Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పధ్నాల్గవ భాగం

Anubandhaalu fourteenth part

అతడి ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే, అన్నపూర్ణేశ్వరి సోఫాలోంచి లేచి మనవరాలి ముందుకెళ్ళింది. మనవరాలి కళ్ళలో ఆవేశం, కోపం గమనించి తనూ గంభీరంగా చూసింది.

"ఏమిటే చెప్పు? నీ అమ్మాబాబుతో నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్ధంకాకపోవచ్చు. కాని నీ మనసులో ఏముందో తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు. మీరు ఆడింది ఆటగా, పాడింది పాటగా బాధ్యత లేకుండా తిరిగితే నీ అమ్మాబాబు ఊరుకోవచ్చు. కాని నేనూరుకోను. మీ కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతా. వయసయిపోయిన ముసలిది ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో, పేడపిసికి, పిడకలు చరిచిన చేతులివి. వీటి బలం మీకన్నా మీ నాన్నకే ఎక్కువ తెలుసు. అలాగని ఇక్కడే వుండిపోయి, మిమ్మల్నేదో ఉద్ధరించాలనే ఉద్దేశం నాకు లేదు. మీ ఇష్టం వచ్చినట్టుండండి. నేను మా వూరు వెళ్లిపోతున్నాను. కాని ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. మీ గురించి ఆశ వదులుకునే వెళ్ళిపోతాను. భవిష్యత్తులో మీరేకాదు, మీ సంతతి వాళ్ళు మేం కూడా భారత సంతతికి చెందిన వాళ్లమే అని చెప్పుకోవడానికి తప్ప ఇండియాలో మీ కంటూ బంధువులెవరూ ఉండరు. కలిసిపొండి. మీరంతా అమెరికా వాళ్లతో కలిసిపోయి, సంతోషంగా వుండిపొండి" అంటూ ఇక ఆపై ఏం మాట్లాడాలో తెలియక, కళ్లనీళ్లు కుక్కుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుంది అన్నపూర్ణేశ్వరి.

శివాని, అనంత్ లు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. చాలా సేపు భార్యాభర్తలిద్దరే అక్కడ మిగిలారు. "మీరు మౌనంగా ఉంటారనుకోలేదు. పిల్లల మీద కనీసం కోప్పడాల్సింది" అంది బాధగా సత్యవతి. పెద్దగా నిట్టూర్చి భార్య వంక చూసాడు గోపాల్.

"లేదు సత్యా! వాళ్లమీద కోప్పడటం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ప్రస్తుతం వాళ్ళనేమీ అనకు. మా అమ్మతో విపులంగా మాట్లాడాల్సి వుంది. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుందాం. నువ్వెల్లి పిల్లలతో ప్రస్తుతానికి వాళ్లని సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి సమాధానపర్చు. ఈ లోపల నేను మా అమ్మతో మాట్లాడతాను. వాళ్ళని ఆ గది పక్కకు రానీకు" అంటూ లేచాడు.

"ఏం మాట్లాడతారు?" అడిగింది సత్యవతి.

"నువ్వు కూడా పక్కనుండాలనుకుంటున్నావా?"

"అలాగని కాదు. కాని నాకెందుకో ఈ పరిస్థితులు కంగారు పుట్టిస్తున్నాయి".

"కంగారు దేనికి? ఓ. కే. ఓ పనిచెయ్యి. వాళ్ళిద్దర్నీ గదులుదాటి బయటకు రాకుండా తాళం పెట్టిరా. మన మాటలు వాళ్ళు వినడం ప్రస్తుతం మంచిదికాదు."

"వాళ్ళు గొడవ చేస్తారేమో?"

"చేయనీ... ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతానికి వాళ్లని సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం మర్చిపోకు." "అలాగే" అంటూ తనూ సోఫాలోంచి లేచింది సత్యవతి. అంతలోనే ఏదో అనుమానం వచ్చి భర్త వంక చూసింది.

"ఏమిటి సత్యా, ఇంకా సందేహమా?" అడిగాడు.

