Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu fourteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఎనిమిదవ భాగం

nadiche nakshatram eighth part

"అదే... పీకల్లోతు ప్రేమలో పడ్డవాళ్ళలోని ఎనర్జీ, ఎంకరేజ్ మెంట్ మీ ఇద్దరి మధ్యా ఏ ఇబ్బందీ లేకుండా బాడీ లాంగ్వేజ్ లో ప్రతిఫలించాలి. ఒకరికోసం ఒకరన్న ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేయగలగాలి. అలా కంఫర్టబుల్ గా చేసేందుకు అవసరమైతే ఏ చెట్టు చాటుకైనా వెళ్లి రిఫ్రెష్ అవండి. హాఫెనవర్ తర్వాతే షూట్ చేద్దాం" అంటూ వాళ్లకి ఏకాంతాన్ని కల్పిస్తూ అక్కడ్నుంచి జారుకున్నాడు డాన్స్ మాస్టర్.

"మాస్టర్ చెప్పినట్టు రిఫ్రెష్ అవుదామా?" అడిగాడు ప్రదీప్ కొంటెగా నవ్వుతూ.

"నాకు తెలిసి కొంతమంది హీరో హీరోయిన్లు... రిఫ్రెష్ అయ్యాకే ఇలాటి సాంగ్స్ లో విజ్రుంభిస్తారు. అందుకే, ఆ సాంగ్స్ ఆడియన్స్ తో అంతగాడంగా కనెక్ట్ అవుతాయి..."

"అంటే ఏం చేయాలి?" అడిగింది గాయత్రీపాటిల్.

"ముందు ఎవరూ లేని ఏకాంతం చూసుకోవాలి. తర్వాత ఒకర్నొకరు కొత్తగా పరిచయం చేసుకోవాలి"

"పరిచయం చేసుకోవడం అంటే... ఇప్పటిదాకా మనం ఒకరికొకరం పరిచయం కామా? ఒకరిగురించి ఒకరికి బాగా తెలుసు... మీరు హీరో... నేను హీరోయిన్. ఈ మూవీలో కలిసి నటిస్తున్నాం. ఇంతకు ముందు కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసాం. డ్యూయెట్స్ లో ఆడిపాడాం..."

"ఇంకా పరిచయం కావాల్సింది ఎంతో ఉంది. అందువల్లనే మనిద్దరి మధ్యా ఇంకా కొన్ని మోమాటాలు, కొన్ని ఇరకాటాలుంటాయి... అంటున్నారు డాన్స్ మాస్టర్. అందుకే, అదేంటో తెలుసుకుంటే మంచిదని నాకూ అనిపిస్తోంది... ఓరకంగా ఇదీ డేటింగ్ కి శ్రీకారమే"

ఆమె అతడ్ని నెమ్మదిగా అనుసరిస్తోంది.

"అబ్బాయికి ఓ అమ్మాయి నచ్చితే... సాధారణంగా 'ఐ లవ్ యూ' చెప్తాడు. కానీ, ఇలా 'డేటింగ్' చేద్దామనడు కదా!" అడిగింది గాయత్రీపాటిల్.

"డేటింగ్ అంటే కాస్త అడ్వాన్స్ డ్ లవ్. రోమియో, జూలియట్, లైలా మజ్నూ, పార్వతీ దేవదాసుల కాలాల్లో యువతీయువకుల ఇష్టాన్ని 'లవ్' అనేవాళ్ళు. ఈ ఇంటర్నెట్ యుగంలో డేటింగ్... ఇంకా ముందుకు 'ఆన్ లైన్ డేటింగ్' కూడా వచ్చేసాయి. ఇష్టపడిన వ్యక్తుల రుచులు, అభిరుచులు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, లక్షణాలు తెలుసుకోవడంతో పాటు... జీవితాంతం కలిసి బతికే ఆస్కారాన్ని అంచానావేసే క్రమంలో ఇద్దరూ కలుసుకుని చేసుకునే పరిశోధనే 'డేటింగ్'. ఈ పదం విని అదేదో అంటరానిదని భావించడం తప్పు. మనమిద్దరం డేటింగ్ లో ఉన్నామనుకున్న ఫీలింగే నాకెంతో తన్మయత్వాన్నిస్తోంది" అన్నాడు ప్రదీప్.

