Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram seventh part

ఈ సంచికలో >> సీరియల్స్

అమూల్యం - కె. సభా

amulyam story by sabha

వాకిట్లో అడుగు పెట్టగానే గట్టిగా మొరిగింది కుక్క పలకరిస్తే కుక్కలేమీ చేయవని అనడం విన్నాను. పైగా బెదిరితే చూచిన వాళ్ళు నవ్వుకోవచ్చు. అంచేత ప్చ్ ప్చ్ ప్చ్ అంటూ చిటికెలు వేస్తూ ముందుకు వెళ్లాను. అది నా పాదాలను వాసన చూస్తూ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే నెమ్మదిగా వంగి వీపు నిమిరాను. ఇంటిలో ఎవరూ ఉన్న అలికిడి కన్పించలేదు. వసారాలో ఉన్న నవారు మంచాన్ని వాల్చుకొని కూచున్నాను. కుక్క మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళింది. ఇట్లా నాలుగైదు మార్లు లోపలికి బయటికీ తిరిగాక స్నానాల గదిలో నుంచి బయటికి వచ్చారు. కవిగారు.

"ఒక్క క్షణం కూర్చోవయ్యా!" అని ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. కుక్క అటూ ఇటూ తిరగడం మానుకొని వాకిలికి అడ్డంగా పడుకొన్నది నా వంక చూస్తూ.

రెండు నిమిషాల్లోనే కవిగారు పేము కుర్చీ తెచ్చి మంచం ముందు వేసి కూచున్నాడు. "బలే కుక్కను సంపాదించారే, ఎక్కడ పట్టుకొచ్చారు?" అన్నాను దాని వంక చూస్తూ.

"నేను పట్టుకురాలేదు. అదే వచ్చింది" అన్నారాయన.

"అదే వచ్చిందీ? ఎక్కడ నుండి వచ్చింది" అన్నాను నవ్వుతూ.

కవిగారు ఈ కుక్కను గురించి గూడా ఏదైనా కథ చెబుతారు కావాలనుకున్నాను ఆయన వాలకాన్ని చూచి. అంతే జరిగింది. ఆ కుక్కను గురించి ఆయన పెద్ద కథనే చెప్పారు. అసలు ఆయన మీద నాకు అభిమానం పుట్టిన ఘట్టం కూడా బహు చిత్రమైంది. ఆయన జాగిలాన్ని గురించి వ్రాసిన గేయాలను చదివి ఆయనను దర్శించాలనుకొన్నాను. ఒక మహాసభలో ఆయన ఉపన్యాసం ఉందని వెళ్లాను. తీరా వెళ్ళాక ఆయన సభలో ఆ జాగిలాన్ని గురించి వ్రాసిన గేయాలే చదివారు. ఆనాడు యేర్పడిందాయనతో పరిచయం. అప్పుడప్పుడూ తీరిక చిక్కినప్పుడల్లా ఆయన్ను దర్శించుకొంటూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా ఆయన ఏదో ఒక కథ చెబుతూ ఉంటారు. ఆ కథల్లో ఎక్కువ భాగం నవ్వు పుట్టించేవి. కాస్సేపు సరదాగా కాలక్షేపం జరిగినా ఆ వ్యవధిలోనే విజ్ఞానం కూడా వికసిస్తుండేది.

"అది కాట్పాడి నుండి వచ్చిందయ్యా" అన్నారాయన. కాట్పాడి నుంచి కవిగారింటి కొక కుక్క వచ్చిందంటే ఎలా నమ్మాలి? ఆయన చెబుతున్నారు గనుక నమ్మక తప్పదు. అసత్యం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు.

"నేను ఆ మధ్య తిరువన్నామలై వెళ్ళివచ్చాను. నీకు గుర్తుందనుకొంటాను. దారిలో కాట్పాడి స్టేషన్ లో అటూ ఇటూ పచారు చేస్తున్నాను" అని అంటుండగానే జాగిలం తుర్రుమని వీదివైపు వెళ్ళింది. కవిగారి భార్య లోపలికి వస్తుంటే ఆమె వెనుక తోకను వూపుకుంటూ మళ్ళీ యథాస్థానంలోకి వచ్చి పడుకొంది.

