Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

'శ్రావణ శ్రీ' - వనం వెంకట వరప్రసాద రావు

sravanasree
పొలమున నిండుగా పొంగెడి గంగలో 
రైతు దమ్ములయందు రాజహంస
గగన మధ్యంబనే గాఢ వారాశిలో 
నీదులాడేను తాఁ నెవల రాజ    
హంస సమము రాత హంసవాహనుడిచ్చె
నేల నొకడు నుండు నింగి నొకడు  
కళ లేని ముఖముతో కళ లెండు ముఖమున  
నేల రాజు యొకడు నింగి రాజు                                (సీ)   

భూమి పుత్రుడొకడు భూమి కంతకు మామ 
ఒకడు భూమిఁ దున్ను నొకడు చుట్టు 
శ్రావణంబు నందు రాజు లిద్దరొకటి     
తడియుటలను సమము తలల రాత                    (ఆ.వె)

శ్రావణమాసంలో రెండు రాజహంసలు కనిపిస్తాయి. సరిగా అదనుకు వర్షాలు కురిస్తే  పొలంలో పొంగే గంగలో భూమిని దున్ని, విత్తనాలు మొలవడానికి అనువుగా మెత్తగా  చదునుచేస్తూ 'దమ్ములు' చేస్తూ రైతు అనే ఒక రాజ హంస. నీలిసముద్రం వంటి నీలి  గగనమధ్యంలో చంద్రుడు అనే మరొక రాజహంస. ఒకడు నేలమీద, ఒకడు ఆకాశంలో, యిద్దరికీ ఒకే రకంగా తలరాత పెట్టాడు హంసవాహనుడు, బ్రహ్మ.
వర్షాలు పడితే పొలం పనులలో అలిసి కళ తప్పిన ముఖముతోనో, వర్షాలు  పడకుంటే నిరాశతో కళ తప్పిన ముఖముతోనో రైతు ఉంటాడు. శ్రావణమాసంలో  వర్షాలు పడితే, పున్నమి రోజులు అయినా అమావాశ్య  రోజులు అయినా మేఘాల  మాటున, వర్షపు పరదాల చాటున కళ తప్పి మసక  మసగ్గా ఉంటాడు చందమామ. ఒకడు భూమిపుత్రుడు, రైతు. ఒకడు భూమిమీది వారందరికీ మామ. ఒకడు భూమిని 
దున్నేవాడు, రైతు. మరొకడు భూమిని ప్రదక్షిణగా చుట్టబెట్టేవాడు, చందమామ. యిద్దరు రాజులూ ఒకటే, తడిసిపోవడంలో, తలల  రాతలో.      

నిలువున పూర్తిగా నిండి కళంకంబు 
కళ్ళకు నల్ల చెంగలువ యొకడు 
గతము నొక్కండు తాఁ కామ పాశంబులో 
చిక్కినాడన్న దౌ చిన్ని మచ్చ   

అరుదగు నిద్రలో అందిన సేద్యంపు  
గాదెల ధాన్యంపు కలల నొకడు
నిండు పున్నమి నాడు నింగిఁ వెలుగు పంట 
గాఁ తను పండించు కళల నొకడు                      (సీ)

కర్షకుండు ఒకడు కామవర్థి యొకడు    
ఒకడు తాపమొందు నొకడు యిచ్చు 
శ్రావణంబు నొకడు సాంద్ర మేఘాలలో 
నీట నొకడు, కంటి నీటిలోన!                          (ఆ.వె.)

శ్రావణమాసంలో నిలువునా బురద అనే కళంకం అంటిన వాడు రైతు. గతంలో  కామపాశంలో చిక్కుకుని, గురుపత్నితో బంధం పెట్టుకున్నాడన్న కళంకం  అంటినవాడు ఒకడు, చంద్రుడు. అరుదుగా పట్టే నిద్రలో చేతికి అందిన పంటగురించి, నిండిపోయిన ధాన్యపు గాదెలగురించి కలలు గనేవాడు ఒకడు, రైతు. నిండు పున్నమి  రోజున ఆకాశాన్ని వెలుగులపంటగా పండించేవాడు ఒకడు, చంద్రుడు. ఒకడు కర్షకుడు, ఒకడు కామవర్ధి(చంద్రుడు). ఒకడు సాంద్రమేఘాలమాటున ఉంటాడు, 

చంద్రుడు. ఒకడు వానలు పడితే పొలంలో వాననీటిలోనో, పడకుంటే నిలువునా కంటినీటిలోనో మునిగి ఉంటాడు, రైతు!     