"ఇది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి దిగిన ముడిసరుకే అనిపిస్తోంది" అనుమానం వ్యక్తం చేసింది గాయత్రీపాటిల్.

"అక్కడ డేటింగ్ మనసు చుట్టూ కాక... శరీరం చుట్టూ తిరుగుతుంది. అందుకే, లైంగిక చట్రంలో ఇరుక్కుని తెగ ఇబ్బంది పడ్తోంది" చెప్తోందామె.

"ఇంకో విషయం చెప్పనా... మనం ఉంటోంది ఇండియాలో. చిట్టచివరికి నదులన్నీ కలిసేది సముద్రంలోనే అన్నట్లు... ఈ దేశంలో లవ్ అయినా, డేటింగ్ అయినా మారేజ్ కి దారితీయాల్సిందే. లేకుంటే, చిక్కులు తప్పవు" అందామె.

"అలాక్కాదు... డేటింగ్ ని కూడా 'పెళ్ళి చూపులు' గా పరిగనించాల్సిందే. ఇది మోడ్రన్ మారేజ్ లుక్స్. మనదేశంలో పెళ్లిచూపుల్లో ఒక అబ్బాయి... ఒక అమ్మాయి మహా అయితే ఓ అరగంటసేపు చూసుకుంటారు. ఆ హాఫెనవర్ లోనే ఒకరిగురించి ఒకరికి సంపూర్ణంగా తెలిసిపోతుందనుకోవడం వట్టి భ్రమ. అయితే, డేటింగ్ అనేది ఓ గంటకో, రోజుకో పరిమితం కాకుండా సుదీర్ఘంగా సాగే 'పెళ్లిచూపుల' ప్రక్రియ" అన్నాడు ప్రదీప్.

"ఏమో... డేటింగ్ లో ఉన్నామనుకోవడానికే భయమేస్తోంది. అందరికీ అర్థమయ్యే రీతిలో లవ్ చేసుకుంటున్నామనుకుంటే అదోదారి. కానీ, డేటింగ్... అటు ప్రేమ, ఇటు పెళ్ళికాని అయోమయపరిస్థితి..."

"అరేంజ్ డ్ మారేజెస్ లో పెద్దల నిర్ణయం మేరకు వధూవరుల పెళ్లిచూపుల్లో చూసుకోవడం... నచ్చితే సరాసరి పెళ్ళిపీటలపై కూచోవడం జరుగుతూ వస్తోంది. కానీ... నూరేళ్ళ జీవితాన్ని అప్పగించుకునేముందు ఒకరికొకరు తెలుసుకోవాలంటే డేటింగ్ తప్పనిసరి అని నా భావం. తొలినాళ్ళ పరిచయం స్నేహంగా మారి, ప్రణయంగా పరిణతి చెంది పరిణయంగా పరిణమించడమంటే ఇరు జీవితాలకు 'శుభం కార్డు' పడ్డట్టే. అంటే... పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి అనే నాలుగు దశలు దాటినా తర్వాతే దాంపత్య ద్వారాలు తెరుచుకున్నప్పుడు జీవితాంతం హాయిగా ఉండొచ్చన్నది డేటింగ్ థీరి..."

"అయితే, ప్రాక్టికల్స్ ఉండవు కదా" అడిగింది గాయత్రీపాటిల్.

"ఏదీ... మళ్లీ అడుగు..." అన్నాడు ప్రదీప్.

"ఈ థీరిలో ప్రాక్టికల్స్ ఉండవు కదా" అతడి కోరిక మేరకు మళ్లీ అడిగిందామె.