"బలే మెలకువైంది. చీమ చిటుక్కుమంటే చాలు తెలుసుకొంటుంది. మనం మనిషి ముఖాన్ని చూచి కూడా అతని స్వభావాన్ని కనిపెట్టలేం. ఇది పాదాలను చూచి అతని హృదయాన్ని తెలుసుకొంటుంది. నిజంగానే చెబుతున్నాను. ఇది మా యింటికి వచ్చినప్పటి నుండి నాకెందుకో చాలా సంతృప్తిగా వుంది. చెప్పరాదుగానీ నాకు మానవుల మీద విశ్వాసం నశించింది. దానికి బోలెడు కారణాలున్నావనుకో?" అంటూ జాగిలం వైపు చూశారు కవిగారు.

అది మెల్లగా లేచి కవిగారి పాదాలను స్పృశించి "కుయ్ కుయ్" మంటూ ఉన్నది. "వెళ్లు. అమ్మను కాఫీ తీసుకురమ్మను" అన్నారు కవిగారు. ఆ మాట విన్న దవసరం అది ఒక్క గెంతుతో లోపలికి వెళ్ళిపోయింది. కవిగారి భార్య రెండు కాఫీ కప్పులతో రావడాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను.

ఎందుకలా ఆశ్చర్యపడుతున్నావ్? ఇందులో ఆశ్చర్యపడవలసిందేమున్నది. ప్రాణంలేని యంత్రాలే మానవుడు చెప్పే పనులను చేస్తున్నాయి. ఇక ప్రాణం వుండే వుండే జంతువులు చేయడంలో విశేషమేముంది. దీని కన్నీ తెలుసు. నీకు చెబితే నమ్మవుగానీ, నేను ప్రయాణమవుతుంటే చెప్పులు తెచ్చి పాదాల వద్ద పడవేస్తుంది. చేతి కర్రను అందిస్తుంది. దీని చిలిపి చేష్టలు చాలా ఉన్నవనుకో. అసలు కథ చెబుతాను. ముందు కాఫీ తీసుకో" అన్నారు కవిగారు. నేను కాఫీ కప్పు నందుకోగానే కవిగారు జాగిలంవైపు చూచి "వెళ్లి పాలు త్రాగు పో" అన్నారు. అది కవిగారి భార్యతో పాటు లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెనక నా వైపు చూచి ప్రారంభించారు కవిగారు.

"చల్లగా వెన్నెల. ఐనా మహా చలిగా ఉంది. శాలువను కప్పుకొన్నాను." చలి వేస్తున్నా ఆ వెన్నెల్లో ఆరుబయటే కూచుందామనిపించింది. ఒక చిన్న చెక్క మీద కూచుని ఆకాశం కేసి పరీక్షగా చూస్తున్నా. నా పాదాల నేదో స్పృశించింది. కాలితో విసిరాను. బరువుగా తగలడం... కుయ్యోమన్న ఏడుపు... కుక్క కరిచిందేమోననిగాబరాపడ్డాను. ఊరికే స్పృశించిందంతే. కాని దానికి నా కాలితాపు బాగా తగిలిందనుకొంటాను. అది నిజంగానే ఏడ్చుకొంటూ ఆవలివైపు వెళ్ళింది. అక్కడో ముసలాడు కర్రను విసరబోయాడు. తప్పుకొని మళ్ళీ నా వైపు వచ్చింది. నన్ను చూచి మళ్ళీ టీ దుకాణం వైపు వెళ్లిపోయింది.