ఎగనామము బడికి ఎగురును బుడుగు 
 
పాడు ఉద్యోగంబు పంతుళ్ళ సణుగు  
లేద కళ్ళా? పంచు లేమనౌ చుట్టు     
ముదనష్టమని ముష్టి మురికిగ తిట్టు
మిడిసిపాటు పునుగు మిర్చీల బండ్లు
తనివి దీరును రైతు తలఁ కడగండ్లు
దవఖానలకు డబ్బు దగ్గులు జబ్బు  
లయ్యకంటికి ఆలి లావణ్య మబ్బు            (మం.ద్వి)

ఏమాత్రం చినుకు పడ్డా, వర్షం పడుతుంటే ఎలా వెళ్ళడం అని బడికి ఎగనామం పెట్టి 'బుడుగు'(లు), బడికి వెళ్ళే  సమయం అయిపోగానే అదే వర్షంలో ఎగుర్లు పెడతారు. పంతుళ్ళకు మాత్రం వెళ్ళడం తప్పదు, పాడు ఉద్యోగం అని  సణుగుతారు, లోలోపలే. తెలారగట్ల వర్షం పడ్డదా, కళ్ళాపు చల్లే పని లేదులే అని  బద్ధకంగా యింకా కొద్దిసేపు పడుకుందామనుకున్న పడతిని, సరసంగా  చుట్టుకుంటాడు పతి, కళ్ళాపు లేదా? అంటూ. ముదనష్టపు వాన అని ఏ కొట్టు  అరుగుమీదో, ఏ చెట్టుకిందో కూర్చున్న ముష్టివాడు తిట్టుకుంటాడు, అడుక్కుని 
తినడం యిబ్బంది అవుతుంది అని. నాలుగు జల్లులు పడితే చాలు, పునుగులు  మిరపకాయబజ్జీలు అమ్మే తోపుడు బండ్లు మిడిసి మిడిసిపడతాయి, గిరాకీతో. దగ్గులు, జబ్బులు, దవాఖానాలకు డబ్బులు పెరుగుతాయి వర్షాలతో. కదలడానికి   వీల్లేక యింట్లోనే కూర్చోవడంతో, తీరిగ్గా చూసే అయ్యకంటబడుతుంది ఆలి  లావణ్యం.     

శ్రావణంబుఁ కథలు రసములు వెతలును              
వనము లందు విందు బర్హి చిందు  
దూర మయిన జంట దుఃఖ మందు కడకు       
గూడు లేక కుములు గుండె మడుగు         (ఆ.వె.)
 
యిలా శ్రావణమాసపు కథలు రసమయంగా ఉంటాయి, శోకరసమయంగానూ ఉంటాయి.శ్రావణ నీలిమేఘాలను చూసి, వనములలో నెమళ్ళు చిందుల విందు చేస్తాయి. ఒకరికి  ఒకరు దూరంగా ఉన్న జంటలు తట్టుకోలేని  విరహ భారంతో శోకంలో ఉంటారు. వారే 
నయము అన్నట్లు కావచ్చు, చివరికి తల దాచుకోడానికి గూడైనా లేని గుండెలు  మడుగులు అవుతాయి!   ఒంటి నిండ బురద ఉద్దె రిల్లు బురద  కంటినిండుగ బారు కలల వరద అడుగుఁ వర్ష మెపుడు? ఆశఁ జూచును పైకి

మబ్బు తేలంగ బోఁ మానములును  
అదను మీద పొలము అపుడు వర్షము రాదు 
యిచ్చి చచ్చినవాడు ఇంట నిలుచు 
నల్లపూస గొలుసు నాలి సేటుకు ఋణం    
ఉంది పురుగు మందు ఉంది ఉరికి                     (సీ)
 
తాడు పుస్తెలున్న తా డచ్చటే ఉంది!  
ఒకటి, తెంపు టన్న  దొదిలె బాధ!
రావె శ్రావణంబ! రావె వర్షంబుగా!  
అన్న రైతు ఉండు, నన్న ముండు!                 (ఆ.వె.)