"ఉంటే ఉండొచ్చు... చిన్నపాటి ప్రాక్టికల్స్. ఇదిగో ఇలా భుజాన చేయివేయడం... హఠాత్తుగా నడుంని చుట్టేయడం... చటుక్కున బుగ్గను ముద్దెట్టుకోవడం... గట్టిగా కౌగలించుకోవడం... అన్నీ చిన్న చిన్న ప్రాక్టికల్స్. ఈ ప్రాక్టికల్స్ లవ్ చేయడంలోనూ ఉంటాయి కదా!" అన్నాడతడు. అలా చెప్తూనే ఆమె భుజాన చేయి వేసాడు. ఇంతకాలం సిన్మాలో సీన్ల డిమాండ్ ప్రకారం డైరక్టర్ సూచనల మేరకు ఆమెని తాకేవాడు. భుజంపై చేయివేసేవాడు. కెమెరా సాక్షిగా కౌగలించుకునేవాడు. ఇపుడు... ఈ ఏకాంతస్థలిలో అతడు ఆమెని చొరవగా దగ్గరకి తీసుకున్నాడు. చేతులో చేయివేసి మరీ ఆమె ముందు తన గుండెని ఆవిష్కరిస్తున్నాడు.

"ఇది లవ్వో... డేటింగో... నన్ను ఇష్టపడుతూ నువ్వు ప్రపోజ్ చేశావ్. ఇపుడు నేనూ 'ఓకే...' చెప్తున్నా. నేను ఈ దేశంలో పుట్టిన అమ్మాయిని. ఎంత సినిమాల్లో నటిస్తున్నా పెళ్లిదాకా దారితీసే ప్రేమకే నా ఓటు. ఈ క్షణం నుంచి ఒకరిగురించి మరొకరం మరింతగా తెలుసుకుందాం. ఇష్టాయిష్టాల్ని బేరీజు వేసుకుందాం. ఒకవేళ అభిప్రాయాలు కుదరకపోయినా గౌరవించుకుంటూ సర్దుకుపోదాం. సర్దుకుపోయేందుకు వీల్లేని స్థాయిలో ఎక్కడో అక్కడ ఏదో మలుపు దగ్గర ఆగిపోదాం. అలా ఆగిపోయిన సందర్భంలో... ఇవాళ్టి మన 'డేటింగ్ లవ్' ఎవరిజీవితాలకీ అడ్డం కాకూడదు. ఈ జ్ఞాపకాలను పట్టుకుని బ్లాక్ మెయిల్... హౌరా మెయిల్ అంటూ ఎవరూ ఎవర్నీ బెదిరించకూడదు. ఈ షరతు అంగీకరిస్తేనే... ఈ డేటింగ్ లవ్ కి నేను ఓకే..." ఖచ్చితంగా చెప్పింది గాయత్రీపాటిల్.

"ఓకే..."

"డేటింగ్ లో ఉండగా హద్దులు దాటకూడదు" మరో షరతు విధించిందామె.

"కెమెరా ముందే కాస్త హద్దులు దాటుతున్నాం కదా?" అమాయకంగా అడిగాడు ప్రదీప్.

"అది సినిమా కోసం యాక్షన్. ఇది మన జీవితం కోసం డేటింగ్" అంది.

"ఓకే... ఈ షరతునీ అంగీకరిస్తున్నాను" అంటూనే... ఆమెని దగ్గరగా తీసుకుని గట్టిగా హృదయానికి హత్తుకుని లిప్ స్టిక్ తో ఎర్రపడిన ఆమె పెదాలపై గాడమైన ముద్దొకటిచ్చాడు ప్రదీప్. అయితే... అతడలా ముద్దు ఇవ్వడం కెమెరా కంటపడింది. అది... సిన్మా యూనిట్ కెమెరా కాదు. జర్నలిస్ట్ కెమెరా. షూటింగ్ కవరేజ్ కోసం వచ్చి... హీరో హీరోయిన్లు కనిపించకపోవడంతో గార్డెనంతా తిరుగుతూ చివరికి ఒక్క 'ఫ్లాష్'తో వారిద్దర్నీ బంధించిన జర్నలిస్ట్ కెమెరా అది.