నాకెందుకో ఉన్నట్టుండి దాని మీద జాలి పుట్టింది. కారణం చెప్పలేను. కాలితో తన్నిన తాపునకు మంచి దెబ్బ తగిలి ఉంటుందని అనుకొన్నాను. ఆ సమయానికి నాకు మా అమ్మ జ్ఞప్తికి రావడం చాలా విచిత్రం. చిన్నతనంలో మా యింట్లో ఒక కుక్కను పెంచుకొనే వాళ్ళం. దాని పేరు శివంగి. అది చాలా ఎత్తుగానూ, బలంగానూ ఉండేది. నేనా కుక్కను చేత్తో గుద్దేవాణ్ణి. నా యిష్టం వచ్చినట్టు తన్నేవాణ్ణి. ఐనా అది పట్టించుకొనేదికాదు. నా వద్ద తన్నులు తినడమే దానికొక సరదాగా ఉండేది. అమ్మ మాత్రం గట్టిగా చెప్పేది. "కుక్కను తన్నితే కాలికి సులుపు పడుతుంది" అని. ఆమె విశ్వాసమది. ఆ భయంతో క్రమంగా తన్నడం మానుకొన్నాను. పెద్దవాళ్ళేదో బలమైన కారణముంటేనే ఒక నియమాన్ని విదిస్తారనుకొంటాను. నోరులేని జంతువుని కొట్టకూడదంటే వినరు. ఏదో రోగం వస్తుందని భయపడతారు. ఆ విషయం నాకు జ్ఞప్తికి వచ్చింది. మా అమ్మ ఆజ్ఞను మళ్లీ యిన్నాళ్ళకు దిక్కరించానెందుకూ? అని నన్ను నేనే ప్రశ్నించుకొన్నాను. అమ్మ శివంగికి రాత్రుల్లో గోనెను కప్పి పెడుతుండేది. కుక్కకు కూడా చలి వేస్తుందన్న విషయం అమ్మకు తెలుసు. ఆ సత్యాన్ని నేను కాట్పాడి స్టేషన్ లో కనుగొన్నాను. ప్రత్యక్షంగా చూశాను. టీ దుకాణం వైపు వెళ్ళిన కుక్క బల్ల క్రిందకు చొరబడింది. దుకాణం వాడు ఒక్క తాపు తన్నాడు. అది అక్కడి నుండి మళ్ళీ గడగడలాడుతూ ఆరుబయటికి వచ్చింది. ప్రతి ప్రయాణీకుని పాదాలను స్పృశించబోతోంది. ప్రతివాడూ దాన్నుండి తప్పుకొంటున్నాడు. నిజంగా దానికి చలి లేకుంటే అలా ఎందుకు తిరుగుతోంది!

ఒక్క చలి మాత్రమే గాదు. ఆకలి కూడా వేస్తున్నది గావాలి. టిఫిన్ స్టాల్ ముందు తింటున్న ప్రతిదాని ముందూ నిలబడి ఎంతో జాలిగా చూస్తున్నది. దాని చూపులతో కన్పిస్తున్న ప్రార్ధనా పూర్వకమైన భావాన్ని పసిగట్టే శక్తి మానవునికి లేదనుకొంటాను. ఎవరి ఆతురతతో వారున్నారు. అసలు జాగిలం వైపు చూచేటంతటి ఓపిక గూడా ఏ ప్రయాణీకుని కుంటుంది? రైలు స్టేషన్లో టిఫిన్ స్టాల్సు ముందు కుక్కలకంటే మనుషులే ముందుగా కన్పిస్తారు. ఈ విషయం చెబుతుంటే నా కొకసారి గూడూరులో జరిగిన సంఘటన జ్ఞప్తికి వస్తోంది. బండి నిలవగానే ముఖం కడుక్కొని ఒక పెరుగన్నం పొట్లం కొనుక్కున్నాను. విప్పేలోగా ఇద్దరు కుర్రాళ్ళు చేతులు చాచుకుని నిలబడ్డారు. అన్నం తింటుండగానే చేతులు చాస్తే మనం ఎలా తినగలం? ఆ పొట్లం వారికిచ్చేశాను మళ్ళీ ఇంకోటి కొనగానే యింకో నలుగురు కుర్రాళ్ళు ముందుకు వచ్చారు. అవి రాయలసీమ కరువు రోజులనుకో. అలా చూశాను. చుట్టూ ఇరవై మంది కుర్రాళ్ళున్నారు. జేబులోనున్న చిల్లర డబ్బులు లెక్కపెట్టాను. ఐదు రూపాయలున్నాయి. టిక్కెట్టు ఉంది గనుక ప్రయాణం సాగిపోతోంది. ఒక్క క్షణం ఆలోచించి నాలుగు రూపాలకు పొట్లాలు కొనేశాను. ఇరవై ఒక్క పొట్లాలు. తలా ఒకటిచ్చాను. నేనూ ఒకటి విప్పి వారితో కలిసి తిన్నాను. భగవంతుడు నన్ను ఇంతవరకూ పస్తు పెట్టలేదనుకో, ఇంటికి వెళ్ళేలోగా ఒక పూటకే మిత్రుడో కనిపించి అన్నం పెడతాడులేనని సాహసించాను. ఆ కుర్రవాళ్ళంతా తింటుండగా నేనెంత ఆనందాన్ని అనుభవించానో, సంతృప్తిపడ్డానో చెప్పలేను. నీతో గనుక చెబుతున్నాను. ఇలాంటి విషయాలు చెప్పుకోరానివి. చెప్పినా మానవమాత్రులు నమ్మలేనివి. ఆ పూటకాపూట గడుపుకొనే మనలాంటి వారు ఈలాంటి త్యాగాలు చేస్తారంటే లోకం నమ్మదు" అని పొగ చుట్టను పైకి తీస్తూ, "అగ్గిపెట్టెను యిచ్చి పంపే" అంటూ కేక వేశారు
కవిగారు. చిటికెలో అగ్గి పెట్టెను నోట కరచుకొని వచ్చింది జాగిలం.

