Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పదమూడవ భాగం

Anubandhaalu thirteenth part

నాయనమ్మ లోపల ఎక్కడో వుందనుకున్న శివాని తన కారు ఎక్కబోయే ముందు పైన వేసుకున్న పంజాబీ డ్రస్సు తీసి పనిమనిషికి ఇచ్చేసింది. ఈ సంఘటన చూశాక తొలిసారిగా మనవడు, మనవరాలి విషయంలో ఆమెకు అనుమానం ఆరంభమైంది.

తనను నమ్మించడానికి మనవడు, మనవరాలు వేషాలు మార్చుకునే పద్ధతిలో వున్నట్లున్నారని నిజానికి వాళ్లు అక్కడి పద్ధతులకి అలవాటు పడిపోయారనే అనుమానం క్రమంగా ఆవిడలో బలపడసాగింది. అందుకే చూసిందంతా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా గమనించడం ఆరంభించింది ఆవిడ.

అత్తగారు గమనించడం ఆరంభించిన సంగతి సత్యవతికిగాని, పిల్లలు అనంత్ సాయి, సాయి శివానీలకు గానీ తెలియదు.

మమ్మీ డాడీలను బాధపెట్టడం ఇష్టంలేక నాయనమ్మను నమ్మించడం కోసం అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఇరవైరోజుల పాటు పద్ధతిగానే ఉన్నారు. నీట్ గా మన పధ్ధతి ప్రకారం డ్రస్ చేసుకుని కాలేజీకి వెళ్ళడం, సాయంకాలం పెదరాడే ఇంటికి చేరుకొని నాయనమ్మకు కాలక్షేపం కల్గించడం, డ్రింక్స్ జోలికి పోకుండా బుద్ధిగా ఉండడం చేశారు.

అప్పటికి అన్నపూర్ణేశ్వరి వచ్చి ఐదు వారాలు గడిచిపోయాయి. రోజులు గడిచేకొద్దీ మనవడు, మనవరాలు తమ పాత అలవాట్ల వైపు జరిగిపోవడం మొదలైంది.

ఆరు గంటలలోపు ఇంటికి రావడం మానేసి క్రమంగా తొమ్మిది, పది గంటలకు రావడం, లైట్ గా డ్రింక్ తీసుకుని వచ్చి నాయనమ్మ కంటబడకుండా తమ గదులలోకి వెళ్లి నిద్రపోవడం జరుగుతుంది. అంతా గమనిస్తూనే ఉంది అన్నపూర్ణేశ్వరి.

ఈ పరిస్థితుల్లోనే ఓ రోజు రాత్రి... అప్పటికి ఇంకా మనవడు, మనవరాలు ఇంకా ఇంటికి రాలేదు. అన్నపూర్ణేశ్వరి టైం కి భోంచేసి వెళ్లి తన గదిలో పడుకుంది. ఎందుకో అర్దరాత్రి ఆవిడకు మెలుకువ వచ్చింది. హాల్లో అలికిడి వినబడి తలుపు ఓరగా తెరిచి చూసింది.

అనంతసాయి, శివానీలు తాగిన స్థితిలో లోపలి వస్తూ కన్పించారు. సత్యవతి ఇంగ్లీష్ లోనే పిల్లలమీద కోప్పడింది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే బదులు చెప్పి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు.

ఈ సంఘటన చూసినా మరునాడు ఎవరినీ ఏమీ అడగలేదు. మౌనంగా తన పని తను చేసుకుపోతూ ఉంది.

డాక్టర్ గోపాల్ రెండు రోజులుగా డెట్రాయిట్ లో లేడు. ఆయన లాస్ ఏంజల్స్ కి వెళ్ళాడు. రావడానికి ఇంకో రెండ్రోజులు పడుతుంది. తండ్రి వూళ్ళో లేకపోవడం, అటు పరీక్షలు కూడా అయిపోవడంతో ఆటవిడుపుగా అన్నాచెల్లెళ్లిద్దరూ పూర్తిగా తమ పాత అలవాట్లలోకి జారిపోయారు. నాయనమ్మ కూడా పట్టించుకోక పోవడంతో మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురయింది.