"అంటే... ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆవిడ సిద్ధంగా ఉందా? మీ అమ్మగారి కోపం తెలీంది కాదు."

"ఆవిడ నా తల్లి. నాతో మాట్లాడడానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు. నువ్వెళ్లి రా త్వరగా" అంటూ తల్లి గదివైపు అడుగులు వేసాడు గోపాల్.

వెళ్తున్న భర్తను చూస్తుంటే సత్యవతికి అర్ధమైపోయింది. ఆయన ఇప్పటికే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసాడని, ఆ విషయాన్ని చర్చించడానికే తల్లి వద్దకు వెళ్తున్నాడని ఊహించింది. తను దగ్గర వుంటే మంచిది కదా! భర్త చెప్పినట్టు ముందు కొడుకు, కూతురిని సమాధానపర్చి, బయటకు రాకుండా వాళ్ళిద్దర్నీ గదుల్లోనే వుంచి తాళం వేసి వచ్చే ఉద్దేశంతో వేగంగా అటు నడిచింది.

గోపాల్ అన్నపూర్ణేశ్వరి గదిలోకి వెళ్లేసరికి ఆవిడ భారంగా కళ్ళుమూసుకుని ఈజీ చెయిర్ లో పడుకొని ఉంది. ఆవిడ కళ్ళముందు తనను అసహ్యంగా చూస్తూ మనవరాలు ఇంగ్లీష్ లో తన మమ్మీ, డాడీతో మాట్లాడిన దృశ్యమే పదే పదే గుర్తుకొస్తుంది. ఆవిడ చెంపల మీదుగా కన్నీరు ప్రవహిస్తోంది. ఒక చెయిర్ ని దగ్గరగా లాక్కొని తల్లికి దగ్గరగా కూర్చున్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూసింది. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని బాధగా ఆమె ముఖంలోకి చూసాడు.

"నువ్విలా బాధపడితే నేను చూడలేను. చెప్పమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అని అడిగాడు తల్లిని.

"నేనిక్కడ ఉండలేనురా... నాయనా... వెంటనే ఇండియాకు పంపించేయి. ఇంతకుమించి ఏమీ చేయనక్కరలేదు" అంటూ ముఖం తిప్పుకొని కన్నీరు తుడుచుకొంది. ఈ లోపల అక్కడికొచ్చిన సత్యవతి కూడా అత్తగారి మాటలు వింటూ గుమ్మం లోనే నిలబడింది.

"నువ్వు కన్నీళ్లు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోవడం మంచిదంటావా... ఇక్కడ మేము సంతోషంగా ఉండగలమా? నీ ఆశీస్సులే మాకు బలం, ధైర్యం అన్నీను. తప్పు చేస్తే ఎవరినైనా తిట్టే అధికారం నీకుంది." తల్లికి నచ్చజెప్పాలని చూశాడు.

కానీ ఆవిడ కొడుకు మాటల్ని ఖండిస్తూ కొడుకు చేతిలోంచి తన చేతిని వెనక్కి తీసుకుంది.
"సంతోషమా? ఎక్కడుందిరా? నీకు డబ్బు పిచ్చి. వృత్తిని అడ్డం పెట్టుకుని ఊళ్ళు తిరిగి డబ్బును సంపాదించడం నీకు ఆనందం. నీ పిల్లలకు జల్సాగా డబ్బు తగలేస్తూ, బాధ్యత లేకుండా ఇళ్లు పట్టకుండా తిరగడం సంతోషం. నీ పెళ్లానికి ఇంటిని కనిపెట్టుకొని ఉండడమే సంతోషం. ఇదా మీరు కోరుకునే సంతోషం. నిజమైన సంతోషం అంటే ఇదే అనుకుంటున్నారా?"

"అదికాదమ్మా!"