కవిగారు అగ్గిపెట్ట నందుకొని చుట్టను ముట్టించి ప్రారంభించారు.

"స్టేషన్ లో ఏదో బండి వచ్చి ఆగింది. చాలామంది దిగారు. అంతకంటే ఎక్కువమందే ఎక్కారు. ఎందరు దిగినా, మరెందరెక్కినా కుక్కను గురించి పట్టించుకొనే వారెవరూ కన్పించలేదు. వచ్చిన బండి వెళ్ళిపోయింది. నేనూ, మరో ఏడెనిమిది మంది మాత్రమే మిగిలాము. బుక్ స్టాల్ కొంచెంగా తెరచి అమ్మే కుర్రాడు కునికిపాట్లు పడుతూ కూచున్నాడు. కుక్క అటూ యిటూ తిరుగుతూనే ఉంది. దాని కడుపు వీపునకు అంటుకపోయింది. బాగా ఆకలి వేస్తున్నట్టుంది. కొళాయి వద్ద చిన్న చిన్న గుంటల్లో నిలిచిన నీటిని చప్పరించి మళ్ళీ నా పాదాల వద్దకు వచ్చింది. అతి దీనంగా చూస్తూ నిలబడింది. నాకా క్షణంలో వివేకానందుడు జ్ఞప్తికి వచ్చాడు. "నా దేశంలో ఒక కుక్క కూడా పస్తు పడుకోరాదు" అన్నాడాయన. ఆ మాటలో ఎంత అర్థముంది! అంతటి మహనీయుడు గనుకనే వివేకానందుడు చరితార్థుడయ్యాడు. అవును. దేశంలో ఎక్కడైనా సరే, ఒక కుక్కపిల్ల కూడా పస్తు పడుకోరాదు. అలాంటి ప్రతినతోనే దేశోద్ధరణకు కంకణం కట్టుకొన్నాడు. స్వామి వివేకానంద.

కానీ నా కళ్ళ ముందు ఒక కుక్క పస్తు పడుకొన్నది. అది ఆకలిగా ఉన్నదని, తనకు అన్నం పెట్టమని దానికి కనిపించిన ప్రతి మనిషినీ ఆర్ధించింది. దాదాపు రెండు గంటల నుండి దానిని పరిశీలిస్తున్నాను. ఎందరినో యాచించింది. దానికీ నోరు ఉంటే మానవ భాష మాట్లాడగలిగి ఉంటే గట్టిగా ఎలుగెత్తి చెప్పి ఉండేది. "బిక్షాం దేహీ" అని శ్రావ్యంగా పాడి ఉండేది. ఈశ్వరుడా భాష నివ్వలేదు. ఒక్క చూపులతోనే అర్ధించగలదు. కనులతోనే యాచించగలదు. అడిగితేనే, గట్టిగా గొంతెత్తి ఏడుస్తూ యాచించితేనే తోటి మానవునికి అన్నం పెట్టని మానవుడు, చూపులతో యాచించే కుక్కకు అన్నం పెడుతాడా? అసలు కుక్కలవైపు చూచే విశ్రాంతి మానవుని కెక్కడిది? స్టేషన్ లో కూచుంటే కళ్లకు ఆకర్షించేవి యెన్నో ఉంటాయి. కూడలి కేంద్రాలైతే ఎన్నో ప్రాంతాల మనుషులు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. వారిలో అందమైనవారు కూడా ఉంటారు. సహజంగా వారి సౌందర్యాల వైపు తిరుగుతుంటాయి పరిశీలకుల నేత్రాలు. ఆ మాటకు వస్తే అందరూ అంతే. కవులూ చిత్రకారులూ ఎవరైతేనేం... కాముకులూ, విరాగులూ అందరూ ఏదో అందం చేతనే ఆకర్షించబడతారు. నిజానికి నేనూ అంతే. ఐనా ఆ రోజు ఆ రెండు గంటలసేపూ ఆ కుక్కను గురించి ఆలోచిస్తూ దాన్ని పరిశీలిస్తూ ఉండిపోయానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