కాసిని చినుకులు పడితే ఆశగా పొలం పనులు చేసి, ఒంటినిండా బురదతో, పెట్టుబడికోసం వడ్డీకి తెచ్చి తెచ్చి ఇల్లు తాకట్లు అనే బురదలోఉంటుంది బక్క రైతుకు.కన్న కలలు అన్నీ నీరై, కంటి నీరై, వరదలై కనులవెంట కారుతుంది. వర్షం ఎప్పుడు పడుతుంది? అని అడుగుతాడు అయ్యగారినో, ఎవరినో. ఆశగా పైకి చూస్తాడు, ఆకాశంలోకి. పట్టినట్టే పట్టిన మబ్బు తేలిపోతుంది, దానితోపాటే మానమూ 
తేలిపోతుంది, అప్పు తెచ్చిన దగ్గర మాట పోతుంది, పరువు పోతుంది. అదనుమీద  పొలం ఉంటుంది. అప్పుడు వర్షం రాదు. అప్పు యిచ్చినవాడు ఇంట నిలిచి అరుస్తాడు చచ్చినోడు. పోనీ ఇంకేమన్నా కుదువబెట్టి వాడి బాకీ కొంతైనా తీరుద్దామంటే, చివరికి 
నల్లపూసల గొలుసు, పసుపుతాడు కూడా నాలి సేటుకు ఋణం, అక్కడే ఉంది. ఇంకేముంది, పురుగు మందు మాత్రం ఉంది, వేళ్ళాడడానికి ఉరికి తాడు ఉంది.  పుస్తెల తాడు అక్కడే, సేటు దగ్గరే కుదువ ఉంది. అందులో ఒక సౌకర్యం ఉంది,  పుస్తెలు తెంపడం అన్న బాధ లేదు, పుస్తెలు ఉంటేగా తెంపడానికి!  ఓ శ్రావణమా! రావే! వర్షంగా రా, నామమాత్రపు శ్రావణంగా కాకుండా, వర్షపు శ్రావణంగా రా! వర్షం ఉంటేనే రైతన్న ఉంటాడు. రైతన్న ఉంటేనే అన్నం ఉంటుంది, అని కవి  శ్రావణ లక్ష్మిని వేడుకుంటున్నాడు!     

అనవిని శ్రావణ మిట్లను
వనముల నరికిరి కిరి కిరి వదలుము వనమా! 
నను నిలుపగ లేదు వనము  
విను! ఋతు పవనంబు రాదు వింత తుఫానుల్!             (కం)

విన్న శ్రావణము యిలా అన్నది. నీ కిరికిరి, గొడవ వదలవయ్యా వనమా! అడవులను నరికిపారేశారు, నన్ను, మేఘాలను నిలిపి ఉంచడానికి లేకుండా. విను! ఋతుపవనము కాదు వచ్చేది, వింత వింత తుఫానులే!   

 
గుస్సాయని తుడిచె నొకటి     
హిస్సన్నది ఒకటి యొకటి హిట్లరు యని! తే
జస్సన్నది లేకున్నది 
యిస్సీ! భూసురులఁ,  ప్రభులఁ, యింతుల యందున్               (కం)

ఆ తుఫానులకు మళ్ళీ చిత్ర విచిత్రమైన పేర్లు! 'గుస్సా' అని ఒకటి తుడిచిపెట్టింది. 'హిస్సు' అనే తుఫాను ఒకటి, 'హిట్లర్'అనే తుఫాను ఒకటి, ఇవీ పేర్లు అంటున్నది   శ్రావణ శ్రీ వ్యంగ్యంగా. అయ్యో! ఛీ! బ్రాహ్మణులలో, విద్వాంసులలో, ప్రభువులలో,  స్త్రీలలో తేజస్సు అన్నది లేకుండా పోయింది, శీలం లేకపోవడంతో.  