"మాట్లాడకు. ఇంకేమీ చెప్పకు. మీ విషయంలో నా అంచనా తప్పిపోయిందని నాకు బాగానే అర్ధమైంది. నేను ఆశించిన విధంగా జరగలేదు. అంతా తారుమారైంది. మీరు ఇప్పుడు ఒక పధ్ధతి ప్రకారం జీవించే అమెరికా వాళ్లు కాదు. అలాగని ఆచారాలు పాటించి, ఆదర్శంగా నిలిచే తెలుగు వాళ్ళు కాదు. రెండింటికీ చెందని విచిత్ర కుటుంబం మీది" అంటూ తిరిగి కళ్ళు తుడుచుకుంది. తల వంచుకున్నాడు గోపాల్.

సత్యవతి వచ్చి మరో కుర్చీని లాక్కొని, భర్త పక్కకు కూర్చుంది. ఆమెకు అత్తగారి మాటలు అసత్యం కాదని తెలుసు. ఆమెకు ఏం సమాధానం చెప్పాలి? విదేశాలలో వుంటూ అనేక ఆంధ్రా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యనే తమ కుటుంబం కూడా ఎదుర్కొంటుంది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన కుటుంబాల్లో మొదటి తరం వాళ్లు ఆంధ్రులుగానే జీవించాలని, విదేశంలో కూడా తమ ఆంధ్రా మార్కు సంస్కృతి ప్రతిబింబించాలని తాపత్రాయపడ్డాడు. కానీ యువతరం వచ్చేసరికి స్థానిక సంస్కృతికి అలవాటు పడిపోతారు. వాళ్ళని సరిదిద్దుకోవాలనుకునే లోపల పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ సమస్యని దృష్టిలో ముందే ఊహించగల్గిన వాళ్లు మాత్రం పిల్లలు తమను తాము తెలుసుకునే వరకు ఇండియాలోనే వుంచి చదివిస్తున్నారు. కానీ అలాంటి వాళ్లు చాలా తక్కువ. అమెరికాలో నివసించడం, సంపాదించడం, పిల్లలు కూడా అమెరికాలోనే పెరగడం ఇదంతా ఒకే స్టెప్ గా భావించి, మాతృదేశాన్ని, మాతృభాషను విస్మరించే విశ్వాస ఘాతకులు ఉన్నారు. అలాంటి వాళ్లు అప్పుడప్పుడూ మేము తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి తప్ప వాళ్ల జీవితంలో తెలుగుదనం ఎక్కడా కన్పించదు. మాతృభూమిని, మాతృభాషను మర్చిపోయే అలాంటివాళ్ళు ఎంత గొప్పవాళ్ళయినా క్షమార్హులు కారు.

"అమ్మా జరిగినదానికి బాధపడుతున్నాను. మనవడు, మనవరాలి మీద కోపం నా మీద చూపించడం న్యాయం అంటావా? పరిస్థితి నువ్వూ చూస్తున్నావుగా? ఏదన్నా మార్గం చెప్పు? నన్నేం చేయమంటావో చెప్పు?" దీనంగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు గోపాల్. ఆవిడ కన్నీరు తుడుచుకుంది.

పేలవంగా నవ్వింది. "ఏమిట్రా ఇది. నువ్వు గొప్ప డాక్టర్ వి. మనుషుల గుండెలు తీసి గుండెలు మార్చే గొప్ప డాక్టర్ వి. ఈ తల్లి గుండె నీకు తెలియదా? ఏం చేయమంటావు అని నన్నే అడిగితే ఏం చెప్పగలను. మీ నాన్నగారు పోయేటప్పటికి మీరు ముగ్గురూ చిన్నపిల్లలు. ఒంటరి ఆడదాన్ని. అయినా నేనెవరి సలహాలు అడగలేదు. పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఏం చేస్తే బాగుంటుందో అలా చేసాను. ఎప్పుడూ పది మందికి చెప్పటమే గాని, ఎప్పుడూ ఒకరిచేత చెప్పించుకోలేదు. కఠోర శ్రమను అలవర్చుకున్నాను. నా శ్రమ వృధా పోలేదు. బిడ్డలు ప్రయోజకులయ్యారు. వ్యవసాయంలో డిగ్రీలు చేసి గోల్డ్ మెడల్ సంపాదించాడు నా పెద్ద కొడుకు. కొత్త కొత్త పద్ధతుల్లో అధిక దిగుబడి సాధించాడు. సొంతంగా కొత్త వరి వంగడాలను కనిపెట్టి, ఆదర్శ రైతు అవార్డు పొందాడు. ఉత్తమ రైతుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి తీసుకొని, మున్నలూరు గ్రామమే గర్వపడేలా చేసాడు. నా రెండో కొడుకు డాక్టర్ అయ్యాడు. అమెరికా వెళ్లాడు. బాగా సంపాదించుకున్నాడు. అమెరికాలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు నా కొడుకు. ఏదో రోజు మన గ్రామానికి వస్తాడు. పెద్ద ఆసుపత్రి కడతాడు. ఖరీదైన గుండెజబ్బు చికిత్సలు పేదోళ్లకు కూడా అందుబాట్లోకి తీసుకొచ్చి మున్నలూరు పేరు మారుమ్రోగేలా చేస్తాడని, ఇంతకాలం నలుగురికి గర్వంగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఆ ఆశ పూర్తిగా అడుగంటింది" అంటూ పెద్దగా నిట్టూర్చింది.