"ఫ్లాష్... ఫ్లాష్ ప్రేమలో ప్రదీప్ గాయత్రీపాటిల్!"

సినీ పత్రిక 'నవతార'లో ఆ వారం హాటెస్ట్ న్యూస్ అది. ఆకుపచ్చని ప్రకృతి సాక్షిగా హీరోయిన్ కి వేడివేడి ముద్దు ఇచ్చిన హీరో ప్రదీప్. ఓ సన్నివేశం కోసం 'ఆన్ స్క్రీన్' ముద్దు ఇచ్చిన ప్రదీప్... ఇపుడు చెట్టుచాటున ఏకంగా హీరోయిన్ కి హాట్ హాట్ ముద్దు ప్రజెంట్ చేసాడు. వారిద్దరి రహస్య ఏకాంతసమాగమం ఎక్కడికి దారితీస్తుందోనని ఫిల్మ్ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ప్రదీప్, గాయత్రి లవ్ చేసుకుంటున్నారా? లేక, రెయిన్ సాంగ్ రిహార్సల్ లో పార్టిసిపేట్ చేసారా? అన్నది తేలాల్సింది ఉంది. కాగా... రెయిన్ సాంగ్ లో ప్రదీప్, గాయత్రీపాటిల్ తెగ రెచ్చిపోయారని యూనిట్ సభ్యులే చెప్తున్నారు... ఇలా సాగిందా ఆర్టికల్.

మూడురోజుల పాటు తీసిన రెయిన్ సాంగ్ బాగా వచ్చిందని డాన్స్ డైరక్టర్ సైతం హీరో హీరోయిన్లని ప్రశంసించాడు. ఆ ప్రశంసకు కొనసాగింపుగా - "ఇండస్ట్రీలో నేనెందర్ని చూళ్ళేదూ! హీరో హీరోయిన్ల ఇంటిమేసీ ఆన్ స్క్రీన్ మీద పండాలంటే 'ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ' కూడా వర్కవుట్ కావాల్సిందే. అందుకే, అలా రిఫ్రెష్ అవమంటూ సాంగ్ పిక్చరైజేషన్ కి హాఫెనవర్ ముందు మిమ్మల్ని వదిలేసా" చెప్పాడు అదంతా తన క్రెడిట్టే అన్నట్టు.

"చూసావా... ఓ సిన్మా హిట్ కొట్టినా ఇంత థ్రిల్ కలగలేదు. నా ఇంటర్వ్యూలు ఎన్ని పబ్లిష్ అయినా ఇంత హ్యాపీనెస్ లేదు. కానీ... ఇవాళ నేనెంతో సంతోషంగా ఉన్నా" కాల్ చేసి మరీ చెప్తున్నాడు ప్రదీప్.

"నాకూనూ" అట్నుంచి అంది గాయత్రీపాటిల్.

"అందుకే, డేటింగ్ ఆఫర్ చేసింది. పెళ్ళిచూపులు... ఆ తర్వాత పెళ్లి. ఇది మామూలు తంతే. ఎవరైనా చేసుకుంటారు. కానీ, డేటింగ్ లో ఇన్ వాల్వ్ అయి... ఇంటిమేసి పెంచుకుంటూ ప్రయాణించడం థ్రిల్ కలిగించే ఇష్యూ. అందులో, మనలాంటి సినీ సెలబ్రెటీస్ ఇలాటి డేటింగ్ లో ఉండడం... ఈ అదృష్టం అందుకోలేని సోకాల్డ్ ఫిల్మ్ జర్నలిస్ట్ లు మనగురించి 'గాసిప్స్' రాయడం... ఓహ్, ఈ సీన్ ఎంతో బాగుంది" చెప్తున్నాడతడు.

"ఏంటీ... మన గురించి నలుగురూ మాట్లాడుకోవడం... దాన్ని గాసిప్ అనడం మీకు బాగుందా?" కోపంగా అడిగింది గాయత్రీపాటిల్.