ఆ సమయంలోనే నేను కుక్కను గురించి వ్రాసిన గేయాలుకూడా జ్ఞప్తికి వచ్చాయి. ఒక్కొక్క పాదమూ స్మరణకు వస్తున్నాయి. ఆచరణ వేరు; కవిత్వం వేరు. ఉపన్యాసాలతో కన్పించే ధర్మాలు నిత్యజీవితాల్లో కన్పిస్తే ప్రపంచం ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు. మరి గేయాలు వ్రాస్తూ కథలు చెబుతూ కరుణా, జాలి అంటే అర్థమేముంది? అందుకనే తక్షణం లేచాను. టిఫిన్ స్టాల్ వైపు వెళ్లి ఒక పొట్లాన్ని కొన్నాను. చకచకా కుక్కదగ్గరికి వెళ్లి పొట్లాన్ని విప్పి ముందుంచాను. ఒక్క మెతుకైనా వదిలిపెట్టకుండా తిన్నది, మధ్య మధ్య నా వైపు రెండు మూడు సార్లు చూచింది. ఆ చూపుల్లోని కృతజ్ఞతా భావాలను కొలిచే సాధనాలను మానవుడింతవరకూ కనిపెట్టలేదు. గాలినీ, ద్రవ పదర్థాలనూ, ఘన పదర్థాలనూ కొలవడం తేలిక గావచ్చు కానీ, ఒక ప్రాణి మరో ప్రాణికి చూపే కృతజ్ఞతను కొలవడం యెట్లా? ఒకరి పట్ల మరొకరి కున్న ప్రేమను విలువకట్టే దెట్లా? ఇవన్నీ ప్రశ్నించుకొన్నప్పుడు మానవునికి పరిష్కరించకుండా మిగిలిపోయిన సమస్యలు అసంఖ్యాకంగా కన్పిస్తాయి. ఉదాహరణకు నేను కవినైనా ఆ క్షణంలో ఈ జాగిలం చూచిన చూపును, ఆ దృక్కులతో కన్పించిన కృతజ్ఞతలను వర్ణించలేకపోయాను. ఆప్యాయంగా మళ్ళీ పాదాలను స్పృశిస్తుంటే దాని ఒంటిమీద చెయ్యి వేశాను. అలాంటి స్పర్శను అనుభవించి ఎన్నాళ్ళయిందో తెలియదు. ప్రతిచోటా అది దెబ్బలు తింటూ వచ్చింది కావాలి. మానవులంతా తమ జాతిని కొట్టడానికే పుట్టారేమోనని అనుకోని ఉంటుంది. కానీ కొన్ని కుక్కలైనా యజమానుల వెంట సరదాగా తిరగడాన్ని అది చూచి ఉంటుంది. అంచేత అలాంటి అవకాశం తనకూ ఉంటే ఎంత బావుండునని అది అనుకొని ఉంటుంది కావాలి.

ఏమైతేనేం! కుక్కకు అన్నం పెట్టాను. దానికి ఆకలి తీరిపోయింది. పాపం పుణ్యంమాట అటుంచి ఆత్మలూ, పరమాత్ములూ స్వర్గమూ నరకమూ యివన్నీ యథార్ధమైతే కనీసం వివేకానందుని ఆత్మకు కొంత మట్టుకు సంతృప్తి కల్గి ఉంటుందనుకొంటాను. ఇలాంటి ఊహలు కొందరి దృష్టిలోనే కాదు, చాలామంది దృష్టిలో అసహజాలే కాదు, అప్రయోజనాలుగా కూడా కన్పిస్తాయి. కానీ భావన, ఊహ, ఆశ, కల, ఆవేదన, సంతృప్తి యివన్నీ లేనపుడు మనిషి యంత్రమై పోతుంటాడు. చలనం లేని జడపదార్ధమై అతని హృదయం ఉక్కుకంటే కఠినమై పోతుంది.