"అదికాదమ్మా! నేను చెప్పేది విను." ఏదో చెప్పబోయాడు.

కానీ ఆమె వారించింది.

"చెప్పకు. నువ్వు చెప్పాలనుకున్నా నేను వినడానికి సిద్ధంగా లేను. మీకు ఇక్కడే బాగుంది. ఈ జీవితమే బాగుంది. నువ్వు ఇండియా వచ్చేసరికి నేను ఉంటానో, లేదో కూడా నాకు తెలియదు. మీరు అమెరికా రావడం వల్లేగా మీ పిల్లలు ఇలా తయారయ్యారు"

"అమ్మా! నా మాటవిను. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. మా బాగుకోసం నువ్వు పడ్డ శ్రమ, తపన నాకు తెలుసమ్మా. అమ్మ రుణం, పుట్టిన ఊరు రుణం తప్పకుండా తీర్చుకుంటాను. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలెడతాను. అన్నింటికన్నా ముందు పిల్లల్ని మంచి పద్ధతుల్లోకి తీర్చిదిద్దుతాను. నా మాట నమ్ము."

"ఎలా నమ్మను? చెప్పరా? నీకు క్షణం తీరిక ఉండదు. సంపాదన, పొగడ్తలు, పేరు ప్రతిష్టలే ముఖ్యమైపోయాయి. ఇంక నువ్వేం బాగు చేస్తావ్ రా వాళ్ళని? చూసావా...? నీ కూతురికి చీరలంటే గిట్టదు. గాజులంటే అసహ్యం. అదంతా అనాగరికం అనుకుంటుంది. డబ్బు ఇవాళ ఉంటుంది. రేపు పోతుంది. కానీ మన ఆచార సాంప్రదాయాలు తరతరాలుగా మనకు వస్తున్న తెలుగు వారసత్వ సంపదరా. అది వదులుకుంటే మీరు తెలుగు వాళ్లు ఎలా అవుతారు? ఎవరో తెలియని సంకరజాతిగా మిగిలిపోతారు. ఇంతకన్నా బాధ కల్గించే విషయం ఇంకోటి ఉందా? విదేశీయులే మన కట్టూ, బొట్టుకు ఆకర్షితులై మెచ్చుకుంటుంటే, మీ పిల్లలు అక్కడి వాళ్ళల్లో కల్సిపోతున్నట్టున్నారు. ఇదేనా మీరు మీ పిల్లలకు నేర్పిన సంస్కృతి. నాకు పెద్దగా చదువులేదు. కాని లోక జ్ఞానం ఉంది. నువ్వు చెమటోడ్చి కోట్లు కూడబెట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని సంతోష పెట్టడం కాదు. పదికాలాలు నీ పేరు నిలిచిపోయేలా