Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram eighth part

ఈ సంచికలో >> సీరియల్స్

అయిదో మనిషి - మల్లంపల్లి సాంబశివరావు

aido manishi story by mallampalli sambashivarao

ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. చదువరులు. ఇల్లు పట్టని భర్త! ఏ బెజవాడకో పోయ్ దండగమారి పనులకు దుడ్డు ఖర్చు పెట్టేది మాత్రం తెల్సు! అయినా ఆ అమ్మకేం? కొట్టంలో గేద వుంది. అది కొట్టంలో వున్నా నలుగురున్న ఆ ఇంట్లో అయిదో మనిషి లాంటిది. దాన్ని అబ్బానాకారంగా చూసుకుని మొగున్నీ, ఇద్దరు బిడ్డల్నీ సాకి సంతరించుకుంటూనే వుందా తల్లి!

బెజవాడ నుంచి బందరెళ్ళే ప్యాసింజర్ రైలులో గంటసేపు ప్రయాణించాక నేను దిగాల్సిన స్టేషనొచ్చింది. అక్కడి నుంచి డొంకరోడ్డు మీద పావుగంట నడిస్తే మా ఊరు. డొంకమీదుగా ఊరివేపు నడుస్తుంటే పొలాల్లోకి కలుపు తీయడానికి బయలుదేరిన ఆడవాళ్ళు ఎదురవుతున్నారు. "ఏరా మనవడా ఇదేనంట్రా రాడం" అంటూ ఒక గుంపులో నుంచి మా ఇంటి దగ్గరలో వుండే సరసమ్మ పలకరించింది 'అవునమ్మమ్మా' అంటూ బదులిచ్చాను. 'ఎవరే ఈ పిల్లోడు ఆనమాలు తెలీటల్లా నాకు?' అంటూ సరసమ్మను ఇంకొక ముసలమ్మ అడిగిందానికి 'నీకు అప్పుడే సూపు ఆనిచావట్లేదా ఏంటే? ఆడు కాంతమ్మ పెద్ద కొడుకు. బెజవాడలో చదువుకుంటున్నాడు' అని వివరించింది.

నేను ఇంటికెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు, తాళం వేసుంది. మా అమ్మ కూలికెళ్ళివుంటుంది. గొడ్డచావడి ఖాళీగా కనిపించింది. బహుశా మా అయ్యతిట్టుకుంటూ గేదలను మేపుకు రావటానికి తోలుకుపోయుంటాడు. వసారాలో కెక్కరిస్తూ తిరుగుతున్న కోళ్ళను ఆదలించి అక్కడున్న కుక్కి మంచం ఒకటి వాల్చుకున్నాను. కాసేపటికి కునుకులోకి జారిపోయాను. 'ఎప్పుడొచ్చావురా! అన్నం తిన్నావా? తాళం చేతులు గూట్లోనే వున్నాయ్ గా! తీసుకుని తినకపోయావా?' అంటున్న ఆ అమ్మ గొంతు విని మగతలోంచి మేలుకున్నాను. 'ఇందాకే వచ్చానమ్మా! ఏడుగంటల బండి బాగా లేటుగా వచ్చింది' అన్నాను ఆవలిస్తూ. 'ఇయ్యాల కూలికెల్లరా! మన చేలో కలుపు ముదిరిపోతందని ఎల్లి చేలో దిగిన కాసేపటికి పక్క చేను పుల్లమ్మోల్లు నువ్వొచ్చావని చెబితే... ఇక వచ్చేశా!' అని చెబుతూనే గబగబా పొయ్యి రాజేసింది. 'కాళ్ళు కడుక్కోచ్చుక్కో! అన్నం తిందూగానీ' అంది. నేను తొట్టి దగ్గరకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి కోడిగుడ్డు అట్టు వాసన ముక్కులకు తగిలింది. 'ఇయ్యాల కూరేమీ వండలా! చిన్నోడు కూడా సద్దన్నం తిని మట్టిపనికి ఎల్లిపోయాడు. ఉత్తపచ్చడేమి తింటావులే అని కోడిగుడ్డు ఒకటుంటే అట్టేత్తన్నా' అని చెబుతూ మళ్ళీ కోళ్ళ మంచి చెడులు చెప్పటం మొదలు పెట్టింది. 'ఈ మద్దెన రోగాలొచ్చి మన కోళ్ళు సచ్చినయ్. ఒకటుంది గానీ అది పొదిగిసత్తంది'.

నాకు ఊళ్లోనే వున్న మా పెద్దమ్మ వాళ్ళు గుర్తొచ్చారు వెంటనే. మాకు ఎకరం భూమైనా వుంది. వాళ్ళింట్లో అంతా కేవలం రెక్కల కష్టం మీదే బతకాలి. అయినా వాళ్ళతో పోల్చుకుంటే మా ఇంట్లో కోళ్లు కోసి ఇంటిల్లిపాది సంతోషంగా తినటం చాలా తక్కువ. 'కాంతానికి కాపీనం ఎక్కువ ఎప్పుడన్నా ఒక కోడిని కోసి పిల్లలకు  పెడదామని వుండదు. అయిరోగాలొచ్చి సత్తే మాత్రం అయ్యో! నాకు కోసుకుతింటానికి చేతులు రాలేదు అని తెగ బాధపడిపోద్ది' అని వాళ్ళు మా అమ్మను ఆటపట్టించేవాళ్ళు. మీ కేమ్మా! అట్టాగే చెబుతారు. మీ వోళ్ళలాగే మా మంద కూడా పనీపాటా చేసుకొచ్చి 'మూట' తీసుకొస్తే కోళ్ళను, గొర్రెలను వొండిపెట్టడానికి నాకేమన్నా తీపరమా? సంకురాత్రికి కోడిపందెగాళ్ళు రెండు డబ్బులు ఎక్కువిచ్చి కొంటారు గందా అని ఆశపడ్డాను. మద్దెలో గత్తరొచ్చి మింగుద్దని నేనేమన్నా కలగన్నానా? అయినా కోడికూర తిన్నా ఎల్లమారిపోద్ది' అంటూ తన పీనాసితనాన్ని సమర్ధించుకునే తీరు గుర్తొచ్చి నాలో నేను నవ్వుకున్నాను.

కంచంలో అన్నం పెట్టిచ్చింది. నేను కుక్కి మంచంలో కూర్చుని తినటం చూసి 'మొగోళ్ళు మంచం మీద కూర్చుని తినగూడదురా' అంటూ వారించబోయింది. 'అట్టా అని ఎవరు చెప్పారు నీకు?' అంటూ నవ్వుతూ అడ్డం మాట్లాడాను. 'రెటమతం లంజేకొడుకులకీ ఏం జెబుతాం' అంటూ గొణుక్కుంది. నేను ఊరికి ఐదారు నెలల తర్వాత వచ్చాను. ఈ లోగా ఊళ్ళో ఏమేం జరిగాయో చెప్పసాగింది. 'అప్పులెక్కువైపోయి అంజయ్యగారు రెండెకరాల పొలం అమ్మేశాడు'. 'ఎంకమ్మ మనవరాలికి పెళ్ళి కుదిరిందిరా! చిన్నప్పుడు సొట్టబుగ్గలేసుకుని ఏమంత బాగుంది సచ్చేది గాదు. ఉప్పుడు బాగానే తయారైంది గుంట' అని ఆ సంబంధం విశేషాలు చెప్పింది. 'ఆ పిల్లకి నిండా పదిహేనేళ్ళు కూడా వున్నట్టు లేదు. అప్పుడే పెళ్లేమిటమ్మా?' అని నేను అన్నందుకు 'నీది మరీ సోద్దెంరా! ఆళ్లు ఉప్పటికే బాగా లేటయిపోయిందని బాధపడిపోతుంటే...' అంటూ దీర్గం తీసింది. 'సరేగానమ్మా! ఆ మధ్య ఎంకటరెడ్డికి బాగోలేదన్నారు. ఇప్పుడు బాగున్నాడా?' అనడిగాను. 'ఇంకెక్కడ ఎంకట్రెడ్డి? ఏట్టో కలిసి కూడా రొండు నెల్లయిపోయింది. రాయిలాంటి మడిసి. ఆయన అంత తొందరగా పోతాడని ఎవరూ అనుకోలా! నెల రోజులు మంచంలో పడ్డాడు. కొడుకులు ఒకాయనేమో అయిదారాబాదులో, ఇంకొకాయన ఇంకేదో ఊరిలో ఉన్నారంట. ఆళ్లు మొదట ఒకసారి వచ్చి చూసి ఎల్లిపోయారంట. అప్పుడు పెద్ద జబ్బేమీ లేదంట. మళ్ళీ రొండు నెలలకి బాగా తిరగబెడితే బెజవాడ పెద్దాసుపత్రిలో జేరిత్తే డాకటర్లు నమ్మకం జెప్పలేదంట. మంచి కూర, మంచి బువ్వ తినకుండా ఇరవై ఎకరాలు సంపాదిచ్చాడు. ఏం లాభం చివరికట్టా ఎల్లమారిపోయాడు' అంటూ ఎంకటరెడ్డి కోడళ్ళనీ, కొడుకుల్నీ వారి నిర్లక్షాన్ని ఆడిపోసుకుంది. అదంతా విన్నాక ఎప్పుడూ కాయకష్టం చేసే ఎంకటరెడ్డి గుర్తొచ్చి నాక్కూడా 'పాపం' అనిపించింది.

పచ్చడితో అన్నం తినడం అయిపోయాక' పెరుగుందా? మజ్జిగ పోస్తావా?' అంటూ ఆమె వంక చూసేసరికి ఆమె ముఖం కళ తప్పిపోయింది. 'నా మతి మండినట్టే వుంది. నీకు ఊళ్ళో సంగతులన్నీ చెప్పుకొచ్చా గానీ మనింట్లో సంగతే మరిసిపోయాను. పోయిన అమాసనాడు మన ముసలిగేద సచ్చిపోయింది. పొసువుల డాక్టర్ గారిని తీసుకొచ్చి సూపిచ్చాం, మూడొందల రూపాయల మందులు వాడినా బతకలేదు' అంటూ ముక్కు చీదుకుంది. ఆమె కళ్లలో కన్నీటిపొర. ఒక ఆత్మీయుడైన మనిషిపోతే కనిపించే దిగులు లాంటిదే ఆ క్షణంలో ఆమె ముఖంలో కనిపించింది. 'మనిషి పోతేనే ఎవరూ పట్టించుకోని ఈ రోజుల్లో ఈమె ఒక గేద గురించి మరీ అంత ఎక్కువగా బాధపడిపోతుందేట్రా బాబూ' అని ఒక్క క్షణం అనుకున్నాను. అలా అనుకున్నందుకు మరు నిముషం నాలో నేను చాలా సిగ్గుపడ్డాను. నలుగురం ఉన్న కుటుంబాన్ని లాగడంలో అమ్మకు ఆ గేద ఎంతో ఆదుకుంది. మా రక్తంలో మా అమ్మ ఇచ్చిన పాలున్నాయో లేవో కానీ ఆ గేద పాలు మాత్రం వున్నాయ్. ఒక రకంగా ఆ గేద మా ఇంట్లో ఐదోమనిషి లాంటిది. కొంచెం మెల్లకన్నుతో, బారు కొమ్ములతో వుండే ముసలిగేదకు అసలు కొమ్ములే సరిగ్గా రాణి రోజుల్లోకి... అంటే దాదాపు పన్నెండు పదమూడేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది నా మనసు.

****    ****    ****    ****

అప్పుడు నేను ఆరో తరగతి మా తమ్ముడు ఐదో తరగతి చదువుతున్నాం. ఆ రోజు బడి వదిలిపెట్టగానే తిన్నగా ఇంటికి రాకుండా ఆటలాడి చీకటి పడుతుండగా ఇంటికి చేరాం. అమ్మ అప్పుడే కూలి కెల్లి వచ్చింద. ఊళ్లో పనులైపోయినయ్. రెండు మైళ్ల దూరంలో ఉన్న ఎలికపాడు వెళుతున్నారు కూలికి. పొద్దుకూకులూ బురదచేతిలో పనిచేసింది కాక రెండు మైళ్ళు నడిచొచ్చిందేమో - ఇంటికి రాగానే కాసేపు కూర్చుండిపోయింది. లేచి దీపం బుడ్డి వెలిగిస్తుండగానే పెద్దగాలి ఆ వెనుకే... పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి. 'బయటున్న పుల్లలు పిడకలు ఎత్తి లోపల పడేయండ్రా' అని మాకు చెప్పి ఆమె బయట ఆరేసి వున్న బట్టలూ, మంచాలు అన్నీ ఇంట్లోకి చేరవేసింది. మేము గంపతీసుకుని ఎత్తటం మొదలుపెట్టేసరికి వాన పెద్దది కావటంతో అవి బాగానే తడిసిపోయాయి. వాటితోనే పొయ్యి వెలిగించాలి. అవి తొందరగా అందుకోవటం లేదు. ఇనప గొట్టంతో దగ్గొచ్చిందాకా ఊదుతూనే ఉంది. ఆ పొగకు కళ్లవెంట నీరు కారుతోంది. 'నేను గట్టుమీదున్న తుమ్మ మొద్దు ఎండిపోయింది. నరుక్కు రమ్మని చెబితే చెవులకి నాట్టుద్దా? పెట్టుద్దా నానా వొంగుడం వచ్చినప్పుడు కూడా చితుకులతో వండాలంటే నానా సాపుగా వుంది. వొండుంచితే ఒక్కడు కూటేలకి జేరుకుని కమ్మగా తింటారు' అంటూ అక్కడ లేని మా అయ్యమీద కోపం చూపింది. చివరికీ ఊదీ ఊదీ పొయ్యని మండించింది. బయట వాన తగ్గలేదు. గేదలు బయటేవున్నాయి. దీపం బుడ్డి దగ్గర పుస్తకాలు తీసి కాసేపు చదువుకున్న తర్వాత మా ఇద్దరికీ అన్నాలు పెట్టింది. 'అమ్మా! సుబ్బారావు మేష్టారు ఇంకా అన్ని పుస్తకాలూ కొనలేదేరా నువ్వు అని తిట్టారు' అని నేను చెబితే 'పాల డబ్బులు వొచ్చాక కొంటాలే' అని హామీ ఇచ్చింది. కూరన్నం తినటం అయిపోయాక మజ్జిగ పోసింది. పెరుగు లేదని చిన్నోడు ముఖం కష్టంగా పెట్టుకుని వుండటం గమనించింది. దెంగితాగటానికి పాలు పెరుగు గావాలి. గేదలను మాత్తరం ఒక్కడూ పట్టిచ్చుకోడు. మీ అయ్యేమో ఎక్కడ పదిరూపాయలు దొరికితే అక్కడ అయి తీసుకుని తాగుతాడు, లేపోతే ఏ బెజవాడలో, గుడివాడలో తిరిగొత్తాడు. నాల్రోజుల్నించి గొడ్లను ఇప్పలేదు. సరైన మేతా, నీళ్లూ లేక పొద్దున పాలు తగ్గిపొయినయ్. ఇంక పెరుగెక్కడనుంచొత్తది. అయి లేపోతే ఏం తాగుతార్రా ఊళ్ళో వాళ్ల ఉచ్చ! అయ్యుండబట్టే అన్నింటికీ అడ్డం పడతన్నయ్. లేకపోతే ఈ మగోడు చేసుకొచ్చి... ఈ కాపరం బాగుపడి సచ్చినప్పుడు...' అంటూ తనలో తాను అనుకుంటున్నట్టుగానూ మాకు చెబుతున్నట్టుగానూ లోపలి బాధ వెళ్లగక్కింది. తినేసి మేం మంచమెక్కేశాం. అమ్మ నీళ్ళు కాసుకుంటూ పొయ్యి దగ్గర కూర్చునుండిపోయింది. ఆ లోగా వాన కూడా తగ్గిపోయింది. 'ఏమే! నీళ్ళు కాగినయ్యా' అంటూ మా అయ్యొచ్చాడు. రావటం రావటం వాల్చివున్న నులకమంచానికి అడ్డం పడ్డాడు. తాగాడనుకుంటా! రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు అమ్మ. 'ఏం ఇరగలబడ్డావని నీళ్లు కానుంచాలి నీకు? ఇయ్యాలంతా ఏడికి సచ్చినట్టు? ఆ గేదల్ని కాసేపు మేపుకొత్తే నీ కండలు కరిగిపోతయ్యనుకున్నావా? వరిగడ్డి కూడా తక్కువుందన్న సంగత్తెలుసుగా' అంటూ గయ్ గయ్ మని లేచింది ఆయన మీదకి.

'చిన్న పనుండి బెజవాడెల్లాలే' అంటూ గొణిగాడు. 'అంత ముక్కెమైన పని ఏంటది? నీ మేనగోడలు సంవర్తబంతా? లేపోతే మీ మేనత్త దినమా? ఇంట్లో రాగికాణీ లేక నేను నానాచావులు చత్తంటే నీకు బెజవాడెల్లటానికి డబ్బులెక్కడియ్యి?' అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలేసింది. 'పాలాయన్ని అడిగి యాబయ్ రూపాయలు తీసుకున్నాలేవే' అన్నాడాయన. 'యాబయ్ రూపాయలు ఉత్త పున్నేనికి నీ పొట్టన పెట్టుకున్నావన్న మాట. కూలికి ఎల్లకుండా నట్టం చేసింది కాకుండా యాబయ్ రూపాయలు ఉరదాఖర్చు! ఇంట్లో నూనె లేదు. కూరగాయలు కొంటానికి డబ్బుల్లేవు. పిల్లలు పచ్చడేసుకు తింటున్నారు. కోమటింట్లో మూడొందల బాకీ అట్టాగే ఉంది. పిచ్చిరెడ్డికియ్యాల్సిన రెండొందలకీ వడ్డీ ఎంత పెరిగిందో! నోటినిండా పళ్ళు ఊరి నిండా అప్పులు అన్నట్టుగా వుంది. నీ వల్ల ఎంత నట్టం ఎంత నట్టం. ఈ కాపరం చేయడం కన్నా ఏదన్నా మింగి సత్తే పీడాపోద్ది' కోపంగా తిట్టడం మొదలుపెట్టింది.

మా అయ్యకు బాగా కోపం వచ్చినట్టుంది. మంచంలోంచి లేచి 'ఏంటే నీ యమ్మ. తెగ నీలుగుతున్నావ్... నీ బాబుగాడి సొమ్మేదో నేను తినేసినట్టు...' అంటూ ఆమె జుట్టు పట్టుకున్నాడు. ఫెడీ ఫెడీ మని నాలుగు తన్ననే తన్నాడు. 'ఓరి నీ దినం చెయ్యో, నీకు గత్తర తగలో' అంటూ ఆమె ఏడుపు లంకించుకుంది. నేను చూస్తూ అట్టాగే ఉండిపోయాను. 'గబాలున పెద్దోనిడై పోతే మా అయ్యా డొక్కలో ఈడ్చి తందును గదా' అని నాలో నేను కుతకుత ఉడికిపోయాను. ఈ గొడవకి పక్కింటి సూరమ్మ వచ్చింది. 'ఎందుకురా ముండసచ్చినోడా దాన్నట్టా గొడతన్నావ్! పనీపాటా జెయ్యకపోయినా చాకిరీ చేసి వొండిపెడతందిరా మీకు' అంటూ తన పెద్దరికంతో మా అయ్యను నిలపరించిది. 'అత్తా నన్నొదులు... దీన్ని... దీన్ని' అని ముద్ద ముద్దగా అంటూ మళ్ళీ అమ్మ మీదకు వెళ్ళబోతున్న ఆయన్ని మంచం మీదకి నెట్టింది సూరమ్మ. 'కొట్టింది సాల్లెరా సన్నాసోడా! నీకిల్లూ, గొడ్డూగోదా ఏదీ పట్టదు. ఒక్కతి ఎన్ని పనులని చూసుకుంటదిరా! సిగ్గులేకపోతే సరి' అని బాగా కోప్పడింది. ఆయన మంచంలో నుంచి లేవలేదు. నిద్రలోకి జారుకుంటున్నాడనుకుంటా! గురక మెల్లగా వినిపిస్తోంది. అమ్మ గోడకి చేరగిలబడి ఏడుస్తూ ముక్కులు చీదుకుంటూ ఉండిపోయింది. సూరమ్మ మా అమ్మ దగ్గరే కూర్చుంది. 'ఇక లెగిసి అన్నం తినవే' అందామె అమ్మను ఉద్దేశించి. 'అదిగాదు పెద్దమ్మా! గేదలు లేక ముందు నానాసావు సచ్చాం. గేదలంటే కొంచిం కూడా శ్రద్ధ లేపోతే ఎట్టా? కూలినాలి సమత్సరమంతా ఉండదు గందా? ఆ గేదలుండబట్టే ఎట్టాగొట్టా నెట్టుకొత్తన్నాను' అంటూ సూరమ్మతో గోడు వెల్లబోసుకుంది. 'సర్లేవే. ఇది రోజూ ఉండే బాగోతమేగా! ఆ నీళ్ళు ఆరిపోయే వుంటాయ్. రెండు చెంబులు గుమ్మరించుకుని అన్నం తినవే' అంటూ సూరమ్మ గోడకు చేరగిలబడి కూర్చున్న అమ్మను లేపే ప్రయత్నం చేస్తోంది.

ఆ గొడవ వల్ల నాకు నిద్రరాలేదు. ఆమె తన్నులు తింటానికి కారణమైన గేదల మీద ఆలోచనలు మళ్ళాయి. మేం మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు పాలు పెరుగూ తెలీదు. ఏ గేదను కొన్నా కలిసోచ్చేది కాదు. మా అయ్య కొన్న గేద అన్నింటిలోనూ నష్టమే వచ్చింది. ఒకటి కొన్న కొన్ని రోజులకే పాలెగ్గొట్టింది. ఇంకోటి నాలుగు నెలలకీ చచ్చిపోయింది. ఇట్టా ఏ ఒక్క గేదవల్లా సరిగా కలిసిరాలేదు. పైగా నష్టాలు అప్పులు. ఒక్కసారి మా అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు పిల్లలు మజ్జిగ నీళ్లకు కూడా మొహం వాచిపోతున్నారని చెప్పుకుని బాధపడింది. అప్పుడు మా తాత మాకు ఒక పెయ్యిదూడను తోలాడు. ఆ దూడకు మా అమ్మ రెండు మూడేళ్ళు బాగా మేపింది. అది ఎదిగి చూడిదైనాక తొలిసారిగా పెయ్యిదూడనే పెట్టాలని దేముడి పటాల ముందు నిలబడి దణ్ణం కూడా పెట్టుకుంది. గేద ఈనే రోజున ఆమె ఎక్కడికీ వెళ్ళకుండా దానినే కనిపెట్టుకుని ఉండిపోయింది. గేద అర్ధరాత్రప్పుడు ఈనింది. ఆమె కోరుకున్నట్టుగా పెయ్యదూడే. భూమ్మీద పడగానే గేద ఆప్యాయంగా దాని ఒళ్లంతా నాకింది. ఆ రాత్రి నేను లాంతరు పట్టుకుని చావిట్లో మా అమ్మకు తోడుగా ఉండిపోయాను. ఆ అర్ధరాత్రి ఆమె తాటాకు చితుకులు ఏరి నీళ్ళు కాచింది. ఆ నీళ్ళతో గేద ఒళ్లంతా శుభ్రంగా కడిగింది. గేదకు పొద్దున్నే పెట్టడానికి జొన్నలు దంచింది. ఆ రాత్రి ఆమె నిద్రను మరిచిపోయింది.

ఆ రకంగా ఇంట్లో సొంత గేదలుండటం మొదలైంది. దున్నపిల్లలు పుడితే మాత్రం గేద పాలియ్యడం మానేయగానే మాదిగ ఎంకట్రాముడికి అమ్మేసేవాళ్ళం గొడ్డ బేరం చేసే ఎంకట్రాముడు 'మంచి గేదలమ్మా కాపోతే మీరు మేపలేకపోతన్నారు' అంటూండేవాడు. ముసలిగేదకు పుట్టి పెద్దయిన గేదల్ని ఒకటి రెండు ఈతల వరకూ వుంచుకుని అమ్మేసేవాళ్ళం. ఇంట్లోకి కాసినిపాలు వుంచుకుని కాసిన పాలు అమ్మేవాళ్ళం.

అప్పటినుంచే ఇంట్లో దరిద్రం చాలా వరకూ తగ్గింది.

'పొద్దు పోతంది పెద్దమ్మా! నేను ఈ గొడ్డను లోపల కట్టేసి ఆ బయటున్న రొచ్చు, పేడ తీయాలి. కోడలు ఎదురు చూత్తందేమో ఇంటికెల్లు' అంటూ మా అమ్మ గేదల దగ్గరికి నడిచింది. 'తినకుండా పడుకోమాకే' అంటూ సూరమ్మ వాళ్ళ ఇంటివైపు కదిలింది.

****    ****    ****   ****

నేను లేచేసరికి బాగా తెల్లవారిపోయింది. ఇప్పటికి మా అమ్మ యధావిధిగా గేదలపాలు తీసి పాలాయనకు పోసేయటం, ఇల్లూవాకిటీ, గొడ్డచావడి అన్నీ ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులేయటం లాంటి పనులన్నీ చేసేసింది. నేను లేచి ఎదురింటి మాణిక్యం దొడ్లో వున్న వేపచెట్టు దగ్గరకెళ్ళి వేపలుల్ల విరుచుకొచ్చుకున్నాను. అప్పటికి మా అమ్మ పొయ్యి రాజేసింది. అరగంటలో అన్నం కూరా వండేసింది. పాలు కాగబెట్టి తోడుపెట్టింది. ఆ పనులయ్యాక ఇంట్లో అందరూ విడిచిన బట్టలను బక్కెట్టు నిండా పెట్టుకుని దగ్గరలో వున్న పంటకాల్వలో ఉతుక్కుని వచ్చి వాటిని తీగ మీద ఆరేసింది. అప్పటికే బాగా ఎండెక్కింది. 'ఏమే ఇంకా అన్నం కట్టుకోలా' అంటూ సూరమ్మ వచ్చింది. 'ఇయ్యాల కూలి మానేద్దామనుకుంటున్నా పెద్దమ్మా! గొడ్డను జోత్తే పేణం ఉసూరుమనిపిత్తంది. ఇయ్యాల గూడా ఇప్పదీయకపోతే ఆటి ఉసురు తగులుద్ది నాకు. పేడ, రొచ్చూ ఆటి ఒంటినిండా అంటుకుపోయి ఎట్టా అట్టలు కట్టాయో చూడు' అంటూ గేదల వైపు చూపించింది మా అమ్మ 'ఆడు రాత్రి తాగి ఇంకా లెగవలేదా? పోత పోయిందిలే ఒక రోజు కూలి. అయి పాలెగ్గొట్టినయ్యింటే సచ్చేసావు. సరే నేను బోతాలే అవతల అందరూ ఎలతన్నారు' అనేసి వెళ్ళిపోయింది సూరమ్మ.

మేం బడికెళ్ళి పోయాం. మా అమ్మ గేదల్ని విప్పదీసింది. మధ్యాహ్నం పెద్ద వానొచ్చింది. మాకు బాగా వానొస్తే చాలా సంతోషం. ఎందుకంటే బడి వదిలిపెట్టేస్తారు. ఆరోజు కూడా బడికి మధ్యాహ్నం నుంచి సెలవిచ్చేశారు. మా అమ్మ కూలికిపోలేదు కాబట్టి ఎందుకైనా మంచిదని బడి వదలగానే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం నేనూ చిన్నోడూ. మధ్యాహ్నం దాటిపోతున్నా ఆమె గేదల్ని తోలుకుని ఇంటికి రావటం లేదు. ఆమె వచ్చేస్తే కాసేపు ఇంటి దగ్గర కనిపించి ఆటలకు పోవాలన్నది మా ఆలోచన. ఆమె ఎంతకీ రాదు. వర్షం కూడా వచ్చింది కదా! బాగా తడిసిపోయుంటుంది. గొడుగు లేదు. ఏ చెట్టుకిందో ఆ కాసేపు నిలబడివుంటుంది. వేసవి కాలంలో కూడా ఎర్రటి అగ్గిలో చెప్పులు కూడా లేకుండా గేదలను మేపుతూ వుంటది. ఎండకీ, వానకీ కొంగును నెత్తిమీదకు లాక్కుని తన పని తాను చేసుకుపోతుంది. మొత్తానికి మూడుగంటల బండి వెళ్లిపోయిన తర్వాత గేదలు ఉత్సాహంగా వాకిట్లోకొచ్చాయి. బుడమేట్లో దింపి శుభ్రంగా కడిగినట్టుంది. ఆ వెనకాల వస్తుందామె. పూర్తిగా తడిసిపోయింది. కాలుకుంటుతూ ఇంటికి వచ్చి మంచం లాక్కుని కూలబడింది. 'ఏమైందమ్మా' అంటూ ఇద్దరం దగ్గరకు వెళ్లి కాలు పట్టుకుని చూస్తే అరికాల్లో పెద్దగాయం కనిపించింది. 'గేదలు డొంకమీద ఆగకుండా రామిరెడ్డి గారి చేలోకి దూకినయ్. నిన్నే ఆ చేలో ఏదో మందులు చల్లారంట. పొరపాటున ఒక్క పరక తిన్నా మళ్ళీ ఈటికేమన్నా అవుద్దని బయమేసి నేను కంగారులో బోదిలోకి దూకి వాటిని పక్కకి తోలాను. ఆ బోదిలో నీళ్లకింద అంతా కరతమ్మ కంపు వున్నట్టుంది.

కాలినిండా ముళ్ళే. సీసా పెంకో ఏదో గానీ కోసుకుపోయింది' అని చెప్పింది. కిరసనాయిలు డబ్బా తెచ్చిపెట్టమంటే చిన్నోడు తీసుకొచ్చాడు. అందులో నుంచి కొంచెం కిరోసిన్ ను తీసుకుని గాయం మీద పోసింది. దాని మీద కొంచెం పసుపు వేసి గుడ్డపీలికతో కట్టుకుంది. అప్పటికీ ఆ కాళ్ళూ, చేతులూ పాచిపోయి వున్నాయి. ఆపైన గాయం. ఆ సాయంత్రానికి చలిగా వుందని ముణగదీసుకుఓయింది. కాసేపాగాక. నేను వొళ్లు చూస్తే కాలిపోతంది. కోమటింటికి వెళ్లి 'జొరం బిళ్ల' తెచ్చాను. 'ఇయన్నీఎందుకురా! తెల్లారితే అదే తగ్గిపోద్ది' అంటూ బలవంతంగానే ఆ బిళ్ల మింగింది. ఈ జ్వరం పేరు మీదన్నా ఇక రెండు రోజులు ఇంటిపట్టునే ఉంటుందిలే అనుకున్నాను. ఉండాలని కోరుకున్నాను. కానీ నేననుకున్న విధంగా జరగలేదు. ఆ తెల్లారి మామూలుగానే లేచిపోయి నిదానంగా అన్ని పనులూ చేసేయడం మొదలుపెట్టింది. అన్నం క్యారేజీ కూడా కట్టేసుకుంది. 'ఒంట్లో బాగోలేదు కదే! ఇయ్యాల కూడా మానెయ్యరాదూ!' అని సూరమ్మ చెప్పినా వినిపించుకోలేదు. 'ఈ మాత్రం దానికే మానేత్తే ఎట్టా జరుగుద్ది పెద్దమ్మా! ఆ మనిషి చూస్తే అట్ట! ఇక నేను గూడా కూలి వున్న నాల్రోజులూ చేయకుండా ఎగ్గొడితే. సంసారం నడిసినట్టే! పద... పద' అంటూ బయలుదేరింది. 'నువ్విట్టా చేయబట్టే ఆది ఆటలు అట్టా సాగుతున్నయే! నీ పేణమంతా చేలోనూ, గొడ్డూగోదలోనూ వుంటదిగా! నువ్వు వినవని నాకు తెలుసులేవే. చూడ్రా మీ అమ్మ... అంటూ మా కేసి చూసింది సూరమ్మ 'నువ్వు కదులు పెద్దమ్మా' అంటూ కాలీడ్చుకుంటూ బయలుదేరింది. వొంట్లో బాగున్నా బాగోకపోయినా ఏదో ఒక సాకు చెప్పయినా కాసేపు విశ్రాంతి తీసుకోవటం మా అమ్మకు వల్లగాని పని.

'రెండు మానికలు బియ్యం ఉంటే ఇత్తా! పొలం పనుల్లో పడి మీ బాబాయి వడ్లు మర ఆడించలేదు. రేపో ఎల్లుండో అడిత్తాడంట' అంటూ మా ఇంటికి పదిల్ల అవతల వుండే మాణిక్యం వచ్చింది ఇంటికి. నన్ను చూసి 'ఈడెప్పుడొచ్చాడూ' అంటూ అడిగింది మా అమ్మను. పండుక్కొచ్చాడని ఈ రోజు వెళుతున్నాడని మా అమ్మే సమాధానం చెప్పింది. ఆమెకి బియ్యం అప్పు, ఇచ్చాక కాసేపు కూర్చుని అదీ ఇదీ మాట్లాడుకున్నారు. 'ఏమోలే కాంతమ్మ! పిల్లలు పెద్దోళ్ళవుతున్నారుగా! ఇక నీ బాదలు తీరుతాయిలే' అంది నవ్వుతూ. దానికి మా అమ్మ నవ్వలేదు. 'అయ్యా చూశాడు ఇక కొడుకులు జూత్తారు. ఇరవై ఎకరాలు సంపాదించిన ఎంకటరెడ్డినే ఎవరూ సరింగా జూడలా. ఈళ్లు నన్ను సూడకపోయినా ఆళ్ల వరకూ సుకంగా బతికితే అంతే చాలు. నాకు ఒంట్లో ఓపికున్నంత కాలం రెండు గేదలను పెట్టుకుని బతుకుతా!' అంటూ మనుషుల మీద కన్నా పశువుల మీదే నమ్మకాన్ని ప్రకటించింది. ముసలిగేద లేని చావడిని, కుడిచెయ్యి పడిపోయినట్టయిన మా అమ్మను చూసి... ఒక మనిషి పోతే అనిపించేటంత దిగులు మనసు నిండా కమ్ముకుంటుండగా రైలెక్కాను.

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్