అన్నపూర్ణేశ్వరికి పరిస్థితి చాలా వరకు అర్ధమైపోయింది. తల్లిదండ్రులు గోపాల్, సత్యవతి మన తెలుగు సాంప్రదాయాన్ని ఆచారాన్ని కొంతవరకయినా పాటిస్తున్నారు. కాని పిల్లలు ఇద్దరూ పూర్తిగా వాటికి దూరమయ్యారు. కట్టుబాటులో వున్నట్లు నటించి కొన్ని రోజులు తనను నమ్మించారు. అంతే, నిజానికి వీళ్ళకి మాతృభాషాభిమానం లేదు. ఆచార వ్యవహారాల మీద మమకారం లేదు.

పిచ్చి పిచ్చి డ్రస్సులు, అర్థరాత్రి దాకా పార్టీలు, మందు తాగడం ఇదే జీవితం అనుకుంటున్నారు. పూర్తిగా అదుపుతప్పిపోయారు. ఇదే విషయం గమనించి బాధపడుతూ, మరునాడు రాత్రి నిద్రకు దూరమైంది అన్నపూర్ణేశ్వరి. అర్థరాత్రి షరామామూలే.

అన్నా చెల్లెళ్లిద్దరూ సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి వచ్చారు. పిల్లలు టైం కి ఇంటికి రాలేదన్న ఆతృతగానీ, కంగారుగానీ సత్యవతి లో లేదు. వాళ్లకోసం ఆమె ఎదురుచూడనూలేదు. తన గదిలో హాయిగా నిద్రపోతోంది. పనివాళ్లు తలుపు తీశారు. కావాలనే లేచి హాల్లోకి వచ్చింది అన్నపూర్ణేశ్వరి.

అన్నా చెల్లెళ్లిద్దరూ చూశారు. కానీ చూడనట్టే తూలుతూ జాగ్రత్తగా ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయి పడుకున్నారు.

ఆ టైం లో తను నోరువిప్పినా, ఇంకేమన్నా అడిగినా... అది లేనిపోని గొడవలకు దారితీయచ్చు అన్న భయంతో తిరిగి తన గదిలోకి వచ్చేసిందావిడ. మిగిలిన రాత్రి ఆవిడకు నిద్రపట్టలేదు. కొడుకు కుటుంబ పరిస్థితి ఏమిటో ఇప్పుడు ఆవిడకు సృష్టంగా అర్ధమవుతోంది.

ఇల్లు పట్టని తండ్రి, తన పనేదో తాను చేసుకుపోయే తల్లి, భాద్యతలు మరిచి విందులు, వినోదాలు, తాగుడుతో కాలక్షేపం చేసే పిల్లలు. పైగా పిచ్చి పిచ్చి డ్రస్సులు.

తను ఆడపిల్ల అనే సంగతే మర్చిపోయి అరకొర దుస్తులతో తిరిగే మనవరాలు. ఏమిటి వీళ్ళ జీవితం? ఎంతో పద్ధతుల్లో అక్కడ ఇండియాలో తన పెంపకంలో పెరిగిన తన కూతరు భ్రమరాంబ పిల్లలు నవీన్, మహేశ్వరిలు ఎక్కడ? వీళ్లు ఎక్కడ?...

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అసలయిన సువాసనలు వెదజల్లే పూలకీ, కాగితం పూలకీ ఉన్నంత తేడా వుంది. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా పెరిగిన కొడుకు పిల్లలకే తన కూతురు పిల్లలనిచ్చి పెళ్లి చేయాలనుకుంది. తన కొడుకు, కూతురు రెండు కుటుంబాలు దగ్గర కావాలని పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడింది. అది నెరవేరలేదు. ఇక్కడ తన మాట ఎవరు వింటారు...? తను ఇండియా వెళ్ళిపోవడం మంచిది. ఈ కుటుంబాన్ని బాగుచేయడం తనవల్ల అయ్యే పనికాదు.

కొంతసేపు తనలో తాను కుమిలిపోతూ, కాస్సేపు ఏడుస్తూ, కాస్సేపు ఆలోచిస్తూ, అలా మిగిలిన రాత్రంతా భారంగా గడిచిపోయింది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయిందామె. దాంతో తెల్లవారినా ఆవిడ గది తలుపులు తెరుచుకోలేదు.

సత్యవతికి ఒకటే టెన్షన్ గా వుంది. తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, పూజలు, పునస్కారాలతో ఇల్లంతా సందడి చేసే అత్తగారు ఉన్నట్టుండి తెల్లారినా బయటకు రాకపోవడం ఆవిడకు కంగారు పుట్టిస్తోంది. పదిగంటల తరువాత గట్టిగా తలుపు కొడితే అప్పుడు మెలుకువ వచ్చింది అన్నపూర్ణేశ్వరి. అప్పుడు కూడా తనకు ఒంట్లో బాగాలేదని కంగారుపడాల్సింది ఏమీ లేదని చెప్పింది గాని తలుపు తీయలేదు. మామూలుగా స్నానాదికాలు ముగించుకొని తిరిగి పడుకుంది.

సత్యవతి ఎంత బ్రతిమాలుకున్నా గది తలుపు మాత్రం తీయలేదావిడ.

"ఏం జరిగింది?" నాలుగోరోజు ఇంటికి రాగానే ముందుగా సత్యవతిని గోపాల్ అడిగిన ప్రశ్న అది.

నిన్నంతా అత్తగారు బయటకు రాలేదు. ఏమీ తినలేదు. పడుకునే ఉంది. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంది. కిటికీ గుండా అంతా గమనిస్తూనే ఉంది సత్యవతి. సత్యవతి ఎంత బ్రతిమాలినా ఆవిడ అలక పాన్పు దిగలేదు. కారణం కూడా అర్ధం కాలేదు. దాంతో ఎందుకయినా మంచిదని ఆ రాత్రి లాస్ ఏంజల్స్ లో వున్న భర్త గోపాల్ కు ఫోన్ చేసి వివరించింది ఆమె. దాంతో సాయంకాలానికి రావాల్సినవాడు కాస్తా ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొని ఉదయం ఫ్లైట్ కు తిరిగి వచ్చేశాడు.

"మాట్లాడవేమిటి సత్యా? ఏం జరిగింది? అమ్మను చూసేముందు అసలు ఏం జరిగింది నాకు తెలియాలి గదా మాట్లాడ్డానికి? అనడిగాడు.

"ఏం చెప్పను? ఏం జరిగింది? నాకు తెలిస్తే కదా చెప్పడానికి? ఒకటి మాత్రం చెప్పగలను. పిల్లలు ఇద్దరూ నా మాటకూడా లెక్కచేయకుండా పాత పద్ధతుల్లోనే తాగి అర్థరాత్రి ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి వుంటుంది. అందుకే ఆవిడ కోపంతో ఇలా చేస్తోంది అనుకుంటున్నాను. మీరు వెళ్లి మాట్లాడండి విషయం తెలుస్తుంది." అంది.

"వాళ్ళిద్దరు ఎక్కడ?" సీరియస్ గా అడిగాడు.

"ఉదయమే బయటకు వెళ్ళిపోయారు. ఫోన్ చేసి పిలవమంటారా?"

"వద్దు అంటూ లేచి తల్లి గది ముందుకు వెళ్లి తలుపు కొట్టాడు.

"అమ్మా... తలుపు తియ్యి" అంటూ పిలిచాడు.

కొడుకు పిలుపు విన్పించిన కొద్దిసేపటికి ఆవిడ నీరసంగా లేచి వచ్చి తలుపు తీసింది.

కొడుకు ఏమీ మాట్లాడలేదు. ముభావంగా వెళ్లి ఎప్పటిలాగే బెడ్ మీద పడుకుంది. వచ్చి తల్లి పక్కన మంచం మీద కూర్చున్నాడు. సత్యవతి వచ్చి డోర్ లో నిలబడింది.

"నిన్నటి నుంచీ ఏమీ తినలేదు, బయటకు రాలేదని చెప్పింది మీ కోడలు. చెప్పమ్మా ఆరోగ్యం బాగాలేదా?" మృదువుగా అడిగాడు.

"నా ఆరోగ్యం బాగానే వుంది. ఇంటిదగ్గర వాళ్ళంతా ఎలా ఉన్నారోనని బెంగగా వుంది. ఇండియా వెళ్లిపోతాను. నన్ను పంపించెయ్యి" అలా అంటున్నప్పుడు ఆమె గొంతులో బాధని అర్ధం చేసుకోగలిగాడు గోపాల్.

"అలాగే... అంతగా వెళ్లిపోవాలనుకుంటే నిన్ను ఆపను. అందుకోసం నువ్విలా ఏమీ తినకుండా, నీలో నువ్వే బాధపడితే మేము చూడలేం. నా మాట విను. లేచి రామ్మా, భోంచేద్దాం" అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు.

చేయి వెచ్చగా ఉంది. కంగారుగా నుదుటిమీద చేయి ఉంచాడు. వెచ్చగా కాలిపోతున్నట్టుంది.

"మై గాడ్! అమ్మా! ఇంత జ్వరం ఉంచుకుని మౌనంగా ఎలా వున్నావ్? సత్యా! ఏమిటిది? అమ్మకు జ్వరంగా వున్న సంగతి కూడా నీకు తెలియదా?" అన్నాడు అసహనంగా.

"ఎలా తెలుస్తుంది? కనీసం మనసులో ఏముందో కూడా నాకు చెప్పలేదు. నాకెలా తెలుస్తుంది" అంది నొచ్చుకుంటూ సత్యవతి.

 "వద్దురా. మీరు కంగారు పడక్కర్లేదు. మనసులో బాధకన్నా ఈ జ్వరం ఎక్కువేమీ కాదు. అదే తగ్గిపోతుందిలే" అంటూ కళ్ళు మూసుకుంది అన్నపూర్ణేశ్వరి. "ఓ. కె. ఇలా జ్వరంతో వుండి నువ్వు ఇండియా వెళ్ళలేవు. జ్వరం తగ్గితేగాని ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి సాధ్యం కాదు. టాబ్లెట్స్ వేసుకొని పాలుతాగు" అంటూ తనే జ్వరం మాత్రలు మింగించి, పాలు తాగేవరకూ దగ్గర కూర్చున్నాడు గోపాల్.

మూడు రోజులపాటు తీవ్రమైన జ్వరంతో బాధపడింది అన్నపూర్ణేశ్వరి. వారం రోజులకు గాని ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. కొడుకుతోను, కోడలుతోను ఏదో నామమాత్రంగా మాట్లాడ్డమేగాని, మనవడు, మనవరాలితో అయితే అసలు మాట్లాడలేదామె. వాళ్లు దగ్గరకొచ్చి పలకరించినా పలకలేదు.

ఆవిడ ఆరోగ్యం బాగాలేదని తెలిసి, అక్కడ ఇండియాలో మున్నలూరు నుంచి రోజూ ఫోన్ చేసి పెద్ద కొడుకు, అల్లుడు, కూతురు అంతా విచారిస్తున్నారు. వాళ్ళంతా ఈ పరిస్థితికి చాలా బాధపడుతున్నారు. కంగారుపడుతున్నారు. ఆవిడ మనసులో ఏముందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడేవరకు డాక్టర్ గోపాల్ తన ప్రోగ్రామ్స్ ని కుదించుకోవలసి వచ్చింది.

ఆరోగ్యం కుదుటపడగానే ముందుగా మున్నులూరు లోని పెద్ద కొడుక్కి ఫోన్ చేయించి తను తిరిగి వచ్చేస్తున్నట్లు చెప్పింది అన్నపూర్ణేశ్వరి. కారణం ఏమిటని అడిగిన రామలింగేశ్వర్రావుకు ఇక్కడ నచ్చలేదని మాత్రం చెప్పి వూరుకుంది.

ఆరోజు సాయంత్రం పెందరాళే ఇంటికొచ్చేశాడు గోపాల్. తను రావడమే కాదు. బయట ఎక్కడో వున్న కొడుకు, కూతురికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావలసిందిగా ఆర్డర్ వేశాడు.

అలా రాత్రి ఎనిమిది గంటలకి, కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశాడు గోపాల్. అన్నపూర్ణేశ్వరి కూడా వచ్చింది.

"నేను ఇండియా వెళ్ళిపోతాను ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?" అని అడిగింది కొడుకును.

"అమ్మా! నిన్ను వెనక్కి పంపించేయడం పెద్ద సమస్య కాదు. కానీ నువ్వీ నిర్ణయానికి రావడానికి బలమైన కారణం ఏదో వుంది. అది ఎంత నిష్టూరమైనా ఫరవాలేదు. నువ్వు చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిపోతే మేం చాలా బాధపడతాం" అడిగాడు.

"లేదురా. చెప్పేంత బలమైన కారణం ఏమీ లేదు. వెళ్లిపోతాను అంతే" అంది.

"నీకు నచ్చని విషయాలు ఇక్కడ ఏం జరిగాయి?"

కొడుకు ప్రశ్నతో అన్నపూర్ణేశ్వరిలో సహనం ఒక్కసారిగా అడుగంటి విసుగు, కోపం కళ్ళలో తొంగి చూశాయి.

"ఏం జరిగాయి కాదురా, ఏం జరగలేదని అడుగు. ఇది సంసారమా? సంసారంలాగా వుందా? వుండడానికి లంకంత కొంప వుంది. ఏం లాభం? దయ్యంలా కొంపనంటిపెట్టుకుని వుండి, ఎవరెటుపోయినా తనకు పట్టనట్టుగా వుంటుంది నా కోడలు. ఇల్లు పట్టకుండా సంపాదన కోసం ఊళ్లమ్మట తిరుగుతావు నువ్వు. ఇక నీ పిల్లల దృష్టిలో ఈ ఇల్లు ఒక హోటల్. రాత్రి ఏదో టైం కి వచ్చి పడుకుంటారు. తెల్లారగానే వూరిమీదపడి తిని, తాగి చిందులేస్తూ అడ్డగాడిదల్లా బాధ్యత లేకుండా తిరుగుతారు. ఇది మీ బతుకు. ఇది చూడ్డానికేనా నేను వేలమైళ్ళ దూరం నుంచి ఇక్కడికొచ్చింది?" సూటిగా నిలదీసింది.

ఆవిడ మాటలకు తుపాకి దెబ్బ తిన్న పక్షుల్లా భార్యాభర్తలిద్దరూ విలవిల్లాడారు. ఆ షాక్ నుంచి వాళ్లు కోలుకోకముందే తిరిగి మాట్లాడింది అన్నపూర్ణేశ్వరి.

"మీరు నన్ను మోసం చేసారు. ఎందుకు అని నేనడగను. మీరు అమెరికా వచ్చేముందు నేను చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టారు. అయినా ఇరవై సంవత్సరాల క్రితం మాటలు మీకింకా గుర్తుంటాయని నేననుకోను. కానీ మీ పిల్లలు పద్ధతిగానే పెరుగుతున్నారని నన్ను నమ్మించడం కోసం వాళ్ళతో అలా ఫోటోలు తీసి ఇండియా పంపించారు. కానీ వాళ్లు మన పద్ధతుల్లో పెరగలేదు. నేను ఇక్కడికి వచ్చాక కూడా నన్ను నమ్మించడం కోసం వాళ్ల ఇష్టాలకు వ్యతిరేఖంగా పద్ధతుల్లో ఉన్నట్టు నటింపజేశారు. అంతే... ఇదో... నువ్వు వూళ్ళోలేని ఈ నాలుగు రోజుల్లో వీళ్ల అసలు రూపాలేమిటో నాకు బాగా తెలిసిపోయింది. ఆ దుస్తులేమిటి? ఆ తీరు ఏమిటి? తప్పతాగి అర్థరాత్రి ఇంటికి రావడమేమిటి? ఇదే మన వూళ్ళో అయితే చెంప పగలగొట్టేదాన్ని. ఇదా పిల్లల్ని పెంచే లక్షణం? అరిచిందావిడ.

అప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ మౌనమే సమాధానంగా నెల చూపులు చూస్తూ వుండిపోయారు. కానీ ఆవిడ మాటలకు రోషం పొంగుకొచ్చి కోపంగా చూశాడు అనంతసాయి.

"ఇట్స్ టూ మచ్, నాయనమ్మా! నువ్వు ఇండియా నుండి వచ్చావ్. ఇక్కడి పద్ధతులు నీకు తెలీదు..." అంటూ ఏదో చెప్పబోయాడు.

"పద్ధతుల గురించి నువ్వు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. సిగ్గు లేని భడవా! చెల్లెలికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వూ పనికిమాలిన వెధవలా తయారయ్యావు. సిగ్గులేదూ? ఏమిటీ పద్ధతులు? ఇల్లు పట్టకుండా అర్థరాత్రి దాకా బార్ లలోనూ, పార్టీల్లోనూ పిల్లలు తిరగాలని మీ అమెరికా ప్రభుత్వం చట్టం ఏమన్నా చేసిందా? దాని అవతారం చూసావా? తొడలు కన్పించేలా ఫ్రాకులు, చంకలు కనబడేలా జాకెట్లు, నడుం కనబడేలా డ్రస్సులు. ఇదా ఫ్యాషను? ఇదా సంస్కృతి? మన దేశంలో ఇలాంటి డ్రస్సులు సినిమాల్లో వేస్తారు. ఇళ్ళల్లో కాదు. తెలుగువాళ్ళ పిల్లలయిన మీలో చూద్దామంటే ఒక్కటయినా తెలుగు లక్షణం కనబడుతోందా?" గద్దించింది. "ఏమిటి తెలుగు లక్షణం? ఒళ్లంతా కప్పుకుని కంట్రీ ఉమెన్ లా తిరగటమా? ఏయ్ ఓల్డ్ లేడీ ఐ డోంట్ లైక్ యు. డాడీ! సెండ్ హర్ బాక్ టు ఇండియా. యూ నో... గ్రానీ వాంట్స్ టు మేడ్ మి లైక్ ఎ జంగిల్ ఉమన్. వాటీస్ ది శారీ, బాంగిల్స్, ఆర్నమెంట్స్. నాన్సెన్స్! ఐ డోంట్ లైక్ ఆల్ దిస్" అంటూ పిచ్చిపట్టినట్టు పెద్దగానే అరిచేసి లోనకు పోబోయింది శివాని.

"ఆగవే... అక్కడే ఆగు" అంటూ హెచ్చరించింది అన్నపూర్ణేశ్వరి.

డాక్టర్ గోపాల్ కి కొడుకు, కూతరు ఇద్దరి మాటలు, చేతలు చాలా బాధ కల్గించేవిగా ఉన్నాయి. వస్తున్న కోపానికి లేచి వాళ్ళిద్దరి చెంపలు పగలగొట్టాలని వుంది. కానీ తనూ రెచ్చిపోతే ఇంట్లో పెద్ద సీన్ క్రియేటవుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఊరుకున్నాడు.

ప్రతీ సమస్యకు ఏదో సరైన పరిష్కారం వుంటుంది. దాన్ని కనిపెట్టాలిగాని గొడవ పడినంత మాత్రాన ఇప్పటికిప్పుడు తమ పిల్లలు బుద్ధిమంతులు కాలేరు.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram seventh part