భూపతు లొకటికి, యొకటికి  
ఈ పుడమికి సురు, లొకటికి యింతులు బాధ్యుల్
పాపము నెరుగని నడతల 
నాపక మూ డొకనెల కవ ననువగు వానల్                         (కం) 

ప్రజలను పాలించేవాళ్ళు, స్త్రీలు, బ్రాహ్మణులు(విద్యాధికులు)సత్శీల సంపదను  కలిగి వుంటే, పాపపు నడతలు లేకుంటే, ఒక్కొక్కరి పుణ్యాన, ఈ ముగ్గురి కారణంగా,  నెలకు మూడువానలు పడతాయి అన్నది భారతీయ సంప్రదాయం, ఆర్యోక్తి. అలా 
జరగడం లేదు, అది కూడా ఒక కారణమే, కనుక తుఫానులే తప్ప వానలు లేవు  అంటున్నది శ్రావణ శ్రీ!

సంధ్యవందనమన్న  సంత యన్నది లేదు 
పక్కింటి సంధ్యకై పాట్లు తప్ప 
అగ్నికార్యమనెడి హాస్యమన్నది లేదు 
సిగరెట్టుకై నిప్పు చింత తప్ప 
పారాయణంబుల పాప చింతన లేదు 
చీట్ల పేకాట ప్రసిద్ది తప్ప 
జపతపంబుల అంటుజాడ్యంబులును లేవు 
ధనము తరుణులకై తపన తప్ప                           (సీ) 

అందరట్లు లేరు అధికు లట్లుండగా   
వందలందు ఒకడు వంద్యుడుండు 
కాన ఇంతకైన కారకులు తమరు 
కనులు తెరువరయ్య గనుడు శుభము                   (ఆ.వె.)
 
సంధ్యావందనము అనే  సంత లేదు, పక్కింటి సంధ్యకోసం పాట్లు తప్ప. అగ్నికార్యాలు, హోమాలు అనే హాస్యం లేదు, సిగరెట్టుకోసం నిప్పుకోసం చింత తప్ప. పారాయణలు అనే పాప చింతన లేదు, చీట్ల పారాయణంలో ప్రసిద్ది తప్ప. జప  తపాలు అనే అంటురోగాలు లేవు,డబ్బుకోసం, స్త్రీలకోసం తపన తప్ప అన్నది  శ్రావణలక్ష్మి వ్యంగ్యంగా. మళ్ళీ తనే అందుకుని, అందరూ అలా లేరులే, ఎక్కువశాతం 
అలా ఉన్నారు. వందమందిలో ఒకడు నమస్కారానికి అర్హుడు, ఉత్తముడు ఉన్నాడు! కనుక దీనికి అంతటికీ కారకులు మీరే, మీ  మానవులే. యికనైనా కనులు తెరిస్తే  శుభములను చూస్తారు అన్నది.

ప్రజల చింతలెపుడు ప్రభుల మనసులను  
ప్రజలనగ సుతులుగ ప్రథమ ప్రజలు 
ప్రజల బాధలెల్ల ప్రభుల బాధౌనుగా 
ప్రజలకొరకు ప్రభులు బ్రతికి యుండ            (ఆ.వె.)

ప్రజలు అంటే సంతానము అని అర్ధం కనుక, ప్రభువులకు, పాలకులకు ఎప్పుడూ తమ  సంతానం గురించే చింత. పుత్రుల బాధ వారి బాధే. కనుక వారి సంతానం కోసమే, వారి  ఉన్నతి కోసమే ప్రభువులు, పాలకులు బతుకుతున్నారు. 

ప్రజల కెట్లు గలుగు ప్రభలు సభలనగ  
ప్రభులు దీర్చు టకిది ప్రబలవాంఛ 
నా వలెనె నడుపుట నా ప్రజల కెరుక  
నా సుతులుగ ప్రజలు నాకు మీకు            (ఆ.వె)

వారి సంతానానికి 'ప్రభలు' ఎలా కలుగుతాయో అన్నదే ప్రభువులకు ఆలోచన, చింత. అందుకోసమే వారు సభలు తీరుస్తారు, వారసులను ప్రకటిస్తారు. ' నాలాగా పాలించడం  నా సంతానానికి తెలుసు. నాకైనా మీకైనా ప్రజలు అంటే నా సంతానమే' అని సిగ్గు  లేకుండా ప్రకటిస్తారు. 

