Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
job gauenty

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రానాగలక్ష్మి

శ్రీనగర్

పత్ని టాప్ నుంచి శ్రీనగరు బయలు దేరుదాం .  పత్ని టాప్ నుంచి శ్రీనగరు సుమారు 184 కిలోమీటర్లు దూరం , మొత్తం ప్రయాణం అంతా యెత్తైన శివాలిక్ ప్రతశ్రేణులపై సాగుతుంది . ఓ వైపు యెత్తైన కొండలు మరో పక్క యెక్కడో కింద లోయ లో ప్రవహిస్తున్న సింధు నది , సుమారు యేడువేల అడుగుల యెత్తులో వున్నా కిందన ప్రవహిస్తున్న సింధు నది హోరు వినిపిస్తూనే వుంటుంది .

80 లలో పత్ని టాప్ నుంచి మంచుతో కప్పబడ్డ హిమాలయాలు సింధునది అవతల వొడ్డున చెయ్యసాచితే అందుతాయేమో అన్నట్లుగా వుండేవి , పెద్ద పెద్ద పైను , అక్రోటు వృక్షాలు కనువిందు చేసేవి . కాలుష్యం వల్ల వాతావరణంలో యేర్పడ్డ అసమానతలవల్ల  మార్పులు యేర్పడి ఆ పచ్చని వృక్షాలు కనుమరుగయిపోయేయి , వరదల వల్ల కొండచరియలు విరిగి పడ్డంతో వృక్షాలు పెకిలించుకు పోవడం , నిత్యం చొరబాటుదారుల దాడిని తట్టుకొనేందుకు మిలిటరీ రాక పోకలు పెరగడం , మిలిటరీ కి , చొరబాటుదారులకి మధ్య జరిగే కాల్పుల వల్ల కూడా వాతావరణం లో మార్పులు సంభవించి వుండవచ్చు . యేది యేమైనా పూర్వపు అందం పోయింది తిరిగి ఆ అందాల కశ్మీరాన్ని చూడగలమా 1980 లో భూలోక స్వర్గాన్ని మొదటి మారు చూసేం , 2014  వరకు మధ్య మధ్య లోవెళ్తూ వుండడం వల్ల అక్కడి వాతావరణం లోను , మనుషులలోనూ అక్కడివారి స్థితిగతులపై యేర్పాటు వాదుల ప్రభావం యెంతగా పడిందో అవగాహన కలిగింది .

పత్ని టాప్ నుంచి ' రంబన్ ' కి 21 కిలోమీటర్లు . పత్నిటాప్ లో ఆర్మీ వారికి చెందిన భోజనశాల లో ఆర్మీ వారికి మాత్రమే భోజన సదుపాయాలు కలుగ జేస్తారు .  జమ్ము నుంచి ' లడాక్ ' వరకు వున్న రహదారి యెప్పుడూ కూడా ఆటంక వాదుల దృష్టిలో వుండటం మూలాన దీనికి కాపలా కూడా యెక్కువగానే వుంటుంది .  చిన్న వాహనాలకు యెటువంటి ఆటంకం వుండదు గాని బస్సులు , ట్రక్కులు లాంటి పెద్ద వాహనాలు మాత్రం ఒకరోజు పైకి వెళ్లడానికి అనుమతిస్తే మరునాడు కిందికి రావడానికి అనుమతిస్తారు . ముందుగా రహదారి పైన మందుపాత్రలు లాంటి పేలుడు పదార్ధాలు వున్నదీ లేనిదీ తణికీ చేసిన తరువాత అనుమతిస్తారు . తరువాత కూడా మిలటరీ వాహనాలు పహారా యిస్తూనే వుంటాయి .రహదారి వదలి ప్రయాణించ వద్దని ప్రయాణీకులకు హెచ్చరికలు చేస్తూ వుంటారు . అమర నాథ్ యాత్ర సమయంలో యీ పహారా చాలా యెక్కువగా వుంటుంది . రంబన్ దగ్గర మాత్రం రహదారి దగ్గర వున్న భోజనశాలలోనే ఫలహారాలు చెయ్యాలని వూర్లోకి వెళ్లకూడదని కూడా చెప్తారు . కారణం యీ రంబన్ లో చొరబాటుదారులు చొరబడుతూ వుంటారు , అదీకాకా యీ వూర్లో చొరబాటుదారులకి సహాయపడేవారు అధిక సంఖ్యలో వున్నారు అని అంటారు .