బండి రావడానికింకో అరగంట వ్యవధి ఉన్నది. కాస్సేపు నడుం వాలిస్తే బావుండు అనిపించింది. పడుకోడాని కనువైన చోటు రెండవ తరగతి, మొదటితరగతి వెయిటింగు రూము మాత్రమే. మూడవ తరగతి ప్రయాణీకుల హాలు ఒక చిన్న చేపల మార్కెట్టు వలె ఉంటుంది. ఏ వూరైనా అంతే. ఎక్కడి అరటి తొక్కలక్కడే ఉండగా చిత్ర విచిత్రమైన వస్తుజాలాలతో ఆ పరిసరాలలోని అపరిశుభ్రతనంతా ప్రోగుచేసుకొని ఉంటుంది. అక్కడెలా పడుకోవడం? మూడవ తరగతి ప్రయాణీకుడెప్పుడూ చులకనే. అంచేత ఉన్నచోటనే ఆ చిన్న చెక్క మీదే అలా వెనక్కి ఒరిగాను. నిద్ర చోటు నెరుగదు. ఆకలి రుచినెరగదు గదా? బాగా నిద్ర పట్టింది. ఎప్పుడు వచ్చి నిలిచిందో బండి తెలియదు. గబగబా లేచి కన్పించిన పెట్టెలోకి చొరబడ్డాను. దైవానుగ్రహం వలన కొంచెం పల్చగానే ఉన్నారందులో. కూర్చున్న రెండు నిమిషాల కల్లా బండి కదిలింది. అక్కడినుండి రైలు అతి నెమ్మదిగా నడుస్తుంది. పట్టాలు తప్పిన ప్రాణభయం మాత్రం ఉండదు. మెల్లగా చోటుచేసుకుని కిటికీవైపు తలనాన్చుకొని పడుకొన్నాను. గంటన్నర ప్రయాణం ఐనా రెండు గంటలవుతుంది రైలు వెళ్ళడానికి. ఆలోగా మరో చిన్న కునుకైనా చాలనుకొన్నాను.

పడుకొన్నాను గానీ నిద్రపట్టలేదు. వెన్నెల్లో ప్రకృతి ఎంతో రమ్యంగా వుంది. అలా కన్పించే పచ్చని పొలాల వైపు చూస్తుండగానే నాకీ కుక్క జ్ఞప్తికి వచ్చింది. పాపం! ఆ పూట అన్నం పొట్లం కొనిపెట్టాను. రోజూ అన్నం పెట్టే వాళ్ళెవరు? దాన్ని కూడా పిలుచుకొని వచ్చివుంటే బావుండేదనుకొన్నాను. రైల్లో కుక్కను ఎక్కించకపోయినా ప్రత్యేకంగా పెట్టెలో ఎక్కించి వుండవచ్చు. పాడు డబ్బులు పోతేనేం. ఏ రూపాయో రెండు రూపాయలో తీసుకొని ఉంటారు. చిటికెవేసి ఉంటే అది బండెక్కి ఉండేదేమో? వచ్చేటప్పుడు దాన్ని గురించే అనుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఒక్కొక్క కుక్కను రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకూ కొనే వారున్న ఈ రోజుల్లో ఉచితంగా లభించిన జాగిలాన్ని, అందులోనూ ఎంతో ప్రేమనూ, కృతజ్ఞతనూ చాటిన కుక్కపిల్లను ఎందుకు వదిలిపెట్టానా అన్పించింది. ఆలోచిస్తుంటే దానికీ నాకూ ఏదో విడదీయరాని చెలిమి ఉన్నట్టు కన్పించింది. కేవలం ఒక కుక్క కోసం, దాని ఆకలి తీర్చడం కోసం డబ్బు ఖర్చుపెట్టడం నా జీవితంలో అదే తొలిసారి. దానధర్మాలు చేయాలనే ఆకాంక్ష, ఉబలాటం అందరికీ ఉంటుందేమో నాకు తెలియదు కానీ అవకాశాలు మాత్రము అందరికీ లభించవు.

జీవితంలో అదొక మంచిరోజు అని అనుకొన్నాను. ఆ కుక్కను చూచి ఆ రెండు మూడు గంటల్లోనూ నేను చాలా విషయాలు నేర్చుకొన్నాను. కన్న తల్లిని స్మరించుకొన్నాను. మహానుభావుడైన వివేకానందుని జ్ఞప్తికి తెచ్చుకొన్నాను. ఒక ప్రాణి ఆకలిని చల్లార్చాను. అన్నిటికంటే ప్రధానమైనది క్రొత్త భాషను నేర్చుకొన్నాను. దైవ భావనను, కరుణాంతరంగాన్ని, నిష్కలంక ప్రేమను ప్రస్ఫుటింప చేయడానికి బ్రహ్మాండమైన పదజాలాలు అవసరంలేదు. చిన్న చిన్న మాటలతో వెన్న పూసల వలె గుండెలను ద్రవింప చేయడమటుంచి ఒకటి రెండు దీన దృక్కులతోనే గండశిలలను సైతం కరిగించవచ్చు.