ఆమె కిద్ద రున్న, అతనికి ముగ్గురు!
సిగ్గు నెగ్గు లేదు, శీలమున్న 
గాదె, మీకు కలుగు కలుములు, శుభములు!
నడత సరిగ నున్న నరుడు గెలుచు!                    (ఆ.వె.)

ఆమెకు యిద్దరు, ఆయనకు ముగ్గురు! సిగ్గు ఎగ్గు లేకుండా యిలా ఉంటున్నారు చాలామంది  స్త్రీ పురుషులు. శీలము ఉంటేనే కదా మీకు శుభములు కలుగుతాయి. నడత సరిగా వుంటే  నరుడు గెలుస్తాడు, ఎప్పుడైనా, ఎక్కడైనా.

నడత దిద్దు కొనుము నరుడ శుభమగును 
సిరులనిచ్చు ధర్మ శీల నిరతి  
విను సుగుణము లున్న వీధిన బడకున్న  
నరుక కున్న చెట్లు నరుడు నిలుచు                (ఆ.వె.)

కనుక, ఓ నరుడా! నీ నడతను దిద్దుకో! శుభముకలుగుతుంది. ధర్మము, శీలములపట్ల  ప్రేమ సిరులను యిస్తుంది. ఓ నరుడా! విను! సుగుణములు వుంటే, వీధిన పడకుంటే, చెట్లు నరుకకుంటే నరుడు నిలుస్తాడు, వృద్ధిని పొందుతాడు.

చెట్టు వర్షమిచ్చుఁ , చేరఁగా నీడయూ   
నిచ్చుఁ, పండ్లనిచ్చుఁ,  నిచ్చుఁ  శాంతిఁ  
చెట్టుఁ నరుక కండి, చెట్టు చల్లని తల్లి! 
వృద్ధి నిచ్చుఁ ధర్మ వృక్ష రక్ష!                         (ఆ.వె.)

చెట్టు వర్షాన్నియిస్తుంది. దగ్గరికి చేరితే నీడను యిస్తుంది. పండ్లను యిస్తుంది. శాంతిని,  హాయిని యిస్తుంది. చెట్టు చల్లని తల్లి! ధర్మమూ చల్లని తల్లి వంటిదే, కనుక, ధర్మాన్ని, వృక్షాన్ని రక్షించడం వృద్ధిని యిస్తుంది.

అన్నది శ్రావణ శ్రీ తను 
విన్నది విన్నటుల విన్నవించితినయ్యా 
ఎన్నుట లెవరిని గాదిది 
ఉన్నది ఉన్నటుల పలుకుటున్నది గుణమై!        (కం)
 
అని అన్నది శ్రావణ శ్రీ. నేను విన్నది విన్నట్లే విన్నవించాను, ఎవరివీ తప్పులు
ఎన్నడానికి కాదు. ఉన్నది ఉన్నట్లు అనడం నా లక్షణం, ఉన్నది ఉన్నట్లు అనడం 
ఉత్తమ గుణం అంటున్నాడు కవి. 
 
వందనమిడి శ్రావణ సతి 
కందరికిని సుగుణములను కలిమియు శుభమున్  
పొందగు వర్షము కర్షకు  
లందగ నిడుమన నగవుల లల నౌ ననియెన్               (కం)
 
శ్రావణ సతికి వందనములు చేసి, అందరికీ సుగుణములను, సంపదను, శుభములను, కర్షకులకు పొందైన వర్షమును యివ్వుమమ్మా అని ప్రార్ధించాడు కవి. నవ్వుతూ అలాగే  అవుతుంది అన్నది ఆ లలన, శ్రావణ శ్రీ.

శ్రావణమున శుభముల జడి 
రావలె, నీ ధరణి శాంతి రాగపు నెలవై 
పోవలె, సిరి గౌరి కొలువు 
కావలె, భారతియు,  భరతకాంతకు జయమౌ!            (కం)

శ్రావణంలో శుభముల జడివాన రావాలి, శుభప్రదమైన జడివాన రావాలి. ఈ భూమి  శాంతికి, అనురాగానికి నెలవుగా కావాలి. లక్ష్మి, పార్వతి, సరస్వతీ మాతలు కొలువు  తీరాలి. భారత మాతకు జయం కలగాలి అని కోరుతున్నాడు కవి. 

కొనసాగుతుంది)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
sabhaku namaskaram