"మన గురించి తెలీకుండా మాట్లాడుకునే ప్రతి 'అట' కబురు గాసిప్పే కదా! మనం నిర్ధారించేంతవరకూ వాళ్ళే నిర్ణయం తీసుకోలేరు. మనం ప్రేమలో పడ్డామా... డేటింగ్ లో ఉన్నామా... పెళ్లి చేసుకుంటామా? ఏం చేసుకుంటామో... అస్సలు అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఇలా వార్తలు వండివార్చేస్తుంటారు..." అన్నాడతడు.

"ఇక్కడితో అయిపోలేదు. ఇకముందు 'నవతార'లో పడ్డ వార్తని ఎలక్ట్రానిక్ మీడియా అందిపుచ్చుకుంటుంది. హాఫెనవర్ స్టోరీలుగా వ్యూయర్స్ కి అందిస్తుంది. మధ్యమధ్యలో మన సినిమా క్లిప్పింగ్ ల్ని వాడుకుంటుంది..."

"హమ్మో... నాకు భయమేస్తోంది. ఈ ప్రచారం ఇంతలా సాగితే... నా కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుందేమో?"

"నో... నో... నీకో విషయం తెలుసా...? చేసిన సిన్మాల కన్నా ఈ తరహా పబ్లిసిటీతోనే నెట్టుకొచ్చే ప్రముఖలెందరో ఉన్నారు ఇండస్ట్రీలో. మనకొచ్చే భయం లేదు..." అన్నాడు ప్రదీప్.

కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత గాయత్రీ అంది - "దీపూ... నాకో డౌట్. డైరక్ట్ గా అడిగేస్తున్నాను. నీతో ఇలా తిరుగుతున్నానని నన్నో వేరేలా అనుకోరు కదా!"

ఆ క్వశ్చన్ కి వెంటనే ఆన్సరివ్వలేకపోయాడు ప్రదీప్.

"చెప్పు... దీపూ! నన్ను తప్పుగా అర్థం చేసుకోరు కదా!"

"అసలా డౌట్ ఎందుకొచ్చింది నీకు?" అడిగాడు ప్రదీప్.

"రాక... స్క్రీన్ మీద సినిమాసినిమాకీ మారుతున్న హీరోతో ప్రేమలో పడుతూ డ్యూయెట్స్ పాడే హీరోయిన్ ని నేను. కెమెరా కన్నుకొడితే... నాలో 'లోలో' అందాలు కూడా బహిర్గతమవుతాయి. మోడలింగ్... సినిమా... ఈ రెండూ హీరోయిన్ వంపుసొంపులపైనే ఎక్కువగా ఆధారపడిన ఇండస్ట్రీలు. అలాటి ఫీల్డులో ఉన్న నా పేరు నీ పేరుతో జతకలిసి ప్రచారంలోకి వస్తే... నాగురించి అలా అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా! ఒకటి చెప్పు. అసలు సినిమా హీరోయిన్లకి గౌరవం ఉందా?"