ప్రజల్ని కూడా సంతోషపెట్టాలి. శభాష్! అన్పించుకోవాలి. పిల్లలు అయోగ్యులైతే నువ్వెంత సంపాదించినా నాశనం చేస్తుంటారు. నువ్వెప్పుడైనా గమనించావా? తరాలు మారినా కొన్ని కంపెనీలు, సంస్థలు చెక్కు చెదరకుండా నిలబడడమే కాదు, వ్యాపారాలు విస్తరించుకుంటున్నాయి అంటే కేవలం డబ్బుకాదు. క్రమశిక్షణతో పెరిగిన ఆయా సంస్థల వారసులు. బిర్లాలు, టాటాలు గానీ అంబానీలు గానీ ఎవరి జీవితాన్ని పరిశీలించినా నీకీ విషయం సృష్టంగా బోధపడుతుంది. అమెరికా సంపాదనే కాదు. మన భారతీయ సంస్కృతిని మరువకూడదు. మనమే కాదు ఎవరు ఏ దేశం వెళ్ళినా తమ తమ మాతృదేశ సంస్కృతి, ఆచారాలను మర్చిపోకూడదు. అలా చేస్తే కన్నతల్లికి అన్యాయం చేసినట్టే. కష్టాలు, పేదరికంలోంచి వచ్చే పిల్లలకు బ్రతుకుల పట్ల, భవిష్యత్తు పట్ల భయం ఉంటుంది. బాగుపడాలనే తపన ఉంటుంది, అందవచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని కష్టపడి, చదివి, రాత్రింబవళ్ళు శ్రమించి, ఉన్నత స్థానాలు అందుకోవడానికి కృషి చేస్తారు. అదే అధికారం, డబ్బు ఉన్న ఉన్నత కుటుంబాల్లోని పిల్లలకు ధైర్యం, విశ్వాసం ఉంటాయి. డబ్బులో పుట్టి పెరగడంతో వాళ్లకి కష్టం అంటే ఏంటో తెలీదు. జీవితమంటే విలాసాలు, సంతోషం అనుకుంటారు. అందుకే ఉన్నత వర్గంలో పిల్లలు తక్కువ స్థాయిలోనే ఉన్నా విద్యా స్థాయికి వెళతారు. మనిషికి చదువు అనేది మూడో కన్ను. అలాంటి చదువుంటే లోకజ్ఞానం బాగా వస్తుంది. కానీ చదువుకున్న వారే సంపాదించగలరు, అంతగా చదువుకోని వారు సంపాదించలేరనుకోవడం కూడా పొరబాటే. లోకజ్ఞానం అవగాహన వుండి, పెద్దగా చదువులేని, ఆ మాటకొస్తే అసలు చదువురాని వాళ్లు కూడా గొప్పగా సంపాదించిన వాళ్ళున్నారు. సంపాదనకి, చదువుకి కొలబద్ధ అనుకోవడం కూడా పొరబాటే.