ఓ సారి అమర నాథ్ యాత్ర నుంచి వస్తున్నప్పుడు ( నాలుగు మార్లు అమర్ నాథుడిని దర్శించు కున్నాం లెండి ) రంబన్ దగ్గర కొండ చరియలు విరిగి పడ్డంతో రహదారి మూతపడింది యాత్రీకులం రోడ్డు మీద యిరవై గంటలు తిండి , నీళ్లు లేకుండా వుండి పోయేం . కాని మిలటరీ వాళ్లు రంబన్ లోకి యాత్రీకులను పంపడానికి అనుమతించలేదు .

ఆర్మీ వారివల్ల తర్వాత తెలిసింది రంబన్ గురించి .

రంబన్ నుంచి సుమారు 75 కిలో మీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణించిన తరువాత బనిహాల్ చేరుతాం . బనిహాల్ ఖాజీగుండ్ ల మధ్య నిర్మించిన ప్రసిధ్ద జవహర్ టన్నల్ చేరుకుంటాం . పూర్తిగా ఆర్మీ వారి ఆధీనంలో లో వున్న సొరంగ మార్గం యిది . ఈ ప్రాంతం లో తరచు కొండచరియలు విరిగి పడ్డం , శీతాకాలంలో హిమపాతం చాలా యెక్కువగా వుండడం తో 1954 లో యిద్దరు జర్మన్ యింజనీర్ల నేతృత్వం లో యేకాద్రంగా నిర్మించి 1956 డిసెంబరు 22 న జాతికి అంకితం చేసేరు .

ఈ సొరంగం రోజుకి 150 మోటారబుల్ వాహనాలు వెళ్లేందుకు వీలుగా నిర్మించేరు . 1960 లో బోర్డరు రోడ్ ఆర్గనైజేషను వారు రోజుకి 7000 వాహనాలు రెండు వైపులా  వెళ్లేందుకు వీలుగా రోడ్డు వెడల్పు చేసి సొరంగానికి మరమ్మత్తులు చేసేరు . సొరంగంలో కృత్రిమ గాలి వెలుతురు యేర్పాటు చేసేరు . ఇప్పుడు సొరంగంలో సిసిటివి కెమేరాలు , ఫోను సదుపాయాలు కూడా వున్నాయి . ఈ సొరంగం బయట లోపలకూడా ఆర్మీ వారి పహారా వుంటుంది .

' లడాక్ ' లోని ఆర్మీ వారికి పంపే ఆహార , ఆయుధ సామగ్రి చేరవేసే ముఖ్య మైన దారి కావడంతో పొరుగు దేశాల , వేర్పాటు వాదుల దృష్టి యెప్పడూ యీ సొరంగ మార్గానికి ఆటంకం కలిగించాలని చూస్తూ వుంటారు . ఇండియన్ ఆర్మీ వారు వారిని పడగొట్టాడానికి యెప్పడూ తయారుగా వుంటారు .

సుమారు 7,200 అడుగుల యెత్తున 2.85 కిలో మీటర్ల పొడవున వున్న యీ సొరంగ మార్గం భారత దేశ పౌరులకు గర్వకారణం . ఈ సొరంగం చుట్టు పక్కల ఫొటోలు తియ్యడం ఆర్మీ వారిచే నిరోధించబడింది .

జవహర్ టన్నల్ ని బనిహాల్ టన్నల్ అని కూడా అంటారు .

జవహర్ టన్నల్  రాత్రి సమయంలో కొన్ని గంటలు మూసివేసేవారు , 2009 నుంచి యీ మార్గం 24 గంటలు తెరిచే వుంటోంది .

ఈ ప్రయాణం లో మనకి యెత్తైన కొండల మీద దట్టమైన అడవులలోనూ అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఆర్మీ జవానులు కనబడతారు , యే కాలమైన కదలకుండా కాపలా కాస్తూ వుంటారు . ఆర్మీ వారి జీవితం అంటే విలాసవంతంగా వుంటుంది అనుకొనే వారు యిక్కడి ఆర్మీ వారిని చూస్తే వారు యెంత ప్రమాద అంచున వుండి వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారో తెలుస్తుంది .

ఓ పక్క చొరబాటు దారులు అల్లకల్లోలం సృష్టిస్తున్నా పర్యాటకులకు యే పాటి అనుమానం రాకుండా ప్రవర్తించడం నిజంగా వారికి సెల్యూట్ చెయ్యాలని అనిపిస్తుంది . మనకి న్యూస్ లో వచ్చేది చాలా తక్కువ  , నిజంగా అక్కడ నిత్యం చొరబాటు దారులకు మన జవానులకు పోరు జరుగుతూనే వుంటుంది . రోడ్డు మీద మందు మాత్ర పేలి ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ వారు యెందరో !

ఇవి ప్రత్యక్షంగా మేము చూసినవి .

ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ముగిసి శ్రీనగర్ దగ్గర పడుతున్న దగ్గర నుంచి చిన్నచిన్న సరస్సులు వరిపండే పొలాలు , బాదాము , అశోక , దేవదారు వృక్షాలతో యెటుచూసినా పచ్చగా వుంటుంది . సాధారణంగా కొండప్రాంత ప్రజలు వరి పంట మీదే ఆధారపడతారు  , వీరు వరి అన్నం తినేవారే .

80 లలో వున్నంత గొప్పగా లేకపోయినా యిప్పటికీ శ్రీనగరు భూతలస్వర్గం లాగే వుంటుంది . శ్రీనగరు ముందు స్విట్జర్ లాండు దిగతుడుపే , కాకపోతే మనం మనసంపదని తగలపెట్టుకున్నాం వారు దానిని మరింత మెరుగులు పెట్టుకొని పేరు సంపాదించుకున్నారు .

80 లలో శ్రీనగరు వెళ్లడం అంటే బాగా డబ్బున్నవారికి మాత్రమే సాధ్యం గా వుండేది . సాధారణ హోటలు రూము ₹500/ తక్కువకు దొరకదు కాదు , హౌసుబోటు అంటే ₹3000/ నుంచి మొదలయేవి . మేము దాల్ లేక్ లో షికారా  లో వెళ్తూ ' సినిమా తారలు వీటిలో వుంటారుట ' అని  అనుకున్నాం . అదే 1998 లో రోజుకి ₹ 800/ యిచ్చి హౌసుబోటులో వున్నాం . వేర్పాటు వాదుల దెబ్బకి జమ్ము కశ్మీరు యెంత వెనుకకు వెళ్లిందో తెలిసింది.

మనుషులలో కూడా చాలా మార్పు వచ్చింది . హోటల్స్ లో డబ్బు యిచ్చి మనం వుంటాం , తింటాం కాని కశ్మీరీ వాళ్లు అందించే సేవలు యెంతో మనస్పూర్తిగా చేసేవారు , వారి ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది , కాని యిప్పుడు నేతిబీరకాయలో నెయ్యే ! తిట్టకుండా వుంటే అదే పదివేలు అని అని పిస్తున్నారు .

శ్రీనగర్ లోకి ప్రవేశించిన దగ్గర నుంచి మన ప్రయాణం దాల్ లేక్ కి యేదో వైపునుంచి సాగుతూ వుంటుంది . క్లుప్తంగా చెప్పుకోవాలంటే వూరికి మధ్యలో వుంటుంది దాల్ లేక్ . దాల్ లేక చుట్టూరా షాపులు , హోటల్స్ వుంటాయి .

ఇక  శ్రీనగరు గురించి తెలుసుకుందాం .

శ్రీనగరు అంటే లక్ష్మీ దేవి నివాసం అని అర్దం , 12 వ శతాబ్దం లో కల్హనుడు రచించిన ' రాజతరంగిణి ' ప్రకారం శ్రీనగరు  ప్రాంతాన్ని    ' ప్రవరసేడు ' పరిపాలించేడు కాబట్టి యీ నగరాన్ని ' ప్రవర పురం ' లేక ' ప్రవరసేన పురం ' గా పిలువబడేది . కొత్తరాతి యుగానికి చెందిన అవశేషాలు లభించడంతో శ్రీనగరు కొత్తరాతి యుగం నుంచి యిక్కడ మానవాళి నివాసంగా వుండేదని కొందరి వాదనకాగా , ఆర్కియాలజీ వారి త్రవ్వకాలలో దొరికిన ఆధారాల ప్రకారం శ్రీనగరు ప్రాంతం లో హరప్ప నాగరికతకు చెందిన అవశేషాలు లభించేయి .  యే పేరు తో పిలువ బడ్డా యీ నగరం హరప్ప నాగరికత కాలం నాటిది .

మనకి శ్రీనగరు అనగానే దాల్ లేక్ గుర్తొస్తుంది కాని యీ నగరం సరస్సుల నగరం అని చెప్పొచ్చు . ప్రస్తుతం కొన్ని సరస్సులు అక్రమ కట్టడాల క్రింద వుండిపోగా కొన్ని చెత్తా చెదారాలతో కప్పబడి లుప్తమైపోయేయి . ఉలర్ , అన్చర్ , ఖుషాల్ సర్ , హొకేర్ సర్ , యిక్కడ వున్న కొన్ని సరస్సులు .

ఝీలమ్ నది శ్రీనగరు గుండా ప్రవహిస్తోంది , స్థానికులు యీ నదిని  ' హ్యాథ్ ' నదిగా వ్యవహరిస్తారు .

మిగతా విశేషాలు తరువాత సంచికలో చదువుదాం .

మరిన్ని శీర్షికలు
navvandi navvinchandi