"నిజానికి ఈ ప్రశ్న నన్ను వేయాల్సింది కాదు. అదీ సూపర్ సక్సెస్ ఉన్న హీరోయిన్ గా చేతులో నాలుగు సినిమాలు ఉన్న ఈ దశలో ప్రస్తావించుకోవాల్సింది కూడా కాదు. మొదటిసారి ఈ ప్రశ్న నీకు నువ్వు ఒకటికి పదిసార్లు వేసుకున్న తర్వాతనే సినిమా కెమెరాని ఫేస్ చేయాల్సింది. అయితే, ఈ ప్రశ్న నువ్వు నన్నడిగావు కాబట్టి చెప్తా... విను. ఇండస్ట్రీ పుట్టిన తొలినాళ్లలో సినిమాల్లో నటించేవాళ్లని సొసైటీ చిన్నచూపు చూసిందన్నమాట ముమ్మాటికీ నిజం. తర్వాత్తర్వాత - సినిమా తారలకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. నీకూ తెలుసుగా... సినిమా వాళ్లని 'వెండితెర వేలుపు'లని అభివర్ణించడం. 'వేలుపు' అంటే దైవం అని అర్ధం. అంటే... సినిమాల్లో నటించేవాళ్ళంతా గాడ్స్... గాడెసెస్. వీక్షకుల దృష్టిలో వీళ్ళంతా దేవుళ్ళు, దేవతలు. దైనందిన జీవితంలో తమకెదురవుతున్న కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు మరిచిపోవడానికి ఇండియాలాంటి దేశంలో అతి పెద్ద వినోదం ఈ మూడక్షరాల 'సినిమా'. ఇక్కడి జనం ఆకలేస్తే ఈ సినిమాని తింటారు. దాహమేస్తే ఈ సినిమాని తాగుతారు. రాత్రి నిద్రపట్టకపోతే ఈ సినిమానే కల కంటారు. అంతలా ప్రజాజీవితంలో మమేకమైన ఈ సినిమాకి చెందిన ఆర్టిస్ట్ లను తమ 'హార్ట్'ల్లో ప్రతిష్టించుకుని పూజిస్తారు. తప్ప... నువ్వనుకున్నట్లు ఎవ్వరూ అనుకోరు" సుదీర్ఘంగా చెప్పాడు ప్రదీప్.

"అంతే అంటావా?"

"అంతే..."

"మరి... ఆ మధ్య హోటల్స్ లో దొరికిపోయిన కొందరు హీరోయిన్ల సంగతేంటీ? అదే... మనకున్న జీవనదుల్లో ఓ నది పేరు పెట్టుకుని అప్పట్లో హోమ్లీ హీరోయిన్ గా ఆడియన్స్ ఆదరణ పొందిన ఓ నటి బెంగళూర్ లో పోలీసులకు దొరికిపోయింది కదా! ఆమె... ఆమె లాంటి మరికొంతమంది కథలేంటీ?"

"ఎంత పెద్ద తులసివనంలో కూడా కొన్ని గంజాయి మొక్కలుంటాయి. వాటి గురించి పట్టించుకోవడం వేస్ట్. మన సినిమావాళ్ల సంగతి సరే... సొసైటీలో కూడా అలాటివాళ్లున్నారు కదా. అయితే, వాళ్లకు మనవాళ్లకొచ్చినంత పబ్లిసిటీ లభించదు. ఎందుకంటే... వాళ్ళంతా పేరు ప్రతిష్ట లేని సామాన్యులు. మన సినిమా వాళ్ళు కెమెరా 'క్లిక్'ల మధ్య తళుకుమనే గ్లామరస్ స్టార్స్. అంతే తేడా. మంచి చెడూ... ప్రతి రంగంలోనూ ఉంటాయి. అలాగే, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో కూడా. ఇక, నీ గురించి... మనకి మనం ఏ తప్పు చేయడం లేదు. మన గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని నేను 'డేటింగ్' అని పిలిస్తే... నువ్వు 'లవ్' అని పిలుస్తున్నావ్. పేరేదైనా మనిద్దరి దారి ఒక్కటే. ప్రేమ ఒక్కటే. మనం డేటింగ్ చేసుకుంటున్నాం. మనం ప్రేమించుకుంటున్నాం. ఆ విషయంలో ఇద్దరికీ క్లారిటీ ఉంది కదా! ఇంకెవరికీ క్లారిటీ ఉన్నా లేకున్నా మనం లెక్కచేయనవసరం లేదు. అయితే, మన గురించి ప్రచారం అవుతున్న స్టోరీల్న, గాసిప్ ల్ని ఎంజాయ్ చేద్దాం. సరేనా?"

"అంటే... గాసిప్స్ ని ఎంజాయ్ చేద్దామంటావ్? అంతేనా?"

"సరిగ్గా క్యాచ్ చేసావ్" అన్నాడు ప్రదీప్... 'బాయ్' చెప్తూ. ఇంతలో ఇన్ బాక్స్ లో మళ్ళీ ఓ మెసేజ్... "హీరో ప్రదీప్ తో డేటింగ్ లో పడ్డారట. అరికాలికింద పడి నలిగిపోతున్న ఏ హృదయాన్నీమీరు పట్టించుకోరా మేడమ్... అభిమాని".