మహాపండితులతో మాట్లాడాను. అఖండ మేధావులతో చర్చించాను. విశ్వ విఖ్యాతులైన కవి పుంగవులను దర్శించాను. నేను ఏదో అతిశయోక్తి అంటున్నానని నీవు అనుకోరాదు. ఆ కుక్కను చూచినపుడు కల్గిన హృదయ స్పందనం, ఆ వెనుకటి ప్రవిత్రమైన భావనలు మధురము దివ్యమూనైన స్మృతులు కలుగలేదు. ఇది యదార్థం. అందుకే ఆ రెండు గంటలూ నాకు నిద్రపట్టలేదు. నాకా కుక్కమీదే ధ్యాస మిగిలి పోయింది. ఉదయం మళ్ళీ కాట్పాడికి వెళ్లి దాన్ని వెదికి యింటికి తెచ్చుకొందామనే నిర్ణయానికి వచ్చాను.

స్టేషన్ రాగానే బండి దిగాను. స్టేషన్ బయటకి వచ్చి ఒక ఒంటెద్దు బండిని కుదుర్చుకొని ఇంటికి బయలుదేరాను. బండి కదిలిందో లేదో వెనుక వైపున నీడ కన్పించింది. నా కలవరం కానీ ఏదో ఊర కుక్కై ఉంటుందని అనుకొన్నాను. కుక్క కన్పించలేదు గానీ నీడ మాత్రం కన్పిస్తూ ఉంది. బండీ ప్రక్కనే వస్తున్నది కావాలి. ఇది కాట్పాడీలో కన్పించిన కుక్క మాత్రం కాదు. అదెలా వస్తుందిక్కడికి అనుకొన్నాను. ఆశ్చర్యం! ఏం చెప్పను! బండి దిగి ఇంట్లో అడుగు పెడ్తున్నాను. ఈ జాగిలం నాతోనే గృహ ప్రవేశం చేసింది.

"ఎక్కడిదీ ఇదెక్కడిదీ?" అన్నది మా ఆవిడ. నేనే తీసుకువచ్చాను. చాలా మంచి కుక్క పెంచుకొందామన్నాను. మా ఆవిడ వైపు దీనంగా చూస్తూ ఇంట్లో జాగ్రత్తగా ఉంటానన్న భావాల్ని వెలిబుచ్చింది.

ఒక్కసారిగా సంతోషమూ, ఆశ్చర్యమూ, ఏదో చెప్పనలవికాని హృదయ చలనము... నాలుగైదు నిమిషాల దీనివంక చూస్తూ కూచున్నాను. కిక్కురుమనకుండా మంచం క్రింద హాయిగా పడుకొన్నది.

పద్దెనిమిది మైళ్ళు రైల్లో వచ్చిందా? ఊహూ... కాదు, రైలు వేగం గంటకు తొమ్మిది మైళ్లే. ఇది మీటరు గేజీ. రాత్రి ప్రయాణం. రైలు వెంబడీ పరుగెత్తే వచ్చింది. నేను ఎక్కినా పెట్టెలో అది ఎక్కనేలేదని మాత్రం గట్టిగా చెప్పగలను. బహుశా సీటు క్రింద నక్కి ఉంటుందనుకోవడానికైనా పెట్టెలో రెండే బెంచీలున్నాయి. ఎవరి కాలికైనా తగిలి ఉండాలి. మరెలా వచ్చి ఉంటుంది. మధ్యలో రెండు స్టేషన్లలోనూ నేను దిగకపోవడం గమనించుకొని ఉంటుంది. మూడో స్టేషన్లో దిగడాన్ని పసికట్టి వెంబడించింది. ఇంత కష్టపడి ఎందుకు వచ్చిందంటావ్?" అంటూ కవిగారు ప్రశ్నించారు.

నేనేమీ చెప్పకపోవడం చూచి ఆయనే అన్నారు. "నేను మొదట కలితో విసిరినపుడు దానికి పెద్ద దెబ్బే తగిలి ఉంటుందేమో! కానీ ఆ వెనుక డబ్బులు పెట్టి పొట్లంకొని నే నందులో కొంచెమైనా తీసుకోకుండా దానికివ్వడాన్ని బట్టి అదేదో అర్థం చేసుకొన్నది. ఎవరైనా కనికరిస్తే ఎంగిలి విదిలించి ఉంటారు, లేదా మిగిలిన అన్నం కబళం దాని ముందు పడేసి ఉంటారు. నా విషయం మాత్రం దానికి ప్రత్యేకంగా కన్పించింది. దానికోసమే పొట్లాన్ని కొనడం దానికే ఆశ్చర్యమై ఉంటుంది. అంచేత ఎలాగైనా నాతో ఉండాలనుకొన్నదది. దాని బలీయమైన కోరికను నేను కాదనలేకపోయాను. ఇంటికి వచ్చాక తరిమిగొట్టినా అది వెళ్లదని తేలిపోయింది" అంటూ జాగిలం వైపు చూశారు కవిగారు. అది తోకను ఆడిస్తూ అతని మోకాళ్ళమీద ముందరి కాళ్ళ నుంచి నిలబడింది.