ప్రతీతరం అప్రమత్తంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆయా సంస్థలుగానీ, ఆస్థులుగానీ నిలకడగా ఉంటాయి. ఏ తరం కూడా చెడిపోకూడదు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, లక్ష్మీ మిట్టల్, ధీరూబాయి అంబానీ, నిర్మా సబ్బుల కార్బన్ బాయ్ పటేల్, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు ఇలా ఎందరో గొప్ప వాళ్లు. అంతా కష్టాలనుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లే. వారి వారసులు కూడా తండ్రీ తాతలంతటి సమర్థులే. టాటాలనే చూడు. జమ్ షడ్బీ టాటా తరువాత జే. ఆర్. డి. టాటా, ఇప్పుడు రతన్ టాటా. బిర్లా ను చూడు జే. డీ. బిర్లా తర్వాత ఆదిత్య బిర్లా, కుమార మంగళం బిర్లా ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో ఉన్నారు. ఆస్థులు గానీ, సంస్థలు గానీ సంపాదించినంత మాత్రాన, స్థాపించినంత మాత్రాన సరిపోదు. దక్షత కలిగిన వారసుల్ని కూడా అందించాలి. మీ వారసులు, మీ పిల్లలు. నా పేరు నిలబెట్టడానికి నా కొడుకులు మీరున్నారు. మీ పేరు నిలబెట్టడానికి మీ పిల్లల్ని సమర్ధులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా. ఈ వయసులో కూడా రోజూ నేను ఈనాడు పేపర్ చదువుతానే. పేపర్ చదివితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఇంతసేపు అన్ని విషయాలు నేను మాట్లాడగల్గానంటే కారణం నేను న్యూస్ పేపర్ చదివే అలవాటే. నేను వచ్చి ఇన్నిరోజులైనా మీ పిల్లలు ఒక్కరోజు కూడా పేపర్ చదువుతుండటం నేను చూడలేదు. అసలు వాళ్లకి ఇంటి దగ్గర ఉండే తీరికెక్కడిది. నా కూతురు పిల్లలకి, వీళ్లకి పెళ్లిళ్లు జరిపించి, మురిసిపోవాలని ఎంతో ఆశ పడ్డాను. ఇప్పుడు అర్థమౌతుంది, నా కూతురి పిల్లలు వీళ్ల లెవెల్ కి తగరని... ఒక్కటి మాత్రం నిజం మీరిలాగే కళ్ళు మూసుకుని ఉంటే ఏదో ఒకరోజు అనంతసాయి ఏ అమెరికా పిల్లనో తెచ్చి ఇదే మీ కోడలు అంటాడు. అది ఏ జర్మనీ వాడినో తీసుకొచ్చి వీడే మీ అల్లుడు అంటుంది. అంతటితో మీరు ఇక ఇండియాలో అడుగుపెట్టే అర్హతను కోల్పోతారు. మున్నలూరులో మీ ముఖం చూసే వారుండరు అంటూ ఆవేశంలోనూ, బాధతోనూ చాలా సుదీర్ఘంగా మాట్లాడింది ఆవిడ. అంతా శ్రద్ధగా విన్నారు భార్యా భర్తలిద్దరూ. ఆవిడ మాటలు పూర్తి కాగానే ముఖాముఖాలు చూసుకున్నారు. పెద్దగా నిట్టూర్చి లేచాడు గోపాల్.

"అమ్మా! నాకు అంతా అర్ధమైంది. నాకు మూడ్రోజులు టైమివ్వు. ఈ సమస్యకు నేనే పరిష్కారం చెప్తాను." అంటూ లేచి బయటకు వచ్చేశాడు గోపాల్ వేగంగా.

మూడ్రోజులు గడిచిపోయాయి. కొడుకు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో అన్నపూర్ణేశ్వరికి తెలియదు. అనంతసాయి, సాయి శివానీల దినచర్యలో మార్పేమీ లేదు. ఎలాగో నాయనమ్మకు తెలిసిపోయిందన్న ధీమాతో ఇప్పుడు మరింత హ్యాపీగా తిరుగుతున్నారు. రాత్రి ఎప్పటికో ఇంటికొస్తున్నారు. వాళ్లకి డాక్టర్ గోపాల్ ఏమీ ఆంక్షలు విధించలేదు. బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్లను దారిలో పెట్టడం ఎలాగూ వీళ్లకు సాధ్యం కాదు. ఇక ఇండియాకు వెళ్లిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిందావిడ. సత్యవతి కూడా భర్త మనసులో ఏముందో తెలియక కంగారు పడింది.

ఈ పరిస్థితుల్లో నాలుగోరోజు మధ్యాహ్నం సడెన్ గా భోజనానికి ఇంటికి వచ్చేశాడు గోపాల్. అతను వచ్చిన టైం లో పిల్లలిద్దరూ ఇంట్లో లేరు. గంట క్రితమే బయటకు వెళ్ళిపోయారు. అతను సరాసరి వచ్చి తన గదిలో కూర్చున్నాడు. పిలవగానే సత్యవతి కూడా లోనికి వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది.

"ఏరా! నన్ను ఇండియా పంపించేస్తున్నావుగా" అంది అన్నపూర్ణేశ్వరి.

"ఇండియా పంపిస్తున్నాను. కానీ అమ్మా నిన్ను కాదు" అన్నాడు గోపాల్.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com
[email protected]

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram eighth part