'ఎవరా అభిమాని?" తెలుసుకోవాలనిపించి కాల్ చేద్దామనుకుంటుండగా... సెల్ ఫోన్ రింగైంది.

ఓ ప్రొడ్యూసర్ కాల్ అది.

చేతుల్లోకొస్తున్న మరో ఆఫర్.

"ఈ మూవీలో హీరోయిన్ సెమీన్యూడ్ గా కనిపించాలి" అడిగాడు ప్రొడ్యూసర్ ఫనిభూషణరావు. తెలుగు ఇండస్ట్రీలో పేరు మోసిన నిర్మాతల్లో ఆయనొకరు. ఆయన చిత్రాల్లో అవకాశం వచ్చిందంటే ఆర్టిస్ట్ లు ప్రత్యేకించి హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అలాటిది... ఆయనే స్వయంగా గాయత్రీపాటిల్ కి కాల్ చేసి తన చాంబర్ కి పిలిపించి మరీ తను తీయబోయే కొత్త సిన్మా గురించి డిస్కస్ చేస్తున్నాడు.

"సెమీన్యూడ్ గానా..." ముఖం చిట్లించింది గాయత్రీపాటిల్.

"ఔను... ఇపుడిపుడే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న కొత్త హీరోయిన్ గా మా సినిమాలో నటించే అవకాశం నీకు ఇస్తున్నాం. ఈ ఆఫర్... ఆర్టిస్ట్ గా నీకే అబ్జెక్షన్ ఉండదనుకుంటా" సాలోచనగా ఆమెని చూస్తూ అడిగాడతను.

"మీరన్నట్లే... ఇపుడిపుడే సక్సెస్ చవిచూస్తున్న హీరోయిన్ ని. ఒక్కసారి స్క్రీన్ పై సెమీన్యూడ్ గా కనిపించాలంటే..." సెంటెన్స్ ఎలా కంప్లీట్ చేయాలో తెలీనట్లు అర్ధాంతరంగా ఆపేసిందామె.

"మాది ప్రెస్టేజియస్ బ్యానర్. హీరోయిన్ గ్లామర్ ని నమ్ముకుని 'సి' గ్రేడ్ సిన్మాలు తీసే సంస్థ కానే కాదు. మంచి విలువలున్న కథాంశాల్తో సొసైటీకి మేలు చేయకున్నా చెడు చేయని సినిమాలే తీయాలన్నది మా లక్ష్యం..." అన్నాడతడు.

"అయినా... ఇపుడు నటిస్తున్న సినిమాల్లో నిండైన చీరల్లోనే నువ్వు కనిపిస్తున్నావా? ఇండస్ట్రీలో సావిత్రికాలం ఎపుడో పోయింది. సిన్మా పుట్టిన తొలినాళ్ళలో ఓ మహాదర్శకుడు కథానాయిక స్నానాల గదిలో ఉందన్న స్క్రిప్ట్ లోని వాక్యాన్ని 'సెల్ఫ్ సెన్సార్' చేసి కట్ చేసారు. ఆ వాక్యంతోనే ప్రేక్షకుల ఊహల్లో 'తడితడి అందాల కథానాయిక' కనిపిస్తుందనే భావించి ఆ డైలాగ్ కట్ చేసార్ట. ఇపుడో... నిన్నటికి నిన్న నువ్వూ ఓ రెయిన్ సాంగ్ లో పల్చటి తడిచీరలో సొగసులారబోస్తూ నర్తించావు. ఆ సినిమా హిట్ అయేందుకు రెయిన్ సాంగ్ ఫక్తు కమర్షియల్ ఫార్ములా అయితే... మా సినిమాలో సెమీన్యూడ్ సీన్ స్టోరీ డిమాండ్ బట్టే ఉంది. అన్నట్టు... ఇంకో విషయం చెప్పనా...

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
aido manishi story by mallampalli sambashivarao