"అంతేగదరా? నువ్వు బలేగట్టివాడివి. చుట్టలై పోయాయి గానీ వెళ్ళి చుట్టల పెట్టెనాలా పట్టుకరా" అన్నారు కవిగారు జాగిలంతో.

అది నిమిషంలో తెచ్చిపెట్టింది పెట్టెను కవిగారు చుట్టల పెట్టెను తెరుస్తూ "అమ్మాయికి పెళ్లి ఐపోయాక యింట్లో ఆ పనీ ఈ పనీ చేసేవారు కూడా లేరు. అబ్బాయికేమో నెల్లూరులో ఉద్యోగమైంది. ఇప్పుడు ఒక కుర్రాడు చేసేటంత పనిని యిదొక్కటి చేస్తున్నదంటే నువ్వు నమ్మకపోవచ్చు" అన్నారు.

"ఔనారా!" అన్నాను జాగిలం వైపు చూచి. ఆశ్చర్యం! అది తలను క్రిందికీ పైకీ ఆడించింది. "చాలా విచిత్రంగా ఉంది" అన్నాను పైకిలేస్తూ.

"ఏముందిందులో విచిత్రం" అన్నాడు కవిగారు. ఏం చెప్పను.

"చాలా మంచికుక్క ఇది మీ రన్నట్టు మనిషి కంటే మంచిది" అన్నాను సెలవు పుచ్చుకుంటూ. కవిగారు చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో ఎంతో సంతృప్తి కనిపించింది. జాగిలం నా వెంట కడప దాకా తోకనాడిస్తూ నిలబడింది. ఒకసారి ఒంటిని దువ్వి "మళ్ళీ వస్తాను" అంటూ వచ్చేశాను.

ఐదేళ్ళకు ముందు జరిగిన ఈ సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకొన్నాను. కళ్ళ నిండుకూ నీళ్ళు క్రమ్మిన విషయం నాకు తెలియదు. నిశ్శబ్దంగా ఎంతకాలం కూచున్నానో కూడా తెలియదు. చేతిలో ఉన్న ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదువుకున్నాను.

"నీవు పంపిన రెండు పుస్తకములు అందినవి. మనస్థిమితం లేక వెంటనే చదవలేదు. త్వరలోనే చదవగలను. మన శివంగి పోయింది. అది వీధిలో ఉన్నప్పుడు మునిసిపాలిటీవారు పట్టుకొన్నట్టు ప్రక్కింటి పాప చెప్పింది. ఆ రాత్రి వెళ్లి వ్యర్థ ప్రయత్నం చేశాను. ఆ పాటికే దాని ప్రాణాలు తీసేశారు. వారం రోజుల వరకూ నాకు నిద్రపట్టలేదు. ఈ జాబు వ్రాస్తున్నప్పుడు కూడా అది నా పాదాలను స్పృశిస్తూ నా కలాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది.

ఏమని వ్రాయగలను నా యావేదన! ఒక కుక్కను పట్టితెస్తే అర్థ రూపాయ బహుమానమట! భగవాన్! మన దేశంలో ఎందరు వివేకానందులు పుట్టినా, మరెందరు గాంధీ మహాత్ములు అవతరించినా ఏం ప్రయోజనం! ఎందుకో నాకు చాలా నిరుత్సాహంగా ఉంది. నా జాగిలం పోయింది. నా జాగిలాన్ని మనిషి చంపేశాడు. నన్నడిగి ఉంటే నా ప్రాణాన్నేయిచ్చి ఉండేవాడిని గదా! పాడు డబ్బు ఎంత పని చేసింది! ఎనిమిదణాల కోసం కుక్కను చంపడమా! నా హృదయం తరుక్కుపోతున్నది. ఎక్కువ వ్రాయలేను! ఎలా వ్రాయగలను!....."

సెలవ్,
ప్రేమతో,
    "........."

 

 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్