పథ్యం సహించని విధంగా, అవేవి ధృతరాష్ట్రునికి రుచించలేదు. గాడిద  కెలా తెలుస్తుంది గంధపు వాసన!

పొరపాట్లు అందరూ చేస్తుంటారు. వివేకులు వాటిని సకాలంలో విశ్లేషించుకొని సరిచేసి కొంటారు. వారు చేసినవి  పొరపాట్లని ఇతరులు తమ దృష్టికి తెచ్చినా కూడా మూర్ఖులు వాటిని దిద్దుకోరు, పైగా అదే మార్గంలో ముందుకు పోతుంటారు. బహుశా అంధకారంలో ఉండటం వల్లో లేక అహంకారం వల్లో అయి ఉండవచ్చు. మన పొరపాట్ల వల్ల ఇతరులు కూడా బాధపడతారు. చిన్న ఉదాహరణ-- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ ను చూసికూడా(చూడకపోయినా) ఆగకుండా ముందుకుపోవటం వల్ల మనతో పాటు ఇతరులకు కూడా హాని జరిగే అవకాశం వుంది.

నిప్పులో చేయి పెట్టితే (తెలిసినా/ తెలియక పోయినా) రాముడికైనా, రావణుడికైనా కాలుతుంది. అది ప్రకృతి ధర్మం. పొరపాట్లు కూడా అంతే! దైవాంశ సంభూతులే సకాలంలో పొరపాట్లు దిద్దుకొనక పోవటం వల్ల ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. మానవ మాత్రులమైన మనం ఎంత! ఒక వ్యక్తిగానే మన పొరపాట్ల వల్ల సంభవించే అనర్ధాలు ఎన్నో ఉంటాయి. అటువంటిది, నలుగురికి సంబంధించిన విషయాల మీద తీసుకొనే పొరపాటు నిర్ణయాల వల్ల ఎంత మంది బాధపడుతారో వివరించనవసరం లేదనుకుంటాను. పొరపాటు చేసినపుడు దాన్ని వినయంగా అంగీకరించి, ఇక ముందు అటువంటి పొరపాట్లు జరగకుండా నలుగురితో సంప్రదించి తీసుకునే మంచి నిర్ణయాలు, మనల్ని అందరూ గుర్తుంచుకొనేటట్లు చేస్తాయి. అటువంటి నిర్ణయాల వల్ల నలుగురికీ మేలూ  జరుగుతుంది. పొరపాట్లను సకాలంలో వినయంగా అంగీకరించటం వివేకుల లక్షణం! దాని వల్ల మన వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది!!

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi