Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varalaxmi vratham

ఈ సంచికలో >> శీర్షికలు >>

మల్లెలతీర్థం - లాస్య రామకృష్ణ

Mallela Theertham

మల్లెలతీర్థం - వారాంతపు పర్యాటక ఆకర్షణ

ఆంధ్రప్రదేశ్ లో ని హైదరాబాద్ నుండి 185 కిలోమీటర్ల దూరం లో, పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం నుండి దాదాపు 58 కిలోమీటర్ల దూరం లో ఈ మల్లెల తీర్థం అనే జలపాతం ఉంది. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం రొటీన్ జీవితం నుండి కొంత ఉపశమనం పొందాలనుకునే వారిని ఎంతో ఆకర్షిస్తుంది. 500 అడుగుల ఎత్తులో నుండి కిందకి ప్రవహించే జలపాతం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కాలుష్యానికి, జనారణ్యం నుండి దూరంగా వైవిధ్యంగా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం ఇది. దేశం లో నే రెండవ పెద్ద నది అయిన కృష్ణా నది ఈ అడవుల గుండా ప్రవహిస్తుంది. ఈ జలపాతానికి 350 మెట్లు దిగి చేరుకోవాలి. సాహసోపేతమైన పర్యాటక అనుభవాన్ని పొందాలనే ఔత్సాహికులకు ఈ ప్రాంతం సరి అయినది. స్వచ్చమైన గాలిని పీలుస్తూ పచ్చని చెట్ల మధ్యలో నుండి ఈ అడవిలో సాగించే నడక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మల్లెల తీర్థం లో ని జలపాతం వద్దకు వెళ్లి చల్లటి ఆ నీటితో ఆటలాడుకోవడం ఎవరూ మరచిపోలేరు.

మల్లెల తీర్థం పరిసరాలు అన్నీ చక్కగా నిర్వహింపబడి ఉంటాయి. వాహనాలని పార్క్ చేసుకునేందుకు సదుపాయం ఉంది. క్యాంటీన్ తో పాటు ఒక చిన్న బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. కేవలం పర్యాటకులు ఎక్కువగా సందర్శించే సీజన్ లో నే ఈ క్యాంటీన్ తెరచి ఉంటుంది. మిగతా సీజన్ ల లో ఈ క్యాంటీన్ పని చెయ్యదు. ఈ పరిసరాల లో ని పచ్చటి ప్రకృతి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఈ జలపాతం లో ఉన్న నీరు పవిత్రమైనదని భావిస్తారు. ఇక్కడ ఏంతో మంది మహర్షులు ఘోర తపస్సు చేసి సాక్షాత్తు పరమ శివుడి అనుగ్రహాన్ని పొందారని అంటారు. ఈ జలపాతం నుండి ప్రవహించే నీళ్ళు కృష్ణా నదిలో కలుస్తాయి.  అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. ఈ సమయం లో నీరు సమృద్దిగా ప్రవహిస్తుంది. వర్షాకాలం మరియు ఎండాకాలం ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అనువైనవి కావు. వర్షాకాలం లో రోడ్లు చిత్తడిగా ఉంటాయి. వాహనాలని నడిపేందుకు రోడ్లు అనుకూలంగా ఉండవు. ఎండాకాలం లో ఈ జలపాతం వద్దకి పులుల సంచారం ఉంటుంది. ఇక్కడ భోజన సదుపాయాలు అంతంత మాత్రమే ఉండటం వలన పర్యాటకులు తమతో ఆహార పదార్ధాలని తెచ్చుకుంటే ఇబ్బంది పడరు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వలన ఇక్కడకు రాత్రి పూట పర్యటన సిఫార్సుచేయదగినది కాదు. ఈ జలపాతానికి రాత్రి వేళలలో గంధర్వులు అలాగే కిన్నెరలు పాటలు పాడడానికి వస్తారు అని స్థానిక ప్రజల నమ్మకం.

మల్లెల తీర్థం చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు కార్స్ లేదా టాక్సీల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. హై వే వద్ద మలుపు వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ మలుపు నుండి మల్లెలతీర్థం 8 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడి నుండి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరితే 11 గంటల కల్లా మల్లెల తీర్థం చేరుకోవచ్చు.

వీకెండ్ ని ఆహ్లాదంగా బంధుమిత్ర కుటుంబ సమేతంగా గడపడానికి ఈ ప్రాంతం అనువైనది. హైదరాబాద్ కి సమీపం లో ఉండటం వలన వీకెండ్స్ లో ఎక్కువగా ఈ ప్రాంతానికి విద్యార్ధులు ఇంకా ఉద్యోగులు వస్తూ ఉంటారు.

మరిన్ని శీర్షికలు
CNR chalokthulu book review